గోడౌన్ లో పెద్దపెద్ద ప్యాకేజి పెట్టెలలో ఎన్నో రకాల టానిక్కులు, ఇంజెక్షన్ వయల్స్, యాంప్యూల్స్ - ఎటుచూస్తే అటు అమర్చివున్నాయి. బయట కంపెనీ లవాళ్ళుకూడా ఫార్ములా ఇచ్చి ఇక్కడ కొన్ని మందులు తయారు చేయించుకుని, వాళ్ళ లేబిల్ మీద ఇక్కడ్నుంచే సరఫరా చేస్తుంటారు. జనతా ఫార్మాస్యూటికల్స్ పనిచేసే స్థాయికి ఇది ఒక ఉదాహరణ.
గోడౌన్ ఆఫీసు సెక్షన్ మేనేజరు వల్లభరావు కల్నల్ ను చూసి ఎదురుగా వచ్చాడు. ఆయనకి నలభయి అయిదేళ్లుంటాయి. పంచా, చొక్కా వేసుకున్నాడు. కళ్ళజోడు, మాట్లాడేటప్పుడు అతివినయం కనబరుస్తూ పదే పదే కళ్ళు ఆర్పుతూ ఉంటాడు.
"వల్లభరావుగారూ! మన మార్ఫియా యాంప్యూల్స్ కొన్ని కొన్ని మందుల షాపుల్లో ఆరు రూపాయలకూ, ఏడు రూపాయలకూ అమ్ముతున్నారని రుజువ య్యింది. డాక్టర్లకి, హాస్పటల్స్ కి తప్ప ఇతరులకి మనం సప్లయి చెయ్యం. మరి షాపుల్లోకి ఎలా వెడుతున్నాయి?"
వల్లభరావు ముఖం వివర్ణమయిపోయింది.
"మీకు తెలీకుండా మన కంపెనీనుంచి మార్ఫియా బయటకు వెడుతున్నదంటే అది మీ అసమర్థత. తెలిసి వెడుతున్నదంటే మీరు డబ్బు సంపాదన కోసం పాల్పడుతున్న అవినీతి. రెండిట్లో ఒకటి నిజం-అది ఏమిటో నాకు తెలుసు. కాని మీ నోటితోనే చెప్పండి."
"సార్! నేను కంపెనీలో చాలా రోజులుగా పనిచేస్తున్నాను...అలాంటి పాడు పనికి........."
"సర్వీసుకు, పాడుపనులు చెయ్యటానికి సంబంధంలేదు వల్లభరావుగారూ! పదిహేనువేల రూపాయలు మూడు రూపాయల వడ్డీమీద ఈ ఊళ్ళో ఒక మెడికల్ షాపు అతనికి అప్పు ఇచ్చారు. బాకీ సకాలంలో చెల్లించక పోయేసరికి వడ్డీమీద వడ్డీపెంచి అతన్ని ముప్పుతిప్పలు పెట్టేరు. అతని ఇల్లు జప్తు చేయించటానికి సిద్ధపడ్డారుకూడా. ఆ కోపంతో అతను మీ గుట్టు బయట పెట్టేశాడు. పిలిపించమంటారా సాక్ష్యం చెప్పటానికి?"
వల్లభరావుకు యిహ తను బకాయించి ప్రయోజనంలేదని తెలిసిపోయింది. చేతులురెండూ ఎత్తి దణ్ణం పెట్టేశాడు.
"తప్పుచేశాను సార్, తప్పుచేశాను. నన్ను క్షమించండి" అంటూ బావురుమన్నాడు.
కల్నల్ నవ్వాడు. "మన కంపెనీలో తప్పు చెయ్యటమంటూ జరిగితే క్షమించటమంటూ వుండదని తెలుసుగా..."
"సార్! నాకు ఆరుగురు పిల్లలు. పెద్దదానికి పెళ్ళీడు వచ్చింది. చెయ్యలేక ఛస్తున్నాను. న కర్మకాలి అప్పు ఇచ్చిన ఈ డబ్బు ఆ దొంగముండావాడు ఎగ్గొట్టమే కాకుండా, ఇప్పుడు నా కొంప ముంచాడు. ఉద్యోగంపోతే నేనూ నా పిలల్లూ వెళ్ళి కృష్ణలో దూకాలి."
"అన్నీ తెలిసేనన్న మాట అవినీతికి పాల్పడ్డారు?"
"బుద్ధి గడ్డితిని."
"వల్లభరావుగారూ! తప్పుచేసినవాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు."
"సార్! నా ఒక్కడి విషయంలో కనికరించండి. ఇహ జన్మలో పాడుపని చెయ్యను. ఉద్యోగం మాత్రం......"
"తియ్యను" అన్నాడు కల్నల్. "అంతేకాదు మీకు ప్రమోషన్ కూడా ఇద్దామనుకుంటున్నాను?"
"సార్! నన్ను ఎగతాళి...."
"ఎగతాళి కాదు వల్లభరావుగారూ! మీరు ఒప్పుకుంటే ఇవాల్టినుంచీ గోడవును సెక్షన్ నుంచి తరలించి మిమ్మల్ని కంపెనీ అసిస్టెంటు మేనేజరుగా ఈ క్షణం నుంచీ నియమిస్తాను."
వల్లభరావు ఆశ్చర్యంగా వింటున్నాడు. ఇది నిజమా?
"కానీ మీ జీతం మాత్రం ఇప్పుడిస్తోన్న జీతానికి వందరూపాయలు తగ్గుతుంది."
"సార్?"
"అవును. సంఘంలో హోదా, పలుకుబడీ, దర్జా - అన్నీ వస్తాయి. ఆలోచించండి. ఒక పెద్ద కంపెనీకి అసిస్టెంటు మేనేజరు. లేకపోతే ఇప్పుడిచ్చే జీతానికి ఇంకో రెండువందలు పెంచి ఇచ్చే మరో ఉద్యోగం వుంది. మీకు చాలా జీతం వస్తుందప్పుడు. ఆ ఉద్యోగం....."
వల్లభరావుకు కలగా వుంది. ఆశగా చూశాడు.
"ఆఫీసు ప్యూన్."
అతను అదిరిపోయాడు. ఏమిటిది? ఏమంటున్నాడు? తననెందుకిలా ఎగతాళి పట్టిస్తున్నాడు?
"నిజం వల్లభరావుగారూ! మీకు హోదా అక్కర్లేదనుకుంటే, డబ్బే ప్రధానమనుకుంటే అయిదునిముషాల్లో ఉద్యోగం తయారవుతుంది. బోలెడు జీతం."
వల్లభరావుకు ఏవేవో దృశ్యాలు కళ్ళముందు మెదులుతున్నాయి.
జీతం......బోలెడు జీతం.
"తను ఆఫీసులో అందరికీ మంచి నీళ్ళందిస్తున్నాడు. కొంతమంది చెరకు రసం, కొంతమంది సిగరెట్లు తనతో తెప్పించుకుంటున్నారు. ఒకళ్ళు ఉత్తరం యిచ్చి పోస్టు చేసి రమ్మన్నారు. ఇంకొకరు లాండ్రీకెళ్లి ఇస్త్రీబట్టలు తీసుకురమ్మన్నారు. పరశురాం వచ్చి "టీ త్రాగొద్దాం రా గురూ" అంటున్నాడు."
వల్లభరావు భరించలేకపోయాడు. బాధ....దుఃఖం....కానీ నిర్ణయం తీసుకోవాలి.
"నాకు అసిస్టెంటు మేనేజరే ఇవ్వండి" మనసు కుదుటపరచుకుని తల ఎత్తి ధీమాగా అన్నాడు.
"గుడ్" కల్నల్ నవ్వాడు.
అప్పటికప్పుడు ఆఫీసుగదిలో ఇంకో చిన్నమీటింగ్ ఏర్పాటయింది.
ప్రస్తుతం అసిస్టెంట్ మేనేజర్ గా వున్న హరగోపాల్ కి, మేనేజర్ పదవిలో వున్న ప్రభాకర్ కీ డైరెక్టర్ హోదా ఇవ్వబడింది.
కల్నల్ అందరికీ కూల్ డ్రింక్స్ తెప్పించారు.
11
శైలజ మంచంమీద పడుకుని వుంది. రాత్రి పన్నెండు దాటివుంటుందేమో. ఎంత వంటరితనం!
మనసేదో కోరుకుంటున్నది. ఎంతకీ నిద్రపట్టదు.
ఇంత దగ్గరగా వచ్చిన ఫణికి, ఎప్పుడూ తన గుండెల్లో దాచుకునే ఫణికి, గుండెలమీద తలవుంచుకుని ఆప్యాయంగా అదుముకోవలసిన ఫణికి ఎలా దూరంగా ఉండటం?