పరీక్ష పూర్తయినవాళ్ళు కల్నల్ ఆదేశం ప్రకారం హాల్లోంచి బయటకు వెళ్లిపోతున్నారు.
క్రమక్రమంగా మనుషులు తగ్గిపోతున్నారు. ముప్పై, ఇరవై, అదీ, అయిదు, మూడు.....
రెండు......
ఫణికి ఒళ్ళు తెలిసేసరికి హాల్లో తనూ, పురుషోత్తం ఇద్దరే మిగిలివున్నట్లు తెలిసింది. తర్వాతి వంతు తనదే. చివర్న పురుషోత్తం ఉన్నాడు.
"యూ ఫణీంద్రా!"
ఇహ తప్పదు. మూడేళ్ళ వ్రతం మూడురోజుల్లో పూర్తయిపోయింది.
లేవబోతున్నాడు.
"నో, ప్లీజ్ వెయిట్! మిస్టర్ పురుషోత్తం కమ్ హియర్"
పురుషోత్తం ముఖం నెత్తురులేనట్లు పాలిపోయింది. ఒక్కక్షణం తటస్థంగా ఉండిపోయి తర్వాత లేచి ఓ యంత్రం కదిలినట్లు నడుస్తూ కల్నల్ దగ్గరకు వెళ్ళాడు.
పరశురాం అతని ప్యాంటు పైకి మడవసాగాడు.
ఫణి ఆతృతగా చూస్తున్నాడు. ఒక్కసారి వళ్ళంతా ఝల్లుమన్నట్లయింది.
ఎడమకాలిమీద బ్యాండేజి.
పరశురాం బ్యాండేజి విప్పాడు.
లోతుగా అల్సేషియన్ డాగ్ కసిగా చేసిన గాయం.
కల్నల్ నవ్వాడు. "మిస్టర్ పురుషోత్తం! నీకిచ్చిన ఆఖరి అవకాశాన్ని కూడా పాడుచేసుకున్నావు. యు హావ్ లాస్ యువర్ జాబ్! నువ్వు ఆఫీసుకు వెళ్ళి సెక్రటరీని కలుసుకో. ఓ పావుగంటలో నీ టెర్మినేషన్ ఆర్డర్, రావలసిన జీతం సిద్ధంగా వుంటుంది."
పురుషోత్తం నిర్జీవంగా అక్కడ్నుంచి కదిలాడు.
"పురుషోత్తం" కల్నల్ పిలిచాడు.
ఆగాడు.
"ఎవరికోసం అర్థరాత్రి ఈ విహారాలు సాగించావ్?"
చెబితే ఏం జరుగుతుందో అతనికి తెలుసు. తన ఉద్యోగంతోపాటు ఆమెది కూడా పోతుంది. అంతేకాదు. అందరిలో అవమానం పాలయిపోతుంది. తను ఎలాగూ బయటపడిపోయాడు. ఆమె జీవితం అభాసు కాకూడదు.
"చెప్పను" అని చరచర నడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు.
"మిస్టర్ ఫణీంద్రా" కల్నల్ పిలిచాడు.
ఫణీ కలలోంచి బయటపడినట్టు "యస్ సర్" తొట్రుపాటుగా అని లేచి నిలబడ్డాడు.
"యు కెన్ గో!"
ఫణి బయటకు వచ్చేసరికి అతనికోసమే ఎదురుచూస్తున్నట్లు పురుషోత్తం అవతల నిలబడి కనిపించాడు. అతన్ని చూసి దగ్గరకు వచ్చేవరకూ ఆగి, అతనితోపాటు ప్రక్కనే నడవసాగాడు.
"అయామ్ సారీ" అన్నాడు ఫణి, ఏమనాలో తోచక. అతనికేదో తప్పు చేసినట్లు లోపల తొలచివేస్తోంది కానీ, మళ్ళీ ఆలోచిస్తే-తన నేరం ఇంకొకరి మీద రుద్దటంలేదుగద. అతనూ నేరం చేశాడు. పట్టుబడిపోయాడు. రాత్రి...పరుగెత్తుకుంటూ వచ్చింది....
"మిస్టర్ ఫణి! రాత్రి మిమ్మల్ని నేను గుర్తుపట్టాను. నాలాగే మీరూ బయటకు వచ్చారు. ఎందుకో...ఎవరికోసమో మాత్రం తెలీదు. ఆ కుక్క నన్ను కరవటానికి ముందే మిమ్మల్ని కరిచింది. అదీ చూశాను. ఘూర్ఖా మన ఇద్దర్లో ఒక్కర్నే చూశాడు. అందుకని రాత్రి సంచరించింది ఒక్కరే అన్న ఉద్దేశంతో వున్నాడు కల్నల్. అందుకే నేను మీ ప్రక్కకి వచ్చి కూర్చున్నాను. అంతేకాదు, ముందు మిమ్మల్ని పిలిచే విధంగా చివర్న కూర్చున్నాను. కానీ ఏం జరిగిందో తెలీదు. అతను నన్నే పిలచాడు."
ఫణి ఏమీ మాట్లాడలేదు. అతనికి ఆశ్చర్యంగానూ, బాధగా వుంది.
"నేను బయట పడిపోయానన్న అక్కసుతో మీగురించి చెప్పేస్తానని భయపడకండి. అంతటి నీచుణ్ని కాదు. నా జీవితంతోపాటు ఇంకొకరి జీవితం కూడా పాడుచేసేటంతటి అల్పత్వం నాలో లేదు."
ఇద్దరూ ఆఫీసుకు దగ్గరగా వచ్చేశారు.
"వస్తానండీ" అని అతను ఆఫీసులోకి వెళ్ళిపోయాడు. ఫణి రీసెర్చి విభాగంలోకి వెళ్ళిపోయాడు.
* * *
కల్నల్ రివాల్వింగ్ ఛెయిర్ లో కూర్చుని పైప్ కాలుస్తూ ఆలోచిస్తున్నాడు.
ఎంత డిసిప్లిన్ తో ఉద్యోగస్థుల్ని వుంచుదామనుకున్నా, అప్పుడప్పుడు చెయ్యి దాటిపోతూనే వున్నారు. క్రమశిక్షణ పాటించాలని వాళ్ళకెందుకు వుండదు? ఇలాంటి అవకతవకలు జరుగుతూంటే ఈ సంస్థ అభ్యుదయ మార్గంవైపు ఎలా పురోగమిస్తుంది? కొత్తబాటను ఎలా నిర్మించగలుగుతుంది?
పురుషోత్తంమీద తనకి కొన్ని రోజులుగా అనుమానంగా వుంది. అందుకే ఫణిని కాదని ఆఖర్న కూర్చున్న అతన్ని పిలిచాడు. అందులో ఫణి ఉద్యోగంలో చేరి మూడునాలుగు రోజులన్నా కాలేదు. అతనికప్పుడే పరిచయాలేర్పడటానికి అవకాశం లేదు.
అవునూ! అతనికి పరిచయమైన అమ్మాయి ఎవరై వుంటుంది? కాలనీలో పెళ్ళికాని అమ్మాయిలు పదిమందయినా వుంటారు. ఎవరని అనుమానించటం?
ఏదో తోచి టెలిఫోన్ రిసీవరు చేతిలోకి తీసుకున్నాడు.
"యస్ సర్!" కమలామణి గొంతు.
ఆ గొంతులో ఏదన్నా తేడా వున్నదేమోనని జాగ్రత్తగా వింటున్నాడు.
"కమలామణీ! నీ ఒంట్లో ఎలా వుంది?
"బాగానే వుంది సర్. ఎందుకని సర్ అలా అడుగుతున్నారు?"
"ఇందాక లోపలకు వస్తూ చూశాను. డల్ గా వున్నట్లు కనిపిస్తే........?"
"నో సర్. నా ఆరోగ్యం బాగానే వుంది."
"గుడ్. హైదరాబాద్ లో మన డిస్ట్రిబ్యూటర్ కి ఓ ట్రంక్ కాల్ బుక్ చెయ్యి."
ఫోన్ పెట్టేశాడు. నో! ఈమె కాదు.
గోడకున్న అద్దాలలోంచి ఆఫీసులో వున్న అందరివంకా పరిశీలించి చూశాడు. ఆఫీసులో సెక్రటరీ కాకుండా ఇంకో ముగ్గురు అమ్మాయిలు వున్నారు. తలలు వంచుకుని వాళ్ళపనుల్లో నిమగ్నమై వున్నారు.
కుర్చీలోంచి లేచి పైప్ ని టేబిల్ మీద పెట్టి బయటకు వచ్చాడు. అతనికి ఏదో గుర్తుకువచ్చింది. ఈ గొడవలో పడి ఆ సంగతే మరిచిపోయాడు. గోడౌన్ వైపు నడిచాడు.