Previous Page Next Page 
ప్రేమ నక్షత్రం పేజి 28


    ఇంత నిర్దాక్షిణ్యమైన శిక్ష తనకి తానెందుకు విధించుకుంది?

 

    సర్వం మరచిపోయింది.

 

    ఎంత అందమైన గుసగుసలు! అతని కౌగిట్లో ఎంత బిగువుగా యిమిడిపోయింది.

 

    ఆ మొదటి కౌగిలి అట్లా అసంపూర్తిగానే ఉండిపోయింది.

 

    ఎంత నిర్దయ!

 

    తలుపుమీద ఏదో పడ్డట్లు చిన్నచప్పుడు, ఏమిటది?

 

    మెల్లిగా లేచింది. కొంపదీసి ఫణి తెగించి తన ఇంట్లోకి రాలేదుకదా?

 

    గుండె దడదడమన్నది. ఏమయితే అయిందని ధైర్యంతెచ్చుకుని, నెమ్మదిగా తలుపు తీసింది.

 

    గుమ్మంలో చిన్న వస్తువేదో పడివుంది. ఏమిటది? చెయ్యి ముందుకు జాచి అందుకుంది.

 

    చిన్న ప్లాస్టిక్ వస్తువది. పాతకాలంనాటి గ్రామఫోన్ లౌడ్ స్పీకర్ ఆకారంలో వుంది. చిన్న దారంలాంటిది దానికి కట్టివుంది.

 

    ఏమిటది? చేతిలో పట్టుకుని అటూ, ఇటూ కదుపుతూ, ఏదో అనుమానం తోచి చెవిదగ్గర పెట్టుకుంది.

 

    చిన్న శబ్దం, చిన్న గొంతు. ఉలిక్కిపడింది.

 

    "శైలూ, నా శైలూ" అందులోంచి ఫణి మాట్లాడుతున్నాడు.

 

    శైలజకు ఒళ్ళంతా జలదరించినట్లయింది. "ఫణి! ఎక్కడ్నుంచి?" అంది అప్రయత్నంగా తడబడే కంఠంతో.

 

    "ఇంట్లోంచే శైలూ! బయటకు కనిపించకుండా తలుపు ఈ దారంలో పట్టేటంత జాగావుంచి జారవేశాను. నువ్వు కూడా అలా చెయ్యి."

 

    శైలజ ఎదురుగా చూసింది. ఫణి కాటేజీ తలుపు మూసివుంది. చూసిన వారెవరికీ తలుపుతీసి వున్న సూచన కనిపించదు.

 

    లోపలకువెళ్ళి తలుపుదారం నొక్కుకుపోకుండా జాగ్రత్తపడి పూర్తిగా జారవేసింది.

 

    "ఫణీ! ఎందుకిలా సాహసం చేశావు?"

 

    "ఉండలేకపోతున్నాను శైలూ! నా కంట్రోల్ లో నన్ను పెట్టుకోలేక పోతున్నాను."

 

    శైలజ అర్థం చేసుకుంది. నిట్టూర్పు ఆపుకుంది.

 

    "శైలూ!"

 

    "ఊఁ"

 

    "మాట్లాడవే?"

 

    "ఇదెక్కడిది? ఎలా తయారుచేశావు?"

 

    "తయారు చెయ్యలేదు. సాయంత్రం ఎగ్జిబిషన్ కి వెళ్ళాను. అక్కడ ఇలాంటివి అమ్ముతున్నారు. పిల్లలంతా కొనుక్కుంటూంటే నేనూ కొన్నాను."

 

    "మనం పిల్లలమన్నమాట!"

 

    "పెళ్ళయిన పిల్లలం."

 

    "ఫణీ! ఎవరయినా చూస్తే? ఇందాక ఒకరి ఉద్యోగం ఊడిపోయింది తెలుసుగా?"

 

    ఆమెకు రాత్రి ఫణికూడా ఆపదలో ఇరుక్కున్న విషయం తెలియదు. అతనూ చెప్పలేదు.

 

    కానీ అనుక్షణం వద్దనుకుంటూ, అయినా తప్పించుకోలేక యాతన పడుతూ, సాహసం కూడదనుకుంటూ, అయినా ప్రమాదాలలోకి తల దూర్చుతూ, జాగ్రత్తగా వుండాలనుకుంటూ, అయినా ఎప్పటికప్పుడు దొరికిపోయేటంతటి సంఘటనలకు గురవుతూ నలిగిపోయేది ఈ ఆకర్షణలగురించే. ప్రపంచ చరిత్రలో ఎన్నో దారుణ పరిణామాలు సంభవించాయి ఈ ఆకర్షణ తప్పించుకోలేక. ఈ విషయం వాళ్ళిద్దరికీ తెలియదు. అయినా గురవుతున్నారు.

 

    "ఫణీ!"

 

    "ఊ"

 

    "మాట్లాడవే?"

 

    "ఆలోచిస్తున్నాను."

 

    "దేన్ని గురించి?"

 

    "మన గురించి."

 

    "ఫణీ! ఈ నిర్ణీతకాలం మనల్ని మనం కాపాడుకోగలిగితే ఈ సమస్యల నుంచి ఒడ్డున పడిపోతాం."

 

    ఈ సత్యం అతనికన్నా ఎవరకి తెలుసు? అందుగురించే కదా అతనీ అగ్ని పరీక్షకు నిలబడ్డాడు.

 

    "శైలూ! ఆ రాత్రి.....చాలా నిర్దాక్షిణ్యంగా విడిపోయాం కదూ?"

 

    "వద్దు ఫణీ! గుర్తుచేయకు - ప్లీజ్!"

 

    మనల్ని బాధపెట్టేది, ఆలోచనల్లోకి వస్తే భరించగలిగేటంతటి యాతనగా వుంటుంది. అదే ఇతరులు గుర్తుచేసే భరించలేనంతటి బాధగా వుంటుంది.

 

    దూరంగా కుక్కలు మొరిగిన చప్పుడు.

 

    "అవిగో వస్తున్నాయి."

 

    "ఏమిటి?"

 

    "మన స్నేహితులు."

 

    ఆమెకు అర్ధమయింది. నవ్వు వచ్చింది.

 

    "ఉంటాను."

 

    "ఇంత అసంపూర్తిగానా?"

 

    "మనకి అలవాటయిన అసంపూర్తి." ఆమె చేతిలోని స్పీకర్ లాంటిది మెల్లిగా నేలమీద ఒదిలేసి, తలుపు కొద్దిగా తెరిచింది. ఫణి అవతలనుంచి లాగుతుండటం వల్ల అది నెమ్మదిగా జరిగిపోవటం మొదలుపెట్టి క్రమంగా అవతలకు వెళ్ళిపోయింది. ఆమె తలుపు గడియ వేసుకుని ఓ నిముషం అలాగే నిలబడి, తర్వాత ఓ నిట్టూర్పు విడిచి మంచంమీదకు వెళ్ళి పడుకుంది.

 

                                          *    *    *

 

    తెలియకుండానే రోజులు గడిచిపోతున్నాయి. ఒక్కోసారి చూడామణి ఇంట్లో రాత్రి రెండయినా, మూడయినా లైటు వెలుగుతూనే ఉంటుంది. చదువుకుంటూ వుంటుందో లేక రసాయనాలు ఎదురుగా పెట్టుకుని ప్రయోగాలు చేస్తూ వుంటుందో మరి. ఫణి ఈ ఇంప్రోవైజ్డ్ ఫోన్ లో శైలజతో మాట్లాడదామని ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కసారి కుదిరేది కాదు. ఒక్కొక్కసారి కుక్కలు అక్కడక్కడే తారాడుతూ ఉండేవి.

 

    "కుక్కల్ని మచ్చిక చేసుకుంటే..?" ఈ ఆలోచన బాగానే వుంది. ఒకరోజు బజారుకెళ్లి కుక్కల బిస్కెట్లు తీసుకువచ్చాడు. వాటి ఆధారంతో కుక్కలకు దగ్గరైపోయే పధకాన్ని ఆలోచిస్తున్నాడు.

 Previous Page Next Page