మధు పెదాలమాటున నవ్వును దాచుకున్నాడు. "స్త్రీలను దారుణంగా అవమానపర్చే ఫిల్మ్ ఒకటి తయారైంది....." చెబుతూనే ఆమెలో క్షణక్షణానికి పెరుగుతున్న ఆవేశాన్ని గమనిస్తున్నాడు మధు.
"ఎక్కడ తయరైందీ......? ఎవరు చేశారీ పని?"
"హైదరాబాద్ లో తయారైంది. డాషింగ్ ఎడ్వర్టేయిజింగ్ ఏజెన్సీ బాస్ ప్రదీప్ సక్సేనా, డ్రాగన్ టైర్స్ కోసం తీయించాడు......"
"అందులో ఎలా చూపెట్టారు స్త్రీని?"
మధు పరోక్షంగా ఆమెను రెచ్చగొడుతూ కొద్దికొద్దిగా వివరాలు అందిస్తున్నాడు.
"లొకేషన్ కృష్ణానది సముద్రంలో కలిపేచోట హంసలదీవిలో షూట్ చేశారు. ఒక ఫీమేల్ మోడల్ ని నగ్నంగా పడుకోబెట్టారు. ఆ కంపెనీ టైర్ ఆమె కాళ్ళ మధ్యగుండా దొర్లుతూ నాభివైపు వస్తూంటుంది. అప్పుడు సబ్ టైటిల్ IT IS A HARD RIDING అని వస్తుంది. ఆ తరువాత నగ్నంగా పరిగెడుతున్న ఆమె వెనుక ఆ టైర్ అతివేగంగా దొర్లుతూ వస్తూంటుంది....." ఆమెను ప్రవోక్ చేసే ధోరణి లో చెప్పాడు మధు.
అంతా విని షినాయ్ భగ్గుమంది. ఆమె కళ్ళు కోపంతో అరుణవర్ణం దాల్చాయి. ఆమె పెదాలు, చేతులు ఆవేశంగా వణికిపోతున్నాయి.
ఆమె నా స్థితిలో చూసి సంతృప్తిగా లేచాడు మధు. "మేడమ్! ఇప్పుడది సెన్సార్ బోర్డ్ పరిశీలనలో వుంది. తన పలుకుబడితో దాన్ని సర్టిఫై చేయించుకో గల సమర్ధుడు ప్రదీప్ సక్సేనా....." ఇంకొద్దిగా రెచ్చగొట్టాడు.
"చూస్తాను.....అది ఎలా రిలీజ్ అవుతుందో...." అంటూనే ఆమె ఫోన్ ఎత్తింది కోపంగా.
తన పనయిపోయింది. మధు బయటకు నడిచాడు. కాగలపని గంధర్విణి తీరుస్తుంది.
హొటల్ రాగానే హైదరాబాద్ లో ఉన్న ప్రదీప్ సక్సేనాకి ఫో చేశాడు. ప్రదీప్ ణి దెబ్బ తీసానన్న ఆనందంలో తన చేసిన ఫోనే ఒకరి ప్రాణానికి మంగళం పాడేస్తుందని తెలిస్తే మధు ఆ పని చేసుండేవాడు కాదు. ప్రదీప్ తో ఎప్పుడూ డైరెక్టుగా మాట్లాడటానికి సాహసించని మధు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.
"ఎవరు మాట్లాడేది.....?" మధు అడిగాడు ఫోన్ లో.
"ప్రదీప్ సక్సేనా" అదే కరుకుదనం, అదే ధీమా ప్రదీప్ కంఠంలో.
"నేను మధుచక్రవర్తిణి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు మాట్లాడేదేం లేదు. నేను చెప్పేది వినడమే......ఎప్పుడూ టైమ్ నీదికాదు......నేను కొట్టబోయే చావుదెబ్బకు సిద్దంగావుండు. మరో నాలుగు రోజుల్లో నీకు ముచ్చటగా మూడులక్షల రూపాయలు నష్టం రాబోతోంది......" హేళనతో కూడిన నవ్వుతో అన్నాడు మధు.
అవతలవైపు ఫోన్ పై ప్రదీప్ వేళ్ళు బిగుసుకున్నాయి. ఆవేశంతో ఊగిపోయాడు ప్రదీప్. తనముందు నిలబడటానికే భయపడే ఓ చిన్న ఫోటోగ్రాఫర్ తనను బెదిరించడమా!? అదీ తనకు మూడులక్షలు నష్టం కలిగిస్తానంటూ.
ప్రదీప్ కోపం మనోహర్ పైకి మళ్ళింది. జరగబోయే నష్టం దేనివలన? ఎలా? ప్రదీప్ బుర్ర మెషిన్ కన్నా వేగంగా ఆలోచించడం మొదలెట్టింది.
* * *
కమలిని ఇంట్లో......మంగళ, కమలిని కబుర్లు చెప్పుకుంటుండగా మాయా డిసౌజా వచ్చింది.
ఇండియాన్ వరల్డులో అతి ఖరీదైన మోడల్ గా మాయా డిసౌజా గంటకు5,000 రూపాయలు చార్జి చేస్తుంది. గంటదాటి ఒక్కనిమిషమైనా మరో5,000 చార్జి చేస్తుంది. చాలా నిర్మొహమాటంగా వ్యవహరిస్తుంది. ఫీల్డ్ లో అంతా హెడ్ స్ట్రాంగ్ అని, పోగరని. అహంకారమని అంటుంటారు. అయినా అవేమీ లెక్క చేయదు మాయా.
యాడ్ ఫోటో గ్రాఫర్స్ అందరి దగ్గరా వర్క్ చేయదు. తనకునచ్చిన ఫోటో గ్రాఫర్ తోనే చేస్తుంది. అందమైన కళ్ళు, ఎత్తయిన చెక్కిళ్ళు దిగ్భ్రమ చెందించే కళ్ళమెరుపులు, అణువణువున సెక్సీనెస్ ఆమె ప్రత్యేకతలు. అపురూపమైన తన అందాల్ని కాపాడుకోవటాన్ని మహాతపస్సులా యజ్ఞంలా భావిస్తుంది.
మాయాకి, కమలిని మంచిస్నేహం చాలాకాలంగా.
మాయాని చూసి చిరునవ్వుతో ఆహ్వానించింది కమలిని.
"చాలాకాలానికి కల్సుకున్నాం. ఎప్పుడొచ్చావ్?"
"మార్నింగ్ ఫ్లయిట్ లో వచ్చాను. ఈరోజు సిద్దిక్ వర్క్ పూర్తి చేయాల్సివుంది....." అంటూ మంగళవైపు చూసింది ఎవరన్నట్లు.
"మనోహర్ వుడ్ బీ.......మంగళ" అంది పరిచయం చేస్తూ.
మంగళ చూపులు మాయామీద ఆగిపోయాయి. దేవలోకం నుంచి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిపోతోంది మాయా. మత్తయిన చూపులు. నాజూగ్గా వంపులు తిరిగిన పెదవులు, ఎత్తయిన వక్షోజాలు, లోతయిన నాభి, చాలెంజ్ చేస్తున్నట్లున్న నాభి క్రింద భాగం, శృంగార దేవతలా గంధర్వ కన్యలా ఆడావారిని సైతం తనవైపు త్రిప్పుకోగల అందంఆమెది.
"యు ఆర్ లక్కీ......మనోహర్ ణి మా ఫీల్టులో ఉన్న ఏ అందగత్తె ఆకర్షించలేకపోయింది......మీరు ఆకట్టుకోగలిగారు కంగ్రాట్యులేషన్స్" అంది మంగళ వైపే ప్రశంసగా చూస్తూ మాయా.
"సిద్దిక్ కి వర్క్ చేస్తున్నావా? అంటే ప్రదీప్ కంపెనీకి......"? ఆశ్చర్యంగా అడిగింది కమలిని మాయావైపు చూస్తూ.
ఆ మాటలకు తేలిగ్గా నవ్వేసింది మాయా.
"తప్పనిసరిగా పరిస్థితుల్లో చేయవలసి వచ్చింది. అయినా నా దగ్గర వారి పిచ్చివేషాలు చెల్లవు....." అంది ధీమాగా మాయా.
"ఐనో.....ఐనో.....ఏమిటి మాయా మూన్ మూన్ సేవ్ మాజాకి చేసిన ఫిల్మ్ పెద్దగొడవ లేవదీసిందట?"
ఒకే వృత్తిలో ఉన్న సమకాలికులు కలిస్తే ఒకరి అనుభవాలు ఒకరితో పంచుకోవటం......ఒకరి సందేహాలు ఒకరు తీర్చుకోవటం మామూలే.
"పైతం పైకెక్కి చేసిన వర్క్ అది. మాజా కూల్ డ్రింక్ కోసం తీసిన ఫిల్మ్ అది. మూన్ మూన్ సేన్ ని నగ్నంగాచేసి రెండు చేతుల్లో రెండు బాటిల్స్ వుంచి, సాయం సంధ్యసమయంలో ఒకబీచ్ లో ఆమెను పరుగెత్తించారు. అదీ ఫిల్మ్."
"మాజా అమ్మాలనా? మూన్ మూన్ సేన్ అందాల్ని అమ్మాలనా?" ఏవగింపుగా అడిగింది కమలిని.
సంభాషణ వింటున్న మంగళలో అసహ్యం చోటుచేసుకుంటుంది.
"ఆ బుద్ధి సెన్సార్ వాళ్ళకుండాలి......అసలా మాజా ఫిల్మ్స్ అన్నీ అంతే. అంతకుముందు కూడా ఒకటి అలాగే తీశారు ఉమర్ ఖయ్యాం డ్రస్ లో ఒక మేల్ మోడల్ ని తయారుచేసి అతను దాహంకోసం ఆరాటపడుతుండగా ఒక్కో ఫిమేల్ మోడల్ ఒక్కోరకం డ్రింక్ తీసుకువస్తుంది. అవేమీ అతనికి నచ్చవు. అనుచరుడి సైగతో నాల్గవసారి ముప్పాతిక నగ్నంగా మాజా బాటిల్ తీసుకుని సాకి మేకప్ లో ఒకమోడల్ వస్తుంది. అప్పుడు అతను సంతృప్తిపడి చేయి చాపుతాడు.
ఫిల్మ్ చూసేవాళ్ళంతా అతను మాజా బాటిల్ కోసం చేయి చాపుతాడనుకుంటారు. కాని అతను ఆమె వక్షోజాలవైపు చేయి చాపుతాడు. అప్పుడామె వారించి అతని చేతికి మాజా అందిస్తుంది. ఇది ఇండియా అంతా రిలీజ్ అయింది ఎవరేం చేయగలిగారు.....?" అంది ఈసడింపుగా మాయా.
"మూన్ మూన్ ఎలా అంగీకరించింది?"
"అంగీకరించకేం చేస్తుంది? పిక్చర్ కి పదిలక్షలు తీసుకునే నెంబర్ వన్ ఫిల్మ్ స్టార్స్ లో సెన్సార్ ఒప్పుకుంటే పూర్తి నగ్నంగా చేయటానికైనా సిద్దపడే వారున్నారు. అంత పెద్దస్టార్సే ఒప్పుకోగా, ఆప్ట్రాల్ మీ మోడల్స్ ఎందుకోప్పుకోరు అని డైరెక్టుగా అడుగుతున్నారు ఫోటో గ్రాఫర్స్....."
"అవునవును సినిమాలుకూడా బాగా దిగజారిపోయాయి......" అంది బాధగా కమలిని.