Previous Page Next Page 
మోడల్ పేజి 26


    "అందుకే కబురుచేశాను నీకు, మామూలుగా ప్యారిస్ లో పనులు కావటం సాధ్యంకాదు. ఒక ఫ్యాషన్ మోడల్ ని నీకు హెల్ప్ గా పంపిస్తాను. ఆమె నీ వెంటవుంటే  ఎలాంటివారితోనైనా  ఠక్కున పని అయిపోతుంది....." అంటూ పైప్ ని వెలిగించుకొనేందుకు ఆగి మరలా మొదలెట్టాడు...."నీ కోపరేషన్ నాక్కూడా కావాలి" అన్నాడు అనుభవంతో ముడతలు పడిన నుదుటిని అరచేత్తో తుడుచుకుంటూ.

    ఓ క్షణం లారెంట్ చెప్పేది అర్ధంకాలేదు మనోహర్ కి. ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ లారెంట్ కి తను చేయగల సహాయం ఏమిటి?!!

    "ప్రపంచంలో ఎక్కువ జనాభా వున్న దేశం చైనా. కాని అది కమ్యూనిస్ట్ దేశం కావటంతో నా బిజినెస్ కి అవకాశాలు తక్కువ. జనాభా వున్నా  పొటెన్ షియాలిటి లేని మార్కెట్. ఆ తరువాత ఇండియాలో జనాభా ఎక్కువ 800 మిలియన్ల జనాభావున్న ఇండియా ప్రజాస్వామ్యదేశం. చట్టపరమైన ఆంక్షలు తక్కువ. ఇంటర్నేషనల్ కాఫీరైట్ లాస్ కఠినంగా ఉండవు. ఏ వస్తువుకైనా మీ దేశం మంచి మార్కెట్. పైగా అనుకరణల పిచ్చి ఎక్కువ. సో ఐ వాంట్ టు టేప్ ఇట్...."

    "అంతసేపూ తనతో మాట్లాడుతున్నప్పుడే అనుమానం వచ్చింది మనోహర్ కి_____ఏదో ప్రయోజనం లేందే అంతసేపు మాట్లాడడని.

    "ఆ సందర్భంలో మీ దేశంలోవున్న  పెద్దపెద్ద బట్టల మిల్స్____ రిలయన్స్, రిమాండ్స్, దినేష్, బిన్ని, మఫత్ లాల్, బోంబేడయింగ్ లాంటి కంపెనీల సహకారంతో, నీ బ్యాగ్రవుండ్ తో 1985 ఇండియన్ ఫేషన్  అండ్ టెక్స్ టైల్స్ షో' ఒకటి అరేంజ్ చేయాలనుకుంటున్నాను బొంబాయిలో....."

    లారెంట్ తెలివి తేటలకు అదిరిపడ్డాడు మనోహర్.

    "1983లో ఫెమీనా ఎడిటర్ విమ్లాపాటిల్ సహకారంతో మా ఫ్రెంచి డిజైనర్ "కార్దిన్" షో నిర్వహించాడు బొంబాయిలో. అందులో లీడింగ్ ఇండియన్ మిల్స్ నుండి 90 రకాల గార్ మెంట్స్ ఎగ్జిబిట్ చేశాడు. దాదాపు అరవైమంది ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ మోడల్స్ ఆ 90 రకాల గార్ మెంట్సుని ధరించారట. ఇట్స్ ఏ సక్సెస్ పుల్ షో.......అలాంటిదే....."

    క్షణాల్ని వేలల్లో లెక్కపెట్టే సూపర్ ఫీజ్ కాస్టూమ్స్ డజైనర్ లారెంట్ తో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్ అందనికారుల్ని కూడా తన కాస్ట్యూమ్స్ తో సమ్మోహనంగా చూపించగల దిట్ట లారెంట్.

    ఈనాడు  ప్రపంచ అందగత్తెలు, హాలీవుడ్ నటీమణులు సైతం లారెంట్ కాస్ట్యూమ్స్ కోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్నారంటే అతిశయోక్తికాదు. మనోహర్ కి ఆనందంగా వుంది. లారెంట్ కాస్ట్యూమ్స్, తన కెమేరా పనితనం, తరంగిణి అద్భుత సౌందర్యం కలిస్తే తన ప్రాజెక్టు సెన్సేషన్ అవుతుంది.

    "ఓ....కే మిస్టర్ లారెంట్......మరి నేను బయలుదేరుతాను....." అంటూ తన తొందరను తెలియచేశాడు మనోహర్.

    అంతలో ఓ ఫ్రెంచ్ యువతి వచ్చి లారెంట్ ని విష్చేసింది. ఆమె వైపు చూశాడు మనోహర్. అద్భుతమైనా ఆకర్షణ ఆమెలో అణువణువున ప్రస్ఫుటమవుతోంది. ఆమె ప్రక్కనుంటే పనులు కావటం అనేది పెద్ద సమస్య కానేకాదు.

    మరో అయిదు నిమిషాల్లో మనోహర్. ఆమె ఎక్కినకారు వరల్డు ఫ్యాషస్ షో సెంటర్ వైపు దూసుకుపోతోంది. అప్పటికే తన అవసరాన్ని చెప్పేశాడు మనోహర్ ఆమెకు. మనోహర్ లోని ఆతృతను పసిగట్టగలిగింది ఆమె. పైపెచ్చు మొదటి చూపులోనే మనోహర్ ఆమెను బాగా ఆకర్షించగలిగాడు.

    కారు ఒక్క జర్కుతో ఫ్యాషన్ సెంటల్ ఆఫీసు ముందాగింది.

    ఆఫీసు మేనేజర్ ని కలిసి తాము వచ్చిన విషయం చెప్పింది. "చాలా కష్టం చెప్పడం ప్రతి నెలలో రెండు మూడు షోలు జరుగుతుంటాయి కొన్ని వేలమంది అమ్మాయిలు వస్తుంటారు. ఎవరో ఏమిటో ఎలా చెప్పగలం?" మేనేజర్ తన అశక్తతను వెలిబుచ్చాడు.

    ఆమె మనోహర్ వైపు చూసింది......మనోహర్ చూపులు అభ్యర్థిస్తున్నట్లుగా  కనబడ్డాయి.

    ఇతనికెలాగైన సహాయం చేయాలనిపించింది ఆమెకు.

    "మీ ఫోటో లైబ్రరీ చూపించండి. మేమే వెతుక్కుంటాం......" అంటూ చిలిపిగా,మత్తుగా చూసింది మేనేజర్ వైపు.

    మేనేజర్ నరాలు ఆమె చూపుకి జివ్వుమన్నాయి. వెంటనే లేచి ఇద్దర్ని వెంటబెట్టుకొని లైబ్రరీకి తీసుకెళ్ళాడు.

    నవంబర్ నుంచి ఫోటో ఆల్బమ్స్ తీశాడు మేనేజర్. ఆమె, మనోహన్ ఆల్బమ్స్ తిరగేయడం ప్రారంభించారు. మనోహర్ చేతులు మెషిన్ కన్నా వేగంగా కదలటం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

    మనోహర్ లో క్షణక్షణానికి ఉద్వేగం రెట్టింపవుతోంది. అతనికళ్ళు డేగ కళ్ళలా ఆల్బమ్ ని క్షుణ్ణంగా చూస్తున్నాయి వేగంగా.

    అరగంట గడిచింది. ఆమె, మేనేజర్ ప్రేక్షకుల్లా మిగిలారు.

    "ఓ ఆల్బమ్ లో  ఒకచోట మనోహర్ చూపులు, చేతులు ఆగిపోయాయి. మనోహర్ తలెత్తాడు. మొఖం ఆనందంగా వెలిగిపోతోంది. మనోహర్ కళ్ళలోని మెరుపుని బట్టే ఆమె గ్రహించగలిగింది.

    మనోహర్ ఆల్బమ్ ని వారిముందుంచి "ఇదిగో ఈమే తరంగిణి" అంటూ ఆల్బమ్ లో అతికించిన ఒక గ్రూప్ ఫోటోలో చూసి పెదవి విరిచాడు. చాలాకష్టం. ఒకపని చేయండి. మీకు ఫ్యాషన్ మోడల్స్ డైరెక్టరీ  ఇస్తాను. అందులో ఆమె పేరుంటే ఫోన్ నెంబరు కూడా వుంటుంది. ట్రై చేయండి......" అంటూ వెనుతిరిగాడు. మెరుపుకన్నా వేగంగా ఆ ఆల్బమ్ లోని రెండు ఫోటోల్ని బయటకు లాగటం, ఆల్బమ్ ని యధాస్థానంలో వుంచటం మేనేజర్ గ్రహించే అవకాశం లేదు.

    కాని ఆమె గ్రహించింది. మనోహర్ వైపు చూసి చిరునవ్వు నవ్వింది. సిగ్గుపడిపోయాడు మనోహర్.

    మరో అరగంట గడిచక డైరెక్టరీలో తరంగిణి పేరు కనిపించింది.

    మనోహర్ కి చెప్పలేని సంతోషం కలిగింది. మరో గంటలోనే తరంగిణి దొరకబోతోందన్న ఆనందం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది మనోహర్ ను.

    ఫోన్ నెంబర్ సహాయంతో తరంగిణి ఇంటి అడ్రస్సు తేలిగ్గా దొరికిపోయింది. మరుక్షణం కారు నేషనల్ పార్క్ వేపు సాగిపోతోంది.

    ఆమెను ఎలా ఒప్పించాలి? తనతో తీసుకెళ్ళగలటం సాధ్యమేనా? అసలామె ఒప్పుకుంటుందా? రకరకాలుగా ఆలోచిస్తూండగానే కారు ఓ పెద్ద బిల్డింగ్ ముందాగింది. ఏడంతస్తుల అపార్టుమెంట్స్ బిల్డింగ్ అది ఇద్దరూ జెట్ స్పీడ్ తో నాలుగో అంతస్థులో వున్న తరంగిణి ప్లాట్ వేపు కదిలారు.

    కాలింగ్ బెల్ నొక్కిందామె.

    తరంగిణిని ఎప్పుడు చూస్తానా అన్న ఆతృత మనోహర్ ని నిలువ నివ్వటంలేదు. రెండు నిమిషాలకి తలుపు తెరుచుకుంది. తరంగిణి కనిపిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న మనోహర్ కి ఆశాభంగమైంది. ఎదురుగా పనిమనిషి......

    ఆమె అడిగింది "తరంగిణి వుండేది ఇక్కడేనా?" పనిమనిషి ఇద్దరి వైపు వింతగా చూస్తూ అవునన్నట్లు తలూపింది.

    మనోహర్ గుండెలనిండా ఊపిరి పీల్చుకున్నాడు.

    "ఓసారి ఆమెని పిలుస్తారా?" ఆమె  అడిగింది. మనోహర్ లో టెన్షన్ పెరిగిపోతోంది తరంగిణి రాకకోసం.

    "ఆమె లేదు......"అంది విసురుగా పనిమనిషి.

    ఓ క్షణం కలవరపడ్డారు ఇద్దరూ.

    "ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడొస్తుంది?"

    ?తెలియదు."

    "ఏమిటి తెలియదు?"

    "ఎప్పుడొస్తుందో తెలియదు."

    "ఎక్కడికి వెళ్ళింది?"

    ఎంతో ప్రయాసపడి, ఎన్నో వేలమైళ్ళ నుంచి వచ్చిన మనోహర్ కి నిరాసక్తంగా సమాధానాలిస్తున్న పనిమనిషి ధోరణి కోసం తెప్పించింది. 

    "ఇండియా వెళ్ళింది."

    ఓ క్షణం తనేం విన్నాడో అర్థంకాలేదు మనోహర్ కి. తేరుకొని స్థంభించిపోయాడు. అప్పటివరకూ తరంగిణి దొరుకుతుందని పెట్టుకున్న ఆశలు కుప్పకూలిపోయాయి. ఒక్కసారిగా నిరాశా, నిస్పృహ చుట్టుముట్టాయి మనోహర్ ని. ఆమె ఖచ్చితంగా  ఇండియా పోయిందని చెబుతున్నప్పుడు ఇక  అక్కడే కాలం వెలిబుచ్చటం వృధా అనిపించింది. మరుక్షణం వారి కారు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టువైపు దూసుకుపోతోంది. ఆమె ఎప్పుడెళ్ళింది? ఏ ఫ్లయిట్ లో వెళ్ళింది తెలుసుకోవాలని మనోహర్ కి ఆతృతగా వుంది. అరగంటలో కారు ఎయిర్ పోర్టు ముందాగింది. ఎంక్వయిరీ ఆఫీసర్ ఆమె అందానికి, హొయలుకి ఒకింత చలించిపోయాడు. ఓపిగ్గా రికార్ద్సు వెతికాడు.

    "ఆమె నిన్ననే అంటే, మార్చి నాలుగున సాయంత్రం నాలుగు గంటలకి జర్మన్ ఎయిర్ లైన్స్ లుప్దాన్సాలో  ఇండియా వెళ్ళిపోయింది అన్నాడు ఆమెవైపు ఆశగా చూస్తూ.

    వెంటనే వెనుతిరిగాడు.

    అర్జెంటుగా  ఢిల్లీ బయలుదేరాలి. వీలైతే మధుకి ఫోన్ చేసి ఆ విషయాన్ని చెప్పాలి. నాలుగు గంటలకు ఆమె ప్యారిన్ లో బయలుదేరితే అది  ఢిల్లీ పోవటానికి దాదాపు 14 గంటలు పడుతుంది అంటే ఈరోజు ఉదయం10 గంటలకి  ఢిల్లీలో ఎయిర్ పోర్టులో దిగుతుంది.

    టైమ్ చూసుకున్నాడు మనోహర్. ఇండియన్ టైమ్ ప్రకారం మరో గంటలో  ఢిల్లీలో దిగుతుంది తరంగిణి.

    ఈసారి కారు మనోహర్ తీసుకోవాలనుకున్నాడు. వెంటనే లారెంట్ ఆఫీసుకి వెళ్ళి  ఢిల్లీలో వున్న తన మిత్రుడు జార్జికి ఫోన్ చేసి  ఆమె పోలికలుచెప్పి, ఆమె నెలాగైనా  ఢిల్లీలో ఆపించే ఏర్పాట్లు చేయాలని  మనోహర్ ఆలోచనలు. క్షణాల్లోనే ఈ ఆలోచనలన్నీ  మనోహర్  మస్తిష్కంలో సుళ్సు తిరిగాయి. పదడుగులు వేగంగా వేసేసరికి వెనుక నుంచి కేకలు వినిపించాయి.

    అవి వినిపించుకునే స్థితిలో మనోహర్ లేడు. అవి వినగలిగుంటే జార్జి ద్వారా  ఢిల్లీ లో తరంగిణిని పట్టుకోగలిగేవాడే మనోహర్.


                                                                    *    *    *

    మధు బొంబాయిలో ఫ్లయిట్ దిగి సరాసరి హొటల్ కి వెళ్ళి హెయిర్ స్టెయిలిస్ట్ రోజాకి. ఆర్ట్ డైరెక్టర్ నిషాంత్ కి. మేకప్ ఆర్టిస్టు డాలీ భాటియాకి వెంటనే తనను కలుసుకోమని ఫోన్స్ చేశాడు.

    వారితో మాట్లాడి అడ్వాన్స్ లు ఇచ్చేసి 25 మేగజైన్స్ (400 అడుగులుండే ఈస్ట్ మన్ కలర్ ఫిల్మ్) ఫిల్మ్ కొనేస్తే బొంబాయిలో తనకు మనోహర్ చేయమని అప్పగించిన పనులు అయిపోతాయి.

    హొటల్ నుంచి బయటికొచ్చి టాక్సీ ఎక్కి ఫిల్మ్ ఇండియా ఆఫీసు అడ్రస్  చెప్పాడు. మధు పెదవులపై చరునవ్వు లాస్యం చేస్తుంది. ప్రదీప్ ని చావుదెబ్బ కొట్టే అవకాశం తనకు లభించటాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నాడు మధు.

    ఫిల్మ్ ఇండియాలో 25 ఫిల్మ్  మేగజైన్స్ కొనేసి వెంటనే కార్గోలో హైదరాబాద్ ఆఫీసు అడ్రస్ కి బుక్ చేసి బయటికొచ్చి మరలా టాక్సీఎక్కి భగత్ సింగ్ రోడ్, కొలాబా బొంబాయి-39 అని చెప్పాడు.

    అరగంట తరువాత కారు వుమెన్ ఈక్వల్ రైట్స్ సంస్థ (స్త్రీ సమాన హక్కుల సంఘం) ఆఫీసు ముందాగింది.

    అప్పటికే మధు బాగా  ప్రిపేర్ అయిపోయాడు. పది నిముషాల వెయింటింగ్ తర్వాత సంస్థ చైర్ వుమెన్ శాంతి షినాయ్ తో అపాయింట్ మెంట్ దొరికింది.

    "గుడ్ మార్నింగ్ మేడమ్........"

    "వెరీ గుడ్ మార్నింగ్ యంగ్ మేన్.....విషయం ఏమిటి?" సూటిగా అడిగింది శాంతి షినాయ్.

    ఆమె కళ్ళలో పట్టుదల, దీక్ష, ఆడజాతిని దోచుకుంటున్న మగజాతిపై కసి, పగ, స్పష్టమవుతున్నాయి. క్షణాల్లోనే ఆమెని రెచ్చగొట్టే ప్రయత్నం పకడ్బందీగా చేసాడు. ఆమెలో ఇప్పుడు మగజాతిపై అతిభయంకరమైన పగ బుసలు కొడుతోంది. కోపంతో ఆమె ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి.

 Previous Page Next Page