సరిగ్గా అప్పుడే-
అతను ప్రేమికుల్ని చూసేడు. సత్యమూర్తి శారద ఒకే బల్లమీద ఒకర్నొకరు అతుక్కుని కూచోడం చూసేడు. ఒకర్నొకరు ఆకలిగా చూసుకుంటున్న దృశ్యం కూడా అతని కళ్లబడింది. కళ్లుబైర్లు కమ్మేయి. ఎందుకైనా మంచిదని అతను కుంటడం మాని వాళ్ల వైపుకి పాక్కుంటో వెడుతున్నాడు.
మరో పక్కనుండి -
కుక్కలు రెండు పరుగెత్తుకుంటూ పార్కులోకి ప్రవేశించాయి. ప్రేమికుల్ని చూడగానే పరుగుమాని అవి కూడా పాక్కుంటూ ప్రేమికుల వేపుకి వెడుతున్నాయి.
"శారదా!" అన్నాడు సత్యమూర్తి ప్రేమగా.
"ఊఁ."
"నిన్ను చూస్తోంటే నాకు మాటాడాలనిపించడంలేదు."
"మరేమనిపిస్తోంది?"
"జస్ట్.... నీ కళ్లల్లోకి చూస్తూ కాలం గడిపేయాలని వుంది."
శారద చిన్నగా నవ్వింది.
"ప్లీజ్ .. నవ్వకు! నేను సీరియస్ గా చెబుతున్నాను."
"నాకు తెలుసు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు అవునా?"
"ఒక్క ప్రేమించడమేనా? ఆరాధిస్తున్నాను."
"భలేవారే? ఆమాట అనవలసింది నేను. మీ ప్రాణాలకు తెగించి నన్ను సముద్ర గండం నుంచి కాపాడినప్పుడే మిమ్మల్ని ప్రేమించడం ప్రారంభించేను. నా కోసం కదుల్తున్న బస్సులోంచి దూకేరని తెలిసి మిమ్మల్ని ఆరాదిస్తున్నాను."
"శారదా!"
"ఈ నిజం చెప్పడానికే మిమ్మల్నిక్కడికి రమ్మని కోరాను."
"కానీ....."
"చెప్పండి."
"ఆకాశంలో వెలిగే నక్షత్రం నువ్వు. నేల మీద కుండ పెంకుని నేను. నిన్ను పెళ్లాడే భాగ్యం నాకు కలుగుతుందంటావా? అందుకు మీ నాన్నగారు అంగీకరిస్తారా?"
"మానాన్నగారు నా ఇష్టాన్ని కాదనరు."
కైలాసం నోటు పుస్తకంలో ఆ పాయింటు రాసుకుంటున్నాడు. ఇంకో పక్కన మొక్కల చాటునున్న కుక్కలు మొహమొహాలు చూసుకుంటున్నాయి. ప్రేమికులిద్దరూ లేచి నిలబడ్డారు.చెయ్యి చెయ్యి కలుపుకుని పార్కు నుండి బయట పడుతున్నారు.
తాను చూచిన ప్రేమ సీను, పెళ్లి ఒప్పందాలు గోవిందం గారికి తక్షణమే చెప్పాలనే పవిత్రమైన ఆశయంతో కైలాసం లేచి నించున్నాడు. పరుగు ప్రారంభించేడు.
పేపరు చదువుతున్న పెద్దమనిషి - పరుగెత్తుతున్న కైలాసాన్ని చూచి గొణుక్కుంటున్నాడు -
"కుంటి వెధవ కాదన్నమాట! ఇంకా నయం పావలా దానం చేసేను కాదు!"
* * *
గోవిందం స్టోరు గది దగ్గిర నిలబడి, తలుపుకి చెవి చేర్చేడు.
లోపల్నుంచి ఏ విధమైన శబ్దాలు వినపడక పోవడంతో గోవిందం గొణుక్కున్నాడు సంతోషంగా -
"అమ్మయ్య! నిద్రపోతున్నాడల్లే వుంది."
అంతలో కుక్కలు రెండూ పరుగెత్తుకుంటూ వచ్చేయి. వచ్చీరాగానే మొరగడం మొదలెట్టాయి.
తాపీగా విని అడిగేడు గోవిందం -
"పార్కులో కలుసుకున్నారా?"
జాకీ మొరిగింది. ఆలకించి అన్నాడు -
"అంతేరా! అంతే! ఇప్పుడు చెయ్యి పట్టుకున్నాడు. రేపు దాని పీక పట్టుకుంటాడు."
ప్రేమికులు మాటాడుకున్న ప్రేమ డైలాగులు సమస్తం చెబుతుందేమో- టైగర్ చాలాసేపు మొరిగి మీటింగు పెట్టింది. అంతా పూర్తిగా విని తాపీగా అన్నాడు-
"చూస్తా! ఇంకా ఎన్ని చిత్రాలు జరుగుతాయో నేనూ చూస్తా! కైలాసం ఎక్కడ?"
అప్పుడే కైలాసం హాల్లోకి అడుగు పెట్టేడు. రెండు చేతులూ జోడించి అంటున్నాడు -
"వచ్చేసానండి!"
గోవిందం కైలాసం యొక్క ముష్టిగెటప్పు చూచి కోపంగా అడిగేడు-
"ఏమిటీ దరిద్రావతారం!"
"చిత్తం! వేషం మార్చకపోతే పని జరగదని అనుకున్నాం గదండీ! అదన్నమాట! ఈ వేషంలో వెళ్లి వాళ్ల కథ మొత్తం తెలుసుకున్నాను. అమ్మాయి గార్ని వాడు ప్రేమిస్తున్నాడు."
"ఎవడు వాడు?"
"వాడేనండి! వాడ్ని మొన్నెప్పుడో చింతామణి శారీ మందిర్లో చూసేను. అక్కడ పని చేస్తున్నాడు - గుమాస్తా!"
"పార్కులో వాళ్లేం మాటాడుకున్నారు?"
"ఏముంటాయండీ! అన్నీ లవ్ డైలాగులే!"
"గుర్తు లేవా?"
"గుర్తు పెట్టుకోడానికి అవి ఏవైనా వేదవాక్కులాండి? ప్రేమ డైలాగులు కదా! పరమ రొటీన్ గా వుంటాయి. రొటీన్ డైలాగులేం గుర్తుంటాయి?"
"ఒక్క ప్రేమించడమేనా? ఆరాధిస్తున్నా - అన్నాడు కదూ?"
"చిత్తం! భలే కనిపెట్టేసేరే? కరెక్టుగా అదే డైలాగు అన్నాడండి!" అన్నాడు కైలాసం ఆశ్చర్యపోతూ.
టైగర్ మొరుగుతోంది. దాని మొరుగుడు ఆలకిస్తున్నాడు గోవిందం. ఆ వరస గమనిస్తోన్న కైలాసానికి గుండెల్లో దడ ప్రారంభమైంది.
గోవిందం అంటున్నాడు -
"ఆకాశంలో వెలిగే నక్షత్రం నువ్వు! నేల మీద కుండ పెంకుని నేను అని కూడా అన్నాడు కదూ?"
కైలాసం భయం భయంగా అన్నాడు -
"డైలాగులు మాక్కీకి మక్కీ చెబుతున్నాయండి కుక్కలు....?"
"మానాన్నగారు నా ఇష్టాన్ని కాదనరు అని అమ్మాయి హామీ ఇచ్చింది. అవునా?"
కైలాసం ఇంక ఓర్చుకోలేక గోవిందం కాళ్ల మీద పడిపోయేడు. తర్వాత తీరుబడిగా లేస్తూ విషాదంగా అంటున్నాడు-
"అనుకున్నాన్లేండి. నా జాతకం బాగా భ్రష్టుపట్టి పోయింది. ఎంతో శ్రద్దగా అతి జాగ్రత్తగా, వేషం మార్చుకుని వెళ్లేను. ఈతడవైనా నా యొక్క పనితనం మీ ముందు ప్రదర్శించాలనే పట్టుదలతో వెళ్లేను. కానీ,ఈ కుక్కలు.... ఈకుక్కలు నా ఆశయాన్ని తుడిచి పెట్టెస్తున్నాయి."
"కుక్కల్ని తిట్టావంటే నీ నాలుక తెగ్గోస్తా!" అన్నాడు గోవిందం.
"తిట్టను."
"కుక్కలైతేనేం? విన్న డైలాగులు ఒక్కటీ కూడా మరిచిపోకుండా చెప్పేయి. వాటికున్న జ్ఞాపక శక్తి నీకుందా?"
"లేదు."
"వాటికున్న నిజాయితీ?"
"చిత్తం! ఆ విషయంలో నన్ను శంకించకండి అయ్యా! నా కంటే కుక్కలు బెటరని నేను కూడా అంగీకరిస్తున్నాను. తమరు అనుమతిస్తే వచ్చే జన్మలో మీ ఇంట్లోనే కుక్క పుట్టుక పుట్టి."
కైలాసం చెబుతున్న దానికి "ఆగు!" అని అడ్డుపడ్డాడు గోవిందం కైలాసం చెప్పడం ఆపేసేడు. గోవిందం మెదడ్లో ఏ గొప్ప పాయింటు మెరిసిందో గాని, కైలాసం చొక్కా పట్టుకుని పక్కకి తీసుకెడుతున్నాడు.
కుక్కలు రెండూ వంట గది వేపు వెళ్లేయి.
అక్కడ దృశ్యాన్ని చూచి మొరగాలా, వద్దా అని మొహమొహాలు చూచుకున్నాయి. ఇక్కడ మొరగకుండా, యజమాని దగ్గర మొరగడమే మంచిదని నిర్ణయానికొచ్చి, తోక లాడించుకుంటూ వెనక్కి తిరిగేయి.
గోవిందం చెప్పిన ప్లాను శ్రద్దగా విని బెంగగా అడిగేడు కైలాసం-
"తమరి ప్లాను అమోఘంగా వుంది. కాకపోతే ఖర్చుతో కూడిన వ్యవహారం!"
"ఖర్చు గురించి వెనకాడకు! ఇది మా వంశ ప్రతిష్టకు సంబందించిన సమస్య. ఈ దెబ్బతో ఆ ఫకీరుగాడు పల్టీ కొట్టాలి. చేసి తప్పు శారదకి తెలిసిరావాలి. ఆ పన్లో వుండు!" అన్నాడు గోవిందం.
కైలాసం సెలవు పుచ్చుకుని వెళ్లిపోయేడు. స్టోరు గది నుండి డబ్బాల మోత వినిపించగానే గోవిందం గబగబా ఆ గదివేపు నడిచి,గది బయటే నిలబడి అరుస్తున్నాడు -
"అనవసరం ! నువ్వేం చెప్పినా వినను. ఆ ఫకీరు వెధవని అమ్మాయి మరిచిపోవాలి! అందుకేమైనా చేస్తాను!" అని గబగబా హాల్లోకి వచ్చేడు.
కుక్కలు మొరుగుతున్నాయి. ఆశ్చర్యపోతూ వింటున్నాడు గోవిందం. చివరికి కళ్లింతవి చేసుకుని అన్నాడు -
'పదండి చూద్దాం!" అని గోవిందం వేగంగా వంటగది వేపు నడిచేడు. కుక్కలు అతని వెంట నడుస్తున్నాయి.
వంట గదిలో పనిమనిషి సుబ్బులు గుండెల మీద వంటవాడు తలవాల్చి విశ్రమించి వున్నాడు. తన గుండెల మీద విశ్రమిస్తున్న వంటవాడికి చిరుతిళ్లు అందించే ప్రయత్నంలో వుంది సుబ్బులు. అందుచేత వాళ్లిద్దరు తన్మయత్వంలో వున్నారు.