అని - కుక్కల్తో మాట్లాడటం పూర్తి చేసి, కైలాసం వేపు చూసేడు.
"కుక్కల్తో సంప్రదింపులేవో చేసిననట్టున్నారు" అడిగేడు కైలాసం.
"సంప్రదింపులూ కాదూ చట్టబండలూ కాదు. మారు వేషంలో వెంబడించమని చెప్పేనా లేదా?"
"చిత్తం! చెప్పేరు!"
"మరి ఆ పనెందుకు చేయలేదు?"
"కొన్ని టెక్నికల్ రీజన్లవల్ల -"
"ఏమిటా బోడి రీజన్లు?"
"ఆర్ధికపరమైన ఇబ్బందులు. వేషం మార్చాలంటే మాటల్తో అయ్యే పని కాదు సార్! జేబులు కొట్టే వేషమైనా - ఖర్చు కనీసం వందరూపాయలవుతుంది!"
"ఆ ఖర్చు నేనిస్తాను!"
"అయితే విజృంభిస్తాను"
అని కైలాసం హామీ యిస్తుండగా - హాల్లోకి పెళ్లిళ్ల పేరయ్య ఎంతో సంతోషంగా ప్రవేశించేడు.
పేరయ్యని చూడగానే గోవిందం గొప్ప సంబరపడిపోతూ అన్నాడు-
"నీ కోసమే చూస్తున్నా!"
"చిత్తం రైలు లేటండి!" అన్నాడు పేరయ్య.
"కూచో!" అన్నాడు గోవిందం.
పేరయ్య కూచున్నాడు. కూచోగానే సంచిలోంచి ఫోటోల పొట్లాం తీస్తూ అంటున్నాడు-
"అయ్యా! ఇవన్నీ ప్రస్తుతానికి ఆన్ హేండ్ లో వున్న సంబంధాల తాలూకు అందగాళ్ల ఫోటోలు."
"అందమొక్కటే ముఖ్యం కాదు పంతులు!"
"చిత్తం!"
"హొదా....హొదా కావాలి! మా జమీందారీ హొదాక్ సరిపోయే సంబంధంకావాలి!" అన్నాడు గోవిందం.
స్టోరు గదిలోంచి డబ్బాల శబ్దం విపరీతంగా వినిపించి ఆగింది. గోవిందం మొహం మాడ్చుకున్నాడు. ఎందుకైనా మంచిదని పేరయ్యని అడిగేడు -
"నీకేమైనా శబ్దాలు వినిపించేయా?"
"శబ్దాలా?" ఆశ్చర్యంగా అడిగేడు పేరయ్య.
"అదేలేవయ్యా! డబ్బా వాయించడం నీకు వినిపించిందా?"
"వేరే వినిపించాలా? ఇప్పుడు జరిగే తంతు అదే గదా! అని మనసులో అనుకుని, లేదండీ! నాకేం వినిపించలేదు" అన్నాడు.
"అయితే సరే! ఇంతకీ నా పాయింటేమిటంటే?" అని గోవిందం ఏదో చెబుతుండగా-
"చిత్తం! అర్ధమైంది. తమ డబ్బా హొదాకి - మన్నించాలి, అనవసరంగా డబ్బా శబ్దం నా మెదడ్లో ఎక్కించేరు గదా! అదన్నమాట! అంచేత మీ హొదాకి సరితూగే సంబందాలే తీసుకొచ్చా! ఇదిగో ఈ ఫోటో చూడండి! అబ్బాయి సినీమా హీరోలాగా వుంటాడు."
"మా క్కావల్సింది సినమా హీరోలు కాదు. జమీందారీ..."
"చిత్తం! వాళ్లది కూడా తమ మాదిరి జమీందారీ కుంటుబమేనండి!" అంటూ ఫోటోని తీక్షణంగా చూస్తున్నాడు.
పేరయ్య చెబుతున్నాడు-
"అబ్బాయి తాతగారు పెంటపాడు జమీందారు!"
"ఊరుపేరు బాగోలేదు."
"ఆయన పోయేరు. కానీ, ఆ ఠీవీ, ఆ హొదా, ఆ దర్జాలు మాత్రం చెక్కుచెదరకుండా అల్లాగే వున్నాయి. అప్పు కోసం వెళ్లినా పల్లకి లోనే వెడతారు!" అన్నాడు పేరయ్య.
అప్పు అనేపదం వినగానే అప్ సెట్టయ్యాడు గోవిందం.
"అప్పా? అప్పేమిటయ్యా? దర్జాతప్పు ఆస్తి లేదా?" అని కూడా అడిగేడు గోవిందం.
అప్పటి గ్గాని పెరయ్యకి తాను చేసిన తప్పేమిటో అర్ధం కాలేదు. అర్ధమైన వెంటనే చేసిన తప్పు దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా అన్నాడు-
"మాటవరసకి అన్నానే గాని వాళ్లకి అప్పు లెందుకండీ? ఫోటో చూసేరనుకుంటాను!"
గోవిందం తన చేతిలోని ఫోటో జాకీకి చూపించేడు.
జాకీ ఫోటో చూసింది. మౌనంగా వుండి పోయింది.
"అబ్బాయి ఎట్లా వున్నాడు?" జాకీని అడిగేడు గోవిందం.
జాకీనేల చూపులు చూస్తో గబగబా మొరిగింది. పేరయ్యకి అదంతా విడ్డూరంగా వుంది.
గోవిందం పేరయ్యని సూటిగా ప్రశ్నించేడు -
"అబ్బాయి తొడుక్కున్న సూటు - సొంతమా, అద్దెదా?"
"మీకెందుకొచ్చిందా డవుటు?"
"నాకు రాలేదు. మా జాకీ కొచ్చింది."
"మీ జాకీ అంటే - ఈ కుక్కే గదా!"
"అవును."
"కుక్కలు అట్లాగే అడుగుతుంటాయి. వాటి మాటలు పట్టించుకోకండి!"
"నేను పట్టించుకుంటాను. అది నా ప్రత్యేకత! నీకు తెలుసో తెలీదో గాని, పంతులూ! మా అమ్మాయి బంగారు ఉయ్యాల్లో ఊగింది."
"ఊగే వుంటుందండి!"
"వేడి వేడి అన్నమ్మీద బంగారు రేకులు అద్ది ముద్దలు తినిపించేవాళ్లం"
"తినిపించే వుంటారు."
సరిగ్గా అప్పుడే స్టోరు గదిలో డబ్బాల మోత వినిపించింది. క్షణంలోనే ఆ మోత మరింత ఎక్కువైంది.
ఆ బాధ భరించలేక గోవిందం లేచి నిలబడ్డాడు. పేరయ్య కూడా లేచేడు. పేరయ్యతో అంటున్నాడు గోవిందం-
"తెచ్చిన ఫోటోలు మా కైలాసాని కివ్వు. అన్నీ పరీక్ష చేసి ఖబురు చేస్తా!" అని గోవిందం గబగబ స్టోరు గది వేరు నడిచేడు. తాళం తీసి గదిలో అడుగుపెట్టి తలుపులు మూసేడు అప్పటికి డబ్బా మోతలు ఆగిపోయేయి.
గోడకి తగిలించిన పాత ఫోటో వేపు కోపంగా చూస్తూ అడిగేడు గోవిందం -
"వేళా పాలా లేకుండా ఏమిటా చప్పుళ్లు?"
"ఎంతకీ రాకపోతే ఏం చేయను?"
"పిలవగానే పరుగెత్తుకు రావాలా? మెనర్స్ నేర్చుకో! ఎందుకు పిల్చేవో చెప్పు!"
"నీ పిల్ల బంగారు ఉయ్యాల్లో ఊగిందా? అన్నంలో బంగారు రేకులద్ది ముద్దలు తినిపించేవా? ఎందుకురా గొప్పలు?"
"నా పిల్ల ! నాఇష్టం! ఏమైనా చెప్పుకుంటాను!"
"చెప్పుకోరా! అమ్మాయి అందంగా వుంటుందని చెప్పు. గునవంతురాలని చెప్పు. చదువుకుందని ఉయ్యాల, బంగారు రేకులని కోత లెందుకురా కోస్తావు?"
"నా ఇష్టమని చెప్పేనా?"
"అయినా ఒరే! అమ్మాయితో ఒక్క మాటైనా చెప్పకుండా పెళ్లి ప్రయత్నాలు చేస్తావా? తప్పురా!తప్పు!"
"నేను నీ బోడి సలహాలు వినను. నాకు హొదా ముఖ్యం. ఆస్తీ, ఐశ్వర్యాలు ముఖ్యం!"
"ఒరే! ఒరే! అసలు నువ్వెవిడివో, నీ కథేమిటో...."
"వద్దు! పాత విషయాలు గుర్తు చేయద్దని నీకు అనేకసార్లు చెప్పేను. ఇంకా నువ్వా మాటే పట్టుక్కూచుంటే - నీ మొహాన నల్లరంగు పోస్తా!" అని ఉక్రోషంగా ఆ గదిలోంచి బయటకు వచ్చి గదికి తాళం వేసేడు.
29
ఆ పార్కులో ఒక మూలగా సత్యమూర్తి శారద కూచుని వున్నారు. ఎప్పట్నుంచి కూచున్నారో గాని శారద విసుగ్గా అన్నాది -
"ఎంతసేపు ఈ మవున వ్రతం?"
ఆ మాట అని ఆమె లేవబోయింది. సత్యమూర్తి అకస్మాత్తుగా ఆమె చేతిని పట్టుకున్నాడు. ఖంగారుగా అంటున్నాడు-
"ప్లీజ్! లేవకు! నా పక్కనే కూచో!"
సత్యమూర్తి అభ్యర్థనను శారద కాదనలేకపోయింది. అతని పక్కనే కూచుంది.
సత్యమూర్తి శారద చేతిని వదిలి పెట్టలేదు. శారదకి కూడా తన చెయ్యి అతని చేతిలో వుంచడమే హాయిగా వుంది. అందుచేత తన చేతిని లాక్కోలేదు! అతని కళ్లల్లోకి ఆరాధనా పూర్వకంగా చూస్తోంది. అతను కూడా అదే పని మీద వున్నాడు.
వాళ్ల మధ్య మాటల్లేవు. కేవలం చూపుల్తోనే మాటాడుకుంటున్నారు.
వాళ్లక్కోంచెం దూరంలో-
ముష్టి వాడి వేషంలో కైలాసం కుంటుకుంటూ వస్తున్నాడు.
పీలికల్లాంటి దుస్తుల్లో వున్నాడు. చేతిలో వంకర్లు తిరిగిన అల్యూమినియం కంచంతో గొప్ప దయనీయంగా వున్నాడు.
ఎవరో దయ గల మారాజు కైలాసం కంచంలో పదిపైసల బిళ్లను చూసి కైలాసం ఫిలాసఫర్లా నవ్వుకున్నాడు.
తన కంచంలో పడిన పదిపైసలబిళ్లను చూసి కైలాసం ఫిలాసఫర్లా నవ్వుకున్నాడు.