"అఫ్ కోర్స్...ఎంత మంది తల్లులు సమాజానికి భయపడి కన్నబిడ్డలచేత ఆంటీ అని పిలిపించు కోవడం లేదు...అందుకే అనుమానం తీర్చుకుందామని..." అంటున్న అతని మాటలు పూర్తికాకముందే డ్రయివింగ్ సీట్ లో కూర్చుని తలుపుని చప్పుడు వచ్చేలా వేసింది డాక్టర్ కృష్ణప్రియ.
అతని మాటలు ఆ డోర్ చప్పుడులో కలిసిపోయాయి.
"ఓ.కె. గుడ్ బై..." అంటూ కారుని స్టారు చేసుకొని వెళ్ళిపోయిందామె.
కుమార్ లోని అహం బుసలు కొట్టింది.
అప్పుడే యధాలాపంగా అతని చూపులు మెట్లవేపు చూశాయి.
అది గమనించి ఠక్కున వెనుదిగిరింది శాంతిశ్రీ.
అయినా అప్పటికే ఆమెను చూడనే చూశాడు.
"ఎవరిది...శాంతిలా వుందే..." అనుకొంటూనే సందేహం తీరక మెట్లు ఎక్కి ఆమెను సమీపించాడు కుమార్.
అతను దగ్గరవుతున్న కొద్దీ శాంతిశ్రీ గుండెలపై నడచివస్తున్న ఒక్కొక్క అడుగుల చప్పుడూ పెద్ద సమ్మెట పోట్లు తగులుతున్నట్లుగా కంపించిపోతుంది.
"హాయ్. శాంతి...ఎలా వున్నావు డియర్...నన్ను చూసి కూడా ముఖం వెనక్కి తిప్పుకుంటున్నా వేంటి__? ఓహ్...డాక్టర్ కృష్ణప్రియతో మాట్లాడడం చూసి నీకు అసూయ కలిగి వుంటుంది. మరేం చేద్దాం చెప్పు...ఆమె నా కాబోయే భార్య...ఎలాగయినా ఆమె మెడవంచి మూడుముళ్ళు వేసే మగవాడిని నేనే. ఇంకొక విషయం చెప్పనా...ఆమె పక్కనే వున్న బాబుని చూశావా...నీ లానే పడుచు వయసులో ఎవడితోనో సుఖాలను తీర్చుకున్నది ఆమె. ఆ పాప ఫలమే ఆ బిడ్డ...కళ్ళు కామంతో మూసుకుపోయి కన్న నేరానికి ఆ బిడ్డను అనాధను చెయ్యలేక ఎవరి బిడ్దనో తెచ్చి పెంచుకుంటున్నట్లుగా నాటక మాడుతున్నది టక్కులాడి. అందుకే అదంటే నాకు కసి...ఎలాగయినా దాని పొగరు అణచివేయాలి. అదే నా ధ్యేయం. అది సరేలే...చాలాకాలం తరువాత కనిపించావు. ఎక్కడ వుంటున్నావు" విలాసంగా అంటూ ఆమె భుజంపై చేయి వేశాడు కుమార్.
ఆడత్రాచు బుసకొట్టినట్లు విసురుగా అతని చేతిని తోసివేసింది.
"షటప్"
"ఓయబ్బో! కోపం ఇంకా తగ్గలేదే? అవునులే ఆడవాళ్ళు కోపంలో కూడా అందంగానే వుంటారు. కమాన్ ఈ శుభ సందర్భాన్ని కలిసి ఎంజాయ్ చేద్దాం" అంటూ చేతిని పట్టుకోబోతే వెనక్కి జరిగింది శాంతిశ్రీ.
అతనివైపు తీక్షణంగా చూసింది.
"ఛి నువ్వూ ఒక మనిషివేనా? కంటికి కనిపించిన ప్రతి ఆడదీ నీకు ఆటవస్తువులానే కనిపిస్తుందా?"
"ఏం చేద్దాం చెప్పు అది ఈ సృష్టిధర్మం"
"నీలాంటి కామంధుడితో మాట్లాడితే ఈ పవిత్రమైన స్థలం కూడా అపవిత్రమే అయిపోతుంది" అని వేగంగా మెట్లుదిగి వెళ్ళిపోసాగిందామె.
"సరే, అపవిత్రమైన చోటుకే వెళ్ళి మాట్లాడుకుందాం ఆగు నేనూ వస్తున్నాను" అంటూ ఆమె వెంట పడ్డాడతను.
మసక చీకట్లు కమ్ముకుంటున్నాయి__
ఒక్క ఆటో కూడా వస్తున్న జాడ లేకపోవడంతో శాంతిశ్రీకి ఖంగారుగా వున్నది.
ఆమె పరిస్థితి చూసిన కుమార్ కు వినోదంగా వుంది.
క్షణాలమీద ఒక పధకాన్ని ఆలోచించుకున్నాడతను.
జేబులో నుంచి హాండ్ కర్చీఫ్ తీసి, ఆమె చూడకుండా ఒక చిన్న బాటిల్ లోని ద్రవాన్ని పైకి ఒంపి వేగంగా ఆమెను సమీపించి ఒడసిపట్టుకున్నాడు కుమార్.
ఖంగారుపడి అరచేలోపల ఒక చేత్తో నోటిని__రెండవచేత్తో ముక్కు దగ్గర ఆ కర్చీఫ్ తో అదిమిపట్టడంతో క్షణాలమీద శాంతిశ్రీ కళ్ళు తేలవేసింది.
పవర్ ఫుల్ క్లోరోఫామ్ వాసన వలన వెంటనే మత్తులో మునిగిపోయింది.
అటుగావచ్చిన ఆటోను ఆపాడు కుమార్...
స్పృహలో లేని శాంతిశ్రీ వైపు ఆశ్చర్యంగా చూశాడు ఆటోవాడు...