Previous Page Next Page 
ఆఖరి మజిలి పేజి 25


    అతను పాడిన రేటుకి మించి ఎవ్వరూ పాటను పెంచలేక పాట నుంచి నిష్క్రమించారు.

    పాట సూట్ వాలాకే వచ్చింది.

    అతని పేరు రూప్ చంద్!

    అతనిని అశోక్ ఆహ్వానించాడు.

    పెద్దమనుషుల సమక్షంలో అగ్రిమెంట్ వ్రాసుకున్నారు.

    అశోక్ బాబు, రూప్ చంద్ కు...అతని మనుషులకు ఆ సీజన్ లో అక్కడే ఉండడానికి బంగ్లాలో బస ఏర్పాటు చేశాడు.

    ఆ రోజు బాగా పొద్దు పోవడంతో రాత్రికి డిన్నర్ ఏర్పాట్లు చేయించాడు అశోక్.

    ఆ రాత్రి రూప్ చంద్ కు నిద్ర పట్టనేలేదు.


                      *    *    *


    శాంతిశ్రీ బిర్లామందిరం మెట్లు దిగుతున్నది...

    ఎవరో వెంటబడి తరుముతున్నట్టు వేగంగా అడుగులు వేయడం వల్ల కాలు స్లిప్ అయి మెట్లపై తూలి పడబోయి నిలదొక్కుకున్నది.

    ఎంతలో ఎంత ప్రమాదం  జరగబోయిందో తలచుకోవడంతో శాంతిశ్రీ గుండె చిక్కబట్టి నట్టయ్యింది.

    నిజానికి డాక్టర్ కృష్ణప్రియ మెట్లు దిగుతున్నది.

    టింకూను తీసుకుని ఆమె గుడికి వచ్చినట్టుంది...కృష్ణప్రియ ఎప్పుడు వచ్చిందో, ఎక్కడ కూర్చున్నదో గమనించలేదు శాంతిశ్రీ. తనువచ్చి చాలాసేపు అయింది. మనసు చికాకుగా వున్నప్పుడు ఈ గుడికివచ్చి చాలాసేపు కూర్చుండి...మనస్సులోని వేదన అంతా ఆవిరి అయిపోయింది అనిపించాక అప్పుడు హాస్టల్ కు వెళుతుంది.

    చేసేది వార్డెన్ ఉద్యోగం అయినప్పటికీ సొంత హాస్టల్ లా తన అజమాయిషీలో వున్న అమ్మాయిల నందరినీ కనిపెట్టి వుంటుందామె...

    స్త్రీ జీవితం  ఎలాంటిదో  శాంతిశ్రీకి అనుభవమే గుణపాఠం నేర్పింది...చిన్న వయసులోనే ఎన్నెన్నో ఆటుపోట్లు...వందేళ్ళ అనుభవాన్నంతా అయిదేళ్ళ జీవిత కాలంలో కాచి పడపోసినట్టు గ్రహించగలిగింది.

    ఈ సమాజంలో ఒంటరి  ఆడది ఎలా మనగలుగుతుందో ఆమె స్వానుభవమే చేదు సత్యాన్ని రుచిచూపింది. ఏమాత్రం ఆదమరచి వున్నా కాటు వేయడానికి సిద్ధంగా ఉండే కాలనాగుల కోరలకు చిక్కకుండా తప్పించుకోవడం ఒకవైపు...జీవన గమనాన్ని కొనసాగించడం మరోవైపు జీవన పోరాటంలో అలసి సేద తీరుతున్న తరుణంలో ఏదో ఒక అశాంతి.

    ఆ అశాంతికి కారణమే ప్రస్తుతం గుడికి రావాలనిపించింది.

    డాక్టర్ కృష్ణప్రియ మెట్లు దిగేటప్పుడు  చూడడంతో ఎలాగయినా  ఆమెను  పలుకరించాలని  తొందరలో బయలుదేరింది.

    అప్పటికే డాక్టర్ కృష్ణప్రియ చాలాదూరం వెళ్ళిపోయింది.

    ఆమె పక్కనే ముద్దులు మూటకట్టే చిన్నారి టింకూ...

    ఎంతోకాలం తరువాత కనిపించిన ఆత్మీయరాలిని పలకరించాలనే తహతహతో వేగంగా మెట్లు దిగుతున్నది శాంతిశ్రీ.
   
    కానీ, ఉన్నట్టుండి ముందుకు అడుగు వేయబోతున్న అడుగును ఆ మెట్లుపైనే అలానే వుంచి శిలావిగ్రహంలా నిలబడి పోయిందామె.

    డాక్టర్ కృష్ణప్రియ కారు ప్రక్కనే ఒక స్కూటర్ వచ్చి ఆగింది.

    ఆ స్కూటర్ పై డాక్టర్ కుమార్...

    "హలో ప్రియా...ఏమిటీ గుడికి వెళ్ళివస్తున్నావా?" పలకరించాడతను.

    "కనిపించడం లేదూ...గుడి మెట్లుదిగి రావడం చూస్తూ కూడా అదేం ప్రశ్న"

    "అవుననుకో...టింకూని క్షణం కూడా వదలిపెట్టి ఉండవనుకుంటానే నువ్వు...ఇంతకూ ఈ జూనియర్ ఎవరో నేను తెలుసుకోవచ్చా?"

    "సారీ...ఆ విషయం మాత్రం అడగవద్దు. అయినా ఆంటీ అనే పిలుపుకు అర్ధం తెలిస్తే ఆ ప్రశ్న వేసివుండవు" కారు డోర్ తీసి టింకూని లోపల కూర్చోబెడుతూ  అన్నది డాక్టర్ కృష్ణప్రియ.

 Previous Page Next Page