Previous Page Next Page 
వివాహం పేజి 25

   
    ఆ విదంగా నీతులు విని విని వుండడంచేత, గోపాల్రావుకి చాలా నీతివర్తన కలిగింది. కనుక వెంకన్నపంతులు తనమీద దొంగతనం కడితే ఎక్కడలేని రోషమూ వచ్చిందతనికి, చివర్క్ రవణ తనే దొంగతనం చేశాననేటప్పటికి అతను నిర్ఘాంతపోయాడు. తనకోసం చేసిన త్యాగమని తోచింది. కాని ఆ భావాన్ని పైకి రానీలేదు యీ దొంగతనం చేసి, అది దాన్ని అణగతొక్కింది. అదీగాక తనకోసం దొంగతనం చేసి, అది వొప్పుకునేటంత త్యాగం చేసింది తన భార్య అని తనకి తానే వొప్పుకుంటే తనకెంత న్యూనత? భార్యచేత సహాయం చేయించుకోవలసిన గతి పట్టిందని వొప్పుకోడు. అంత ఉపకారభావం భరించడం కూడా దుస్సహమే.

    ఈ ఆలోచనలన్నిటినీ, ఆమె త్యాగాన్నీ, ఉదారాన్నీ దొంగతనం చేసిందనే కోపంలో మాడ్చి ఆమెవైపు తృణీకారంగా చూసి, రైలు యింజనుకంటే యెక్కువగా మండుతో రైలెక్కి పట్నం వెళ్లాడు గోపాలరావు.

    సాయంత్రం రవణ "సాహితి" ముందు పెట్టుకొని కూచుంది. గుమాస్తాని పంపేక వెంకన్నం పంతులు గదిలోకి వొచ్చి, రవణ భుజంమీద చెయ్యేసి - "అతనిమీద అప్పుడే అంత ప్రేమా! నువ్వు చేశానంటే మాత్రం నేను నమ్ముతానా? అతన్నేమీ అననులే, పిచ్చిపిల్లా!" అన్నాడు.

    వెంకన్న పంతులు ప్రతిరోజూ అబద్ధం నిజంగాచెప్పే సాక్షుల మొహాలూ, కరణాల మొహాలూ చూస్తోవుండడంచేత ఆయనకి నిజం చెప్పే మొహానికి చెప్పినదానికీ భేదం కనుక్కునే సమాజశక్తి నశించింది. సాక్ష్యబలంమీద ఆధారపడడమేగాని మనిషి స్వభావంమీద ఆధారపడడమేగాని మనిషి స్వభావంమీద ఆధారపడడం మానుకున్నాడు. అదిగాక రవణమీది ప్రేమచేత ఆమె ఆ పని చేసిందని వొప్పుకోవడం అతనికిష్టంలేదు. రవణే ఆ పని చేసిందంటే ఆ పని చెయ్యవలసిన ఆవశ్యకతా, తన అన్యాయమూ, అన్నీ వొప్పుకోవలసి వొస్తుంది. కనుక తన లోభత్వం గోపాలరావు చేసిన కార్యంమీద ద్వేషంలో దిగమింగి, అతను వూరుకున్నాడు. యింతాచేసి గోపాలరావుకి సొమ్మూ యిప్పించలేక, అతనిమీద అపవాదునూ తొలగించలేక, తన కోపమూ, తన ప్రేమా, తన త్యాగమూ, అన్నీ నిరర్ధకములైనా, లోపలనే అణచుకుని నిత్యజీవనం గడుపుతోంది రవణ.
       

                                                                          6

    ఫిబ్రవరి నెలలో రావమ్మ మళ్ళీ కన్నది. సాయంత్రం ఆ రోజంతా వాన. అయిదున్నరకే చీకటిపడ్డది. నొప్పులుపడుతూ పగలంతా పెద్ద గదిలో పడుకుని కేకలేసి, చివరికి అలసి పడుకుంది. ప్రతి కానుపుకూ యిట్లా మూడు నాలుగు రోజుల బాధపడడం మామూలే. యింక కానుపు లక్కర్లేదని ప్రతివారితోనూ అనడం, మళ్ళీ కనడం మామూలయింది ఆమెకి. ఆ రోజు రాత్రి డాక్టరుగారింటికి గృహప్రవేశ భోజనానికి వెళ్ళి యింటికి రాత్రి పదిన్నరకి వొచ్చాడు వెంకన్నపంతులు. పట్టుబట్టవిప్పి పంచకట్టుకోడానికి వెడితే దీపంలేని ఆఫీసుగదిలో కుర్చీమీద కూచుని బల్లమీద చేతులు పెట్టుకుని రవణ నిద్రపోతోంది. ఆమె మెడవరకు వెన్నెల పడుతోంది. తలంటి పోసుకుని ఒదులుగా జడవేసుకున్న జుట్టు గుబులుగా చేతులమీద వేళ్ళాడుతోంది. పిరుదుల దగ్గర్నించి మెడవరకు సాగే ఆ ఒంపుల్ని, ఆ అమాయకత్వాన్ని నూతనత్వాన్ని, వెన్నెలలో ఆ చర్మంలో కనపడే కొత్త యవ్వనపు మెరుపుని చూసి, వెంకన్న పంతులు మనసులో సంచలనం కలిగింది. బల్లకి ఒత్తుకోకుండా ఆమె రొమ్ముని తప్పించాలనిపించింది. యిన్నాళ్ళూ ఆమె మీదవుండే పితృవాత్సల్యం గృహప్రవేశ భోజనంతో అడుగునపడి, యింత అందమైనదాన్ని యిన్నాళ్ళు యెట్లా గుర్తించలేదా అనుకున్నాడు వెంకన్నపంతులు. ప్రపంచంలో స్త్రీలు లేరు, ఆ రావమ్మ తప్ప. అందరూ కరణాలూ, కలెక్టర్లూ, గుమాస్తాలూ కాయితాలే. లోకం ప్రకారం దుర్నీతి అతనిలో యేమీలేదు. ఆ ధ్యాసేలేదు. ఆ వాంఛ వచ్చినపుడు భార్యవుంటే చాలు. కాని యింకా చావని కొన్ని రసాభావాలూ, సౌందర్య పిపాసా కొంచెంగా వుందో, ఏం చెయ్యబోతున్నాడో అతనికే తెలీదు. మెడకింద చెయ్యేసి కదిలించాడు.

 Previous Page Next Page