Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 26


    సంబరంగా అంటున్న అతన్ని తిరస్కారంగా చూసింది. తనని అర్ధం చేసుకోడం అంటే ఇదా? తనన్న మాటలకు అతనికి నచ్చిన పాయింటు ఇదా? అందుకే సింపుల్ గా పెళ్ళికి ఒప్పుకున్నాడా? పెళ్ళి ఖర్చులు, అత్తగారికి వాటా అన్నీ మానేస్తే లక్షా తనకే వస్తుందన్న ఆశతో ఒప్పుకున్నాడు . ఎంత మోసం! ఎంత దగా ....తన తల్లిదండ్రుల ఆరాటాన్ని ఈ విధంగా కాష్ చేస్సుకున్నాడా తెలివిగా.... తన దగ్గిర మాతవరసకన్నా ఇటు తల్లిదండ్రులు , అతను చెప్పకుండా దాస్తారా? ఇప్పుడు పెళ్ళి అయిపొయింది. శోభనం కూడా జరిగిపోయింది. ఇంక చెప్పినా ఫరవాలేదనుకున్నాడా.....చెపితే ఇంకేం చేస్తుందన్న ధైర్యమా..... సునీత మనసు, శరీరం నిప్పులు రాసుకున్నట్టు మండింది.
    భేష్ మగవాడా.....భేష్....ఎంత అదృష్టవంతుడివి  యెంత చక్కగా అర్ధం చేసుకున్నావు నా ఆశయాన్ని! లక్షకి కక్కుర్తిపడి , పైగా గర్వంగా లక్ష ఎంత ఈజీగా సంపాదించానో అన్న ఆనందంగా చెప్పడం.....ఎంత దిగజారుడుతనం..... ఆ డబ్బుతో ఇంట్లో సామాను నింపుకోవచ్చన్న గొప్ప ఆలోచన ఎంత లేకితనం..... లక్ష కోసం , పాపం , సంప్రదాయపు వివాహానికి తిలోదకాలు ఇచ్చిన త్యాగధనుడిని. అంతా తనకిందే ఖర్చు పెట్టుకోవాలి. కనిపెంచిన తల్లిదండ్రులకి కనీసం బట్టలకన్నా ఇవ్వక్కర లేదన్న గొప్ప స్వార్ధం. ఆమెకే శక్తి ఉంటె..... ఆమె చూపులకే శక్తి ఉంటె రామకృష్ణ అక్కడికక్కడే మాడి మసి అయ్యేవాడే.
    ఆమె చూపులు తప్పించుకుంటూ  "ఏమిటలా చూస్తున్నావు/ నీవేగా అన్నావు? ఈ దండుగ ఖర్చులు అన్నీ వద్దని.....నాకూ అదే మంచిదనిపించింది. మీ నాన్నగారు నీ పెళ్ళి కోసం దాచింది ఇచ్చేస్తాను అంటే సరేననుకున్నాను.' తనని తాను సమర్చించుకొబోయాడు.
    "అంటే లక్ష ఇస్తారని రిజిష్టరు మేరేజీకి ఒప్పుకున్నారన్నమాట! ఆ లక్ష ఇవ్వకపోతే నన్ను చేసుకునే వారా?" తీక్షణంగా చూసింది.
    జవాబుకి రామకృష్ణ తడబడ్డాడు.
    "మీరు ముందే నాన్నతో మాట్లాడి వచ్చి నా దగ్గిర ఇది దాచి, చాలా గొప్పగా నీతో ఏకీభవిస్తున్నానని అన్నారన్నమాట."
    రామకృష్ణ తడబడ్తూ ఏదో చెప్పబోయాడు. 'నేను సింపిల్ మేరేజి అంటే అటు ఇటు దండగ ఖర్చులు ఉండకూడదని....అంతేకాని ఇలా డబ్బు దండుకోమని కాదు.'
    "మరి నీవే అన్నావుగా ఆ ఖర్చులన్నీ మాని అటువాళ్ళు ఇటువాళ్ళు ఆ డబ్బిస్తే కొత్త కాపురానికి పనికొస్తుందని.....' ధీమాగా తలెత్తి ఏం అంటావన్నట్టు చూశాడు.
    "అది డబ్బు ఉన్నవారి గురించి.... మాటవరసకి అన్న ఆ మాట మాత్రం మీకు నచ్చింది. ఆ పాయింట్ ఒక్కటే మీరు పట్టుకున్నారన్నమాట! చూడండి మా నాన్న రిటైరయ్యారు. ఇద్దరి పెళ్ళిళ్ళు చేశారు. అయన దగ్గిర ఏమాత్రం ఉందొ నాకు తెలుసు. ఈలక్ష ఫిక్సిడ్ డిపాజిట్ తీసేస్తే కేవలం అయన పెన్షను మీద ఆధారపడి అన్నింటికి ఇబ్బంది పడాలన్నది నాకు తెలుసు. కనకే ఖర్చు లేకుండా ఆ పెళ్ళి కావాలన్నాను. అంతేగాని ఆ లక్ష కోసం ఆత్మాభిమానం వదిలి మామగారి దగ్గర పుచ్చుకుని పైకి ఆదర్శవంతులుగా ఫోజు పెట్టమని కాదు" తీవ్రంగా అంది.
    రామకృష్ణ మొహం ఎర్రబడింది. 'అయితే ఆ మాట అనకుండా ఉండాల్సింది. మావాళ్ళు దమ్మిడీ ఇవ్వరు అని ముందే చెప్పాల్సింది."
    'అంటే ఆ లక్ష కోసం చేసుకున్నారన్నమాట! సరే! ఇటువాళ్ళు అటువాళ్ళు ఖర్చు పెట్టేది పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురికి ఇచ్చేస్తే బాగుంటుందని అన్నాను. మా లక్ష మీరు తీసుకున్నారు. మరి మీ వాళ్ళ లక్ష ఏది?"
    రామకృష్ణ తెల్లబోయాడు. "మా వాళ్ళెందుకు ఇస్తారు? మగపెళ్ళి వారు పెళ్ళికి రావాల్సింది వాళ్ళు వదుల్కున్నారు అంతే చాలు"
    'ఓహో మగపెళ్ళివారెం ఖర్చు చెయ్యక్కర్లేదన్నమాట! నాకు చీరలు, నగలు, పెట్టాలి. పార్టీ ఇవ్వాలి. గృహప్రవేశం . మీ వాళ్ళ బట్టలు అన్నీ కలిపి వాళ్ళకీ లక్ష అవుతుంది. అది ఎందుకీవ్వరు?" రెట్టించింది.
    రామకృష్ణ ముఖం మాడిపోయింది . జవాబు లేనట్టు తలదించుకున్నాడు.
    'ఆ లక్ష అయినా తెండి, లేదంటే ఈ లక్ష మావాళ్ళకి వెనక్కి ఇచ్చేయండి" ఖచ్చితంగా అంది. అతని ముఖం ఎర్రబడిపోయింది.
    "ఇవ్వను, మహా బెదిరిస్తున్నావు ఏం చేస్తావు?' తగ్గిపోవడం అవమానమనిపించి కోపంగా అన్నాడు.
    "ఇవ్వకపోతే ఇదే మనకి మొదటిరాత్రి, ఆఖరి రాత్రి అవుతుంది. పెళ్ళి అయింది శోభనం కూడా అయిపొయింది , ఇంకేం చేస్తుందిలే మహా అయితే అరుస్తుంది అనుకున్నారు, అందుకే అంతవరకూ చెప్పకుండా దాచారు . చూడండి ఇది మీ కుటిలత్వాన్ని, చాటుతుంది. పోనీ చెక్కు పుచ్చుకుని గప్ చిప్ గా ఊరుకోకుండా నాకు ఇప్పుడే చూపడంలో మీ ఉద్దేశం పెద్ద కబుర్లు చెప్పావు చూడు నేనేం సాధించానో అని చెప్పడమో, నీ ఆదర్శాలు నా దగ్గర కాదు , అని హేళన చెయ్యడానికో అయి వుంటుంది. దీన్ని బట్టి మీది ఎంత క్రుకేడ్ మెంటాలిటినో అర్ధం అయింది. ఆ చెక్కు కావాలో నేను కావాలో ఐదు నిమిషాలలో తేల్చి చెప్పండి. ఇది బెదిరింపు కాదు. పెళ్ళయిపోయింది కాబట్టి నోరు మూసుకు పడుంటాను అని మాత్రం అనుకుంటే పొరబాటు పడ్డట్టే! మొగుడు సంసారం, వదులుకుంటాను గానీ ఇలాంటి కుచ్చితం మాత్రం సహించను' తీవ్రంగా అంది.
    రామకృష్ణకి ఆమె సీరియస్ గానే మాట్లాడుతుందన్నది అర్ధం అయింది. తగ్గిపోవడానికి అహం అడ్డు వచ్చింది. ఆవేశంలో ఏదో అనబోయి అరక్షణం అలోచించి, తరువాత ఆ చెక్కును ముక్కలుగా చేసి సునీత మీదకి విసిరివేసి అటుతిరిగి పడుకుండిపోయాడు. సునీత మొహం వికసించింది. అతని కోపం అర్ధం అయి సునీత నవ్వుకుంది.
    సునీతకి అర్ధం అవనిది.....రామకృష్ణ అరక్షణంలో కట్టిన లెక్కలు. అతడు ఇంజనీరు, లెక్కల్లో దిట్ట. అతని బుర్ర కంప్యూటర్లా అరక్షణంలో నెలకు ఐదువేలు *పన్నెండు నెలలు* ముప్పై ఏళ్ళు ఎంతో గుణించేసింది. వెధవ లక్ష కోసం భవిష్యత్తులో వచ్చే ఇరవై లక్షలు వదులుకునే తెలివితక్కువవాడు అనుకుందేమో తనని, అలాగే అనుకుని సంతోషించనీ, అనుకుని ఆతను అటు తిరిగి నవ్వుకున్నాడు" ఎవరికి వారు గెల్చిన తృప్తితో నిద్రపోయారు.
    అయితే ఇద్దరూ ఆలోచించనిదీ, ఊహించనిది ఒకటుంది. మొదటి రాత్రి కాపురం ముచ్చటే ఇలా మొదలైతే తరువాత ఎలా ఉంటుంది. సంసారం ముచ్చట అన్నది ఇద్దరికీ తట్టి వుండదు బహుశా . మంచిదే! తట్టకపోవడంలో సుఖం ఉంది!!

                                                   *ఆంధ్రప్రభ వారపత్రిక , ఫిబ్రవరి- 1998

 Previous Page Next Page