సోదెమ్మవల్ల పని కాలేదు.
భాషల్లో ఈ రకం లిపి వున్నట్లు లేదు.
ఇది దేవనాగరిక లిపి కాకపోవచ్చు.
ఇహ మిగిలింది
కోడ్.
రహస్య సమాచారం చేరవేయటానికి కోడ్ వుపయోగిస్తారు. కోడ్ ని జాగ్రత్తగా డికోడ్ చేస్తే! బస్ పని అయిపోతుంది.
"లేచి నుంచుంటే అడుగులు ఆవేపడతాయి. అడుగు లేయటం వస్తే పరుగెత్తటం తేలిక" అనుకున్న కైలాస గణపతి మళ్ళీ పుస్తకం ముందుకు జరుపుకుని కోడ్ ని డికోడ్ పలురకాలుగా చేస్తూ ఖరాబు అయిన కాగితాలను చించి పారేస్తూ కూర్చున్నాడు.
వంచిన తల ఎత్తకుండా రకరకాలు మార్చి ఏమార్చి రాస్తున్నాడు కైలాసగణపతి. దృష్టి అంతా కాగితాల మీదనే వుంది.
రాత్రిళ్ళు సూర్యారావు పాన్ కి ఒకటి రెండుసార్లు లేస్తాడు.
రోజూలాగే లేచాడు సూర్యారావు. పెద్ద లైటు కైలాసగణపతి గదిలో వెలగటంచూసి కిటికీ దగ్గరకు వచ్చి లోపలకు తొంగిచూశాడు.
"కైలాసగణపతి బయట ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోయినంతగా కాగితాలలోకి
.
తలదించుకుని ఏదో రాస్తున్నాడు. తనలో తాను గొణుక్కుంటూ ఉహూ?" అని తల అడ్డంగా తిప్పుతూ దానిలో లీనమైపోయాడు.
"ఇలా అయితే వీడికి ఎప్పుడో పిచ్చిపట్టడం ఖాయం" అనుకుంటూ అతను వెళ్ళిపోయాడు.
ఇక్కడ అతనికి తెలియనిది ఒకటుంది. కైలాసగణపతికి పిచ్చి పడుతుంది అనుకోటం అంత పిచ్చి మరొకటి లేదని.
కైలాసగణపతి కాగితాలు ఖరాబు చేస్తూ చాలా సేపు గడిపాడు.
"అనవసరంగా దీనితో కుస్తీ పడుతున్నానేమో! ఏదయినా లిపి గనక అయితే తన శ్రమ వేస్టు. రేపెలాగూ ఊరికి వెళుతున్నా కదా ముందు అది చూసుకునీ ఆపైన కోడ్ విషయం చూస్తే సరి" అనుకున్నాడు డైరీని మూసివేస్తూ.
కాగితాలని డస్క్ లో పడేశాడు.
కోడ్ ని డీ కోడ్ చేసే ప్రయత్నంలో చించి పారేసిన కాగితాలని నలిపి ఉండ చుట్టిన కాగితాలని పక్కన వున్న వేస్టు బాస్కెట్ లోకి విసిరేశాడు. పెద్దలైటు ఆర్పి మంచంమీద పడుకున్నాడు.
తను రాసిన కాగితాలని ఒక్కో కాగితాన్ని అక్షరానికొక ముక్కగా చేసి పారేసినట్లయితే బాగుండేది. ఇదెవరికి తెలుస్తుందిలే, ఎవరు చూడొచ్చారులే, చూసి మాత్రం ఏం తెలుసుకుని చచ్చారులే అన్న నిర్లక్ష్యం వలన తానేమి కోల్పోతాడో కైలాసగణపతి ఎరుగడు.
అతను పడుకున్న పదినిమిషాలకే నిద్రపోయాడు.
అప్పుడు సమయం పన్నెండూ నలభై.
17
"నాలుగురోజుల్లో వస్తాను."
"అలాగే! నీ మతిమరుపు దొంగలు తోలా ఈమాట యిప్పటికి పదిసార్లు చెప్పావు" సూర్యారావు నవ్వుతూ అన్నాడు.
"మతిమరుపు కాబట్టే గుర్తుంచుకొని పదిసార్లు చెప్పటం." అంటూ తనూ నవ్వాడతను.
బస్సు యింకా రాలేదు. కబుర్లు వేసుకొని ఇరువురూ రోడ్డు వార నుంచున్నారు.
ఉదయం బస్సుకి కైలాసగణపతి ఊరికి బయలుదేరాడు.
బస్సు ఎక్కించి వస్తానని సూర్యారావు వెళ్ళాడు.
వెళుతూ భార్యతో చెప్పాడు. వస్తూ గవర్రాజు ఇంటికి వెళ్ళి వస్తాను. ఇంటికి రావడం కాస్త ఆలశ్యం అవుతుంది.
"ఎంతాలశ్యం అయినా గంటయేను, రెండుగంటల యేను. అలాగే కానియ్యండి" మాణిక్యాంబ నవ్వుతూ అన్నది.
సూర్యారావు ప్లాను వేరు.
కైలాసగణపతీ, సూర్యారావు మాట్లాడుకుంటుండగానే బస్సు వచ్చింది.
వెంటనే కైలాసగణపతి బస్సు ఎక్కడం. బస్సు బయలుదేరి వెళ్ళిపోవటం జరిగింది.
ఇంట్లో చెప్పినట్లుగా సూర్యారావు చేయలేదు. గవర్రాజు యింటికి వెళ్ళలేదు సరికదా అసలు ఊళ్ళోకే రాలేదు.
డొంకదారిన బయలుదేరి అడ్డదారుల గుండా నడిచి కొండ దగ్గరకు వచ్చాడు.
పొలందాటిన తరువాత కొండ. అందుకే అక్కడ జనసంచారం వుండదు. మరికాస్త ఎండ ఎక్కితేగాని ఆవులూ, మేకలూ కాచేపిల్లలు రారు.
ఎందుకయినా మంచిదని సూర్యారావు ఓ పర్యాయం నలువేపులా చూచి వడివడిగా కొండ ఎక్కడం ప్రారంభించాడు.
సరీగా అరగంట.
సూర్యారావు సగం కొండ ఎక్కాడు.
ఎదురుగా గుహ.
మరోసారి అటూ యిటూ చూసి గుహప్రవేశించాడు అతను.
సమయం గడిచిపోతున్నది.
తరువాత సూర్యారావు తృప్తినిండిన మనసుతో గుహలోంచి బయటికి వచ్చాడు.
మరోసారి అటూ యిటూ చూసి వడి వడిగా కొండదిగాడు.
చాలా హుషారుగా కొండ దిగిన సూర్యారావు ఎప్పటిలా మామూలు దారిన ఊళ్ళోకి వెళ్ళక మళ్ళీ డొంక దారిన అడ్డదారిన బయలుదేరి రోడ్డు దగ్గరకు వచ్చి రోడ్డు నుంచి యింటికి బయలుదేరినట్లుగా ఊరివేపు సాగాడు.
"ఎక్కడికి సూర్యారావుగారూ! ఇటునుంచి వస్తున్నారు?" దారిలో ఎదురయిన ఒకరిద్దరు సూర్యారావుని అడిగారు.