Previous Page Next Page 
హత్య పేజి 25


    "రెండూ ఒకటే, విషయం చెప్పు."

 

    "ఆదిమూర్తిని కలుసుకుని వస్తాను.... యాసిడ్ అయిపోయింది అదెలాగూ తెచ్చుకోవాలి. ఈ కోడ్ విషయం కూడా కనుక్కోవాలి. రేపే వెళతాను. ఈ విషయం నీతో చెప్పాలనుకున్నాను.... మన మాటల్లో విషయం రానే వచ్చింది. రేపు ఉదయం బస్సుకి వెళతాను." కైలాస గణపతి చెప్పాడు.

 

    "భోం చేసి వెళ్ళి రావచ్చుకదా!" సూర్యారావు అన్నాడు.

 

    "మధ్యాహ్నం అలసటగా వుంటుంది."

 

    "సరే నీ ఇష్టం - రాత్రికి వస్తావా - మర్నాడు వస్తావా!"

 

    "అలా వెళ్ళి రావటానికి అదేమన్నా మన పక్కవూరా! నాలుగైదు రోజులు పడుతుంది. ఎక్కడికి పారిపోను సరేనా!"

 

    "ఛా - ఛా - అదేం మాటరా కైలాసం!" నొచ్చుకుంటూ అన్నాడు సూర్యారావు.

 

    "నన్ను విడిచి వుండలేక బాధపడుతుంటేను అలా అన్నాను" కొంటెగా పలికాడు కైలాసగణపతి.

 

    "అరవైలో ఇరవై వేషాలు మటుకు మానవు కదా" సూర్యారావు నవ్వుతూ అన్నాడు.

 

    హరి రావటంతో వాళ్ళ మాటలు మారిపొయ్యాయ్యి.

 

    ఆ రాత్రి -

 

    పదకొండు పది.

 

    ఇంట్లో అంతా నిద్రపోతున్నారు. ఒక్క కైలాసగణపతి తప్ప.

 

    తన గదిలో ఒక్కడూ కూర్చుని పరిశోధన చేస్తున్నాడు. పెద్ద లైటు వెలుగుతున్నది. డైరీ లాంటి చిన్న నోట్ బుక్ తెరిచిపెట్టుకున్నాడు. తెల్ల కాగితాలు, కలము చేతికి అందుబాటులో వున్నాయి. ఆ సమయంలో కైలాసగణపతిని ఎవరైనా చూస్తే పెద్ద ధీసిస్ రాస్తున్నట్లు వుంది.

 

    కైలాసగణపతి పరిశోధన చేస్తున్నాడని సూర్యారావు ఒకడికే తెలుసు. కనుక ఈ సమయంలో సూర్యారావు గనుక కైలాసగణపతిని చూస్తే పరిశోధన తాలూకా మేటర్ ఏదైనా రాసుకుంటున్నాడు కాబోలు అనుకుంచాడు.

 

    అది ధీసిస్ కాదు పరిశోధన తాలూకా మేటర్ అంతకన్నా కాదు.

 

    ఆ విషయం ఏదో ఒక్క కైలాస గణపతికి మాత్రమే తెలుసు.

 

    కొండ గుహలో గవ్వలమ్మ పేరుతో వున్న కుండలో ఓ పుల్ల, ఆ పుల్లకి రహస్యపుటర దానిలో చిన్న కాగితంలో చిత్రమైన రాత విచిత్రమైన గుర్తులు. సప్త సముద్రాల అవతల రాక్షసుడి ప్రాణం మర్రిచెట్టు వూడల్లో దాగున్న బుల్లి చిలకలో వున్నట్లు ఈ రహస్యపు రాతలోని పరమ రహస్యం ఏమిటో రాసిన వాడికి తెలియాలి లేక ఆ పైవాడికి తెలియాలి.

 

    కైలాసగణపతి ఆ రాతతోనే కుస్తీ పడుతున్నాడు.

 

    కైలాసగణపతికి హిందీ, ఇంగ్లీషు కాక కన్నడ తమిళం అక్షరాలు తెలుసు. అలాగే ఇతరదేశం భాషలు బొత్తిగా తెలియకపోయినా వ్రాతలో ఆ అక్షరాలు ఎలా ఉంటాయో తెలుసు. కాగితంలోని ఈ అక్షరాల గుర్తులు భాషకి చెందినట్లు లేదు. అలా అని దానిని వదిలేయటానికి లేదు.

 

    సోదివాళ్ళకి సోది చెప్పేటప్పుడు "గడ్డమంటే పుంజుఓయమ్మ నుదురంటే పెట్ట. ఓయమ్మ తెల్వలేదా? పుంజు తల్లే పుంజు. చెయ్యి సరిగ్గా పట్టు. ఇదిగిదిగో లెక్కపెట్టు" ఇలా దీర్ఘాలు తీస్తూ చెపుతారుగానీ పెద్దగా భాషంటూ వేరేది వుండదు. భాష లేనప్పుడు స్పెషల్ లిపి ఏముంటుంది.

 

    అక్కడికి కైలాసగణపతి ఆ ఉదయం ఓ సోదెమ్మని కలుసుకొని చేతిలో అయిదు రూపాయలు పెట్టి "మీకు వేరే భాష వుంటుందా? దానికి లిపివుంటుందా" అనడిగాడు

 

    అయిదు రూపాయలనోటు చక్కగా పుచ్చుకుని నాకు తెల్దుబాబూ" అంది సోదెమ్మ.

 

    "లిపి తెలయదా?"

 

    "తెల్దే!"

 

    "పోనీ రాయటం అంటే తెలుస్తుందా?"

 

    "రాయటం అంటే రాయటం అని తెల్సుగాని రాయటము రాదు. ఇందాక అదేదో అన్నారు....."

 

    "లిపి....."

 

    ఆ - అది అసలు తెల్దే."

 

    "మరి మీరు అవసరం పడితే రాయరా!"

 

    "మాకేం అవసరం. మాకేమన్నా చదువులా ఉద్దోగాలా!" అంది సోదెమ్మ చేతులు తిప్పుతూ.

 

    "సోదికి రాసే అవసరం వుండదా?" అక్కడికీ ఆశ చావక కైలాసగణపతి అడిగాడు.

 

    "భగవంతుడు ఒకేసారి రాస్తాడు అందరి ముగాల. ఇంక మేము రాసేదేముంది రాత."

 

    "పోనీ కాగితాల మీద తమాషా గుర్తులతో బొమ్మలు లాంటి వేస్తారా?"

 

    "బాగుంది" అంది సోదెమ్మ.

 

    ఏం బాగుందో కైలాసగణపతికి అర్థం కాలేదు. "బాగుంటమేంటి!" అన్నాడు.

 

    "మా బతుకులకి కాగితాలు రాతలు. బాగుబాగు. అయినా నాకు తెల్వక అడుగుతాను. ఈ ఆరాలన్నీ మీకెందుకు బాబూ" అందిసోదెమ్మ అనుమానంగా చూస్తూ!

 

    "సోదివాళ్ళు వాళ్ళ బ్రతుకులు అని పేపరుకి రాసి పంపిస్తే పేపరు వాళ్ళు పేపరులో వేసుకుని డబ్బు యిస్తారు" నోటికి వచ్చింది బొంకాడు కైలాసగణపతి.

 

    "మీకా, నాకా?" ఆతృతగా అడిగింది సోదెమ్మ.

 

    కైలాసగణపతి గతుక్కుమన్నాడు. ఒకటికిపోతే రెండొచ్చింది, కొసరు కోరితే అసలుకే ఎసరొచ్చింది. అన్నట్లు తయారయింది పరిస్థితి.

 

    "మీకు కాదు రాసినందుకు డబ్బు మాకొస్తుంది. కానీ పేపరులో పడినందుకు ప్రభుత్వం గుర్తించి ఆతర్వాత మీకు సౌకర్యం కలిగిస్తుంది. ఇల్లు వాకిలి, చదువు అలా అన్న మాట,"

 

    "బాబ్బాబు తొందరగా ఆ పని చేద్దురూ. నాకు యిల్లంటే మా చెడ్డ యిష్టం" అంటూ సోదె మొదలుపెట్టింది సోదెమ్మ.

 

    సోదెమ్మని వదిలించుకుని బైట పడేసరికి తలప్రాణం తోకకి చేరినట్లయింది కైలాసగణపతికి.

 

    అది ఉదయం జరిగిన సంగతి.

 

    సోదెమ్మని కలుసుకోవటం వల్ల అయిదు రూపాయలు ఖర్చు. అనవసర ప్రసంగం తప్పించి కించిత్ ఫలితం కూడా లేకపోయింది. అదీగాక లేనిపోని కొని తెచ్చుకున్న తలకాయ నొప్పిగా తయారయింది పరిస్థితి.

 

    కైలాసగణపతికి బాగా అనుమానంగా ఉంది. కుండలో వున్న కాగితంలో రాత సోది వాళ్ళది కాదు. అవి బీజాక్షరాలు కూడా కాదు. విషయమేమిటో కనిపెడితే అసలు రహస్యం తెలుస్తుంది. అప్పుడు ఓ అడుడు ముందుకో వెనక్కో వేయవచ్చు, అది పరమరహస్యం తాలూకా కోడ్ అయివుంటుంది. ఏ భాషా కాకపోతే చివరికి అదే అవుతుంది.

 Previous Page Next Page