Previous Page Next Page 
వెన్నెల్లో గోదారి పేజి 26


    జరిగిందేమిటో నాకు అర్ధమైంది. తరళకి ఆయన ఈ విషయం చెప్పటానికి సంకోచించి వుంటాడు. తరళంటే ఆ ఇంటిల్లిపాదికీ వల్లమాలిన గారాబం చిన్నప్పటినుంచీ, ఏనుగుబొమ్మ నడుగుతే, నిజం ఏనుగుని తెచ్చి ఇచ్చేటంత గారాబంగా పెంచారు తనని మామూలుగా అయితే, ఆనంద్ లాటి ఏమీలేని యువకుడిని ప్రేమించినందుకు ఇంకొక తండ్రి ఆమెని తలవాచేటట్లు చివాట్లు పెట్టి వుండేవాడు. కానీ ఆయన ఒక్కమాట కూడా అనకుండా ఆనంద్ దగ్గిరకి వచ్చాడు. అంతటి లక్షాధికారీ చేతులు జోడించి అడిగాడు. ఆనంద్ కాదనేసరికి, ఆ విషయాన్ని కూడా కూతురికి చెప్పలేక, అతనొప్పుకున్నాడని అబద్దం చెప్పాడు.
    
    కాళ్ళదగ్గిర కొచ్చిన అదృష్టాన్ని కాదన్న ఆనంద్ అంటే నాకు గౌరవం, అభిమానం మరింత పెరిగాయి. నేనెంత అదృష్టవంతురాల్నో అర్ధమైంది. చాలా కొద్దిమంది వుంటారు అలాటి మొగవాళ్ళు కేవలం డబ్బు విషయంలోనే కాదు. అతడి ఆలోచనా విధానం, నిర్ణయాలు, కొన్ని విషయాల్లో అతడి పంతం- అన్నీ అపురూపంగా తోచాయి. మీరు అనుకుంటూ వుండవచ్చు- ప్రేమలో పడ్డాక అవతలివారి గురించి ప్రతీవాళ్ళకీ ఇలాగే అనిపిస్తూ వుంటుందని దానికి సమాధానం నేనింతకుముందే చెప్పాను. మేము తలమునకలయ్యేటంత ప్రేమలో ఎప్పుడూలేము. ఇంత జరిగాక ఇక ఆలస్యం చేయటం మంచిదికాదని ఆనంద్ అన్నాడు. ముందొకసారి మా యింటికొచ్చి మా అమ్మని వివాహం విషయం అడుగుతాననీ, ఆమె ఎలాగూ వప్పుకోదు కాబట్టి గుళ్ళో చేసుకుందామనీ అన్నాడు. మావయ్య ఏదైనా గొడవచేస్తే అవసరం పడుతుందని పోలీసులకి కూడా చెప్పివుంచుతానన్నాడు. ఇద్దరం ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోలేదు. ఇద్దరం కలిసి ఒకే భవిష్యత్తువైపు ఆశతో చూస్తున్నాం మా వుద్దేశ్యం ప్రేమంటే ప్రపంచాన్ని మర్చిపోవటం కాదు. ప్రపంచంలో ఎలా బ్రతకాలా అని ఆలోచించటం. ఆ మరుసటిరోజే అతడు మా ఇంటికి వస్తానన్నాడు.
    
    మా ప్రేమ విషయం ఎవరికీ తెలీదని నేను అనుకుంటూ వచ్చాను. కానీ, ఆ విషయం తెలిసిన మరో వ్యక్తి వున్నాడని ఆ రాత్రి నాకు తెలిసింది. ఆ వ్యక్తి నా మావయ్య నేను నిద్రపోతున్నాననుకుని పక్కగదిలో అమ్మతో మాట్లాడుతూవుంటే విన్నాను. ఏదైనా చేసైనా సరే, నన్ను ఆ వృత్తిలోకి దింపాలని వాళ్ళు చర్చించుకుంటున్నారు. తలదిండు కన్నీళ్ళతో తడిసి పోయింది. ఒక్క రెండు రోజులు తొందరగా గడిచిపోతే బావుణ్ణు అని భగవంతుని ప్రార్దించాను. మూడ్రోజుల తరువాత మా పెళ్ళి.
    
    ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. ఏ మాత్రం అలికిడి అయినా మావయ్య లోపలికి వస్తున్నాడేమో అని భయం. ఈ స్థితి సత్రువులకి కూడా రాకూడదు. మా ఇంట్లోనే నాకు భద్రత లేదు.
    
    రేపు ఆనంద్ వచ్చి విషయం చెప్పగానే ఇంట్లో రేగే తుఫాను గురించి తలుచుకుంటేనే భయంగా వుంది. ఈ పరిస్థితుల్లో నాకు మానసికంగా ఒక తోడు కావాలని అనిపించింది. అలాటి ధైర్యం నాకు ఎవరు ఇవ్వగలరు? తరళ!
    
    అవును తరళ తప్ప ఇంకెవరూ లేరు. ఇరవైనాలుగు గంటలు తరళ నాతో వుంటే చాలు. ఆనంద్ గృహ ప్రాంగణంలోకి వెళ్ళిపోతాను. ఎంత చిత్రమైన స్థితి...తరళని నాకు సాయపడమని అడగటం!! ప్రేమకోసం త్యాగం చేసిన వ్యక్తుల్నే మీరు చూశారు. స్వార్ధంకోసం ప్రేమని బలిపెట్టమని అడిగే వ్యక్తిని ఇప్పుడు మీరు నాలో చూస్తున్నారు. నన్ను చూస్తూంటే మీకు అసహ్యం కలగవచ్చు. కానీ జీవితం కల్పన కాదు. వాస్తవం.
    
    తరళని ఈ విషయంలో సహాయం అడగాలన్న ఆలోచనరాగానే నాకు కావలసినంత ధైర్యం వచ్చింది. ఆ రాత్రి ఇక ఆగలేకపోయాను. మొత్తం విషయమంతా ఆమెకు చెప్పేస్తేగానీ నా మనసు కుదుట పడేట్టు లేదు. అంతా విన్నాక కూడా ఆమె ఆనంద్ ని ఇంకా ప్రేమిస్తూనే వుంటే నేను చేసేది ఏమీలేదు. కానీ తరళ విషయం నాకు బాగా తెలుసు. జీవితాన్ని చాలా తేలిగ్గా తీఉస్కునే అమ్మాయి. ఆనంద్ ని తలవాచేటట్టు చీవాట్లు పెడుతుంది. తరువాత నవ్వేస్తుంది. ఆనంద్ కి కూడా ఆమాత్రం మందలింపు కావల్సిందే. ఆ అమ్మాయి తనని ప్రేమిస్తూంది అని తెలిసి కూడా ఏమీ తెలియనట్టు వుండటం అన్యాయం. కేవలం ఆ అమ్మాయి తన ప్రేమని ప్రకటించలేదు. కాబట్టి నేనుకూడా ఏమీ చెప్పను అనటం కేవలం ఆ అమ్మాయిని ఏడిపించటం మాత్రమే. తరళ మంచి అమ్మాయి కాబట్టి తండ్రితో కబురు చేసింది. ఆయన మరీ మంచివాడు కాబట్టి తిరిగి వెళ్ళి కూతురితో అబద్దం చెప్పాడు.
    
    అందరూ మంచివాళ్ళే ఎటొచ్చీ మధ్యలో నలిగిపోతుంది నేనే. రాత్రి పన్నెండు దాటింది.
    
    ముందు గదిలో అమ్మ, పక్కగదిలో మావయ్య నిద్రపోతున్నారు. చప్పుడు చేయకుండా బయటకొచ్చాను. పల్లె చీకటిని ముసుగ్గా కప్పుకుంది. తరళా వాళ్ళిల్లు ఎక్కువ దూరంలో లేదు. తనది ముందుగదే కిటికీలోంచి పిలిస్తే లేస్తుంది.
    
    వీధులు నిర్మానుష్యంగా వున్నాయి. ఆ సమయంలో నన్నెవరయినా చూస్తే మరుసటిరోజు పల్లెలో ఈ వార్త భగ్గుమంటుంది. అయినా ఏదో తెలియని మొండిధైర్యం నన్నావహించింది. అలాగే నడుచుకుంటూ వెళ్ళాను. తరళా వాళ్ళింటినిండా లైట్లు వెలుగుతూ కనిపించాయి. నా మనస్సెందుకో కీడు శంకించింది. నడక వేగం హెచ్చింది. లోపలికి ప్రవేశించాను. ముందు హాల్లో తరళ తండ్రి పచార్లు చేస్తున్నాడు. స్తంభం దగ్గిర పాలేరు బిక్కమొహంతో చేతులు కట్టుకు నిలబడి వున్నాడు.
    
    గది మధ్యలో తరళ, నిండా తడిసిన బట్టల్తో...తలమీద నుంచి కారుతున్న నీటితో కనిపించింది.
    
    ఆ సమయంలో నన్ను ఊహించని ఆ ఇంటిల్లిపాదీ ఆశ్చర్యపోయారు. ముందుగా తేరుకున్నది తరళా వాళ్ళ నాన్నగారు. పాలేరు దగ్గిరకు వెళ్ళి "ఈ విషయం మూడో కంటికి తెలిస్తే జాగ్రత్త, వేళ్ళు" అని హెచ్చరించాడు. వాడు భయంతో తలూపి బయటకు వెళ్ళిపోయాడు. తరళని వాళ్ళమ్మగారు లోపలికి తీసుకువెళ్ళారు.
        
    మేమిద్దరమే గదిలో మిగిలేము. ఆయన నా దగ్గిరకి వచ్చి "ఇది ఎంత పనిచేసిందో తెలుసా?" అన్నారు. నాకింకా అక్కడేం జరిగిందీ అంతుబట్టలేదు. "అర్దరాత్రి వెళ్ళి గోదాట్లో దూకింది".
    
    అర్దరాత్రి పిడుగుపడ్డట్లు అదిరిపడ్డాను. ఆయన ఏం చెబుతున్నాడో కొద్దిసేపు అర్ధంకాలేదు.
    
    "ఆ ఆనంద్ ఏం చెప్పాడో తెలీదు. రాత్రంతా అదోలా వుంది. అర్దరాత్రి వెళ్ళి గోదారిలో దూకేసింది. అదృష్టం బావుంది మా పాలేరుకి మెలకువ వచ్చింది కాబట్టి సరిపోయింది" ఆయన మొహం కోపంతోనూ, ఉక్రోషంతోనూ ఎర్రబడింది. "... ఏమనుకుంటున్నాడు ఆ ఆనంద్ తన గురించి, కో అంటే కోటిమందిని వరుసగా నిలబెట్టగలను" అరిచాడు.
    
    తలుపు సగం తెరిచి మొహం బయటకు పెట్టి "నాకు కోతి మంది అక్కర్లేదు. ఆనంద్ చాలు" అంది తరళ. నా వైపు చూసి కన్నుకొట్టి లోపలికి వెళ్ళిపోయింది. ఆయన గట్టిగా ఏదో అనబోయి తమాయించుకుని నావైపు చూశాడు. ఏం మాట్లాడాలో తోచనిదాన్లా నేను నిశ్శబ్దంగా వుండిపోయాను. ఆయన నా దగ్గిరకి వచ్చాడు. "ఈ విషయం నువ్వుకూడా ఎక్కడా చెప్పకు. రెండ్రోజుల్లో అంతా సర్దుకుంటుంది. అది నీ స్నేహితురాలు కాబట్టి ఎలాగో ఒక్కలాగా దాన్ని వప్పించు. రెండ్రోజులు ఓపిక పట్టమను. ఆ ఆనంద్ ని ఈ లోపుగా నేను దారికి తీసుకువస్తాను" అన్నాడు.

 Previous Page Next Page