Previous Page Next Page 
వెన్నెల్లో గోదారి పేజి 27


    
    ఇటువంటి పరిస్థితి ఎవరికీ వచ్చి వుండదు. అడకత్తెరలో పోకచెక్కలా అయింది నా స్థితి. తరళ ఇంతపని చేస్తుందని కలలో కూడా వూహించలేదు. ఆనంద్ మీద బాగా కోపం వచ్చింది. నేను వెళ్ళిపోయాక తరళ తన దగ్గిరకు వెళ్ళివుంటుంది. వాళ్ళ నాన్నతో తనేమన్నాడో ఆమెకి ఆనంద్ చెప్పే వుంటాడు. ఈ షాకు భరించలేక గోదాట్లో దూకింది.
    
    "ఈ రాత్రికి ఇక్కడ పడుకో మీ ఇంటికి నేను కబురు పంపిస్తాలే" అన్నాడాయన. "వెళ్ళగానే పలకరించి ధైర్యం చెప్పి, రెండ్రోజులు ఓపిక పట్టమను".
    
    ఇంకొక తండ్రి అయితే నరికి పోగులు పెట్టి వుండేవాడే. కాని ఆయన గారాబు కూతురామె.
    
    వచ్చిన పని మర్చిపోయి, తరళ గదిలోకి వెళ్ళాను. సాంబ్రాణి పొగతో తలారబెట్టుకుంటూన్న తరళ నన్ను చూసి నవ్వి, "నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. ఈ రాత్రంతా ఇక్కడే వుండబోతున్నావు. ఆత్మహత్య మహాపాతకమని నాకు ఉద్భోధించ బోతున్నావు. మా నాన్న కొట్టబోయే బోరుకి నువ్వు వకాల్తా తీసుకోబోతున్నావు. అవునా" అంది.
    
    ఇంకేం మాట్లాడను?
    
    వాళ్ళమ్మ కూతుర్ని తిడుతూంది. నేనో అరగంట కూర్చుని వచ్చేసేను. ఆ పరిస్థితుల్లో నేను చెప్పాలనుకున్నది ఎలా చెప్పను? అందుకే ఆ విషయం ప్రస్తావించకుండా ఇంటికొచ్చేశాను.
    
    అలా కాకుండా ఆ రాత్రే తనకి అంతా చెప్పేసి వుంటే, ఈ కథ ఇంకో మలుపు తిరిగి వుండేదేమో-
    
                                   * * *
    
    ఆ రాత్రి నాకు శివరాత్రే అయింది.
    
    మరుసటిరోజు నేను పక్కమీద నుంచి లేచేసరికి అమ్మ "ఒసేయ్, నీ కిది తెలిసిందా? రాత్రి తరళ గోదార్లో దూకిందట" అంది.
    
    పల్లెపల్లెంతా ఈ వార్త గుప్పుమందని నా కప్పుడే తెలిసింది. ఈ విషయాన్ని దాచే ప్రయత్నమేమీ చెయ్యలేదు. తరళ పాలేర్నంటే కంట్రోలు చేయగలిగాడు. కూతుర్ని ఎలా ఆపగలడు?
    
    చిత్రమేమిటంటే తరళ నెవరూ తప్పుపట్టలేదు. పైగా ప్రేమంటే అలా వుండాలని అనుకున్నాడు. ఇంతకాలం తిరిగి, ఇప్పుడు కాదంటాడా అని ఆనంద్ నే తిట్టారు. ఆ ఇద్దరితోపాటు నేనూ వున్నానన్న విషయం అందరూ మర్చిపోయారు. అదేపని నేను చేసివుంటే, భోగం వేషాలు వేసి అతన్ని వలలో వేసుకుందామని ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో ఏ కడుపో వచ్చి గోదార్లో దూకింది అని వుండేవారు. సమాజంలో స్థాయి, పరపతి, మనుష్యుల ఆలోచనా విధానంమీద ఎలా ప్రభావం చూపిస్తాయో, నాకప్పుడే తెలిసింది. ఒక కోడిని పట్టుకోవటం కోసం నలుగురూ దాన్ని మూలమూలకి తోసి, ఎటూ వెళ్ళలేని ఇరకాటాన పడేస్తారు. అలా క్రమక్రమంగా ఇరుక్కిరుక్కి వెళ్ళిపోతున్నట్టుంది నాకు. ఒక్కొక్క ద్వారం మూసుకుపోతున్నట్టుంది.
    
    ఈ తాకిడికి తట్టుకున్నవాడు ఆనంద్ ఒక్కడే నాకు చిన్న చీటీ పంపించాడు.
    
    "ఇంక ఆలస్యాలూ, మొహూర్థం కోసం ఆగటాలూ అనవసరం సాయంత్రం గుడికిరా పురోహితుడ్నీ, మంగళసూత్రాన్నీ నేను తీసుకువస్తాను". మూడే వాక్యాలున్నాయి ఆ చీటీలో-
    
    ఆ కాగితం ణ అచేతుల్లో అలాగే చాలాసేపు వుండిపోయింది. గుండెల్నిండా భయం- వణుకు! ఎటూ తేల్చుకోలేని స్థితి ఆనంద్ ఈ నిర్ణయం ఇంత తొందరగా అమలు జరుపుతాడనుకోలేదు.
    
    నేను అదోలా వుండటం అమ్మ కనిపెట్టి అడిగింది. ఏదో చెప్పి తప్పించుకున్నాను.
        
    సాయంత్రం అవుతున్న కొద్దీ నాలో ఉద్వేగం పెరగసాగింది. ఇంట్లోంచి బయటికొచ్చే ధైర్యం చేయలేకపోయాను. మావయ్యని తల్చుకుంటే భయం. తనేమీ చెయ్యలేడు. కానీ ఆ భయం అలా వుండిపోయింది.
    
    చీకటి పడింది.
    
    కాలుగాలిన పిల్లిలా ఒకగాదిలోంచి మరో గదిలోకి పచార్లు చేయసాగాను. ఇందులో తెలీదుగానీ ఏడుపొస్తోంది. నా మీద నాకే కోపం, విసుగు.
        
    ఆరున్నరయింది-ఏడు-ఏడున్నర.
    
    ఇక ఆగలేకపోయాను.
    
    వాచీ కూడా విప్పేసి గదిలో టేబుల్ మీద వుంచి, మెట్లు దిగాను. "ఇంత రాత్రప్పుడు ఎక్కడికే" అంది అమ్మ.
    
    "తరళా వాళ్ళింటికి" సమాధానం ఇచ్చాను.
    
    ఆనంద్ కోసం తరళ గోదావరిలో దూకిందని తెలిసిన తరువాత అమ్మకి నా మీద బాగా నమ్మకం కలిగినట్టుంది. ఏమీ మాట్లాడలేదు. "తొందరగా వచ్చెయ్యి" అని మాత్రం అంది.
    
    బయట చల్లగాలి వీస్తూంది.
    
    దాదాపు పరుగెడుతున్నట్టు గుడిని చేరుకున్నాను.
    
    ఇంట్లో వున్నంతసేపూ వెళ్ళాలా వద్దా అని వున్న ఆరాటం, ఇంట్లోంచి బయటపడగానే ఆతృతగా మారి నన్ను పరుగులు తీయించింది.
    
    పదిహేను నిముషాల్లో గుడిని చేరుకున్నాను.
    
    ఊరికి దూరంగా వున్న గుడి అది.
    
    నిర్మానుష్యంగా వుంది.
    
    ఒక్క పూజారి మాత్రమే వున్నాడు.
    
    అంత దూరంనుంచి వచ్చిన నన్ను చూసి కలిగిన ఆశ్చర్యం అతడి మొహంలో ప్రస్ఫుటంగా కనిపించింది.
    
    "ఏమ్మా ఇలా వచ్చావ్?" అని అడిగాడు.
    
    ఆ ఒక్క ప్రశ్నలో నాకు సమస్తం అర్ధమైంది.
    
    ఆనంద్ పెళ్ళి సరంజామాతో, మనుష్యుల్తో అక్కడికి వచ్చి వుంటే పూజారి ఆ ప్రశ్న అడిగి వుండేవాడు కాదు అంటే-
    
    ఆనంద్ రాలేదు.
    
     ఆనందరావు చెప్పిన కథ
    
    తరళ వ్యవహారం నాకు తలనొప్పిగా పరిణమించింది.
    
    ఆ అమ్మాయిది పొగరో, మూర్ఖత్వమో నాకు అర్ధంకాలేదు. తరళ గోదార్లో దూకినప్పటినుంచీ ఆ గ్రామంలో నా పరిస్థితి మీరు వూహించవలసిందేగానీ చెప్పనలవి కాదు.
    
    నేను కాదన్నాననీ- అందువల్ల తరళ ఆత్మహత్య చేసుకోబోయిందనీ మాట్లాడుకుంటే ఆ రూమర్లు వ్యాప్తి చేయటంలో ప్రజలకు ఆనందం కాదు. అది అంతగా జీర్ణం కాని వాస్తవం.
    
    అందువల్ల మా అమాయక లౌక్యులైన గ్రామప్రజలు అందరికీ కన్వీనియెంట్ గా అర్ధమై, చెప్పుకోవటానికి వీలుగా, ఆసక్తి కలగొలిపేలా వుండే వార్తని ప్రచారం చేయటంలో నిమగ్నులైవున్నారు. ఆ వార్త ప్రకారం, నాకూ తరళకీ మధ్య ఎన్నాళ్ళనుంచో గ్రంథం నడుస్తూ వుంది. ఆమెకిప్పుడు మూడోనెల. ఆమె తండ్రి లక్షాధికారి కాబట్టి సహజంగానే ఈ వివాహానికి వప్పుకోలేదు. అందువల్ల ఆ అమ్మాయి గోదార్లో దూకింది.

 Previous Page Next Page