Previous Page Next Page 
ప్రేమ నక్షత్రం పేజి 25


    కుడికాలు మోకాలుకూ, మడమకూ మధ్యభాగంలో లోతుగాయమై విపరీతంగా సలుపుతోంది.

 

    తన ఇంటిముందు భాగంలోగాని, పరిసరాల్లోగాని రక్తంకారి క్రింద మరకలు పడివుంటాయా? కానీ బయటకు వెళ్ళి చూడటానికి ధైర్యం చాలలేదు. కల్నల్ బైనాక్యులర్స్ తో డాబామీద నిలబడి వుంటాడు. చూడామణి గుమ్మంలో నిలబడి చూస్తూ వుంటుంది. దొరికిపోతాడు.

 

    జరిగిందంతా శైలజకు తెలుసా? ఆమె ఏమి చేస్తూ వుంటుంది?

 

    కొద్దిగా తలుపు తెరిచిచూశాడు. ఎదురుగా వున్న ఇంటి తలుపు తెరిచేవుంది గాని ఆమె కనబడలేదు.

 

    నిస్పృహగా తలుపు మూసేశాడు.

 

    స్నానంచేశాక గాయపడిన చోట ఇస్త్రీకర్చీఫ్ తో బ్యాండేజి చేసుకుంటూ ఆలోచిస్తున్నాడు. రాముడ్ని పంపించి బ్యాండేజి సామాను తెప్పించుకోవచ్చు కాని, దోషి తనే అని పట్టిచ్చినట్లవుతుంది.

 

    'కాన్ఫరెన్స్ హాల్లో కల్నల్ ఏం చేయబోతున్నాడు? కుక్కల్ని ఉసిగొల్పి నేరస్థుల్ని కనిపెట్టేస్తాడా?

 

    ఆలోచించిన కొద్దీ అతనికి దడదడగా వుంది.

 

    కళ్ళముందు వసుమతీ, మిగతా చెల్లెళ్ళూ, తమ్ముళ్ళూ మెదుల్తున్నారు.

 

    శైలజ వాళ్ళనాన్న సుభద్రమ్మగారికి హెచ్చువడ్డీకి రాసిచ్చిన నోటూ, ఆయన సంతానమూ దీనాతిదీనంగా మెదుల్తున్నారు.

 

    ఎలాగైనాసరే దొరికిపోకూడదు.

 

    భోజనం విషయం మరిచిపోయాడు. పదిగంటలకు ఇంకో అయిదు నిముషాలుందనగా, బయటకు వచ్చి కాన్ఫరెన్స్ హాలుకేసి నడిచివెళ్ళాడు.

 

                                            10

 

    కాన్ఫరెన్స్ హాలులోకి ఒకొక్కరూ చేరుకుంటున్నారు. సరిగ్గా పదయ్యేసరికి పిలవబడ్డవాళ్ళంతా చేరుకున్నారు. మొత్తం నలభయిమందిదాకా వుంటారు.

 

    ఫణి ఎంత ధైర్యంగా వుందామనుకున్నా కాళ్ళు వణికినట్టుగా అవుతున్నాయి. వెళ్ళి అతను చివరి వరుసలోవున్న కుర్చీలలో ఒకదాంట్లో కూర్చున్నాడు.

 

    అతనిప్రక్క ఒకే ఒకతను కూర్చున్నాడు. వయసు పాతికేళ్లుంటాయి. అందరి ముఖాలతోపాటు అతని ముఖంకూడా పాలిపోయి వుంది.

 

    "మీరు కొత్తగా వచ్చారుకదూ!" అని పలకరించాడు ఫణిని.

 

    ఫణి అవునన్నట్లు తల ఊపాడు.

 

    బాగుండదని "మీరో?" అన్నాడు.

 

    "చేరి నాలుగు నెలలయింది. నాపేరు పురుషోత్తం. టానిక్స్ తయారుచేసే సెక్షనులో వుంటాను."

 

    అతని మాటలు పూర్తికాకముందే హాలు తలుపులు తెరచుకున్నాయి. కల్నల్ సంజీవరావు లోపలకు అడుగుపెట్టి డయాస్ దగ్గరకు ఠీవిగా నడిచివెళ్ళాడు.

 

    అక్కడ నిలబడి అందరి ముఖాల్లోకి ఒక్కసారి కలియజూశాడు.

 

    అతని పెదవుల మీదనుంచి సహజంగా వచ్చే నవ్వు అలలు అలలుగా కదిలింది.

 

    "రాత్రి కాలనీలో ఎవరో నిబంధనలు అతిక్రమించారు అర్థరాత్రి సమయంలో తమ కాటేజీనుంచి బయటకు వచ్చి. బహుశా ఏ ప్రణయకలాపం గురించో అయివుండవచ్చు. వేరే కాటేజీలోకి ప్రవేశించటానికి ప్రయత్నించారు. మీలో ఎవరో ఒకరు  తప్పు చేశారు. మీలో పెళ్ళికానివారున్నారు, పెళ్ళయి భార్యాపిల్లలతో సంసారాలు చేస్తున్నవారున్నారు. కానీ నేరస్థుడెవరో తెలుసుకోవటానికి అందర్నీ రప్పించాల్సివచ్చింది. పెళ్ళయినవారు తప్పు చెయ్యరని కాదు. కానీ ఒకర్నిగురించి ఇంతమందిని అవమానించక తప్పటంలేదు. రాత్రి నేరం చేసిన వ్యక్తిని కుక్కలు తరిమాయి. అతన్ని కాలిమీద కరవటం ఘూర్ఖా చూశాడు. పట్టుకుందామని ప్రయత్నించేటంతలో ఎలాగో తప్పించుకో గలిగాడు."  

 

    కల్నల్ నవ్వాడు. "ఘూర్ఖా చేతిలోనుంచి తప్పించుకోగలిగాడు కాని, నా నుంచి మాత్రం తప్పించుకోలేడు. న అల్సేషియన్ డాగ్స్ పళ్ళ వాడి నాకు తెలుసు. అయిదే అయిదు నిముషాలు టైము ఇస్తున్నాను. నేరస్థుడెవరో ముందుకొచ్చి ఒప్పుకోకపోయినట్లయితే నిర్దాక్షిణ్యంగా తనిఖీ చెయ్యటం జరుగుతుంది. మీ అంతట మీరు బయట పడినట్లయితే శిక్ష కొంచెం తగ్గటానికి అవకాశం ఉంది."

 

    ఫణి గబగబ ఆలోచిస్తున్నాడు. ఏం చెయ్యాలి? తప్పు ఒప్పుకోవటమా? ఇంతమంది ముందా? తర్వాత తలెత్తుకుని తిరగగలడా? ఎంత అల్లరి?

 

    కల్నల్ గొంతు మళ్ళీ ఖంగుమని ధ్వనించింది. "అయిదునిముషాల టైము ఇస్తున్నాను. ఈ అవకాశం పాడు చేసుకోవద్దు."

 

    ఫణికి ఏం చెయ్యాలో పాలుపోవటంలేదు. వచ్చివచ్చి ఎంతటి విషవలయంలో చిక్కుకున్నాడు? అప్రయత్నంగా ప్రక్కనకూర్చున్న పురుషోత్తం ముఖంలోకి చూశాడు ఫణి. అతనప్పటికే ఇతని ముఖంలోకి గ్రుచ్చి గ్రుచ్చి చూస్తున్నాడు. ఎందుకలా చూస్తున్నాడు? అతనికి తెలుసా నేరంచేసింది తనే అని?

 

    పురుషోత్తం పెదవులమీద చిరునవ్వు ఉదయించింది. ఆ నవ్వులోని అర్థమేమిటో ఫణికి బోధపడలేదు. అనుకోకుండా అర్థంలేకుండా అతనూ నవ్వాడు.

 

    అదే సమయంలో హాలంతా ప్రతిధ్వనిస్తున్నట్లు కల్నల్ నవ్వు వినిపించింది. వెనువెంటనే అతని కటువైన కంఠస్వరం: "అయిదు నిముషాలూ పూర్తయి పోయింది."

 

    ఫణి ముఖంమీద చిరుచెమటలు అలుముకున్నాయి. కల్నల్ ముఖంలో భావశూన్యంగా చూస్తూ వుండిపోయాడు.

 

    "ఒక్కొక్కరూ లేచి యిక్కడకు రండి."

 

    ముందు కూర్చున్నతను లేచి కల్నల్ దగ్గరకు వెళ్ళాడు. ప్రక్కనే నిలబడి వున్న పరశురాంవంక "కానియ్య"మన్నట్లు చూశాడు కల్నల్.

 

    పరశురాం ఆ వ్యక్తి ప్యాంటు మోకాళ్ళదాకా పైకి మడిచాడు.

 

    అతని పరీక్ష అయిపోయింది.

 

    తర్వాత యింకొకరు.

 

    ఒకరితర్వాత ఒకరుగా వచ్చి పరీక్షకు గురై వెళ్ళిపోతున్నారు. అందులో పెళ్లయినవాళ్లూ వున్నారు. కానివారూ వున్నారు. వయసు మళ్ళినవాళ్ళూ అయినా తప్పలేదు.

 

    కొందరి ముఖాల్లో బాధ, కొందరి ముఖాల్లో కోపం, కొందరిలో నిర్లిప్తత, కొందరిలో చికాకు - అందరిలోనూ నిస్సహాయత.

 Previous Page Next Page