"అలాగా?" అన్నట్టు తల వూపుతూ వింది త్రిపుర.
"నాయనమ్మ ఇప్పటికి మీ గురించి ఎంతో బాధపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆవిడ పుట్టింటికి దూరమ్తెన బాధ ఆవిణ్ణి ఎంతో కలచివేస్తూంది. తాతగారు కూడా పోవడంతో ఆవిడ మరి ఏకాకి అయిపోయారు. పెద్దమ్మా మీరొకసారి రాకూడదూ? మీ మేనత్తే కదా?"
త్రిపుర ముఖంలో నిర్లిప్తత చోటు చేసుకుంది. "ఆ బంధాలు ఎప్పుడో తెగిపోయాయి బాబూ!"
"నాయనమ్మ ఏం చేసింది మీకు?"
"నిజానకి ఆవిడ ఏమి చేయలేదు అపకారం నాకు! నా గురించి తను చాలా ఆరాటపడింది కూడా! కాని, అసలు బంధమే తెగిపోయాక అత్తవారింటితో నాకేంపని చెప్పు?"
"అత్తకాకముందు మేనత్తేకదా? మేనత్తగా అభిమానించడానికి ఏమిటి మీకు అభ్యంతరం?"
సమాధానం త్రిపుర నుండికాక పరమేశం నుండి వచ్చింది. కొంచెం కటువుగా. "ఆ గతాన్నంతా మేం ఒక పిడకలగా మరచిపోయాం. నువ్వొచ్చి మళ్ళి ఆ గతాన్ని మాకళ్ళ ముందు నిలిపే ప్రయత్నం చేయొద్దు. పెద్దమ్మని చూడాలనివచ్చావు. అంతవరకు బాగానే ఉంది. అంతకుమించి అధికానికి వెళ్ళకు!"
అజిత్ ముఖం కొంచెం నల్లబడగా, "అయితే నేనికవస్తాను!" అని లేచాడు.
"అపరాహ్నం వేళ అభోజనంగా వేడతావా? అలా వీల్లేదు. భోం చేసి వెళ్ళు!"
"పెద్దమ్మని చూడాలని వచ్చాను. చూశాను. ఇక వెడతాను. అంతకు మించి అధికానికి వెళ్ళకూడదాని మీరే చెప్పారు కదా, తాతగారు?" అని రెండడుగులు వేశాడు వెళ్ళడానికి.
"మాకు గృహసదాధర్మం అనేది ఒకటి ఉంది. అపరాహ్నం వేళ అతిధి అభోజనంగా మాఇంటి నుండి వెళ్ళిపోతే ఆ పాపం పోగొట్టుకోడానికి మేం ఎంత కష్టంపడాలో!"
"ఇప్పడే ఈ అతిధికి బొడిపె వచ్చేలా వడ్డించారు!" అని నవ్వసాగాడు అజిత్.
"చాలా సరదా అయినా కుర్రాడిలా వున్నావు!" నిష్కపటమ్తెన అతడి నవ్వు చూస్తుంటే ముసలాయనకి ముచ్చటేసింది. "ఇకనుండి అతిధి మర్యాదా సక్రమంగానే జరుగుతుంది బాబూ!"......నీ పేరు ఏమిటిన్నావు?" అడిగాడు చిరునవ్వుతో.
"అజిత్ కుమార్"
"ఏం చదివావు?"
"ఎమ్.ఇ."
"నేనిక వస్తాను! త్వరగా వంటచేసి తాతగారికి కెరియర్ పంపాలి" అంది త్రిపుర కదులుతూ.
"కెరియర్ ఇవాళ ఎవరు తీసుకు వెడుతున్నారమ్మా?"
"అఖిలను పంపిస్తాను, నాన్నగారూ"
"గౌరీనాథ్ ను వెంట ఇచ్చిపంపు"
"ఒక్కధాన్ని ఎలా పంపుతాను? గౌరిని వెంట ఇచ్చే పంపుతాను!"
"తాతగారెవరు, తాతగారూ?" ఆమె లోపలికి వెళ్ళాక అడిగాడు అజిత్.
"మా చిన్నాయనగారు!! ఆయన చాలా చిన్న్తతనం లోనే సన్యాసం స్వీకరించారు! కొంతకాలం సాదుసన్యాసులతో దేశ సంచారం చేసివచ్చి పొలంలో చిన్న కుటీరం వేసుకొని ఉంటున్నారు."
"ఆయన గురించి నాయనమ్మ చెప్పింది. వారిని చూసి రమ్మంది కూడా, ఇంకా, కరణం మాధవరావుగారని ఉండేవారట!
నాయనమ్మ అంటే ఆయనకీ చాల అభిమానమాట! ఆయన్ని కూడా కలసిరమ్మంది!"
"మాధవరావు పదేళ్ళ క్రిందటే కాలంచేశాడు! ఆయన కొడుకులు పెద్దవాళ్ళయి "తాతలు కూడా అయ్యారు"
"వాళ్ళున్నారా ఈ ఊళ్ళోనే?"
"పెద్దకొడుకు ప్రభాకరం ఉన్నాడు! మిగతావాళ్ళు ఉద్యోగాలరిత్యా ఎక్కడెక్కడో ఉన్నారు!"
"తాతగారి దగ్గరికి ఇప్పుడు వెళ్ళిరానా"
"చల్లబడ్డ తరువాత వెళ్ళొచ్చు! సాయంకాలం త్రిపుర వెడుతుంది చెట్లకి నీళ్ళు పోయ్యడానికి అప్పుడు వెళ్ళొచ్చు."
"సాయంత్రం వరకు తిరిగి వచ్చేస్తానని చెప్పాను, నాయనమ్మకు."
"సాయంత్రం వరకు వెళ్ళకపోతే పాడ్తే పోయే పనులున్నాయా?"
"ఏం లేవు."
"అయితే ఈ రాత్రి ఉండిరేపు వెళ్ళొచ్చు."
కారియర్ తిసుకొని అఖిల, గౌరినాద్ అజిత్ ముందునుండే వెళ్ళారు.
అరగంట తరువాత అజిత్ నీ భోజనానికి లేపారు.
వరండాకి అనుకొని వున్న గదిలో అతడికి ఒక్కడికి మాత్రమే పిట వేసి వడ్డించారు.
అజిత్ కి నాయనమ్మ మాటలు జ్ఞాపక మొచ్చాయి! "నువ్వోచ్చాక నువ్వుతాకిన చోటుని నీళ్ళుపోసి కడుక్కుంటారు!"
"తాతగారూ, మీరు భోజనం చేయారా?"
"ఈ వేళ పోమావారం! ఉపవాసం మాకు"
"ఇలా ఒక్కడినీ తినాలంటే ఎలాగో అనిపిస్తూంది నాకు! మీ మనుమడిని రానివ్వండి! నా ప్రక్కన కూర్చొని భోజనం చేయడానికి చిన్నపిల్లాడేకదా, అభ్యంతరం ఉండదనుకొంటాను!"
"చూడు, బాబూ! ఈ ఇంట్లో ఆచారాలు, పద్ధతులు ఏమిటో మీ నాయనమ్మ నీకు చెప్పే ఉంటుందనుకొంటాను! అన్ని తెలిసి, నువ్వు ఇంతదూరం మమ్మల్ని వేలెత్తిచూపేందుకు, వెక్కిరించేందుకు రాలేదను కొంటాను!" పరమేశం గంభీరంగా అన్నాడు.
"ఇక్కడ ఇలా జరుగుతుందనే నాయనమ్మ మాధవరావు గారింట్లో భోజనం చేయమని చెప్పింది! మీరేమో అతిధి మర్యాద అంటూ నన్ను పట్టుకొన్నారు! తాతగారూ, మిరేమ్తేనా అనుకోండిగాని నేనొక్కడిని భోం చేయలేను! కనీసం మీ ఇంటి పిల్లినో, కుక్కనో నాకు తోడుగా కూర్చోబెట్టండి"