Previous Page Next Page 
ఆఖరి మజిలి పేజి 24

    రాజా శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్ గారి రాజమహల్ అంటే చుట్టుప్రక్కల చాలా ప్రాంతాల వరకూ మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి...

    ఆయన బ్రతికున్న రోజులలో సింహంలా గర్జించేవాడు.

    ఏ పని చేసినా పదిమందీ గొప్పగా చెప్పుకోవాలని అందరూ తన రాజసాన్ని, దర్పాన్ని గొప్పగా చెప్పుకోవాలని తపన పడేవారు.

    చుట్టూ ఎటు చూసినా ఆయన పేరు ప్రఖ్యాతులతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా తారస్థాయిలోనే ఉండేవి.

    అలాంటి రాజాగారు అకాలమరణం చెందాక ఎన్నో మార్పులు వచ్చాయి.

    అంతవరకూ మూరు మాట్లాడకుండా వున్న అప్పుల వాళ్ళందరూ  రాజాగారు మాకు బాకీ వున్నారు అంటూ యివ్వాలో... యివ్వనవసరం లేదో...అసలు అన్ని అప్పులు ఎలా చేశారో...ఎందుకు చేశారో అర్ధంకాలేదు ఎవరికీ__ఇదేమని అడిగే వారసులు ఎవరూ ఆ సమయంలో లేకపోవడం వలన ఆయన ఆస్తులన్నీ హరించిపోయాయి.

    అశోక్ వచ్చేసరికి కేవలం పండ్ల తోటలు...రాజమహల్ మాత్రం మిగిలాయి. 

    జరిగిన దారుణాన్ని  చూసి తట్టుకోలేని అశోక్ తను చదివిన డాక్టర్ డిగ్రీని విస్మరించి విషాదంలో మునిగి తేలుతూ ఉండిపోయాడు.

    అందుకే...ఉన్న పండ్లతోటను అమ్ముకోలేక...వాటి సంరక్షణను చేయలేక పండ్ల చెట్లను కౌలుకు యిచ్చే ఉద్దేశానికి వచ్చాడు అశోక్.

    ఎస్టేట్ లోని మామిడి తోటలను  ఆ సంవత్సరానికి కౌలుకు తీసుకోవడానికి గాను పేపర్ ప్రకటన ఇవ్వడంతో చాలామంది పళ్ళ వ్యాపారస్థులు పోటీపడి తోటలను పాడడానికి ముందుకువచ్చారు.

    "కౌలుకు ఎందుకు బాబూ...తోట కాపుకువచ్చాక పళ్ళను యితర రాష్ట్రాలకు ఎగుమతిచేస్తే ఎక్కువ లాభం రావచ్చు..."

    అశోక్ చెవిలో చిన్నగా వూదాడు కోటి.

    "నాకంత ఓపికా...తీరికా లేని సంగతి నీకు తెలియనిది ఏముంది...వచ్చినంత చాలులే"

    అశోక్ మాటలకు కోటి మవునం వహించాడు.

    "క్రిందటి సంవత్సరం తుఫాన్ వచ్చింది. ఈ సంవత్సరం చెట్లకు కాయలు కాయకపోవచ్చు. అదీగాక వాటి పోషణ చూసే మనఃస్థిమితం నాకు లేదు...అందుకే కవులుకు యివ్వాలనే నిర్ణయానికి వచ్చాను"

    అశోక్ మాటలకు కోటి గంగిరెద్దులా తలవూపక తప్పలేదు.

    పాట పాడడానికి వచ్చిన వారినందరినీ అశోక్ సాదరంగా ఆహ్వానించి తోటల విస్తీర్ణం, చెట్ల సంఖ్య వివరించాడు.

    సాయంత్రం పాట మొదలయింది.

    పండ్ల వ్యాపారస్థులు ఎవ్వరూ ఎక్కువరేటు  పెట్టకపోవడంతో  అందరూ ముందుగానే సిండికేట్ అయినట్టు అశోక్ కు అర్ధమైంది.

    ఇప్పుడు పాట తక్కువ రేటులో కొట్టెయ్యవలసిన పరిస్థితి ఏర్పడింది. తనకు వ్యాపారంలో అనుభవం లేకపోవడం వలన పండ్ల వ్యాపారస్థులు అందరూ తెలివిగా తనను బోల్తా కొట్టించబోతున్నారు.

    పోనీ, ఈరోజు పాట కాదు అని కాన్సిల్ చేస్తే నష్టం రాదు కాని...శ్రీహరి ఎస్టేట్ కున్న పరువు ప్రతిష్టలను బజారున వేస్తారు...

    అందుకే చేసేదేమీ లేక అశోక్ మవునంగా ఉండిపోయాడు.

    పాటను నడిపిస్తున్న వ్యక్తి పాటను చాలా తక్కువకు కొట్టివేసే ప్రయత్నంలో రెండవసారి పిలిచాడు.

    సరిగ్గా అదే సమయానికి నంబర్ లేని బ్రౌన్ కలర్ కారులో నుంచి దిగిన సూట్ వాలా ఒక్కసారిగారెట్టింపు పాడాడు.

    అందరూ తెల్ల ముఖాలు వేశారు.

    కోటి భృకుటి ముడిపడింది.

    సూట్ వాలా యీ విధంగా ఎస్టేట్ లో పాగా వేస్తాడని అతను ఊహించి ఉండలేదు.    

 Previous Page Next Page