Previous Page Next Page 
వివాహం పేజి 24

   
    అరగంటలో వెంకన్నపంతులు నోట్లుపోయిన సంగతి కనుక్కున్నాడు. సరిగ్గా యిరవై పోవడం అతని కనుమానమేసి, గోపాలరావు సామానులన్నీ వెతికించాడు. దాంతోబాటు పనివాళ్ళని కూడా బెదిరించాడు. గోపాల్రావు పుస్తకంలో నోట్లు దొరికాయి. వెంకన్న పంతులతన్ని పిలిపించి,

    "ముందు బాగుపడవలసిన వాడివి. యిల్లాంటి బుద్ధులు నేర్చుకున్నానంటే పాడైపోతావు. నువ్వు పాడయితే పాడైనావు. నీ భార్యనీ, సంసారాన్నీ పాడుచేసుకుంటావు. ఇంకోళ్ళయితే, చివరికి నా కొడుకైనా సరే పోలీసువాళ్లకి వప్పచెప్పి వుందును; కాని తండ్రివలె ఆ పిల్లని తలుచుకుని నిన్ను వొదిలేస్తున్నాను?" అన్నాడు.

    "మళ్ళీ యింకోసారి నేనమీ ఎరుగనని చెపుతున్నాను. యిట్లాంటివి నేనెప్పుడూ చెయ్యలేదు. నే నెల్లాంటివాణ్ణో వెంకట్రావుగారికి రాసి తెలుసుకోవచ్చు."

    "చాల్లే వూరుకో; అబద్ధం చెప్పి......"

    రవణ లోపలికి వచ్చి, వొంచిన తలతో-

    "ఆ రూపాయలు తీసింది నేను. ఆయన పుస్తకాన్ని నారాయణ చింపాడు. ఆ ఖరీదు మీరు యిచ్చివుండవలసింది; యియ్యలేదు. అది అన్యాయం. ఆయన ఎక్కణ్ణించి తెచ్చి యిచ్చుకుంటారు? అందుకని నేనే తీసికెళ్ళి ఆయన పుస్తకంలో పెట్టాను. పెట్టానని కూడా ఆయనకి తెలీదు. ఆయన్నేమీ అనకండి" అంది.

    వెంకన్న పంతులు చిరునవ్వుతో గదిలోనించి వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోగానే గోపాల్రావు చాలా కోపంగా గదిలోనించి వెళ్ళిపోయినాడు.

    ప్రతి మనిషికీ పాపాలన్నిటిలోనూ తనలోగానీ యితరుల్లోగానీ సహించని పాపం ఒకటి వుంటుంది. సాధారణంగా వారి స్థితిలో వారికి ఎక్కువగా చెయ్యాలనిపించే పాపమే అయివుంటుంది. వర్తకుడికి మోసమూ, భర్తమీద ప్రేమలేని భార్యకి వ్యభిచారమూ, ప్లీడరుకి దొంగ సాక్ష్యమూ, సిపాయికి పిరికితనమూ మొదలైనవి. యితర పాపాలు చేశారంటే వూరుకుంటారు. ప్రత్యేకించి ఆ పాపం చేశారనగానే మండిపడతారు. అట్లానే గోపాల్రావుకి దొంగతనమంత ఘోరమైన పాపం లేదు. తను చెయ్యడూ, ఇతరులలో ఆ పని సహించనూలేడు. బీదవాడు కావడం చేతనూ, యితరుల యిళ్ళలో పెరగడం చేతనూ అతనికి ఆస్తి విషయమైన నీతి గొప్పదయింది.

    తాము చేసిన దుష్క్రార్యం కలగచేసే అంతరాత్మ బాధని, ఆ దుష్కార్యం చెయ్యవొద్దని బోధించడంవల్ల నయం చేసుకునేవారు కొందరు. ఒక చావుముందు విల్లు 'రిజిస్ట్రేషన్కి' వెళ్ళితే అన్యాయం చేసి, వారసత్వం తప్పించి, యాభైవేలు సంపాయించి "ఫిన్షన్" పుచ్చుకున్న రిజిష్ట్రారొకాయన ఆ వూళ్ళో వుండేవాడు. ఆయన్ని స్కూలుజీతం యాచించడానికి గోపాల్రావు పూర్వం వెడితే-

    "ఇదుగో! అబ్బాయ్ , నువ్వు మాత్రం లంచాలు తీసుకోకు. స్కూలు ఫైనల్ ప్యాసై పనిలో ప్రవేశిస్తావా! అప్పుడు లంచాలిస్తామని వొస్తారు, తీసుకోకు అంత పాపం యింకోటి లేదు" అని ప్రతీసారీ చెప్పేవాడు.

 Previous Page Next Page