" ఇది లోపలే వుండిపోయింది."
పాప తీసేసింది.
రక్తం జివ్వుమంటూ శరీరంలోంచి బయటకు చిమ్మింది.రామదేవి చప్పున చెయ్యి ముడిచేసుకుంది.అలవాటున్నట్టు.
తర్వాత బెడ్ మిదకు వెనక్కి వాలిపోయి మత్తుగా కళ్లు మూసుకొని పడుకుంది.
"అమ్మగారూ... అమ్మగారూ...." అని పిలుస్తోంది పాప గాభరాగా.
రమాదేవి బలవంతాన కళ్లు విప్పింది." ఆ కళ్ళు.... చూపులు ఎలాగో వున్నాయి.
"ఫరవా.... లేదు..నాకేం....భయం...లేదు... చాలా.... హాయిగా... వున్నాను... నువ్వు... అబ్బాయి కోస...మొచ్చావని... తెలుసు.... అక్కడ... ఆగదిలో... వున్నాడు... గో... ఎండే ... ఎన్ జాయ్.."
తర్వాత యిహ మట్లాడలేకపోయింది.
పాప గదిలోంచి బయటి కొచ్చింది. పెద్ద హాలు. అందు లోంచే ప్రతి గదిలోకీ దారివుంది. సూర్యచంద్ర వున్న గది ఏది? అటూ యీటూ చూసి కుడిప్రక్కగా వున్న గదివైపు కదిలింది.
తలుపు వేసివుంది. బలవంతంగా తోచింది.
లోపల లైటు వెలగుతోంది. సూర్యచంద్ర సోఫాలో కూర్చుని తల వొంచుకొని చాల ఏకాగ్రతలో రాసుకుంటున్నాడు. అలికిడి విని తలత్రిప్పి చూశాడు.
" నువ్వా?" అన్నాడు ఆశ్చర్యంగా.
పాప ప్రతిమలా అలా నిలబడి వుండిపోయింది.
" లోపలకురా" అన్నాడు ఆప్యాయంగా.
పాప లోపల కడుగు పెట్టింది.
" ఏమిటిలా వచ్చావు?"
ఇందాకట్నుంచీ ఆపుకున్న దుఃఖం యిహ ఆగలేదు, ఉన్నట్లుండి ఆమె వెక్కి వెక్కి
ఏడవసాగింది.
అతని కర్ధం కాలేదు. "పాపా! ఏమిటిది? ఎందుకేడుస్తున్నావు?" అనడిగాడు అయోనయంగా.
"నాకు... నాకు..." అంటూ దుఃఖం ఎక్కువైపోయి మాట పూర్తి చెయ్యలేక ఏడ్చేస్తోంది.
"ఏమిటి పాపా? ఏం జరిగింది? రా, యిలా కూచో."
" ఉహు" అంటూ పాప కూర్చోటానికి నిరాకరించింది." నాకు... నాకు..."
సూర్యచంద్ర చేతిలోనిఫైలూ, పెన్నూ ప్రక్కనపెట్టి లేచి ఆమె ద్గగరకెళ్ళి బుజంమిద చెయ్యి వేశాడు. " చెప్పు పాపా. చెప్పవా?" అన్నాడు అనునయంగా.
" నాకు... పెళ్ళి...ఖాయం చేసేశారు...."
"చాలా సంతోషం పాపా."
ఉలికిపడి అతనివంక చూసింది.ఎంతో ప్రయాసపడి, ఆశపడి యిక్కడికి వ్చచ్చిందియీ జవాబు వినటానికా?
అతనికేమి బాధనిపించటం లేదా? అతనికేమి లేదా తనంటే?
ఎలా అడగాలో తెలీక " నాకు యి పెళ్ళి యిష్టం లేదు" అంది తడబడుతూ.
" ఇష్టంలేదా? మరి ఎందుకు ఒప్పుకున్నావు?"
" ఒప్పుకోలేదు. బలవంతాన ఖాయం చేసేశారు."
" అయ్యో! అయితే వచ్చి మి నాన్న గారితో మాట్లాడతాను."
" ఏం మాట్లాడతారు?"
" ఈ పెళ్ళి కేన్సిల్ చేసెయ్యమని."
" చేసి...."
" మర మంచి సంబంధం , అన్ని విధాలా నీకు నచ్చిన వరుడ్ని చూడమని చెబుతాను."
"అన్ని విధాలా నాకు తగిన వరుడు మిరే" అని చెబుతామనుకుంది. కానిధైర్యం చాలలేదు అంతేగాక చెప్పి ప్రయోజనం లేనప్పుడు కొన్ని మాటలు చెప్పకుండా వుంటే మంచిది.
" బాబుగారూ" అంది. ఆమె కంఠస్వరం వొణుకుతోంది. " అలాంటి సంబంధం...."
"తప్పకుండా ఎక్కడో అక్కడ దొరుకుతుంది పాప. మి నాన్నగారివల్ల కాకపోతే నేనే ప్రయత్నంచేసి వెదుకుతాను."
ఆమె కర్థమైంది.అతని మనసులో తనంటే చేసుకుంది.
"అంతేనా?"అంది పూర్తిగా నిరాశ చేసుకుంది.
" నీ పెళ్ళి గురించి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాను పాపా."
" వొస్తాను" అంటూ కదిలింది.
" అదేమిటి? ఏదో అడగాలని వచ్చావు."
" అడిగాను బాబుగారూ. జవాబు కూడా దొరికింది అంటూ రెండడుగులు వేసి ఏదో గుర్తువచ్చి "అన్నట్లు...." అని మళ్ళీ వెనక్కి వెళ్ళి "తీసుకోండి బాబుగారూ. ఇదిమి కిచ్చే ఆఖరి పువ్వు" అంటూ చేయిజాపి గులాబీని అందించింది.
"థ్యాంక్స్" అంటూ అందుకున్నాడు.
అంతవరకే.... అంతకుమించి తనకి అందదు.
"వొస్తానుబాబుగారూ" బరువెక్కిన గుండెతో అక్కడ్నుంచి కదిలింది.
14
పాప పెళ్ళి జరిగిపోయింది. వరదరాజు యిరుగు పొరుగూవాళ్ళే అన్ని విధాలా సాయపడ్డారు.
అసలు పెళ్ళి కొడుకు ఎలా వుంటాడో చూడలేదు. చూడాలని. ఆసక్తి కూడాలేదు. యాంత్రికంగా ఎవరేది చెబుతే అది చేసింది.
పెళ్ళి పూర్తయిపోయింది.
ఆ రాత్రి శోభనం ఏర్పాటు చేశారు.
అప్పుడు చూసింది అతన్ని. నల్లగా, సన్నగా, కొంచెం పొడవుగా వున్నాడు. కళ్ళు... లోతుగా, క్రూరంగా వు న్నట్లు కనిపించాయి.
అతని పేరు బంగార్రాజు.