మధూహ అతడికి కృతజ్ఞతలు తెలిపి, సోమంని తీసుకుని అక్కడ నుంచి కదిలింది. శివశంకరం టైపుమిషను ముందు కూర్చుని స్వయంగా నోటీసు తయారు చేయసాగాడు.
6
డాక్టర్ విశాల్ మొహం క్రూరంగా మారింది. స్పోటకపు మచ్చల గుంటలు మరింత లోతై నల్లదనాన్ని సంతరించుకున్నాయి.
"ఎవడీ లాయరు?" అని అడిగాడు.
"నేను హిప్నాటిజం క్లినిక్ నడుపుతున్నప్పుడు ఇదేవిధంగా చాలాసార్లు నాకు నోటీసులిచ్చి ఎడిపించాడు. ఒక రకంగా చెప్పాలంటే. అతడి బాధపడలేక దాన్ని మూసేసి ఇక్కడకొచ్చి చేరాను" అన్నాడు రాజు. "మైండ్.....మాగ్నో క్లినిక్ అంటే కోర్టు పరిధి నుంచి తప్పించుకోవచ్చునన్న వుద్దేశ్యంతో...."
"కష్టం" అన్నాడు విశాల్. "ఈ DRUGS AND MAGIC REMEDIES ACT మనం ఏరకంగా ట్రీట్ చేసామా అన్న విషయాన్ని ప్రశ్నించదు. కొన్ని మందుల్ని, రోగ నివారణల్ని పత్రికల్లో ప్రకటించటాన్ని శిక్షార్హం చేస్తుంది. ఈ లాయరు ఎప్పటికైనా ప్రమాదకరమే. ఎందుకంటే...." ఆగి నెమ్మదిగా అన్నాడు. ".....ప్రెగ్నెన్సీ మందుల్ని పత్రికల్లో ప్రకటించటాన్ని కూడా ఈ ఆక్టు నిరోధిస్తుంది." అంటూ లేచాడు "నాతో రా"
రాజు ఆశ్చర్యంగా "ఎక్కడికి?" అని అడిగాడు.
"నీమీద ఈ లాయరు చాలాసార్లు అటాక్ చేసేడన్నావ్ గా."
"అవును. అయితే."
"ఇంతకాలం నువ్వు స్వంతంగా ప్రాక్టీసు చేసావు. కానీ ఇప్పుడు నువ్వు డాక్టర్ విశాల్ మనిషివి. ఆ విషయం తెలుసుకోలేని లాయరు. అలా తెలుసుకోనందుకు కొద్ది సేపట్లో చింతించబోతున్నాడు" అంటూ స్నేహితుడి కారుకోసం ఫోన్ చేసాడు.... ఇద్దరూ కార్లో కూర్చున్నారు. కారుని వర్క్ షాప్ ముందు తీసుకువెళ్ళి ఆపాడు డాక్టర్ విశాల్. దగ్గిరగా వచ్చిన మోకానిక్ తో "బ్రేక్ ఆయిల్ తీసెయ్" అన్నాడు. మెకానిక్ డాక్టర్ వైపు ఆశ్చర్యంగా చూసాడు. బ్రేకులు తొలగించమని ఏ కారు యజమానీ కోరాడు. అయినా ఎదురు ప్రశ్నలు వేయకుండా ఆ పని చేసాడు.
అక్కడ నుంచి కోర్టుకి వెళ్ళారు ఇద్దరూ. నాలుగున్నర అవుతూండగా. కోర్టు నుంచి స్కూటర్ మీద బయటకు వస్తూ కనిపించాడు శివశంకరం. స్కూటర్ వీధి మలుపు తిరుగుతుండగా వెనుకనుంచి వేగంగా వెళ్ళి కారుతో ఢీకొన్నాడు డాక్టర్ విశాల్. శివశంకరం గాలిలో ఎగిరి దూరంగా పడ్డాడు.
కారు ఆగలేదు. అదేవేగంతో అతడి కాళ్ళమీద దూసుకుపోయింది. రెండు కాళ్ళూ పచ్చడి అయిపోయాయి.
కారు ఆపుచేసి దగ్గిరికి వచ్చాడు విశాల్. జనం ఇంకా చుట్టూమూగలేదు. దిగ్భ్రాంతిలో వున్నారు, డాక్టర్ విశాల్ శివశంకరాన్ని చేతులమీద ఎత్తి మరో టాక్సీ పిలిచి ఎక్కించాడు. శంకరం బాధగా మూలుగుతున్నాడు.
ఆక్సిడెంట్ అనగానే జనం మూగటం సహజం. కనీ ఈలోపులోనే అంతా జరిగిపోయింది. టాక్సీ కదిలింది.
......ఆపరేషన్ టేబిల్ మీద పడుకోబెట్టి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసాడు. "ఇన్ స్పెక్టర్ గారూ. నేను డాక్టర్ విశాల్ ని మాట్లాడుతున్నాను. పది నిముషాల క్రితం కోర్టు దగ్గిర యాక్సిడెంట్ చేసాను."
"మీరేనా?" అట్నుంచి అన్నాడు ఇన్ స్పెక్టర్. ఆక్సిడెంట్ జరిగిన మనిషిని టాక్సీలో ఎక్కించుకుని వెళ్ళిపోయారని అక్కడ జనం చెప్పారు. రాళ్ళతో కారు అద్దాలు బ్రద్దలు కొట్టారు. కారు యజమాని ఎవరా అని ఇప్పుడే ఎంక్వయిరీ మొదలుపెట్టబోతున్నాను. మీ పేరేమిటి అన్నారు?"
"డాక్టర్ విశాల! కారు యజమాని నా స్నేహితుడు. ఏదో అర్జెంటు పనివుండి తీసుకున్నాను. బ్రేక్ ఆయిల్ చూసుకోలేదు. బ్రేకులు ఫెయిల్ అయినయ్. పాపం అతనెవరో లాయర్ అనుకుంటాను. కాళ్ళు విరిగిపోయాయి. అది చూడగానే నేనిక రూల్సూ రెగ్యులేషన్సూ ఆలోచించలేదు. ఒక డాక్టర్ గా అతడిని నా నర్సింగ్ హొంకి తీసుకొచ్చాను. ఇన్స్ స్పెక్టర్ గారూ! మీరొప్పుకుంటే, ఇంకో రెండు నిమిషాల్లో ఆపరేషన్ ప్రారంభిస్తాను. తరువాత నేనే స్వయంగా వచ్చి మీకు లొంగిపోతాను."
ఇన్స్ స్పెక్టర్ నొచ్చుకుంటున్నట్టు "అంత మాట అనకండి" అన్నాడు. ".....అరెస్ట్ అనేది కేవలం ఫార్మాలిటీయే. దానితోపాటు బెయిల్ పేపర్లు కూడా సిద్ధంగా వుంచుతాను. మీరు చేయాలని చేసిన నేరం కాదు కదా. స్నేహితుడి కారు బ్రేకులు ఫెయిల్ అవుతే దానికి మీరేం చేయగలరు? మీరు తీరిగ్గా రండి. ఫర్వాలేదు."
"థాంక్స్"
"మీరు మాకు థాంక్స్ చెప్పటం కాదు. మేమే మీకు చెప్పాలి డాక్టర్ గారూ! ఆక్సిడెంట్ అనగానే బెదిరిపోకుండా, మీరే షేపెంట్ ని తీసుకెళ్ళి ఈ పరిస్థితుల్లో కూడా స్వయంగా ఆపరేషన్ టేకప్ చేయబోతున్నారంటే అది మీ మానవతా వాదాన్ని తెలుపుతోంది. పోతే మీ కారుని మాత్రం జనం బాగా పాడు చేసారు."
"పోనీలెండి. నేను చేసిన ఆక్సిడెంట్ కి అది శిక్ష అనుకుంటాను. నా స్నేహితుడికి ఆ ఖర్చులు నేనిస్తాను" అని ఫోన్ పెట్టేసాడు. ఆ తరువాత కార్డ్ లెస్ ఫోన్ టేబిల్ మీద వుంచి, శివశంకరం దగ్గిరగా వచ్చాడు. అతడి రెండూ కాళ్ళూ పరిశీలించి అసిస్టెంట్ తో "కుడి కాలు ఫర్వాలేదు. స్టీల్డ్ రాడ్ వేస్తే అతుక్కోవటానికి ఆర్నెల్లు పట్టొచ్చు. ఎడమకాలు మాత్రం తీసెయ్యాలి. ఏర్పాటు చెయ్యి" అన్నాడు. అసిస్టెంట్ వెళ్ళిపోయాడు.
ఒంటరిగా ఆపరేషన్ టేబిల్ మీద పడుకునివున్న శివశంకరం తల దగ్గిరకి వచ్చి నిలబడి అతడి మొహంలోకి చూస్తూ.....
.....అప్పుడు విశాల్ నవ్వేడు.....క్రూరంగా, విలాసంగా .శంకరానికి మాట్లాడటానికి సత్తువ లేదు. అలాగే చూస్తూ వుండిపోయాడు. విశాల్ తాపీగా అన్నాడు.... "ఇదే పని నేను గుండాలచేత చేయిస్తే ఏ లక్ష రూపాయలో ఖర్చయ్యేది. కొద్దిగా రిస్కుతీసుకుని నేనే చేసాను. స్వయంకృషి మీద నాకు నమ్మకం ఎక్కువ. అయినా తన శత్రువు కాళ్ళు తానే స్వయంగా సరికే అవకాశం ఎంతమందికొస్తుంది చెప్పు? కాలు నిజానికి తీసేయక్కర్లేదు. కానీ తీసేస్తున్నాను."
ఆపరేషన్ పరికరాల్తోపాటు, ఏముకని కోసే 'సా' (రంపం) పట్టుకుని రాజు ప్రవేశిస్తూ వుండగా విశాల్ పూర్తీ చేసాడు. "ఇతని పేరు రాజు. గుర్తు పట్టావనుకుంటాను....."మళ్ళీ నవ్వేడు.
"నేను నీమీద కక్ష గట్టటానికి కారణం రాజు అనీ, నాకారు బ్రేకులు నేనే పాడుచేసుకుని ఆక్సిడెంట్ చేసాననీ ఏ కోర్టులో నిరూపించగలవు?" ఏ MAGIO REMEDY ACT కూడా ఇంత మాస్టర్ ప్లాన్ ని వూహించి వుండదే..."
* * *
"నేను ఏ కోర్టులోనూ నిరూపించలేను. ఏ కోర్టు కూడా నమ్మదు" అన్నాడు శంకరం నిస్సహాయంగా. నర్సింగ్ హొంలో .....ఒక కాలు ఆపరేట్ చేయబడి మరొక కాలు తొలగించబడి వున్నాడు అతడు. ప్రక్కన స్టూల్ మీద కూర్చుని వుంది మధూహ. పక్కనే సోమం వున్నాడు. అది విశాల్ క్లినిక్ అవటం ఐరనీ.
"అతడే స్వయంగా ఆపరేషన్ చేసి ఏలోపం లేకపోయినా నాకాలు తీసేసాడు. అయినా ఇదంతా కక్ష గట్టి చేసాడని నేను నిరూపించలేను. కారుబ్రేకులు పని చేయకపోవటం అనేది క్షమార్హం. కోర్టులో అతనికి కాస్త జరిమానా పడవచ్చు. లేదా అదీ పడకపోవచ్చు. రాజు అతడి అసిస్టెంట్ అనీ, అతడికి లాయర్ నోటీస్ ఇవ్వటం వల్ల కక్షగట్టి ఇంత పెద్ద. నేరానికి పూనుకున్నాడని కోర్టులో చెప్పలేను. ఎంత విచారకరమైన స్థితి!"
"కానీ.....ఇది ఘోరం. అన్యాయం. అక్రమం" మది మధూహ.
"అవును కానీ చాలా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా , చట్టంలోని లొసుగులు ఆధారంగా చేసాడు. అతడన్నట్టు ఇది మాస్టర్ ప్లాన్. ఏ సాడిస్ట్ కూడా ఇంత క్రూరంగా ఆలోచించి వుండదు. మధూహగారూ! అతడిని చూస్తే నాకెందుకో మామూలు మనిషిలా కనిపించడం లేదు. అతడో సైకిక్ లా వున్నాడు. వుట్టి సైకిక్ అయితే ఫర్వాలేదు. కానీ విపరీతమైన తెలివితేటలున్న సైకిక్ లా కనబడుతున్నాడు."
మధూహ ఒళ్ళు జలదరించింది. శంకరం చెప్పిన దృశ్యాన్ని ఆమె వూహించుకోగలుగుతుంది. చాలా పుస్తకాల్లో ఆమె చదివింది. సినిమాల్లో చూసింది. తన దారికి అడ్డొచ్చిన వారిని తొలగించుకోవటానికి పాకలు తగలబెట్టించటం, లారీల్తో గుద్దించి చంపించడం...అన్నీ కథల్లోనే జరుగుతాయనుకుంది. కానీ ఇంత దారుణంగా....ప్రత్యక్షంగా.... నవ్వుతూ ప్రాణాలు తీసే కిరాతకులు వుండగలరని ఇప్పుడే చూస్తోంది.
ఆమె మనసులో భావాలు గ్రహించినట్టు శంకరం అన్నాడు.....
'నేను తిరిగి లేచి, కనీసం ఒంటికాలితోనైనా లేచి నడవటానికి కనీసం ఆర్నెల్లు పడుతుంది. ఈ లోపులో మరో లాయర్ కి కేసు అప్పగించినా సరే లేకపోతే.....ఆగి నెమ్మదిగా అన్నాడు....."ఇలాంటి కిరాతకులతో గొడవ ఎందుకు....అనుకుంటే మీ ఇష్టం"
ఆ గదిలో నిశ్శబ్దం కూడా ఆమె ఏం చెపుతుందా అన్న ఉత్సుకతతో చూసింది. గాలి స్ధబ్దంగా వుంది. ఆమె సోమంవైపు చూసింది. అతడు తల దించుకుని అభావంగా కూర్చుని వున్నాడు....ఎప్పటిలాగే.
పోగలోచ్చే వరకు అచలానికీ, అగ్ని పర్వతానికీ తేడా తెలీదు.
7
"నమస్కారమండీ"
డాక్టర్ విశాల్ తలెత్తి చూసాడు. లోపలికి వస్తున్న లక్ష్మిని చూడగానే అతడి మొహంలో ప్రసన్నత తొంగి చూసింది. క్లయింట్స్ అందరికీ అతడో గాడ్ ఫాదర్ లా కనిపిస్తాడు. అతడి కళ్ళు ప్రేమతో, దయనీ, ఆప్యాయతనీ వర్షిస్తున్నట్టు వుంటాయి. అదంతా సహజసిద్ధంగా జరిగిపోతుంది.
ఆమె నిలబడే......"నా రిపోర్స్ పరిశీలించి ఈరోజు ప్రెగ్నెన్సీ రిజల్టు చెపుతామన్నారు" అంది.
"అవును" అంటూ ఇంటర్ కమ్ లో మాట్లాడి, "ఇంకో అరగంటలో వస్తాయి కూర్చోండి" అన్నాడు. ఆమె కూర్చుంది. కొంచెంసేపు మామూలు సంభాషణ జరిగాక అతడి అడిగాడు 'మీ మనసులో ఏదో బాధ వుంది. ఏమిటది?'
అకస్మాత్తుగా అతడా ప్రశ్న అడిగేసరికి ఆమె బిత్తరపోయింది. మాట్లాడలేదు.
"చూడు లక్ష్మీ.....ఏకవచనంలో సంభోదిస్తున్నానని ఏమీ అనుకోకు. నేను పేరుకి డాక్టర్నే గానీ ఎంతోమంది ఎన్నో సమస్యలతో నా దగ్గరికి వస్తూ వుంటారు. అన్నయ్యా, మావయ్యా, డాడీ, ఫ్రెండ్, ఫిలాసఫర్....అందర్నీ నాలో చూసుకుంటారు. అందరి సమస్యల్నీ పరిష్కరించటం కోసమే నన్ను పుట్టించాడేమో దేవుడు అనుకుంటూ వుంటాను. అందుకే నేను వివాహం కూడా చేసుకోలేదు. బాధ అనేది మరొకరికి చెప్పుకుంటే తగ్గుతుంది. అవతలి వ్యక్తి అనుభవజ్ఞుడైతే అతడి తిట్టు కూడా నీకు దీవెనగా మారి దారి చూపిస్తుంది. చెప్పు లక్ష్మి నీ మనసులో బాధ ఏమిటో చెప్పు."
ఆమె ఇంతవరకూ ఎవరికీ చెప్పుకోలేదు. అదే గుండెల్లో పెరిగి పెరిగి, ఒక రచనగా బయటకొచ్చింది. కానీ ఏదో అసంతృప్తి. ఒంటరితనపు ఆలోచనల దిగులు. ఎవరికయినా చెప్పుకుంటే బాధ తగ్గుతుంది అన్నమాట నిజమేనా? అందుకే నా మనసువిప్పి మాట్లాడటానికి ఒకరయినా ఆత్మీయులు వుండాలంటారు? అలాటి ఆత్మీయులు ఎవరూ ఇంతవరకూ తనకి తారసపడలేదు. ఆమెకు చెప్పుకోవాలనిపించింది.
అంతా. మొత్తమంతా.
కానీ.....