చెప్పబోతూ ఆమె ఆగింది. మరో కోణంలో ఆలోచించింది.
తమ సమస్యలు పక్కవారికి చెప్పుకోవటం కోసం మనిషి స్నేహితుల్ని "వెతుక్కుం"టాడు. చెప్పుకుంటే బాధ తగ్గుతుందన్నది పొరపాటు. అవతలివారు ధైర్యం చెపుతారనో, తనపట్ల సానుభూతి చూపించాలనో కోరిక మనసులో వుంటుంది. కేవలం అలా చెప్పుకుంటే, అవతలివారికి వినే వుత్సాహం వుండదని ".......దీనికి నేనేం చేయాలి?" అని చివర్లో ఒక సలహా అడిగి, ఎదుటి వారికి పెద్దరికం ఆపాదిస్తారు. అవతలి వారుకూడా జ్ఞానులూ, అనుభవజ్ఞులూ అయివుండరు. తమకు తోచింది చెపుతారు. అదెలాగూ ఆచరణలోకి రాదు కాబట్టి, ఈ వ్యవహారమంతా, చెప్పటం.....వినటం" అనే చట్రంలో తిరుగుతూ వుంటుంది.
ఆమె మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్నాడు డాక్టరు "మీరేమీ సంశయించకండి. మీ సమస్యకు నా జవాబే మీకు శ్రీరామరక్ష" అన్నాడు.
ఏదో మనో విశ్లేషణ పుస్తకంలో వాక్యం ఆమెకు గుర్తొచ్చింది. "నీ పక్కింటి వ్యక్తికి నీలోని బాధ చెప్పుకుంటే, నీ మనసు ఇంటిమీద ఆ మేరకు అతడికి అధికారం ఇచ్చావన్నమాట."
ఆ వాక్యం ఆ సమయంలో గుర్తొచ్చి ఆమెని రక్షించింది. ఆమెని మరింత రక్షించతానికా అన్నట్టు, అదే సమయానికి రాజు ఆమె తాలూకు రిపోర్టులు తెచ్చి బల్లమీద పెట్టాడు.
డాక్టర్ విశాల్ వాటిని పరీక్షించసాగాడు.
అతడేం రిజల్టు చెపుతాడో అని ఆమె వూపిరి బిగపట్టి ఎదురు చూడసాగింది.
రెండు నిముషాల తరువాత అతడు తలెత్తి, "మీరు తల్లికాబోతున్నారు" అని చెప్పాడు.
8
"రా. నీ కోసమే చూస్తున్నాను. ఒక ఇంటరెస్టింగ్ కేస్ గురించి మా డాక్టర్ ఒకామె చెప్పింది. వెంటనే అది నీకు చెప్పాలనిపించింది" ప్రహసిత్ అన్నాడు.
మధూహ ఎదుటి కుర్చీలో కూర్చుంటూ, "ఏమిటది?" అని అడిగింది.
"మా దగ్గిరకి సంవత్సరం క్రితం ఒక జంటవచ్చారు. వారికి అయిదు సంవత్సరాల్నుంచి పిల్లలు కలుగలేదు. ఆమె రకరకాల ట్రీట్ మెంట్లు ప్రయత్నించింది. అయినా సంతానం కలుగలేదు."
"అయితే?"
"ఈ ప్రకటన చూడు. ఇదే ఆ జంట...." అంటూ పేపర్ చూపించాడు. అందులో దంపతుల ఫోటో వుంది. క్రింద ఈ విధంగా వ్రాసి వుంది.
కృతజ్ఞతలు
"అయిదు సంవత్సరాలుగా సంతానం లేకపోవటంతో మేము డాక్టర్ విశాల్ గారిని ఆశ్రయించాము. ట్రీట్ మెంట్ తీసుకున్న మూడునెలల్లో మా కోరిక నెరవేరింది. మా చిన్నారికి 'విశాలి' అని పేరు పెట్టుకున్నాము. మా ఇంటిలో దీపం వెలిగించిన డాక్టర్ విశాల్ గారికి కృతజ్ఞతలు పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాము."
మధూహ పేపరు మడుస్తూ, "ఇందులో విశేషం ఏముంది?" అంది.
"ఇలాటి కేసుల్ని నువ్వు పరిశోధిస్తున్నావని తెలుసు కదా. అందువల్ల ఆ దంపతుల్ని అంతకు ముందు పరీక్షించిన చేసిన లేడీడాక్టర్ ని మరికొన్ని వివరాలు అడిగాను. ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి."
ఏమిటన్నట్టు చూసింది. మధూహ ఉద్వేగంగా.
"ఈ కేసులో డాక్టర్ విశాల్, ఆర్టిఫీషియల్ ఇన్ సెమినేషన్ చేసాడట.A.I.H....అంటే....భర్త తాలూకు స్పెర్మ్ భార్యలో ప్రవేశపెట్టటం"
అడగటానికి సిగ్గేసింది.....కానీ అనుమానం తీర్చుకోవటానికి అడిగింది. "భర్త స్పెర్మ్ బయటనుంచి ప్రవేశపెట్టటమెందుకు? ప్రకృతి సిద్దమైన పద్దతులుండగా?" ఇంగ్లీషులో అడిగినా కూడా ఆమె మొహం ఎర్రబడింది. అయితే ప్రహసిత్ దాన్ని గమనించలేదు. ఒక డాక్టర్ కాబట్టి మామూలుగా చెప్పుకుపోయాడు.
".......కొన్ని కేసుల్లో మొగవాడి వీర్యం, స్త్రీ అండాన్ని చేరుకోలేదు. అటువంటప్పుడు భర్త స్పెర్మ్ ని ఒక ఇంజెక్షన్ లోకి ఎక్కించి, దాన్ని భార్యలోకి ప్రవేశపెడ్తారు. మామూలుకన్నా ఎక్కువ శక్తివంతంగా ఈ ప్రక్రియ పనిచేస్తుంది. డాక్టర్ విశాల్ చేసిందిదే."
"ఇందులో పరిశోధించవలసిందేముంది?"
"ఇక్కడే ఒక చిన్నవిషయం బయటపడింది. ఇది సంవత్సరం క్రిందటి మాట. అప్పుడు డాక్టర్ విశాల్ కి ఇంత ప్రాక్టీసు లేదు. మూడు గదుల చిన్న ఇంటిలో వుండేది క్లినిక్. అక్కడ మంచి బాత్ రూమ్ సౌకర్యం కూడా లేదట. అందుకని స్పెర్మ్ ని ఇంటిదగ్గరే కలెక్ట్ చేసుకుని రమ్మని చెప్పాడట. ఆ భర్త ప్రొద్దున్న అయిదింటికి దాన్ని తీసి ఒక ఇంజెక్షన్ బాటిల్ లో భద్రపరిచాడు. తోమ్మిదింటికి భార్యాభర్తలు స్కూటర్ మీద క్లినిక్ కి వెళ్ళారు. ఆమె వెనుక సీటుపై కూర్చొని, కర్చీఫ్ లో ఆ బాటిల్ పట్టుకుంది..." అని ఆగి, నెమ్మదిగా పూర్తిచేసాడు. ".....మొగవాడి వీర్యంలో జీవోత్పత్తి చేసే కణాలు మరణించటానికి మూడు గంటలకాలమూ. ఆమాత్రం ఎండా చాలు. కానీ ఆమె గర్భవతి అయింది."
"మైగాడ్" అదిరిపడింది.
"ఒక విషయం గమనించావా? డాక్టర్ విశాల్ దాదాపు ప్రతిరోజూ పత్రికల్లో తన క్లినిక్ వల్ల సంతానం కలిగినట్టు ప్రకటించుకుంటూ వుంటాడు. కేవలం ఒక్క డాక్టర్ వల్ల ఇంతమంది దంపతులకు సంతానం కలగటం అసంభవం. అందువల్ల లైబ్రరీకి వెళ్ళి గత ఏడాది తాలూకు ప్రకటనలన్నీ సేకరించాను."
మధూహ నిరత్తురాలై "వ్వాట్?" అంది.
ప్రహసిత్ నవ్వేడు. "అవును. ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు లోతుకంటూ చేయాలి కదా" అంటూ డ్రాయర్ లోంచి పేపర్లు తీసి బల్లమీద పెట్టాడు. "......ఇందులో దంపతుల ఫోటోలు లేవు కానీ కృతజ్ఞతలు చెప్తూ వ్రాసిన వుత్తరాల అడ్రసులున్నాయి. ఉదాహరణకి ఈ రెండు అడ్రసులూ తీసుకో.
1.జి. రామారావు.
నెహ్రౌనగర్, ఉండ్రాజవరం.
2. విన్నకొండ సుబ్రహ్మణ్యం,
చందనంవారి వీధి, శ్రీకాకుళం.
ఈ రెండు వూళ్ళూ నాకు బాగా తెలుసు. ఆ వూళ్ళో సదరు వీధులు లేవు. అక్కడ దంపతులకి ఇతనివల్ల పిల్లలు పుట్టరన్నది అబద్ధం"
మధూహ వూపిరి బిగపట్టింది. ఆమెకు లోపల్నుంచి ఆవేశం తన్నుకొస్తూంది. "ఎలా?........ఎలా దీన్ని బయటపెట్టటం" అంది స్వగతంగా.
"చాలా కష్టం. చట్టబద్ధంగా మనం ఏమీ చేయలేం. విశాల్ క్లినిక్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటే పిల్లలు పుట్టరనీ . కేవలం పేషెంట్లని ఆకర్షించటానికే ఈ విషమైన ప్రకటనలు గుప్పిస్తాడనీ నిరూపించటానికి మనవద్ద సాక్ష్యాలు లేవు. ఇక మనం చేయగలిగిందల్లా విశాల్ క్లినిక్ ముందు నిలబడి... ఇక్కడికి ఎవరూ వెళ్ళొద్దు....అని రోజంతా అరవాలి. అప్పుడు గానీ మనిద్దర్నీ పిచ్చాసుపత్రిలో చేర్పించరు" అంటూ నవ్వేడు.
ఆమె నవ్వలేదు. స్థబ్దుగా కూర్చుండిపోయింది. ఆ క్షణం ఆమె ప్రపంచంకోసం దుఃఖించింది! ఎంతమంది అమాయకులు!! వీరికి జ్ఞానం ఎలా వస్తుంది? ఎంతమంది సంస్కర్తలు హేతువు గురించి ఎంత బోధించినా, ఎంతమంది రచయితలు తర్కం గురించి ఎంతవ్రాసినా ఈ సమాజం ఇలాగే వుంటుంది.
కాదు. ఎవరో మారతారు. ఒక్కరు మారిన చాలు. ఒక్కరు తెలుసుకున్నా చాలు. వారికొసమైనా దీన్ని చివరి కంటా శోధించాలి.
ఆమె దృఢ నిశ్చయంతో లేచింది.
* * *
అయితే ఇంటికొచ్చేసరికి పరిస్థితి మరోలా వుంది.
సోమం ఇంటిలో లేడు. ఓకే వుత్తరం మాత్రం వుంది.
"వదినా,
నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. తల్లీ తండ్రీ పోయాక నన్ను స్వంత తమ్ముడిలా ఆదరించావు. కానీ నాకే నీ తమ్ముడయ్యేటంత అర్హత లేదు.
ఒక అన్యాయం జరుగుతోంది. దానివల్ల నీకేం నష్టం లేదు. దానితో నీకే సంబంధమూ లేదు. అయినా దాన్ని ఎదుర్కొనేందుకు నువ్వు ఎంత శ్రమిస్తున్నావో నాకు తెలుసు. ఒక దారుణాన్ని వెలుగులోకి తీసుకురావటానికి నువ్వెంత తపిస్తున్నావో కళ్ళారా చూసాను. న్యాయం కోసం పోరాడిన లాయరుగారు కాళ్ళు రెండూ పోగొట్టుకుని, ఆస్పత్రి మంచం మీద పడివున్న దృశ్యం ఇంకా నాకళ్ళల్లో కదుల్తోంది.
చాలామంది తెలివైన వాళ్ళు మోసం చేస్తుంటే, మీలాటి వాళ్ళు కొద్దిమంది దాన్ని ఎదుర్కోవటం కోసం పోరాడుతూంటే, మాలాటి అమాయకులం తెలివిని 'పెంచుకోవటం; కోసం మైండ్......హిప్నో.....క్లినిక్ లని ఆశ్రయిస్తాం.
వదినా మా వూళ్ళో కొందరు యువకులున్నారు. జరుగుతూన్న అన్యాయాన్ని చట్టపరంగా ఎదుర్కోలేనప్పుడు, ఆ బాధ్యతని వాళ్ళు చేపడతారు. నేను వాళ్ళదగ్గిరకి వనాల్లోకి వెళుతున్నాను. వెళ్ళబోయేముందు ఇంకో చిన్న పని పూర్తి చేస్తాను.
ఇంకో రెండు నిమిషాల్లో ఈ వుత్తరం ముగించి విశాల్ క్లినిక్ కి వెళ్తాను. అతనికి చిన్నపాఠం చెప్పటంకోసం.....సోమం.
ఆమెకేదో అర్థమయింది. సోమం ఏదో దారుణం తలపెట్టబోతున్నాడని అర్థం కాగానే "నో...." అని అరుస్తూ చేరుకునేసరికి పదినిముషాలు పట్టింది. సరిగ్గా అదే సమయానికి డాక్టర్ విశాల్, రాజుతో కలిసి క్లినిక్ తలుపు మూసి మెట్లు దిగుతున్నాడు. ఆమె ఏదో అనబోయేటంతలో కిళ్ళీ బడ్డీ వెనుకనుంచి సోమం వేగంగా ముందుకొచ్చాడు.
అది గమనించి మధూహ గట్టిగా అరవటం, ఈ లోపులో సోమం. తన చేతిలో సీసాలో వున్న ద్రవం డాక్టర్ విశాల్ మీదకి విసరటం ఒకేసారి జరిగాయి. ఏం జరుగుతోందో తెలియని రాజు, అప్రయత్నంగా ముందుకు రావటంతో, ఆ ద్రవం అతడి మొహం మీద పడిపోయింది.
ఊహించని ఈ పరిణామానికి సోమం కూడా బిత్తరపోయినా, వెంటనే తేరుకుని మిగతాదాన్ని విశాల్ మొహం మీదకి విసిరాడు. అప్పటికే ప్రమాదాన్ని గ్రహించిన విశాల్ మొహం వెనక్కీ తిప్పుకున్నాడు. వెనుక జుట్టు క్షణాల్లో కాలిపోయింది. మెడమీద చర్మం భగ్గుమంది.
డాక్టర్ విశాల్ కేకల్ని రాజు కేకలు అధిగమించాయి. జనం ఇంకా దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేదు.
"నాకళ్ళు.....నాకళ్ళు....." అని అరుస్తున్నాడు అంధుడైపోయిన రాజు. డాక్టర్ విశాల్ కి అంత ప్రమాదం జరగలేదుకానీ, జుట్టంతా కాలిపోయి మరింత వికృతంగా తయారయ్యాడు. డీప్ షాక్ లో వున్నాడు.
సోమం జనంలో కలిసిపోయాడు.
మధూహ రాజు దగ్గిరకి పరుగెత్తింది. అతడి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుంది.
ఎంతకాదనుకున్నా అతడు ఒకప్పుడు తన స్నేహితుడు. కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకున్నవాడు. వీటన్నిటికన్నా ఎక్కువగా.....స్త్రీ సహజమైన జాలి, ప్రేమ, కరుణ....ఇన్ని భావాలు ముప్పిరికొనగా, అతడిని తన గుండెలకి హత్తుకుని, "ఊరుకో రాజూ.....దిగులు చెందకు. నేను లేనూ" అంటూ ఓదార్చసాగింది.
ఆ క్షణం అతడి స్థితి చూసి ఆమె కరిగిపోయింది. కొన్నాళ్ళక్రితం అతడన్న మాటలూ, తనని తిరస్కరించిన విధానం.....అన్నీ మర్చిపోయింది. నిస్సహాయుడై విలపిస్తూన్న తన స్నేహితుడిని ఓదార్చటంలో ఆమె పూర్వపు ప్రేమ పొంగి పొర్లింది.
స్త్రీకున్న ఏకైక బలహీనత అది! పురుషుడు ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని అబద్దాలు చెప్తున్నాడని తెలిసినా....మళ్ళీ మళ్ళీ అతడిని క్షమిస్తుంది. పూర్ణమైన మనసుతో అతడిని ప్రేమిస్తూనే వుంటుంది. తన ప్రేమతో అతడిని గెలవాలనుకుంటుంది. అతడు ఎప్పటికయినా తన పంథా మార్చుకుంటాడనీ, తనే అతడుగా జీవిస్తాడనీ భావిస్తుంది. మనుష్యులు.....ముఖ్యంగా మగవాళ్ళు.... అంత తొందరగా మారతారా? కాలమే నిర్ణయించాలి.