"అరె! అలాగా...హ్యాపీబర్తుడే శైలజగారూ!" అంటూ వాళ్ళు చుట్టూచేరి తల ఒకటి తీసుకుంటున్నారు.
ఇంకా ఒక్కటే మిగిలివుంది. శైలజ దాన్ని వ్రేళ్ళతో పట్టుకుని ఫణివైపు "ఇంద" అన్నట్లు చూపించింది.
అతను కదల్లేదు. ఏమి చెయ్యాలో పాలుపోక అలాగే కళ్ళప్పగించి చూస్తున్నాడు.
అంతలో అక్కడికి రామకృష్ణ వచ్చాడు. అతను అనవసరంగా బెదిరిపోడు. అవసరం వస్తే రిస్క్ తీసుకునే స్వభావం.
"హలో! ఏమిటి మీరంతా యిక్కడ చేరి?"
కమలామణి చెప్పింది "ఈవేళ శైలజగారి బర్తుడే......"
"అయితే స్వీట్ నాకేదీ-అరె, ఒక్కటే వుందే. గుడ్, థ్యాంక్యూ శైలజగారూ" అని ఆమెచేతిలోని మైసూర్ పాక్ అందుకుని "మెనీ హ్యాపీ రిటన్స్ ఆఫ్ ది డే! నాకు ముందుగా తెలిస్తే ఏమయినా ప్రెజెంట్ చేసేవాడ్ని" అన్నాడు.
"అక్కర్లేదులెండి" ఆమె కోపాన్ని చంపుకుంటూ అతనికేసి చూసేసరికి మైసూర్ పాక్ నోట్లో పెట్టుకుంటున్నాడు. మనస్సు చివుక్కుమంది.
బెల్ మ్రోగేసరికి అంతా లేచారు.
ఆమె బయటకు వచ్చి లేబొరేటరీవైపు నడవబోతుంటే పరశురాం ఎదురుగా వచ్చాడు.
"అయ్యాగారు ఒకసారి పిలుస్తున్నారమ్మా మిమ్మల్ని."
ఆమె గుండె గబగబ కొట్టుకున్నది "పద" అంటూ ఆఫీసువైపు తిరిగింది.
వెళ్ళేసరికి కల్నల్ తనసీట్లో కూర్చుని పైప్ కాలుస్తూ కనిపించాడు.
"గుడ్ ఆఫ్టర్ నూన్!" ఆమె గొంతు కొద్దిగా వణికింది.
"కంగ్రాచ్యులేషన్స్ మిస్ శైలజా! ఫర్ యువర్ బర్తుడే సెలబ్రేషన్స్ ఎండ్ హాపీ బర్తుడే టూ యు!"
"థ్యాంక్యూ సర్!"
కల్నల్ నవ్వారు "ముందుగా తెలిస్తే ఓ స్వీటు నాకూ దక్కేది, ఐయామ్ లేట్."
"సారీ సర్."
"బట్ నాట్ టూ లేట్ - ఎట్ లీస్టు ఫర్ గివింగ్ యూ దిస్ స్మాల్ గిఫ్ట్."
డ్రాయరు సొరుగులోంచి చిన్న దంతపుబొమ్మ తీశాడు. మేకను నోట కరచుకున్న పులిబొమ్మ అది. అందించాడు.
"ప్లీజ్ టేకిట్!"
"థ్యాంక్యూ సర్" అందుకుంది.
"హౌడు యు లైక్ యిట్?"
"ఫెంటాస్టిక్ సర్."
"ఓకే. యు కెన్ గో."
"హమ్మయ్య" అని ఊపిరి పీల్చుకుని శైలజ అక్కడ్నుంచి బయటపడింది.
9
రాత్రి పన్నెండు గంటలయ్యింది. కాలనీ అంతా నిద్రాదేవత ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు నిశ్శబ్దంగా వుంది.
ఫణి తలుపు తెరుచుకుని నెమ్మదిగా బయటకు వచ్చాడు.
గుండె వడివడిగా కొట్టుకుంటున్నది. అటూఇటూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. కుక్కలుకూడా దగ్గర్లో ఎక్కడా వున్నట్లులేవు.
చూడామణి ఇల్లుకూడా నిశ్శబ్దంలో మునిగివుంది. ఫణి తన కాటేజీ దాటి రోడ్డుమీదకు వచ్చేశాడు. గబగబ అడుగులు వేసి చప్పున శైలజ ఇంటి బాల్కనీలో చేరిపోయాడు.
బజర్ వుందిగానీ నొక్కడం ఇష్టంలేదు. ఆ చప్పుడుకు చూడామణి మేల్కొంటే?
"శైలూ!" పిలిచాడో లేదో అతనికే తెలీదు. చెయ్యెత్తి మెల్లగా తలుపు తట్టబోయాడు.
ఉన్నట్లుండి "భౌ భౌ"మని కుక్కల అరుపులు వినిపించాయి. గుండె గుభేలుమంది. వెనక్కి తిరిగి చూసేసరికి కుక్కలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి.
"అయ్యో!" అనుకుని మెరుపులా ఇవతలకి వచ్చాడు కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఆల్సేషియన్ కుక్క అతనింటికి వెళ్ళే దారిలో అడ్డంగా నిల్చుని వుంది.
మతి పోయినట్లయింది. ఏం చెయ్యాలో తెలీలేదు. కుక్క అతనిమీదకు దుమికింది. ఫణి తనేం చేస్తున్నాడో అర్థంకాని స్థితిలో ప్రక్కకి తిరిగి శివమెత్తిన వాడిలా పరిగెత్తనారంభించాడు. కుక్క అతన్ని తరుముతోంది - మొరుగుతూ.
అతను స్పోర్ట్సుమన్. తన బలాన్నీ, శక్తినీ చూపిస్తూ పిచ్చిగా పరుగెడుతున్నాడు.
దూరంనుంచి ఘుర్ఖా "క్యా హై- కౌన్ హై?" అని అరుస్తూ బ్యాటరీ లైటు వేస్తున్నాడు. ఇహ లాభంలేదు. ఎలాగయినా కాటేజి చేరుకోవాలి. అప్పటికి స్కూల్ దాకా వచ్చేశాడు. దానిచుట్టూ తిరిగి మళ్ళీ వెనక్కి కాటేజీవైపు పరుగెడుతున్నాడు.
అలుపు వస్తోంది. కళ్ళు చీకట్లు క్రమ్ముతున్నాయి.
ఒక్కక్షణం వేగంలో మార్పువచ్చింది. ఆ ఒక్కక్షణంలోనే కుక్కవచ్చి అతని కాలు పట్టుకుంది.
భగ్గుమన్నట్లయింది. విదిలించబోయాడు. బలం చాలలేదు. రాక్షసిలా శివంగిలా అతన్ని బలంగా పట్టుకున్నది.
వెనక ఘూర్ఖా అరుపులు.
ఇంతలో ఇంకో విచిత్రం జరిగింది. మెరుపువేగంతో వేరొక ప్రక్కనుంచి రెండోకుక్క తరుముతుండగా ఎవరో మనిషి పరుగెత్తుకు వస్తున్నాడు. దగ్గరకు వచ్చేశాడు. వేగానికి తట్టుకోలేక ఫణిని పట్టుకుని వున్న కుక్కను ఢీకొన్నాడు.
కుక్క ఫణిని విడిచిపెట్టి అతనిమీదకు దూకింది.
ఫణికి ఈ అవకాశం చాలు. అతనికి ఎక్కడలేని శక్తీ వచ్చింది. ఒక్కఊపున ముందుకు దూసుకువెళ్ళి, సరాసరి కాటేజిలోకి వచ్చిపడ్డాడు. గభాలున లోపలకెళ్ళి తలుపులేసేసుకుని, వగరుస్తూ ఆ తలుపుకానుకుని నిలబడ్డాడు.
* * *
మరునాడు ఉదయం రాముడు ఓ మోమోతో ప్రత్యక్షమయ్యాడు.
కాలనీలో వుండే ఉద్యోగస్థులంతా - మొగవాళ్లు మాత్రం సరిగ్గా పదిగంటల కల్లా కాన్ఫరెన్స్ హాల్లో హాజరుకావాలి.
అందినట్లు సంతకం పెట్టి పంపేశాడు.
ఈ విషయం కల్నల్ దృష్టిలోకి వెళ్లిపోయిందన్నమాట.