Previous Page Next Page 
ఆఖరి మజిలి పేజి 23


    అప్పుడు నోరుమూసి వుంటుంది అది__

    అంతకుమించి ఎవరయినా దొంగలు పడడానికి తనేమయినా లక్షలు సంపాదించి వుంచాడనా__? ఎందుకూ పనికిరాని రాళ్ళురప్పలుతప్ప తన భవంతిలో వాళ్ళకు ఏం దొరకవని వచ్చే ఆ దొంగలకు మాత్రం తెలియదా?

    ఆ ఆలోచనలతో తిరిగి నిద్ర కుపక్రమించాడు ఆ పెద్దమనిషి__

    సరిగ్గా అదే సమయంలో ఇరువురు వ్యక్తులు ఆ బిల్డింగ్ పోర్టికోలో తచ్చట్లాడుతున్నారు.

    వాళ్ళు ఏం చేసినా చూడడానికి గేటు దగ్గరున్న గుర్ఖా...లోపల కాపలాకాసే కుక్కలలో  ఏ ఒక్కరిలోనూ ప్రాణాలు లేవు__

    ఇద్దరూ ఒకరినొకరు కళ్ళతోనే సైగ చేసుకున్నారు.

    ఒకడు జేబులో నుంచి తాళాల గుత్తిని బయటకు తీశాడు. ఒక్కొక్క తాళాన్ని ఉపయోగించి తలుపు తెరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఐదు నిమిషాల తరువాత ఫలించిందతని ప్రయత్నం__మెల్లగా తలుపు తీసుకుని ఇరువురూ లోపలకు ప్రవేశించారు.

    యధాప్రకారం తలుపు దగ్గరకు వేసి పైకివెళ్ళే మెట్లు ఎక్కసాగారు.

    పైనున్న మొదటి గదిలోనే తనకు కావలసిన వ్యక్తి వున్నాడని వాళ్ళకు ముందే తెలుసు కాబోలు__నేరుగా పోయి ఆ తలుపు హాండిల్ తిప్పాడు ఒకడు.

    స్మూత్ గా తెరుచుకున్నది__

    గ్రీన్ కలర్ బెడ్ లైట్ వెలుతురులో మెత్తని పరుపుపై హాయిగా నిద్రపోతున్న వ్యక్తిని చూడగానే వాళ్ళ ఇద్దరి పెదవులపై చిరునవ్వు వెలిసింది.

     స్విచ్ బోర్డు ఎక్కడుందో చూసి లైటు వేశాడు ఒకడు.

    ఆ కాంతికి కళ్ళు తెరిచాడు బెడ్ మీద నిద్రపోతున్న పెద్దమనిషి__

    ఎదురుగా ఇద్దరు అపరిచితులు కనపడడంతో ఖంగారు పడిపోయాడాయన.

    "ఎవరు మీరు__"

    అంటూ ఇంక ఏదో అడగబోయాడు కానీ...ఆ ఇద్దరిలో ఒకరి చేతిలో తొంగిచూస్తున్న రివాల్వర్ ను చూడగానే మిగిలిన మాటలు ఆయన గొంతులోనే వుండి పోయాయితప్ప బయటకు రాలేదు.

    దాంతో తనకేం పని లేదన్నట్టు ఆ గదిని మొత్తం దేనికోసమో వెదకసాగాడు  రెండవవాడు...కనిపించిన దేన్నీ వదలడం లేదు__టేబుల్ సొరుగులు...బీరువా__పుస్తకాల షెల్ఫ్...ఎంత వెదికినా వాళ్ళకు  కావల్సింది ఏదో దొరకలేదని అర్ధం కావడంతో పైప్రాణాలు పైనే పోయాయి__

    "మీ...మీ__కు ఏం కావాలి__?  

    "ఏం కావాలో నువ్వే నీ నోటివెంట చెబుదువుగానీ పదరా బేవకూఫ్__" అంటూ గదిమాడు రివాల్వర్ వ్యక్తి.

    "ఎక్కడకు..."

    "నోరు మూసుకుని ముందు పదబే..."

    రెండవ వ్యక్తి వచ్చి లాగిపెట్టి  చెంపమీద ఒకటి వేస్తు కరుగ్గా అన్నాడు...

    వాళ్ళు ఎందుకు వచ్చారో...ఏం కావలసి వచ్చారో దేనికోసం తన గదినంతా  వెదికారో...తనకు ఎక్కడకు తీసుకు వెళుతున్నారో ఏమీ అర్ధంకాలేదాయనకు...

    అదేమని నోరు తెరిచి అడిగితే ఏం ప్రమాదం ముంచుకు వస్తుందోననే భయంతో  మౌనం వహించి వాళ్ళు చెప్పినట్టే బయటకు నడిచాడు...

    గేటు దాటుతుండగా రక్తపు మడుగులో పడివున్న గుర్ఖాను...పెంపుడు కుక్కను చూడడంతో  ఆయనకు వెన్నులో నుండి చలి పుట్టుకువచ్చింది.

    వాళ్ళు ప్రాణాలు తీసే కిరాతకులు అని అర్ధంకావడంతో అంతవరకూ లేని ప్రాణభీతి తొలిసారిగా ఆయనకు కలవరం పెట్టసాగింది...

    ప్రహరీ ప్రక్కనే ఆగివున్న తమ కారులోకి ఎక్కించారు ఆగంతకులు...

    మరుక్షణమే రివ్వున దూసుకుపోయిందా కారు...

    అంత అర్దరాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా ఆ విధంగా కిడ్నాప్ కాబడిన ఆ వ్యక్తి...ప్రముఖ ఆర్కియాలజిస్టు ప్రొఫెసర్ జయపాల్!


                        *    *    *    

 Previous Page Next Page