"నా ట్రంకు కొంటావా? నా కలం కొంటావా?" అని అడగం వింది. మొదట రవణకి నవ్వొచ్చింది. ఆ సొట్టలు పోయిన పాతట్రంకూ, పాళీ చిట్టిన కలం యెవరు కొంటారని! కాని అతని ఆత్రుతలలో గర్భితమైన నిరాశా, విచారమూ స్ఫురించి యెంతో విచారం కలిగింది. ఆ యిరవై రూపాయలూ యెలాగో అతనికి సంపాయించి యివ్వాలి యెట్లా? యెవరిస్తారు? ఈ వెంకన్నపంతులెందుకివ్వడు? తన పిల్లలు చెయ్యకపోతే, యెవరు చేస్తారాపని? ఆ నారాయణా నరుసు మీద అధికమైన కోపం కలిగింది. పైగా అబద్ధం చెప్పడం! అల్లరి అల్లరిత ఆగాలిగానీ యిట్లాంటి పనులా! వాళ్ళు చించారని రూఢిచేస్తే వెంకన్న పంతులిస్తాడు? యెట్లా రూఢి చెయ్యడం? గోపాలరావు విచారం తప్ప ఆమె కింకేమీ కనపడ్డంలేదు. ఆలోచించింది. యెట్లానన్నా వాళ్ళని వొప్పించాలి. నారాయణే చేసివుంటాడీ పని!
నాలుగు రోజులయింది. గోపాల్రావు చెన్నపట్నం వెళ్ళబోతున్నాడు. ఇంకా పుస్తకం ఖరీదు యివ్వలేదు. రవణ ధైర్యంచేసి, సిగ్గు చంపుకుని- పంతులుతో -
"మరి ఆ పుస్తకం ఖరీదు యివ్వరూ?" అంది.
"ఖరీదు? ఖరీదెందుకివ్వాలి?"
"మరి నారాయణ చింపలా?"
"యెందుకు? వాళ్ళకందేట్టు యెందుకు పడెయ్యడం?"
"మరి యెట్లా?"
"ఎట్లానూలేదు" అని ముఖం తిప్పేసుకున్నాడు. అట్లా తిప్పేసుకునన్న తరువాత యింక వెంకన్న పంతులుతో లాభం లేదని సిరద్ధారుకీ తెలుసు, రవణకీ తెలుసు. ఈ అన్యాయం, క్రూరత్వం రవణ నధికంగా బాధించింది. అప్పటికీ యింకోరి విషయమైతే, ఆయనతో తర్కించేదే కాని, ఈ విషయమై మాట్లాడడానికి అభిమాన మెక్కువయింది. ఆ రెండు మూడు మాటలు మాట్టాడ్డమే కష్టమైపోయింది. రవణకేమీ తోచలేదు! చాలా న్యూనతా రోషమూ కలిగాయి. కాని పైకి ఏమీ చూపక వూరుకుంది. గోపాల్రావుకి పుస్తకం మనో వ్యాది అయింది. కాలేజీకి పోననీ, ఎక్కడికో పారిపోతాననీ, బైరాగుల్లో కలుస్తాననీ అతను అనడం వింది. మర్నాడు సాయంత్రం దీపం వెలిగించడానికి వెంకన్న పంతులు గదిలోకి వెళ్ళినప్పుడు అతని బల్లమీద కరెన్సా నోట్లు కనపడ్డాయి. అప్పడప్పుడు అట్లా అతను వొదిలేసి వెళతాడు. ఆ యింట్లో ఎప్పుడూ దొంగతనమన్న మాటలేదు కనుక, అనుమానాలతో నిండిన వెంకన్నపంతులు మనసు కూడా ఈ విషయమై అశ్రద్ధ వహించింది. ఒక్క నిమిషంలో ఆలోచించడానికైనా వ్యవధి లేకుండా, చప్పున, రెండు పదిరూపాయల నోట్లు తీచి దాసేసింది. వేళ్ళి ఆ రాత్రే గోపాలరావు పుస్తకంలో చిరిగిపోయిన పేజీల దగ్గర ఆ నోట్లని పెట్టేసింది. తను తప్పు చేశానని రవణకే మాత్రమూ లేదు. ఆ రూపాయలతనివే తను యిచ్చేసింది. వాళ్ళివ్వరు గనుక.