"పోనీలే అమ్మా..... నేనున్నానుగా సాయం చెయ్యడానికి!" అంది నిర్మల నెమ్మదిగా.
అటు వచ్చిన శివశంకరంగారు హాస్యంగా, "ఏమిటోయి..... కోడలు వచ్చినా వంటింట్లోనే మగ్గుతున్నావు? నీవు ఇవతలికిరా, ఈరోజు కోడలి వంటరుచి చూద్దాం" అన్నారు.
"ఆ..... చేసే కోడలే లెండి! అసలా అమ్మాయికి ఇంకా ఇది తన ఇల్లు, సంసారం అన్నది పట్టనేలేదు - ఏదో హోటల్లో ఉన్నట్టు తినిపోవడం తప్ప." విసుగ్గా అంది ఆవిడ.
"తెలియకపోతే తెలియదనిజెప్పాలిగాని గొణుక్కుంటే ఏం లాభం."
"చిన్నవాళ్ళా చెప్పి చేయించుకోవడానికీ? ఏమన్నా అంటే అత్త ఇలా అందని నన్ను ఆడిపోసుకుంటారు. అసలు మీ కొడుకుననాలి. పాపం వాడు వంటింట్లో అన్నిపన్లకి మిషన్లున్నాయి. మీటనొక్కితే వచ్చేస్తాయి అనుకుంటున్నాడు లెండి. పెళ్ళాం ఎక్కడ కష్టపడిపోతుందోనని భయం కాబోలు. పెళ్ళయి మూడు నెలలు అయినా ఇంకా కొత్త పెళ్ళాం మోజులోనే ఉన్నాడు. ఆ మైకం దిగితే అప్పుడు ఏమన్నా మనం కనిపిస్తామేమో!" నవ్వుతూ అన్న పెళ్ళయిందగ్గరనించి బొత్తిగా పరాయివాడిలా అయిపోయాడన్న బాధవుంది ఆవిడ మాటల్లో.
"అంతా మరి నీలాగే ఉంటారా? గదిలో వున్న కాసేపు 'అయ్యో అత్తగారేం అనుకుంటారో, మామగారేం అనుకుంటారో, అయ్యయ్యో పట్టపగలు వీళ్ళు చూస్తారు. వాళ్ళు చూస్తారు' అని భయపడటానికి. నీ కోడలు ఈ కాలం పిల్ల "శివశంకరంగారు హాస్యమాడారు.
నిర్మల బిడియంగా తలదించుకుంది. తల్లి అంటే పాతకాలంది కాని తను.... తనకి ఇలాంటి అనుభవం ఎప్పుడు కలిగింది కనక? గదిలో భర్త బంధించడం, అయ్యో, అత్తగారేం అనుకుంటారో వదలండి అని ముద్దులు గునపడం - ఇలాంటి అనుభూతులకి అసలు తావెక్కడేడిసింది. తన మున్నాళ్ళ కాపురంలో? నిజంగా దివ్య ఎంత అదృష్టవంతురాలు! అంత అపురూపంగా చూసుకునే భర్త దొరికాడు. మాటిమాటికీ దివ్యని చూస్తూ తన మూడునాళ్ళ కాపురం గుర్తుతెచ్చుకుని నిట్టూర్చేది నిర్మల.
"ఇలాంటి వాళ్ళకివేరింటి కాపురాలు పెడితేగాని బాధ్యతలు వంటపట్టవు. అయినా అందరూ మీ కోడలులాగే వుంటారా?" మా అన్నయ్య కోడలు వచ్చిన మూడోరేజే ఇంటి పెత్తనం అంతా చేతిలోకి తీసుకొని అత్తగారిని కుర్చీలో కూర్చోపెట్టి అన్నీ చేతికందించేది.
"నీ కోడలు అలా కాదంటావు? ఉండు, రఘుని పిలిచి మీ అమ్మని కుర్చీలో కుర్చోపెట్టాలి ఇంక అని చెబుతాను." హాస్యంగా అన్నారు.
"ఆ..... అందలం ఎక్కించే రకాలు వేరులెండి. ఆ రకాలు మర్నాటినించే తెలుస్తాయిలెండి. పనిపాట మాట అటుంచికాస్త గదిదాటి బయటికి వచ్చి నలుగురితో కలియడానికి ఏం వచ్చింది? కోడలు వచ్చిందన్నమాటేగాని ఓ మాటా మంతా?" మూతి ముడిచింది శారదాంబ.
"ఆ..... ఏదో కొత్తమోజు! నాల్గురోజులు పోనీ. ఇంతకీ నీతో ఏం మాట్లాడుతుంది. నీతో, నాతో మాట్లాడాలంటే జనరేషన్ గేప్ అంటారు ఈ కాలం పిల్లలు."
"పోనీ, నేనంటే ముసలిదాన్ని. తన ఈడుది నిర్మల వుందిగా ఇంట్లో....."
శివశంకరంగారు అవును నిజమేనన్నట్లు తల పంపించారు.
"ఆ అమ్మాయి తత్వమే అంతేమో, అట్టే మాట్లాడే రకం గాదేమో!"
"అవునవును..... మాట్లాడే రకమో గాదో అలా రఘు గది బయట రెండు నిమిషాలు వుండి వినండి. వాళ్ల వాళ్ళుగాని, ఫ్రెండ్స్ గాని వచ్చినప్పుడు వినండి."
భార్య మాటల్లో నిజం వుందని ఆయనకీ తట్టింది. కోడలు వస్తే నిర్మలకి కాస్త కాలక్షేపం ఉంటుందని ఆయనా ఆశించారు. కాని ఆ కోడలు ఎప్పుడూ నిర్మలతో సరదాగా గడపడం ఆయన చూడలేదు. పోనీ వాళ్ళు ఏ సినిమాకో వెడుతున్నప్పుడైనా కనీసం మర్యాదకైనా రమ్మని పిలిచినట్టు కనపడలేదు ఆయనకి. ఏదో కొత్తమోజు అనుకున్నారు. నాల్గునెలల పైన అయింది. 'ఇంకా అంత కొత్తేమిటి? పాపం..... నీరు వంటరిగా ఉంటుంది. దాన్ని కాస్త ఎక్కడికన్నా తీసుకెళ్ళాలని రఘుకైనా అన్పించలేదా?' అనుకున్నారు ఆయన.
.........................
మరోవారం తరువాత.....
ఆ రోజు ఆదివారం. రఘు, దివ్య సినిమాకి వెళ్ళడానికి ముస్తాబు అవుతున్నారు. వాళ్ళ మాటలను బట్టి సినిమాకు వెడుతున్నట్టు గ్రహించి శివశంకరంగారు "రఘూ!" అని పిలిచారు.
టైకట్టుకుంటూ బయటికి వచ్చి.... "ఏం నాన్నా...." అన్నాడు.
"సినిమాకి వెళ్తున్నారా? మీరు" అన్నారు రఘు వంక చూసి.
తండ్రి అలా అడగడం వింత అన్పించి 'ఆ.... ఏం?" అన్నాడు ఆశ్చర్యంగా.
"ఏంలేదు. నీరూని కూడా తీసుకెళ్ళండి మీతో. పాపం అది ఒక్కర్తి వెళ్ళలేదు. ఎంతకని ఇంట్లో ఒక్కర్తీ కూర్చుంటుంది? మీరలా సినిమాలకి వెళ్ళినప్పుడు దాన్ని పిలుస్తుండండి..... అన్నారాయన.
రఘు మొహం అదోలా పెట్టాడు. తండ్రి ముందు ఏం అనలేక ఊ అని ముభావంగా గదిలోకి వెళ్ళిపోయాడు. గదిలోంచి దివ్య మామగారి మాటలు విననే వింది. "ఏమిటీ..... ఆవిడని మనతో సినిమాకి తీసుకెళ్ళాలా?" అంది తీక్షణంగా మొగుడి వంక చూసి.
రఘు చూపులు మరల్చుకుని "నాన్నగారు చెప్పాక తీసుకెళ్ళకపోతే బాగుండదు. ఏమన్నా అనుకుంటారు" అని గొణిగాడు.
"అయితే ఆవిడతోనే వెళ్ళండి..... నేను రాను. అయినా భార్యాభర్తలిద్దరూ సరదాగా వెడ్తుంటే మధ్య ఆవిడని తీసుకెళ్ళమనడానికి బుద్ధుండక్కరలేదా! అంత వయసుంది. అంత పెద్దాయనకి ఆ మాత్రం తెలీదా? మన మధ్య ఆవిడెందుకు? అంతగా కావాలంటే వాళ్ళే తీసుకెళ్ళొచ్చుగా?" అంది కోపంగా.