Previous Page Next Page 
ప్రేమ నక్షత్రం పేజి 23


    ఈవేళ ఏదయినా స్వీటుచెయ్యాలి. ఆమెకైతే చాలా వచ్చు. కానీ తన ప్రావీణ్యం చూపించటానికి ఇక్కడ సరంజామా లేదు, టైమూ లేదు.  తేలిగ్గా చెయ్యటానికి వీలుగా ఉండేది మైసూర్ పాక్. అది తయారుచేసింది.

 

    వంట చేస్తున్నంతసేపూ ఎన్నో ఆలోచన్లు. ఈ పెళ్ళివల్ల ఇద్దరూ ఏం సుఖపడుతున్నారు? కనీసం మొదటిరోజయినా.

 

    విధి నిర్దాక్షిణ్యంగా త్రుంచేసింది. ఇద్దర్నీ దూరదూరంగా విసిరేసింది.

 

    ఒద్దు. దాన్ని గురించిన ఆలోచన వద్దు.

 

    అతను క్యాంటీన్ లో భోజనం చేస్తున్నాడు- తానిక్కడ వుండి, ఎదురుగా వుండి.

 

    ఎంత పాపిష్టి జన్మ!

 

    ఆమె కళ్ళల్లో నీళ్ళు నిండాయి.

 

    టైమయిపోతోంది. చిన్న టిఫిన్ గిన్నెలో మైసూర్ పాక్ లు సర్దింది. ఎలా అతనికి పంపించటం? కాసేపు బయట నిల్చుంటే రాముడు కనిపిస్తాడు. వాడ్ని బ్రతిమిలాడితే ఫణికి యిచ్చిరావచ్చు. కానీ వాడిముందు బయటపడటం ఇష్టంలేదు.

 

    సరాసరి ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేసి, "కొలీగ్ కాబట్టి, నా పుట్టినరోజు కాబట్టి ఇచ్చాను" అని చూసినవాళ్లకు చెబుతే?

 

    బావుండదు. అనేక అపార్థాలకు అవకాశమిచ్చినట్లు వుంటుంది.

 

    మరి ఇది ఎందుకు చేసినట్లు...........?

 

    కాలుగాలిన పిల్లిలా అటూఇటూ తిరిగింది. ఏమీ తోచలేదు. కంపెనీకి వెళ్ళే టైము దగ్గరపడుతోంది.

 

    ఇక్కడ్నుంచి విసిరేస్తే...? అతను లాఘవంగా పట్టుకోవచ్చు. కానీ ఎవరయినా చూస్తే....? అమ్మో!

 

    చివరికాపూట భోజనం చెయ్యనేలేదు. పదికి ఇంకో ఏడెనిమిది నిముషాలుందనగా టిఫిన్ పాత్ర చేతిలో పట్టుకుని బయటకు వచ్చి కంపెనీ వైపు బయలుదేరింది.

 

    ఆమెకు ముందు....పది పదిహేను గజాల దూరంలో ఫణి నడుస్తున్నాడు.

 

    ప్రక్కన ఇంకా ఎవరెవరో నడుస్తున్నారు.

 

    ఎంత నిర్దాక్షిణ్యం! ఆమె నిట్టూర్పు అణచుకుంది.

 

                                                               *    *    *

 

    లంచ్ అవర్.

 

    అంతా బయటకు వెడుతున్నారు.

 

    ఫణి, శైలజా తమ సీట్లలోంచి కదలలేదు. చూడామణికూడా తన సీటుకు అతుక్కుపోయి, పెన్సిల్ తో కాగితాలమీద ఏవో ఫార్ములాలు గీస్తూ, అందులో లీనమై వుండిపోయింది.

 

    "లేవదేం? కనీసం బాత్ రూమ్ కయినా వెళ్ళదేం?"

 

    నిముషాలు గడచిపోతున్నాయి. శైలజకు అసహనంగా వుంది. ఫణికి వెర్రెత్తి పోతున్నట్లుగా వుంది. కాసేపు అలా గడిచాక యిహ ఏదో పనిచేస్తున్నట్లు అక్కడ నటించటం చేతగాక అతను లేచి బయటకువచ్చి క్యాంటీన్ వైపు వెళ్ళాడు.

 

    శైలజకు ఏం చెయ్యాలో తోచలేదు. రెండుమూడు క్షణాలాగి యిహ వుండలేక తనూ లేచి నిలబడింది.

 

    చూడామణి చేస్తున్న పనిని ఆపి ఆమెవంక ఆశ్చర్యంగా చూసింది.

 

    తలనొప్పిగా వుందన్నట్లు సౌంజ్ఞచేసి ఆమె బయటకు కదిలింది.

 

    క్యాంటీన్ కి ఆమె ఎన్నడూ వెళ్ళలేదు. అందుకని చేతిలో స్టెయిన్ లెస్ స్టీలు టిఫిన్ బాక్స్ పట్టుకుని ఆమె లోపలకు అడుగుపెడుతూంటే అందరూ ఆమెవంక వింతగా చూశారు.

 

    కమలామణి ఆమెకెదురుగా వచ్చింది. "ఏమిటండోయ్, ఎప్పుడూ లేనిది ఇలా వచ్చారు?"

 

    "తల నొప్పిగా వుంది, కాఫీ త్రాగుదామని."

 

    "రండి, ఇలా కూర్చుందాం."

 

    కూపను తీసుకున్నాక ఇద్దరూ ఓ టేబుల్ దగ్గరకెళ్ళి కూర్చున్నారు. శైలజ కళ్ళుమాత్రం నలువైపులా కలయతిరుగుతున్నాయి.

 

    "ఏమిటండీ చూస్తున్నారు?"

 

    "ఎప్పుడూ చూడలేదు కదండీ. రోజూ ఇక్కడికి ఇంతమంది వస్తారా అని...."

 

    "ఈ గంటేకదండీ, స్వీచ్చగా ఊపిరి పీల్చుకోగలిగేది. మిగతా టైమంతా చెరసాలలో ఉన్నట్లేకదండీ."

 

    శైలజ ఏమీ జవాబు చెప్పలేదు.

 

    "ఇక్కడైనా గోడలకు చెవులున్నాయి. ఊపిరివరకే స్వేచ్చ! మాటల విషయంలో జాగ్రత్తగానే వుండాలి."

 

    శైలజ ఆమె చెప్పేది వింటూనే అటూఇటూ దృక్కులు సారిస్తున్నది. అదిగో ఫణి. దూరంగా ఓ టేబుల్ దగ్గర కూర్చునివున్నాడు. శైలజ అతనికేసి చూసిన టైముకే కమలామణి కూడా చూసింది.

 

    "అతను ఫణీంద్ర! మొన్ననేకదూ ఉద్యోగంలోకి వచ్చి చేరాడు."

 

    "అవును. మా డిపార్టుమెంటే" అంది శైలజ.

 

    "మీరెన్నయినా చెప్పండి. అతనిమీద నాకు సదభిప్రాయం కలగలేదు."

 

    "అదేం?" అంది శైలజ గతుక్కుమని.

 

    "అతను ఆడవాళ్ళని ఎగాదిగా చూస్తాడు. మనిషి బాగానే వుంటాడనుకోండి. అయితేమాత్రం, చూడండి మనవంక ఎలా చూస్తున్నాడో.."

 

    శైలజకు కమలామణి అతన్ని నిందిస్తోంటే బాధగా వుంది. అతని అందాన్ని మెచ్చుకుంటూంటే కోపంగా వుంది.

 

    "అన్నట్టు ఈ టిఫిన్ ఏమిటండీ?"

 

    "ఇదీ....ఈవేళ నా పుట్టినరోజండీ, స్వీట్సు చేశాను."

 

    "చెప్పరేం మరీ?" అని కమలామణి చొరవగా టిఫిన్ మూత ఊడదీసింది.

 

    "హాయ్! మైసూర్ పాక్!" అంటూ ఒకటి చేతిలోకి తీసుకుంది.

 

    ఇంతలో అటుకేసి యింకో నలుగురుయిదుగురు ఆడవాళ్ళు వచ్చారు.

 

    "ఏమిటి కమలా! మాకు పెట్టకుండా కొట్టేస్తున్నావు?" అంది వాళ్ళలో ఒక అమ్మాయి.

 

    "ఈవేళ శైలజగారి బర్తుడే, అందుకనీ." 

 Previous Page Next Page