Previous Page Next Page 
మోడల్ పేజి 24


    అంతలో ఫోన్ మ్రోగింది. మధు చక్రవర్తి ఫోన్ ఎత్తాడు.

    "ఇంటర్నేషనల్ కాల్ ఫ్రమ్ ప్యారిస్ టూ మనోహర్" అని చెప్పింది ఆపరేటర్.

    మధు ఆ విషయం చెబుతూండగానే అమాంతం మీదపడి ఫోన్ లాక్కున్నాడు మనోహర్.

    "హలో.....మిస్టర్.....లారెంట్......"

    "యస్.....నేనే....నువ్వు అడిగిన ఇన్ ఫర్మేషన్ గేదర్ చేయించాను. తరంగిణి ప్యారిస్ లోనే వుంది. నువ్వు ఎంత త్వరగావస్తే అంత మంచిది."

    మనోహర్ లో ఆనందం కట్టలు తెంచుకొని ప్రవహించింది. అక్కడున్న అందరివైపు విజయగర్వంతో చూశాడు. ఆమె అక్కడుందని తెలిశాక ఒక్కక్షణం ఇక్కడ వృధా చేయటం దుర్భరంగా ఉంది మనోహర్ కు.

    "నేనీరాత్రికే ఎయిరిండియాలో ప్యారిస్ వస్తున్నాను. అది ప్యారిస్ రావటానికి 13 గంటలు పడుతుంది. అంటే రేపు ఉదయానికి అక్కడ ఉంటాను. దయచేసి రేపు సాయంత్రం ప్లయిట్ లో ఢిల్లీ రెండు రిటన్  టిక్కెట్స్  బుక్ చేయించగలరా?"

    మనోహర్ ఆమెను తీసుకురాగలననే ధైర్యతోనే చెబుతున్న మాటలకు విస్తుపోయారు మంగళ, కమలిని. వీళ్ళెవర్నీ గమనించే స్థితిలో లేడు మనోహర్.

    "ఏమిటంత హడావిడి? వరల్డ్ ఎడ్వర్ టైజింగ్ లో, ఫ్యాషన్స్ లో, మోడలింగ్ లో బెస్ట్ సెంటర్ ప్యారిస్ నాలుగురోజులుండి రీసెంట్ ట్రెండ్ స్టడీచేసి వెళ్ళవచ్చుగదా! రానుపోను టిక్కెట్ కే 8,556-00 ఖర్చుపెట్టాలి మీ ఇండియన్ కరెన్సీలో. పైన మరో నాలుగువేలు దాదాపు 13 వేలుదకా  ఖర్చుపెడుతూ ఇలావచ్చి అలా వెళతావా?" ఆశ్చర్యపోయాడు లారెంట్.

    సంవత్సరానికి రెండుసార్లు వరల్డ్ టూర్ చేసే లారెంట్ కి ఏ దేశం నుంచి ఏ దేశానికి ఏ సర్వీసుంది? చార్జీ ఎంత? అన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసు.

    "ఒక పెద్ద సూప్ లో ఇరుక్కున్నాను మిస్టర్ లారెంట్ నాప్రతి భక్తి పెద్ద చాలెంజ్ ఇప్పుడు నేను చేపట్టిన ప్రాజెక్టు అది పూర్తయితే శాశ్వతంగా ప్యారిస్ లోనే సెటిల్ అవుదామని వుంది మీ సహకారంతో."

    "మోస్ట్ వెల్ కం"

    "మరొక్క సహాయం కావాలి మీ నుంచి."

    "చెప్పండి."

    "36:24:36 మెజర్ మెంట్స్ తో ఐదడుగుల తొమ్మిదంగుళాల ఎత్తున్న అమ్మాయికి లేటెస్ట ఫ్యాషన్ తొ నాలుగు రకాల కాస్ట్యూమ్స్ తయారుచేసి ఇవ్వగలరా? ప్రోడక్ట్ సోప్స్."

    "గుడ్ మెజర్ మెంట్స్, గుడ్ డిస్కవరీ. మీ దేశంలో అమ్మాయిలు 5.9 ఎత్తుకూడా ఉంటారా? స్ట్రేంజ్."

    "ఆమె నా డిస్కవరీ కాదు జస్ట్ యాక్సిడెంటల్. పైగా మీరు చూసానంటున్న తరంగిణిది మా దేశమే. నేను కావాలంటున్న కాస్ట్యూమ్స్ ఆమెకే....."

    "ఏమిటో అంతా గందరగోళంగా వుంది. ఆ అమ్మాయిని నీవు కనీసం చూడలేదు అప్పుడే కాస్ట్యూమ్స్ అంటున్నావ్.......ఏది ఏమైనా అడిగేది నువ్వు గనుక ఇస్తాను. కాని చార్జీ భరించగలవా? భారించినా ప్యారిస్ లో రోజుకో ఫ్యాషన్ మారుతుంటూంది. పైగా అంతా యూరో పియన్ కల్చర్. లేటెస్ట్ గా కాస్ట్యూమ్స్ నచ్చకపోవటం అనే ప్రసక్తి అసలులేదు.

    మధ్యలో ఆపరేటర్ లైన్ లోకి వచ్చింది. "టైమ్ ఈజ్ ఓవర్" అంటూ. ఫోన్ పెట్టినట్లు శబ్దం వినిపించింది మనోహర్ కి. తనూ క్రెడిల్ చేస్తుండగా చందూ వచ్చాడు.

    "ఏం చందూ రూపా ఎలా ఉంది."

    "కోలుకుంది సార్. కాని ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. వాళ్ళ బంధువులు వచ్చి ఆమెను తీసుకెళ్ళిపోయారు."

    "అయితే సరేమధు......రూపా తండ్రికి ఫోన్ చేసి డబ్బేమన్నా అవసరం అయితే పంపే ఏర్పాట్లుచేయి....." అంటూ చందూవైపు తిరిగి "చందూ ఈ రోజునుంచీ నీ పొజిషన్ మార్చాను. ఆ వివరాలు మధు చెబుతాడు. ప్రదీప్ పగ భయంకరమైంది. పైగా రూపాని కాపాడింది నువ్వే జాగ్రత్తగా ఉండు. కోరమాండల్ కంపెనీకి వెళ్ళి వాళ్ళు తయారుచేస్తున్నా  నాలుగు సోప్స్, ఒక్కొక్కటి రెండు డజన్లు తీసుకో. వాటి రేపర్స్, కార్తన్స్ కూడా తీసుకో. ఆ కంపెనీ లోగో, ఎంబ్లమ్, బ్రాండ్ నేమ్, దాని డిజైన్స్ అన్నీ కలెక్టుచేసి పెట్టుకో."

    "మధు...... హెయిర్ స్టయిలిస్ట్.....రోజాని, ఆర్ట్ డైరెక్టర్.....నిషాంత్ ణి మేకప్ ఆర్టిస్టు....డాలీభాటియాని కాంటాక్టుచేసి వార్ని సిద్దంగా ఉండమని చెప్పు. వారికి అడ్వాన్సులు ఇస్తూ. మనకు వర్క్ చేయబోతున్న విషయాన్ని రహస్యంగా ఉంచమను. ఎందుకైనా మంచిది వారిమీద ఒక కన్నేసి ఉంచు. బ్యాలెన్స్ వర్కు బాగా చేయాలి మధు. ఫోటోగ్రాఫర్ అంటే జస్ట్ క్లిక్కర్ మాత్రం కాదు, మైండిట్" అంటూ ముఖ్యమైన ఐటెమ్స్ మరోసారి చెక్ చేసుకుంటున్నాడు.

    మనోహర్ ఓసారి ప్రక్కకువస్తే బావుండని ఆలోచిస్తోంది, ఆశగా మనోహర్ వైపే చూస్తూ మంగళ. ఆ విషయాన్ని కమలిని గమనించింది.

    "మనోహర్ ఒకసారి ప్రక్కకువస్తే బావుండని ఆలోచిస్తోంది, ఆశగా మనోహర్ వైపే చూస్తూ మంగళ. ఆ విషయాన్ని కమలిని గమనించింది.

    "మనోహర్ తలెత్తి మంగళవైపు చూశాడు. ఆమెచూపులు దీనంగా అభ్యర్థిస్తున్నట్లుగా ఉన్నాయి. అర్థం చేసుకున్న మనోహర్ తన బెడ్ రూం లోకి నడిచాడు. ఆ వెనుకే మంగళ వెళ్ళింది. ఏకాంత సమయమైతే దొరికిందిగాని ఏం మాట్లాడలేకపోతోంది.

    మనోహర్ మంగళను దగ్గరకు తీసుకుని ఆర్తిగా తన గుండెలకు హత్తుకుని ప్రేమగా జుత్తును చుంబించి "వస్తాను మంగళ......నీకు తోడుగా మేడమ్ వుంటారు......"అంటూ వెళ్ళిపోయాడు.

    ఏడుపు ముంచుకు వచ్చింది మంగళకు. ఏదేదో మాట్లాడాలనుకుంది. ఏమేమో చెప్పాలనుకుంది ఉద్వేగంతో మాట పెగలలేదు. ఆ లోపు మనోహర్ వెళ్ళిపోయాడు.


                                                               *    *    *


    మరో రెండు గంటల తరువాత మనోహర్  ఢిల్లీ  వెళ్ళే ప్లయిట్ లో వున్నాడు.

    నాలుగు ఫిల్మ్స్ లో ఒక డైలాగ్ లేకుండా నాన్ వెర్బల్ గా తీసేందుకు మనోహర్ ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.

    మరోప్రక్క ఫ్రాన్స్ వెళ్ళేందుకు వీసా తయారయిందా లేదా అని ఆలోచిస్తున్నాడు (ఇతర దేశం వెళ్ళేందుకు ఇచ్చే అనుమతి పత్రం.)

     ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ప్లయిట్ లేండవ్వగానే హడావుడిగా ఇంటర్నేషనల్ ఎయిర్ బుకింగ్ వైపు వెళ్ళాడు, రంజీత ఈ రాత్రికే ప్యారిస్ కి తన పేరు మీద టిక్కెట్  రిజర్వు చేసిందీ లేనిది కన్ ఫర్మ్ చేసుకొనేందుకు. దారిలోనే ఎదురయింది రంజీత టిక్కెట్ చేతిలో పట్టుకొని వస్తూ.

    "యు ఆర్ లక్కీ సార్......ముందు లేదన్నా చివరకు ఇచ్చారు. వీసా రడీనా సార్.....?" అడిగింది రంజీతా టిక్కెట్ మనోహర్ కిస్తూ.

    "అయ్యుండవచ్చు. ఫ్రాన్స్ ఎంబస్సీకి ఫోన్ చేసి చెప్పాను. ఈ పాటికి తయారయి ఉండవచ్చు......"

    "కాని ఈ టైమ్ లో ఆఫీ సెలా ఉంటుందిసార్" అంది లేత గులాబి రంగుతో వున్న మనోహర్ పెదవులవేపే చూస్తూ.

    "ఆ ఆఫీసులో తెల్సిన అతను వున్నాడు. నాకోసం ఆఫీసులోనే వెయిట్ చేస్తుంటాడు.....వస్తాను.....థాంక్స్" అంటూ టాక్సీస్టాండ్ వేపు వడివడిగా నడిచాడు.....రంజీతా చెప్పేది వినకుండా.

    ప్లయిట్ రాత్రి 8 గంటలకు సార్....." రంజీతా మాటలు గాల్లో కలిసిపోయాయి. మనోహర్ హడావుడి చూసి రంజీతా విస్తుపోయింది.

    దాదాపు పరిగెతున్నట్లుగా వెళ్ళిన మనోహర్ ని చూసి చుట్టు ప్రక్కలవాళ్ళు వింతగా  చూశారు. టాక్సీ మనోహర్ సూచనల మేరకు ఫుల్ స్పీడ్ లో పోతోంది తరంగిణి దొరకబోతోందన్న ఆనందం మనోహర్ ని  ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

    ప్రదీప్ లాంటి కట్ త్రోట్ కంపిటీటర్ తో ఛాలెంజ్ చేసి నెగ్గటం అంటే మామూలు విషయంకాదు. మంచి ఫోటోగ్రాఫర్ తో పాటు, సమర్థుడిగా పేరు రాబోబోందన్న ఎగ్జెయిట్ మెంట్ మనోహర్ ని అల్లకల్లోల పరుస్తోంది.

    టాక్సీ ప్రాన్స్ ఎంబస్సీ ముందు ఆగింది వందరూపాయిల నోటు తీసి డైవర్ కిచ్చేసి, చిల్లరకోసం చూసుకోకుండా రెండో అంతస్తులో ఆఫీసువేపు కదిలాడు వేగంగా.

    మెట్లను వేగంగా ఎక్కుతూనే వాచీ చూసుకున్నాడు. టైమ్ 6-10 అయింది. మరో యాబై  నిముషాల్లో ఎయిర్ పోర్ట్ లో వుండాలి. విమానాల హెజాకింగ్ తరచూ జరుగుతుండంతో గంటన్నర ముందే ఎయిర్ పోర్ట్ లో వుండాలని నిబంధనపెట్టారు. గంటన్నర కాకపోయినా  కనీసం గంటముందైనా వుండాలి.

    జోన్స్ ఏదో ఫైల్ చూసుకుంటు కనిపించాడు.

    "హలో జోన్స్....." పలకరించాడు మనోహర్.

    జోన్స్ తలెత్తిచూసి "హలో.....మనోహర్.....కమాన్....కమాన్.....నేను మీ కోసమే ఎదురుచూస్తున్నాను. మీ వీసా అప్లి కేషన్ లో సెయింట్ లారెంట్ ని కల్సుకోబోతున్నట్లుగా రాశారు. నాదొక చిన్న రిక్వెస్ట్. నామిసెన్ లారెంట్  కుట్టే డ్రస్ కోసం ఆరేండ్ల నుంచి వెయిట్ చేస్తోంది. మరో పడేండ్లు పోయినా ఆ అదృష్టం దొరికే అవకాశం లేక ఎదురు చూస్తోంది నిరాశగా మీ ఇన్ ప్లుయన్స్ ఉపయోగించి ఒక్కటి అంటే ఒక్కటి డ్రస్ వచ్చేలా చూడగలరా.....?"

    ఆలోచించుకొనే టైమ్ లేదు.

    "ఓకే......అలాగే" అన్నాడు.

    "అయితే ఇదుగోండి మెజర్మెంట్స్" అంటూ ఓస్లిప్ అందించాడు.

    అవసరం తనది కాకపోతే ఈడ్చి తన్నేవాడే జోన్స్ ని" నా వీసా ఏమైంది జోన్స్....టిక్కెట్ కూడా రిజర్వు అయిపోయింది....." కంగారు పడిపోతున్నాడు మనోహర్.

    "సారీ మనోహర్......రేపు మధ్యాహ్నానికి కాని పూర్తికాదు మీ వీసా......"

    "ఆ మాట విని నిశ్చేష్టుడయి పోయాడు. ప్లాన్ అంతా తల క్రిందులైపోయింది. ఎంతో ఆశతో వచ్చాడు తన ప్రయాణం ఏ అడ్డంకులు లేకుండా సాగిపోతోందని.

    "ఎందుకని మిస్టర్ జోన్స్?" ఒక్క నిముషం ఆలస్యం కూడా ఒక్కొక్కసారి గొప్ప అవకాశాల్ని చేజారిపోయేలా చేస్తుంది.

    "ఈ మధ్య మాదకద్రవ్యాల వ్యాపారం జోరుగా సాగుతోందని మా గవర్నమెంట్ వర్రీ అవుతోంది. పూర్తిగా పరిశీలన జరిపిగాని వీసా లివ్వోద్దని కండీషన్ పెట్టింది అందుకని......"

    "నేను ప్యారిస్ వెళ్ళటం ఇదే మొదటిసారి కాదు. నా ప్రొఫెషన్ ఏమిటోకూడా మీకు బాగా తెలుసు. మీరు చెప్పలేకపోయారా?"

    "నేను చెప్పబట్టే రేపటికన్నా  సిద్దం అవుతోంది.

    "ఎవరు సంతకం పెట్టాలింకా?"

    "థామస్......"

    "కమాన్......నేనాయాన్ని రిక్వెస్ట్ చేస్తాను....."అంటూ లేచాడు సీట్లోంచి.

    జోన్స్ కారు మనోహర్ చేతిలో వుంది. కారు ఎప్పుడో ఎనభై కిలో మీటర్లు స్పీడ్ దాటిపోయింది. ఆ రాష్ డ్రైవింగ్ కి జోన్స్ కి చెమట పట్టేస్తోంది.


                                 *    *    *

    చేతిలో డబ్బుంటే చాలు పారిస్ లో దొరకని అనుభవం, సుఖం లేదు.

 Previous Page Next Page