"నీలూ! నువ్వు ప్రేమిస్తున్న రవిచంద్ర...నువ్వు అనుకున్నట్టు సంస్కారవంతుడు కాదమ్మా"
"ఆంటీ...నా రవిచంద్ర గురించి యిక ఒక్కమాట కూడా చెడుగా చెప్పకండి. నేను నమ్మను. ఇప్పటివరకు మీమీద వున్న గౌరవం ఏమయిపోతుందోనని భయంగా వుంది..." నీలిమ కళ్ళు ఎర్రబడ్డాయి.
"నిజం ఎప్పుడూ నిష్టూరంగానే వుంటుందమ్మా"
ఆమె ఇంకేమి చెబుతుందోనన్న ఖంగారు ఒక వేపు, చెడువిని తను తట్టుకోగలనా అన్న భయం మరోవేపు ఆమెను ఆందోళనకు గురిచేశాయి.
"రవిచంద్రకు యిదివరకే పెళ్ళి అయ్యింది తెలుసా"
నెత్తిన పిడుగు పడినట్టు ఒక్కసారిగా అదిరిపడింది నీలిమ.
"పోనీ అతని వయసు ఎంతో తెలుసా?"
మరేం వినవస్తుందోనన్న భయంతో చెవులు మూసుకుంది.
"అతనికి నలభయ్ ఏళ్ళు. పెళ్ళీడుకొచ్చిన కూతురుందంటే నమ్ముతావా?"
"అబద్ధం ఆంటీ, మీరు చెప్పినవన్నీ శుద్ధ అబద్ధం అని ఒక్కముక్క చెప్పండి...అబద్ధం కదూ ఆంటీ. మీరు జోక్ చేయడానికన్నారు కదూ?"
నీలిమ ఎక్కి ఎక్కి ఏడుస్తూ అంది.
"పిచ్చిపిల్లా! నీ జీవితంలో అతను ఆటలాడాడని నేను కూడా జోక్ చేస్తున్నా ననుకున్నావా? ఇదిగో యిది చూడు..." అంటూ రవిచంద్రతోపాటు అతని భార్య పిల్లలు వున్న ఫోటో నీలిమ చేతిలో పెట్టింది.
"ఆంటీ..."
నీలూ ఆ ఫోటో చూసి బావురుమంది.
హాస్టల్ వరండాలో అర్దరాత్రి జరుగుతున్న హడావుడికి మిగిలిన గదులలో వున్న వాళ్ళంతా లైట్లువేసి కంగారుగా బయటకు వచ్చారు.
ఏదో జరిగింది. వార్డెన్ రాక్షసిలా నీలూని నానా ప్రశ్నలతో, సంజాయిషీలతో వేధించుకు తింటున్నదని మాత్రం వాళ్ళు అర్ధం చేసుకున్నారు.
పరిస్థితి గమనించిన వార్డెన్ "మీరంతా యెందుకు బయటకు వచ్చారు? మర్యాదగా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళండి" మందలింపుగా అంది.
అంతా మంత్రముగ్ధల్లా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు.
"నీలూ యిటు రామ్మా..."
అంటూ భుజంమీద చేయి వేసింది.
"ఇది జీవితం. కలకాదు. కథ అంతకంటే కాదు. ఆడపిల్ల జీవితం వడ్డించిన విస్తరిలాంటిది. అందరూ ఎంగిలి చేయాలనే చూస్తారు...ఒంటరిగా ఉంటే నిన్ను ఆలోచనలు వేధిస్తాయి. ఆవేశంతో నువ్వేమయినా చేసుకోవచ్చు. ఇక నుంచి నువ్వు నాతోపాటే నా గదిలో వుండమ్మా..." అంటూ నీలుని వెంటబెట్టుకుని తీసుకువెళ్ళింది వార్డెన్ శాంతిశ్రీ.
* * *
డాబర్ మన్ డాగ్ అరుపులు బిగ్గరగా వినిపించడంతో ఠక్కున మెలకువ వచ్చింది అతనికి.
కళ్ళు ములుముకుంటూ టేబుల్ పైనున్న అలారం పీస్ వైపు చూశాడు.
పన్నెండు గంటలు...
ఇంత అర్దరాత్రివేళ కుక్క ఆరవడమేమిటి అనుకున్నాడతను.
అయినా గేటుదగ్గిర గూర్ఖావుండాలికదా...ఏం చేస్తున్నాడో...!
ఆగకుండా మొరుగుతూనే వుందది...
లైటు వేయడానికి బెడ్ పై నుంచి కిందకు దిగబోయేటంతలో 'కుయ్యో'మని పెద్దగా అరిచి ఉన్నట్టుండి ఒక్కసారిగా దాని అరుపులు ఆగిపోయాయి...
ఒక నిమిషం అలానే వుండిపోయాడు.
తరువాత అంతా నిశ్శబ్దం__
ఏం జరిగిందో అర్ధంకాలేదు అతనికి.
గేటు దగ్గిర గుర్ఖా__గేటులోపల ఆల్సేషియన్__
రాత్రిపూట ఏ ఎలుకనో, పిల్లినో చూసి వుంటుంది. అది__సహజమయిన వైరం వుండడంతో అరిచివుంటుంది. నిద్రలో జోగుతున్న గుర్ఖా విసుక్కుంటూ దాని దగ్గిరకు వెళ్ళి రెండు అంటించివుంటాడు.