పెళ్ళికాగానే రవణ యింర తనకి అతనే రక్షకుడు, నాధుడు అనుకుంది. కాని క్రమంగా అతని అసహాయత్వం చూసి, క్రమేపీ అతడే తన వాడైనట్లు అతన్ని తనే రక్షించవలసినట్లు, ధైర్య మివ్వవలసినట్లు తోచింది. అతని హీనత్వమూ, నమ్రత, యాచకబుద్ధీ, యితరులలో చూస్తే ఆమెకి పరమ అసహ్యం కలిగివుండును. కాని తన భర్తలో కనబడితే ఆమెకి విచారమూ, దయా, ప్రేమా కలిగాయి. అతని బాధ, అసహాయత్వం చూసి, తన భర్తని చూసి ఆగలేక, మెల్లిగా వొచ్చి అతని పక్కన నుంచుని,
"అన్నానికి లేవరూ?" అంది.
ఆ కంఠం వినేప్పటికి గోపాల్రావు తలయెత్తి చూశాడు. బైట లాంతరులోంచి వొచ్చే వెలుతురులో పసుపుపచ్చ కాళ్ళు, నీలం కుచ్చెళ్ళూ కనపడ్డాయి. పెద్ద సిగ్గొచ్చింది మాట్లాడకుండా తల ముడుచుకొని పడుకున్నాడు.
"నేను పిలుస్తున్నానన్నా రారూ?"
అతని వ్యసనమూ, ఆకలీ, బాధా అన్నీపోయి పెద్ద సంతోషం వొకటి వచ్చింది.
"నేనింకా అన్నం తినలేదు" - అంది మళ్ళీ.
ఆ నిముషాలు యింకా దీర్ఘం కావాలనిపిస్తోంది. తననించి సిగ్గు పడే యీ భర్తని చూసి; రవణకి జాలి యెక్కువైంది. ధైర్యమెక్కువయింది.
"మీరన్నంతిన్నదాకా నేను తినను."
అతని మెడమీద ఒక వేడినీళ్ళచుక్క పడ్డది.
"వెళ్ళు, వొస్తాను"
విస్తట్లో, అప్పుడే వేగిన రెండు వొడియాలున్నాయి, అన్నంతింటో తల్లితో- అతను "నేనింకా యీ యింటో వుండను. ముష్టడుక్కుని బతుకుతానుగాని, యీ నీచపు బతుకు బతకను" అన్నాడు.
"ఈ రెండేళ్ళూ అజ్ఞాతవాసంగా కానీ నాయనా, పూర్వజన్మంలో యేం పాపం చూసుకున్నామో వీళ్ళ చేతుల్లో పడ్డాము. నాకు యీ చాకిరీ యేమిటి చెప్పు,
మొగపిల్లవాణ్ణిచ్చుకుని పైగా వంట చాకిరీ! నా చుట్టాలా పక్కాలా!"
"ఆ పుస్తకం చూడు. దాని ఖరీదు యిరవై రూపాయలు యెట్టా యిచ్చుకోను? రేపెట్లా కాలేజికి పోను!"
కళ్ళంబడి నీళ్ళు కారాయి. అన్నం తినలేక పోయినాడు.
రవణకి వెంకన్న పంతులు మీద చాలా కోపమొచ్చింది. ఆయన మొహం చూడడమూ, ఆయనకి పనులు చెయ్యడమూ కష్టమనిపించింది. కాని తను భర్త పక్షం వహించిందని అనుకుంటారనే సిగ్గువల్ల, పనులు చేసింది కాని. యెంత ప్రయత్నించినా సరిగా సంతోషంతో మాట్లాడలేకపోయింది. మర్నాడు మధ్యాహ్నం గోపాలరావు యెవరినో,