Previous Page Next Page 
అంకితం పేజి 23


    టి.వి.లో లాయర్ - బొటనవేల్తో, మిగతా వేళ్ళనీ రాస్తున్నాడు. రాజకీయ నాయకుణ్ణి ప్రశ్నల్తో వేధిస్తున్నాడు. మొహం గుర్తులేదు గానీ, రిక్షాలో సుమద్యుతి పక్కన కూర్చున్న వ్యక్తి అలాగే చేయటం గుర్తుంది.

    నా గుండె వేగం నాకే తెలుస్తోంది.

    పిడికిళ్ళు గట్టిగా బిగించి కన్నార్పకుండా చూస్తున్నాను. వెనుక నుంచి వచ్చిన అరుంధతి పలకరించబోతోంది "ష్......" అన్నాను. ఆమె అయోమయంగా నావైపూ, టి.వి. వైపూ చూడసాగింది.

    టి.వి.లో ప్రోగ్రాం అయిపోయింది. చివర టైటిల్స్ మొదలయ్యాయి. ఒక్కొక్కటైటిలూ పైకి వెళ్ళిపోతోంది.

    నా మొహంలోకి రక్తం జివ్వున జిమ్ముతోంది.

    ఏంకర్ పెర్సన్......!

    టైటిల్ చదువుతూంటే నాకు స్పృహ తప్పుతుందేమో అనిపించింది. టి.వి. స్క్రీన్ మీద చిన్న చిన్న అక్షరాలు ఫేడిన్ అవుతున్నాయి. ఒక్కొక్క అక్షరాన్నే చదువుతూంటే ఆనందంతో నా శరీరం వణికింది. తెరమీద ఇప్పుడు పూర్తిపేరు వచ్చి నిలిచింది.

    "కృ......పా......నం........ద్"

   
                                                   10


    గెలుపు- వేళ్ళమధ్య నుంచి జారిపోవచ్చు.

    ఓటమి మాత్రం - చేతి రేఖలమధ్య స్థిరంగా వుంటుంది.

    కృష్టి ఒక్కటే దాన్ని స్థానభ్రంశం కావించగలదు.



                         *    *    *

    నేనూ, జాన్ కలిసి ఆ ఇంటిని అయిదునిముషాల్లో పట్టుకోగలిగాము హైద్రాబాద్ లోని ఖరీదయిన లొకాలిటీలో ఒక ఇల్లు అది.

    కృపానంద్ ది!

    గత పదిరోజుల్లో దాదాపు అయిదువేల కిలోమీటర్లు ప్రయాణంచేసి వుంటానేమో! అయినా ఆ అలసట అంతగా తెలియటంలేదు. కష్టానికి ఫలితం దొరకబోతుందన్న తృప్తి......అలసటని పోగొడుతోంది!

    టి.వి. ఆఫీసులో కృపానంద్ ఇంటి చిరునామా దొరకటం పెద్ద కష్టంకాలేదు. అయితే కృపానంద్ -ఏదో ప్రోగ్రాం  నిమిత్తమై యాదగిరి గుట్ట వెళ్ళాడనీ, పదిరోజులవరకూ రాడనీ తెలిసింది. అది మాకు అంత బాధ కలిగించలేదు. నాక్కావల్సింది కృపానంద్ కాదు. సుమద్యుతి  మాత్రమే! 'ఆమె  ఒప్పుకుంటే ఈ లోపులో మిగతా ఏర్పాట్లు చేసుకోవచ్చు' అన్న ఆశ నాది........ఆశకన్నా గొప్ప తృప్తి ఏముంది?

    కృపానంద్ ప్లాట్ నెంబర్ నూట నలభై ఎనిమిది రోడ్డుప్రక్కకారాపి, ఇంటి నెంబర్ అడిగాడు...... జాన్. ఎటు వెళ్ళాలో చేత్తో చూపించాడు ఆ వ్యక్తి. కారుని ఆ దిశగా పోనిచ్చాడు. రోడ్డుకి కుడివైపుగా వున్న వీధి అది. 151....... 150....149.......148.

    దొరికింది..........!!!

    నా బి.పి. పెరిగింది. టెన్షన్, ఆతృతలాటివి మనకి వుండవనుకుంటాము. ఒకవేళ ఉన్నా, వాటిని సప్రెస్ చేసుకుంటాము. బుడగలోంచి గాలి బయటకు వచ్చినట్టు అవి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంటాయి. ఒక స్థాయిలో మనని ఓడించి, బయటపడతాము.

    ఆ ఇంటి ముందున్న నెంబర్ ప్లేట్ చూడగానే నాకు కలిగిన అలాంటిదే! ఆ స్థితిలోనే, వణుకుతున్న కాళ్ళతో ఇంటి గేటు దగ్గరకు వెళ్ళాను. నవ్వుతూ పరిహసించింది తాళం!

    గేటుకి తాళంవేసి వుంది. లోపలికి చూసాను. లోపల సింహద్వారానికి కూడా తాళంవేసి వుంది. కృపానంద్ బహుశా భార్యతో కలిసి వెళ్ళి వుంటాడు.

    అంటే- పదిరోజులవరకూ రాడు!!!

    నాకీసారి దుఃఖం రాలేదు. నిస్సత్తువ కూడా ఆవరించలేదు. ఆస్పత్రిలో..... అంకిత్ శరీరం క్రమక్రమంగా నిర్వీర్యం అయిపోతున్నాటు ఒక దృశ్యం  కళ్ళముందు కదలాడింది. ఒక ఫిల్మ్  నెగిటివ్ కాలిపోతున్న భావన.

    చివరికి మిగిలేది అదే!

    హైద్రాబాద్ నుంచి హాస్పిటల్ ఫోన్ చేసాను. మృణాళిని ఎత్తింది.

    "మీరు వెంటనే బయల్దేరి రండి."

    "అంకిత్ తల్లి - తండ్రి దొరికారా?" అని అడక్కుండా.....ఆమె మాట అలా అనేసరికి కంగారుపడ్డాను....... "ఏమైంది?"

    "మీరొచ్చాక చెప్తాను...... త్వరగా రండి" ఫోన్ పెట్టేసింది.

    నాకంతా అయోమయంగా అనిపించింది. ఏమై వుంటుంది.

    అంకిత్ మళ్ళీ ఆత్మహత్యకు పాల్పడి వుంటాడా? లేక పారిపోయి వుంటాడా, అదీగాక ఆ మెషిన్  పని చేయటం ఆ.......గిపోయి వుంటుందా?

    ఎయిర్ పోర్ట్ కి ఫోన్ చేసాను. అదృష్టవశాత్తు టిక్కెట్ దొరికింది. వెంటనే బయలుదేరాను.

    ఆ ఆర్థికస్థితిలో లోటుని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాను. అంకిత్ డయాలిసిస్ కి ఈ కొద్దిరోజుల్లోనే లక్షదాకా  ఖర్చయింది. ఇంక ఎంత వుతుందో తెలీదు. ఇల్లు అమ్మేయాలన్న ఆలోచన కూడా వుంది. ఆ ప్రసక్తి మా భార్యభర్తలమధ్య వచ్చింది కూడా!

    ఆరోగ్యం 'ఖరీదు' ఎంతో ఇప్పుడు తెలుస్తోంది నాకు.

    ........ఇటువంటి ఆలోచన్లతోనే వైజాగ్ చేరుకున్నాను.

    కారు హాస్పిటల్ లో ప్రవేశించేదాకా నా ప్రాణాలు అరచేతిలో వున్నాయి.

    దిగగానే రాకెట్ లా పరుగెత్తాను. గబగబా పరుగెత్తి డయాలిసిస్ వార్డు తలుపు దగ్గరే ఆగిపోయాను. అంతా నిశ్శబ్దంగా వుంది. పెద్ద ప్రమాదం తర్వాత ఏర్పడే వాతావరణం. నా కాళ్ళు ముందుకు పడలేరు.

    గుండె గుప్పిట్లో పెట్టుకుని లోపలికి అడుగుపెట్టాను.

    అంకిత్ బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఒక్కసారిగా నా మనసు కుదుటపడింది. అదే క్షణం....... నన్ను అంతగా భయపెట్టినందుకు మృణాళిని మీద కోపం కూడా వచ్చింది. దగ్గరికి నడిచి ప్రక్కన కూర్చున్నాను. క్షణం క్రితంవరకూ లేడేమో అన్న అనుమానం పటాపంచలవగానే అంతులేని ఆత్మీయత  పుట్టుకొచ్చింది. నిద్రపోతున్నవాడిని కొద్దిగా లేవనెత్తి నా గుండెలకదుముకుని తలపై ముద్దు పెట్టుకున్నాను. తిరిగి పడుకోబెట్టి, లేచి మృణాళిని గదిలోకి నడిచాను.

    నన్ను చూడగానే, "రండి!" అంటూ సర్దుకు కూర్చుంది. ఆమె ఏదో  దీర్ఘాలోచనలో వున్నట్టు కూర్చుని వుంది.

    ఎదురుగా కూర్చుని "ఏం జరిగింది?" అనడిగాను......కాస్త కోపంగా.

    ఒక్క క్షణం తలెత్తి నా కళ్ళలోకి సానుభూతి (?) గా చూసింది. నాకేమీ అర్థంకాలేదు. "మృణాళినీ, ఏం జరిగిందో చెప్పు. ఏదయినా జరగనీ, నా బిడ్డ మాత్రం క్షేమంగా వున్నాడు. ప్రాణాలతో ఉన్నాడు. అంతకుమించి ఇంకేమైనా వినడానికి నేను సిద్ధమే!" అన్నాను స్థిరంగా చూస్తూ.

    "అంకిత్ లో సినిక్ లక్షణాలు కనిపిస్తున్నాయి" తలదించుకుని చెప్పింది క్లుప్తంగా!

    నా చేతిలోంచి పేపర్ వెయిట్ జారిపడి పెద్ద శబ్దం చేసింది. ఉలిక్కిపడ్డాను. అయోమయంగా చూసానామెవంక.

    ఆమె చెప్పసాగింది. "అంకిత్ ఈ రోజు పూర్తి వెర్రివాడిలా ప్రవర్తించాడు. ట్యూబ్ లన్నీ తెంపేసి, మిషన్ ను పడేసి, వార్డు వార్డంతా ఒక్కటి చేశాడు. అడ్డుకోబోయిన వార్డు బోయ్ తలమీద గ్లూకోజ్ స్టాండ్ తో కొట్టి గాయపరిచాడు. ఇంజక్షన్ చేయడానికి వెళ్ళిన నర్స్ చేతిలోంచి సిరెంజ్ లాక్కుని ఆమె చేతిమీద పొడిచాడు......"

    ఒక చిన్న చలి తాలూకు వణుకు నా వెన్నుపూస చివర మొదలై క్రమక్రమంగా  శరీరమంతా ఆక్రమించుకొని ఐసులో పెట్టినట్టు.......నాలో సన్నగా  మొదలయిన వణుకు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. ఆమె చెబుతూనే వుంది...... "హాస్పిటల్ స్టాఫ్ ఎవరూ అడ్డుకోలేకపోయారు. నేను డ్యూటీలో అడుగుపెట్టేసరికి అంకిత్ హాస్పిటలంతా పరిగెత్తుతూ ఎవరికీ దొరక్కుండా నానా హంగామా చేసాడు. అందరూ ఇక అంకిత్ పిచ్చి పట్టిందనే అనుకుంటున్నారు. చివరికి మత్తు ఇంజెక్షన్ చేయాల్సి వచ్చింది."

    "పిచ్చా? అంకిత్ కి మతి స్థిరం తప్పడం నిజమా?" అరిచినట్టుగా టేబుల్ మీద పిడికిలితో గుద్దుతూ అన్నాను.

    "అవును అంకిత్ ఇక ఆ టెన్షన్ ఎన్నాళ్ళో భరించలేడు. తనని రక్షించడానికి మందులూ, డాక్టర్లూ, మీరు......ఎవరూ ఏమీ ఉపయోగపడరని తెల్సుకున్నాడు. ఇక అతన్ని ఎంతోకాలం ఆ స్థితిలో వుంచలేం. టెన్షన్ తట్టుకోలేక అతని తలలో నరాలు చిట్లిపోవచ్చు. లేదా మతిభ్రమించొచ్చు."

    ఎందుకు...... ఎందుకు మృణాళినీ నా మీద ఇంత కక్ష నీకు? బాణాల్లాంటి మాటల్ని ణా గుండెలోకి కసిగా ఎందుకు దింపుతావు? ణా బిడ్డలో కలిగే మార్పుల్ని ముందే చెప్పి, నన్నూ ఒక సైకిక్ పేషెంట్ గా ఎందుకు మారుస్తావు? 

    నా మనసులో భావాలు చదివినట్టుగా  తిరిగి అంది. "నన్ను క్షమించండి. నిజానికి ఈ విషయాలు డాక్టర్ మహారధి చెప్పకూడదని ఆర్డర్ యిచ్చారు. కానీ, ఒక స్నేహితురాలిగా, జరగబోయే పరిణామాలు ముందే చెప్పి హెచ్చరించాలని మీకిదంతా చెప్పాల్సి వచ్చింది. మహారధికి తెలియకూడదని ఫోన్లో క్లుప్తంగా చెప్పాను. మీ టెన్షన్ నేను అర్థంచేసుకోగలను. సారీ......."

    "ఎలా..... ఎలా మృణాళినీ..... ఎలా ....... రక్షించుకునేది?" ఇరిటేటింగ్ గా అన్నాను. ఆమె మాటలు పూర్తిగా వినకుండా........

    "నా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయించి......"క్లుప్తంగా అంది.

    నాకు ముందామె ఏమన్నదో అర్థంకాలేదు. ప్రశార్థకంగా తలెత్తాను.

    "మీకు ఫోన్ చేసి పెట్టెయ్యగానే నాకీ ఆలోచన వచ్చింది. వెంటనే క్షణాలమీద అన్ని పరీక్షలూ చేయించాను. అదృష్టం....! అన్నీ సరీగ్గా అంకిత్ పాధో ఫిజియాలజ్ కి సరిపోయాయి. ఎప్పుడోగానీ ఇలా అంతా కరెక్ట్ గా సరిపోయే డోనార్ దొరకదు. నాకే ఆశ్చర్యం వేసింది. అందుకే....." అని, ఆగి, ఆమె స్థిరంగా అంది "నా కిడ్నీ ఇస్తాను."

    ఒక చల్లటి పిల్ల తెమ్మర అలవోకగా నన్ను స్పృశించి వెళ్ళింది. ఒక అద్భుతమయిన భావన నా గుండెనిండా ఆక్రమించుకుంది. నమస్కరించడం అన్న చిన్నపని చేయలేక...... అంతకన్నా పెద్దగా కృతజ్ఞతా  భావాన్ని ప్రదర్శించుకునే మార్గం తెలీక...... నా కళ్ళు సజలాలయ్యాయి.

    'ఓ స్త్రీ మూర్తీ!.....' మనసులో ఆర్ద్రంగా అనుకున్నాను. అదో హృదయ ప్రకంపనం...... 'విశ్వాన్ని సాకే నీ చేతులతో నా కొడుకుని స్పృశించు చాలు. వాడిలో పనిచేయక ఆగిపోయిన అవయవాలన్నీ తిరిగి చైతన్యం నింపుకుని సంపూర్ణంగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తాయి' నిశ్శబ్దంగా నినదించాను.

    నా మౌనాన్ని మరోలా అర్థం చేసుకుని ఆమె కొనసాగించింది. "ఇంకేమీ ఆలోచించకండి, నాకెలాగూ పిల్లలు కలిగే యోగం లేదు. అదీగాక ఏ బాదరబందీలేదు. శాడిస్ట్ భర్తని దూరం చేసుకుని చాలా స్వేచ్చగా వున్నాను. ఎవర్నీ సంప్రదించాల్సిన పనిలేదు. ఎవరికోసమూ వెదకాల్సిన అగత్యమూ లేదు. అన్వేషణ మానుకోండి. రెండు మూడు రోజుల్లోనే ఆపరేషన్ కి అన్ని ఏర్పాట్లూ చేయిస్తాను. దాని గురించి ఈ రోజే డాక్టర్ మహారధితో మాట్లాడతాను......." సంతోషంగా సీట్లో వెనక్కి  వాలి ఏదో స్వప్నలోకాన్ని తొంగిచూస్తున్నట్టు తిరిగి చెప్పడం మొదలు పెట్టింది. "ఇక నాకే చింతా వుండదు. ఒక మంచి పని చేశానన్న తృప్తితో జీవితాంతం హాయిగా గడిపేస్తాను" అంటూ హఠాత్తుగా నా వేపు తలతిప్పి, "మీకీ విషయం తెలుసా, నా కడుపులోనే చివరి ఊపిరి విడిచేసిన బిడ్డపుట్టి వుంటే, ఈపాటికి అంకిత్ వయసు వుండి వుండేది" అంది.   

 Previous Page Next Page