Previous Page Next Page 
అంకితం పేజి 22


    పోయిన సంవత్సరం నా పుట్టినరోజు ఎలా జరిగిందో నాకు బాగా గుర్తు. నా ఆనందానికి అది పరాకాష్ట! సాధారణంగా పుట్టిన రోజులకి నేను ఎక్కువ విలువ ఇవ్వను. ప్రొద్దున్నే మామూలుగా ఆఫీసుకి వెళ్ళిపోయాను.

    -రాత్రి ఎనిమిది అవుతుందప్పుడు.

    పోర్టికోలో కారాపి డోర్ తీసుకుని క్రిందికి దిగాను. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది.

    నా కనుబొమలు ఆశ్చర్యంతో పైకి లేచాయి! కాలింగ్ బెల్ నొక్కాను. లోపల బెల్ మ్రోగుతున్న శబ్దం వినిపించింది. అయినా  అలికిడి లేదు.

    నెమ్మదిగా సింహద్వారం దగ్గరికి ప్రవేశించాను, అది తీసే వుంది.

    లోపలంతా చీకటిగా వుంది. పోర్టికోలో లైటు వెలుగుతోందంటే కరెంట్ పోలేదన్నమాట. మరి లోపల ఎందుకు చీకటిగా వున్నదో నాకు అర్థంకాలేదు. ఒక ఫ్యూజ్ పోయిందేమో అనుకున్నాను.

    కానీ - ఇన్వర్టర్ వుందిగా!

    తల తిప్పి చూశాను. ఒక మూల ష్యూస్  స్టాండ్ లో అంకిత్, అరుంధతిల చెప్పులు యాథాస్థానంలో వున్నాయి. అంటే - వాళ్ళు ఇంట్లోనే వున్నారన్నమాట. మరి కారు లోపలి ప్రవేశించిన శబ్దం వినగానే ఎప్పుడూ 'డాడీ' అంటూ పరుగెత్తుకొచ్చి చుట్టేసే అంకిత్ ౦ ఇవ్వాళ ఏమయిపోయాడు?

    నాకు భయం వేసింది. ఒక శీతలపవనమేదో మెల్లమెల్లగా నా వెన్నుని వణికించసాగింది.

    తలుపు తీసేవుంది. బయట వెలుగుకి కాంట్రాస్ట్ వా లోపలంతా గాఢమైన చీకటి. కళ్ళు చిట్లించి చూస్తూ లోపలికి నడిచాను. పోర్టికోలోని లైట్ల వెలుగు సన్నగా లోపలికి పడుతోంది. హాలూ, కిచెనూ, అంకిత్, బెడ్ రూమ్ అన్నీ ఖాళీగా  వున్నాయి. నాలో సన్నగా కంపన ప్రారంభమైంది. నా గుండెచేసే సవ్వడి ఆ గదినిండా మార్మోగిపోతున్న భావన. ఒకవేళ ఏ బందిపోట్లో అందర్నీ కట్టేసి ఇల్లంతా దోచేయలేదు కదా? నా నుదుటిమీద స్వేదం అలుముకొంది. భయపడుతూనే నా బెడ్ రూమ్ లోకి నడిచాను.

    అక్కడ దృశ్యం అకారణంగా నాలో వణుకు పుట్టించింది. అక్కడ గది మధ్యలో టేబుల్ మీద ఒక చిన్న కొవ్వొత్తి వెలుగుతోంది. చాలా సన్నగా వుందావెలుగు. ఆశ్చర్యంగా కొవ్వొత్తి వంక చూసాను.

    అంతే. నా వెనుక పెద్ద శబ్ధమైంది.

    ఉలిక్కిపడి వెనుదిరిగేలోపే ఇల్లంతా లైట్ల వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగును ఒక్కసారిగా చూడలేక కళ్ళు గట్టిగా మూసుకుని మెల్ల మెల్లగా తెరిచాను.

    ఎదురుగా అరుంధతి నవ్వుతోంది. అంకిత్, చప్పట్లు కొట్టాడు. చుట్టూ చూసాను. గదంతా రంగురంగుల కాగితాలతో ఆలంకరించి వుంది.

    అప్పుడర్థమయింది నాకు. నా వెనక ప్రేలింది ఏమిటో! బెలూన్!! వెంటనే గుర్తొచ్చింది నాకు. ఆ రోజు నా బర్త్ డే అని. నా ఆలోచనని నిజంచేస్తూ అంకిత్  పరుగెత్తుకుంటూ వచ్చి, హ్యాపీ బర్త్ డే డాడీ" అన్నాడు.

    నేను వంగి బుగ్గమీద ముద్దుపెట్టుకుంటూ "థాంక్యూ డియర్. నా కసలు గుర్తేలేదు" అన్నాను క్షమాపణగా.

    "ఎందుకు గుర్తుంటుంది? మీరీ రోజే పుట్టారుగా?" నవ్వుతూ అంది అరుంధతి. చిన్నగా నవ్వేను.

    నా గుండెదడ అప్పటికి తగ్గింది.

    "మీకు సర్ ప్రైజ్ ఇద్దామని పాపం అంకిత్ ఉదయం నుండి ఒక్కడే కష్టపడి ఇదంతా తయారుచేసాడు తెలుసా?" అంది అరుంధతి పైకప్పుకి, కిటికీలకి రిబ్బన్లు చూపిస్తూ.

    "నిజామా?!" బాగా థ్రిల్ అయినట్టు మొహంపెట్టి, అంకిత్ వైపు చూసాను.

    "యస్ డాడీ! మీకు నచ్చిందా?" అన్నాడు అంకిత్ గర్వంగా, వాడి మొహం వెలిగిపోతోంది. నా కోసం అంత కష్టపడిన వాడిమీద ప్రేమ పొంగుకొచ్చింది నాకు. "థాంక్యూ మై సన్!" అందామనుకున్నాను. కానీ అంత చిన్నమాటతో చెప్పటం ఇష్టంలేక మోకాళ్ళు నేలమీద ఆన్చి కూర్చుంటూ రెండు చేతులూ చాచాను. అంకిత్ పరుగెత్తుకుంటూ వచ్చి నా చేతుల్లో వాలిపోయాడు.

    నేను వాడిని గట్టిగా గుండెలకు హత్తుకున్నాను. నా కళ్ళు చెమర్చాయి. ఆనందభాష్పాలతో నా గుండెలోని మాట గొంతులోనే ఆగిపోయింది.

    నా చిన్నారి చిట్టితండ్రికి ప్రేమ తప్ప గొప్పకానుక ఏమివ్వగలను?......

    ఏ.....మి...... ఇవ్వగలను?

    -సిగరెట్ చురుక్కుమనడంతో స్పృహలో కొచ్చాను. యాష్ ట్రేలో పడేసి తిరిగి సర్దుకు పడుకున్నాను.

    అప్పటి సంఘటన గుర్తొచ్చేసరికి నా మనసంతా చేదుగా మారిపోయింది.

    మాదంతా ఒక కుటుంబం........ఒకే కుటుంబం!

    నా బిడ్డ, నేనూ, నా భార్యా- అంతా అందమైన సమిష్టి కుటుంబ సభ్యులం -అప్పుడు!!!

    ఇప్పుడు?

    నా బిడ్డ ఆస్పత్రిలో ఒంటరిగా- జాలిగా.

    భార్య- నా ప్రక్కన కళ్ళు మూసుకుని పడుకుని ఎవరికోసం బాధపడాలో తెలీక, అయోమయంగా-

    నేను- సమస్యల వలయాల మధ్య ఊపిరాడక- పిచ్చివాడిలా,

    .......ఒక పుట్టినరోజుకీ, మరొక పుట్టినరోజుకీ ఎంత తేడా! కాలం ఆడే చదరంగంలో చెదిరిపోయిన పావుల్లా-చెరో మూలా ఒకే పక్కమీద పడుకున్నా- ఎవరి ప్రపంచంలో వారుంటూ.......

    తలత్రిప్పి అరుంధతి వంక చూసాను. ఆమె నన్నే పరిశీలనగా చూస్తోంది. ఎంతసేపటి నుండి నన్ను గమనిస్తోందో తెలీదుగానీ, నేను తనవైపు చూడగానే కళ్ళు వాల్చేసింది.

    "ఇంకా నిద్రపోలేదూ?" అడిగాను.

    "ఊహు-రావడంలేదు."

    నేనామెవేపు తిరిగి మీద చేయి వేసాను. కొద్దిగా దగ్గరగా జరుగుతూ "భయపడుతున్నావా" అన్నాను.

    "అవును! కానీ, ఈ క్షణంలో నాకెందుకో భయం కలగటంలేదు" నా ఛాతీమీద తన మొహాన్ని గట్టిగా అదుముతూ అంది.

    "ఎందుకని?"

    "ఏమో- అయినా  మీరోచ్చేరుగా నాకిక భయంలేదు."

    అప్యాయంగా ఆమె తలమీద ముద్దుపెట్టుకుంటూ "నువ్వెప్పుడూ ఇలాగే నిశ్చితంగా కన్పిస్తే నాకంతకంటే కావలసిందేమీ లేదు. మనకొచ్చిన సమస్యల్ని నువ్విచ్చే ఈ మాత్రం సహకారంతో పూర్తిగా అధిగమించగలననే అనుకుంటున్నాను" అన్నాను.

    "నాకు తెలుసు! మీరేదయినా సాధించగలరని. మృణాళిని చెప్పింది కూడా అదే!"

    "మృణాళినా-తనేం చెప్పింది?" ఆశ్చర్యంగా అడిగాను.

    "మగవాడికి ఆత్మవిశ్వాసం కలిగించేది భార్య చిరునవ్వే అని చెప్పింది. మృణాళిని చాలా మంచిది. నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసిన అద్భుతమైన వ్యక్తిత్వం ఆమెది......." తన్మయంగా చెబుతోంది.

    నేను మనసులోనే మృణాళినికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. "ఇంకా ఏమంది?" అనడిగాను.

    "చాలా చెప్పింది జీవితంలో ఏ సమస్యనయినా అధిగమించాలంటే సహనం ప్రధానమట. సమస్యని త్వరని పరిష్కరించుకోవాలన్న ఆత్రుతలో హేతువు గురించి ఆలోచించకపోవటం, వాస్తవాన్ని ఆకళింపు చేసుకోకపోవటం మూర్ఖత్వమంది. నాకేం కోపం రాలేదు. పైగా గౌరవం కలిగింది. పదిహేనేళ్ళ క్రింద మా అమ్మ నన్ను కాపురానికి పంపిస్తూ చెప్పిన మాటలకన్నా చాలా విలువైన మాటలు చెప్పింది మృణాళిని. అమ్మ కేవలం సంసారాన్నీ పిల్లల్నీ చక్కదిద్దుకోవాలంటే ఏం చేయాలో అది మాత్రమే చెప్పింది. కానీ మృణాళిని.... మనసుల మధ్య  పేరుకుపోతున్న  స్థబ్దతని ఎలా పారద్రోలవచ్చో అర్థమయ్యేలా వివరించింది" అంటూ తన పెదవుల్తో నా పెదవులపై చిన్నగా ముద్దు పెట్టుకుంది.

    ఒక సన్నటి మలయ పవనం నన్ను చుట్టుముట్టినట్టయింది. అది వాంఛకాదు, తదాత్మత! వాంఛలోలేనిది. అనురాగంలో వున్నది. మానసికంగా బాగా అలసిపోయిన మనిషికి పరిపూర్ణమైన శక్తినిచ్చే ప్రక్రియ.

    ఆమెని రమిస్తోంటే. ఏదో రచనలో జాన్ డేవిడ్ వ్రాసిన కవిత గుర్తొచ్చింది.

    మనసు లోపల పొరల్లో.....

    ఆలోచనల రహదారుల్లో.....

    అంతటా నువ్వే-

    హడావుడిలో గుర్తొస్తావు. హడావుడి లేకపోయినా గుర్తొస్తావు.

    పగలు-ఫైలు ముళ్ళు విప్పుతూంటే.......

    ముడులు విప్పుకుంటూన్న రాత్రి తాలూకు జ్ఞాపకాలు.

    రాత్రిళ్ళు.......
   
    మందంగా వెలుగుతూండే బెడ్ లాంప్ వెలుగులో......

    గులాబీరంగు మెత్తిటి పువ్వులాంటి శరీరమేదో కౌగిలిలోంచి మిస్సైన

    ఫీలింగ్.....

    అసలు వీటన్నిటినీ మించి-

    అటూ ఇటూ తిరిగే నీ పెద్ద పెద్ద కళ్ళు-

    "స్టుపిడ్-స్వీట్ స్టుపిడ్" అని విసుక్కుంటూ-

    మళ్ళీ వాటినే తల్చుకుంటూ-

    ఒక పరఫెక్ట్ కంపేనియన్, చిటికెన వేలు చివర్ని వదిలి ఎటోవెళ్ళి- ఇంకారాదేం......? అనిపించేలాటి వేదనలా

    నీరెండ ఉదయాల్లోనూ, నీలిరంగు సాయంత్రాల్లోనూ అంతటా విషాదమే! అప్పుడప్పుడు నీ అల్లరి కట్టలు తెగిన హుషారూ అంతా గుర్తొచ్చి లీలగా నవ్వొస్తుందనుకో!కానీ అదంతా -కరెంట్ ఓ క్షణం వచ్చిపోయినట్టు..... క్షణికమే.......వుండనా మరి.

    ఈ నా అక్షరాలు పారిజాతాలై- ఆ పరిమళం నిన్ను చుట్టుముట్టి మన దగ్గిరతనపు     Body Odouని గుర్తు తెస్తుందని ఆశిస్తూ-


                         *    *    *

    ఉదయం నిద్ర లేచేసరికి పక్కన అరుంధతి లేదు, మామూలుగా అయితే ఆమెకన్నా ముందే నేను నిద్రలేస్తూంటాను. అప్పుడంటే జాగింగ్ చేసే అలవాటు. అంకిత్ లేకపోవటంతో నేనూ బీచ్ కి వెళ్ళటం మానేసాను.

    హాల్లో టి.వి. మోత వినపడుతూంది. ఎవరో 'బాబా' శిష్యురాండ్ర వెనక కూర్చుని వుండగా, ముందు జనాలకి ఆథ్యాత్మిక  చింతన గురించి బోధిస్తున్నాడు టి.వి.లో.

    బెడ్ రూమ్ లోంచి బయట కోస్తూండగా, పక్క బల్లమీద చిన కాగితం కనపడింది. అరుంధతి చేతివ్రాత.

    "సుప్రభాతం! ఈ రోజు మీ మనసు ప్రశాంతంగా మారిందనే అనుకుంటున్నాను. రాత్రి నేను మీకు చెప్పిన విషయాల్లో ఒక్కటి మాత్రం కావాలనే  దాచాను! మృణాళిని నాకు చెప్పిన విషయాల్లో అతి ముఖ్యమైనది అది. 'భర్త బాధతో వున్నప్పుడు సేదతీర్చగల ఆయుధం స్త్రీ దగ్గిర ఒక్కటే వున్నది...... రోమాన్స్' అని నిజమే అనుకుంటాను కదూ!...... మీ అరుంధతి."

    అప్రయత్నంగా నా కళ్ళు తడి అయ్యాయి. కారణం తెలీదు. ఆ తడి కళ్ళతోనే ముందు గదిలోకి వచ్చాను. టి.వి.లో ప్రోగ్రాం మారిపోయింది. ఎవరో నల్లకోటు వేసుకున్న వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిని ప్రశ్నల్తో క్రాస్ చేస్తున్నాడు. ఆ ఛానల్ లో చాలా పేరొందిన కార్యక్రమం అది.

    కళ్ళతడి మసకలో ఆ రూపం అస్పష్టంగా కనపడినా- ఆ భంగిమ నాలో ఏదో కెరటాన్ని ఒక్క  ఉదుటున కదిపింది.

    పది సంవత్సరాల క్రితం సుమస్యుతి పెళ్ళి చూపుల సమయంలో ఆ పెళ్ళికొడుకు నన్ను చూసి - ఇరిటేటింగ్ గా పెట్టిన వేళ్ళ భంగిమ!

 Previous Page Next Page