Previous Page Next Page 
అంకితం పేజి 24


    నేను గట్టిగా నిట్టూర్పు విడిచాను.

    ఏమివ్వగలను మృణాళినీ నీకు? ఏమీకాని మాకోసం నీ శరీరంలోని ఒక భాగాన్ని మనస్ఫూర్తిగా అందివ్వడాన్ని కూడా వెనుకంజ వేయటం లేదే.........అలాంటి నీకు ఏమిస్తే రుణం తీరుతుంది?

    "బాగా ఆలోచించుకున్నావా మృణాళినీ?" అన్నాను చివరికి.

    "ఇంకేమీ ఆలోచించడానికి లేదు. అంకిత్ బ్రతకటానికి ఇంతకు మించిన అవకాశం కూడా రాదు. దయచేసి కాదనకండి."

    నేను లేచాను. "నీ ఇష్టం మృణాళినీ..... మా జీవితాలు మా ఆలోచనల్లాగే నీ చుట్టూరా పరిభ్రమించడం అదృష్టమేనేమో!" అని, ఆమె దగ్గిర శలవు తీసుకుని బయటకు నడిచాను.

    నాకు చాలా....చాలా హాయిగా అనిపించింది. గాలిలో తేలిపోతున్నట్టుగా వుంది. ఇన్నాళ్ళ నా టెన్షన్ అంతా చేతితో తినేసినట్టు చాలా తేలిగ్గా వుంది.

    అప్పుడే ఆస్పత్రి కారిడార్ లోకి ఆదుర్దాగా అడుగుపెడుతున్న అరుంధతిని చూసి అటుకేసి నడిచాను, ఆనందంగా దగ్గరికి వెళ్ళి రెండు చేతులతో ఆమె చేతులు పట్టుకున్నాను.

    "ఏమిటండీ...... ఏమయింది" విస్తుబోతున్నట్టు చూస్తూ అంది.

    "ఏమీ కాలేదు. ఇక మనం రేపటినుండి ఇలాగే ఆనందంగా వుంటాము" అన్నాను. ఆమె అయోమయంగా చూస్తూ......

    "డైరెక్ట్ గా ఆస్పత్రికి బయల్దేరారని తెలిసి.....నేనింకా ఏదో ప్రమాదం జరిగి వుంటుందని అనుకుంటున్నాను. అసలేమయింది? కాస్త వివరంగా చెప్పండి" విసుక్కుంటూ అంది.

    "మృణాళిని అంకిత్ కోసం కిడ్నీ ఇవ్వబోతోంది" నవ్వుతూ చెప్పాను.

    "నిజం?!" నమ్మలేనట్టు చూసి, నా చేయి పట్టుకుని "నిజమేనా చెప్పండి?' అంది.

    "నిజమే మరో మూడురోజుల్లో మన అంకిత్ మామూలు మనీషావుతాడు."

    అది వినగానే అరుంధతి చిన్నగా నవ్వింది. నేను నవ్వేను. క్రమక్రమంగా మేమిద్దరం పెద్దగా నవ్వేసాం. అది ఆస్పత్రి వరండా అని కూడా గుర్తించకుండా, అలా చిన్నపిల్లలా నవ్వుతూనే వున్నాం అంకిత్ బ్రతకటంకన్నా ఆనందం ఏముంది?

    "అబ్బ. ఎంత గుడ్ న్యూస్ ఇది? వుండండి ఆమెకు థాంక్స్ చెప్పేసి వస్తాను" అంటూ మృణాళిని గదిలోకి పరుగెత్తింది.

    నేను అంకిత్ దగ్గరకు నడిచాను. ప్రక్కన కూర్చుని నిద్రపోతున్న వాడి జుట్టులోకి వేళ్ళు జొనిపి చిన్నగా నిట్టూర్చాను.

    పిచ్చివెధవ! ఎంత హంగామా చేసాడు?....... "ఇక నీకు ఈ మిషన్ నుంచీ, ఆస్పత్రి నుంచీ శాశ్వత విముక్తి లభించబోతోంది" అనుకున్నాను. నా మనసు ఆనందంతో నిండిపోయింది. అయితే....ఆ తృప్తి అంతా కేవలం ఒక్కరోజు మాత్రమే వుంటుందని, నేనాక్షణం అనుకోలేదు.

    ఎందుకంటే..... ఆ రాత్రే మృణాళిని దారుణంగా హత్య చేయబడింది.

   
                        *    *    *

    "మృణాళిని మరణించింది" మహారధి కంఠం అట్నుంచి వినిపించింది.

    గట్టిగా కేక పెట్టాను. నా చేతిలోంచి రిసీవర్ జారిపోయింది.

    నా ఒళ్ళు నా స్వాధీనంలో లేదు. బాగా వణుకుతోంది. నుదురంతా చెమటలు కారిపోతున్నాయి.

    నా కేకకి అరుంధతి పరుగున వచ్చింది.

    నన్ను చూస్తూనే ఆత్రంగా "ఏమయిందండీ..... ఏంటలా వణికిపోతున్నారు?" ఆదుర్దాగా ప్రశ్నిస్తూ నా మీద చేయివేసింది.

    ఆ చేతిని గబుక్కున లాక్కుని గుండెలమీద గుప్పిటలా పట్టుకుని, "మంచి నీళ్ళు" అన్నాను. పరుగెత్తుకెళ్ళి క్షణాల్లో గ్లాసుతో తెచ్చిచ్చింది. అవి త్రాగేసి వెనక్కి వాలాను. క్రమక్రమంగా నా శరీరంలోనూ చూపులోనూ  స్థిరత్వం వచ్చేసింది. అప్పుడు స్ఫురణకొచ్చింది. నేనేం అన్నానో వెంటనే స్ర్పింగ్  లా లేచి 'పద' అన్నాను.

    "ఎక్కడికి?" అయోమయంగా అడిగింది.

    "మృణాళిని చచ్చిపోయింది."

    ఆమె ఎంత షాక్ కు గురయిందో నేను పట్టించుకోలేదు. ఆమె చెయ్యందుకుని బయటికి పరుగుతీశాను.

    మృణాళిని ఇంటికి వెళ్ళేవరకూ ఇద్దరం ఒక్క మాటకూడా మాట్లాడలేదు. ఆమె ఇంటిముందు జనం- ప్రవాహం లాంటి జనం కారాపి జనాన్ని తోసుకుంటూ లోపలికి నడిచాను. నన్ను చూడగానే మహారధి ఎదురొచ్చాడు.

    "ఎలా జరిగింది డాక్టర్?" అడిగాను.

    "ఆమె భర్తే చేశాడంటున్నారు. వాచ్ మెన్ చూసాడంట. రాత్రి లోపలికి వెళ్ళి ఆమెతో ఏదో గొడవ పడ్డాడట. తరువాత గంటకి వెళ్ళిపోయాడంట. మీ ఉదయాన్నే పనిమనిషి, పాలవాడూ వచ్చి తలుపుకొడితే తీయకపోయేసరికి ప్రక్కవాళ్ళ సహాయంతో తలుపు తెరిచి చూసారట. అప్పటికే ఆమె చనిపోయి వుంది. కానీ చాలా దారుణంగా చంపాడు. నోట్లో గుడ్డలు క్రుక్కి మొహమంతా యాసిడ్ పోసాడు. శరీరంలో నాలుగు చోట్ల కత్తిపోట్లు కూడా వున్నాయి...."

    నేనిక వినలేక ఆపమన్నట్టు చేయెత్తాను.

    "రండి. డెడ్ బాడీని చూస్తారా?" అన్నాడు.

    "ఊహూ....."

    చూడలేను. మృణాళిని "మృతదేహం" చూడలేను. పిల్లలనే కాదు పెద్దవాళ్ళనీ ఓదార్చగల ఆ చేతులు చలనం లేకుండా వుంటే ఎలా చూడను?

    నా బాధలన్నీ దూరం చేయడానికి కంకణం కట్టుకుని, నా దాంపత్యాన్ని కూడా సరిదిద్దిన ఆమె చిరునవ్వు ఇప్పుడు యాసిడ్ తాలూకు మచ్చల వెనక వికృతంగా మారిపోయివుంటే దాన్ని చూసి ఎలా తట్టుకునేది?

    నా గుండెని ఎవరో నొక్కిపెట్టినట్లు...... సన్నటి నొప్పి.

    దూరంగా మృణాళిని శవాన్ని పోస్టుమార్టమ్ కోసం అంబులెన్స్ లో ఎక్కిస్తున్నారు.

    తెల్లటి బట్టకప్పి వుంది. ఆ గుడ్డక్రింద ఒక అమృతమయి మృతదేహం వుంది. లోకంలోని బాధలన్నీ తనవిగా చేసుకున్న ఆమె చివరికి తనకి దక్కిన సన్మానాన్ని కనిపించనీకుండా ఆ తెల్లగుడ్డ చాటున దాచుకుని వెళుతోంది.

    ఎంత నిర్దయగా వెళ్ళిపోయావు మృణాళినీ. నీకు మేమెవరమూ గుర్తుకు రాలేదా? నీకింత కష్టంగా వుందంటే మా గుండెల్లో దాచుకునే వాళ్ళం కామూ?


   
                        *    *    *

    "తలకొరివి ఎవరు పెడతారు?" అడుగుతున్నారెవరో. ఎవరూ ముందుకు రాలేదు. బంధువులు కూడా వాళ్ళలో వాళ్ళు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు తప్ప ఎవరూ మేమున్నామంటూ రాలేదు.

    అప్పుడు నాలో చలనం వచ్చింది. పోయిన మా అమ్మను గుర్తుకు తెచ్చిన అమ్మకాని అమ్మకీ.... మృణాళినికిని........ నేను తలకొరివి పెడితే తప్పేముంది?

    అక్కడ బ్రహ్మాడు లేడు. ఏ తతంగమూ లేదు. ఏమీ లేదు.

    ఒక్క రాలుతున్న కాగడాలాంటి కర్రముక్క మాత్రమే కనిపిస్తోంది.

    మౌనంగా కర్రని అందుకుని కదిలాను. వణుకుతున్న చేతిని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ తలవేపు నడిచి నిప్పంటించాను. ఒక్కసారిగా శబ్దంచేస్తూ ముండింది.

    "నన్ను క్షమించు మృణాళినీ. నా జీవితాన్ని బాగుచెయ్యాలని తలచిన నీ శరీరాన్నే తగులబెడుతున్నాను."

    కర్ర దూరంగా విసిరేసి తల వంచుకుని వెనక్కు వచ్చాను. జ్వాలలు నింగికెగిసి పడుతున్నట్టున్నాయి.

    కేవలం ఓ పదిరోజులు ఏడ్చేసి కర్మ పూర్తికాగానే దినచర్యలో యాంత్రికమయిపోయే వారినే చూసాను. కానీ అసలైన దుఃఖం అనుభవిస్తూ కన్నీళ్ళు రానివారిని నేను చూడలేదు. బహుశా నేనొక్కడినే అయివుంటాను.

    ఇంటికివెళ్ళి స్నానంచేసి బట్టలు మార్చుకుంటూండగా అరుంధతి లోపలికి వచ్చింది.

    నిస్పృహగా మంచంమీద కూర్చుంటూ, "ఇప్పుడు మన అంకిత్ కి కిడ్నీ ఎవరిస్తారండీ?" అంది.

    అంతే! నేనెంత ఇరిటేట్ అయ్యానంటే, నేను కొట్టిన చెంపదెబ్బకు అరుంధతి అంతదూరంలో పడింది.

    తరువాత నన్ను నేను  సంబాళించుకునేలోపే ఆమె ఆ గదిలోనుండి మౌనంగాబయటికి వెళ్ళిపోయింది.

    బాధగా కణతలు రుద్దుకుంటూ సోఫాలో కూర్చున్నాను.

    నాకు మొట్టమొదటిసారిగా ఒక సత్యం అర్థమయింది. ఈ ప్రపంచంలో తొంభైశాతం మందీ స్వార్థంతోనే ఆలోచిస్తారని, చాలా కొద్దిమంది మాత్రం....... ప్రతిఫలం ఆశించరని...

    నా భార్య కూడా ఆ తొంభైశాతంలో ఒకర్తి అవటం దురదృష్టం. మనిషికి మనిషికీ మధ్య కేవలం అవసరమూ స్వార్థమే వుంటాయా? అంతకుమించి మరేమీ లేవా?

    మరి ఏ అవసరంతో మృణాళిని నా కొడుక్కి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడింది.

    సమాధానంలేని ప్రశ్న.

    అయితే కాస్త తేరుకున్నాక నా భార్యని అర్థం చేసుకోగలిగాను. ఆమెకూ మృణాళిని మరణంపట్ల బాధ వుంది. అది సాటి మనిషి స్నేహితురాలూ కావడం వల్ల ఏర్పడిన సానుభూతి కూడా కావచ్చు. కానీ అంతకన్నా పెద్ద బాధ అంకిత్ సమస్య. అంకిత్ మీద వున్న ప్రేమ ఆమెని మరేమీ ఆలోచించనివ్వలేదు.

    బంధాలపట్ల వున్న వాత్సల్యం అనుబంధంపట్ల వుండదనటానికి ఆమె నిదర్శనం. తనబిడ్డ ప్రాణంకన్నా అరుంధతికి మరెవరూ ముఖ్యం కాదు.

    కానీ నేనిదంతా జీర్ణం చేసుకోలేకపోతున్నాను. ఒక మనిషిపోతే ఆ మనిషివల్ల కలిగే లాభం పోయిందే అని వాపోవడం రాక్షసత్వమే అనిపిస్తోంది.

    భగవంతుడా! మాలో తరిగిపోతున్న 'మానసిక విలువలు' తిరిగి పునరుద్భవించేలా..... ఒక మనిషి మరణంపట్ల సాటిమనిషి పూర్తి నిజాయితీగా దుఃఖపడేలా...... ఏదో ఒకటి చేయి.



                         *    *    *   

    నేను డయాలిసిస్ వార్డులో అడుగుపెట్టగానే నర్సు చెప్పింది. "మిమ్మల్ని డాక్టర్ మహారధి రాగానే రమ్మన్నారు" అంది.

    అరుంధతిని అంకిత్ దగ్గర వుండమని చెప్పి నేనటుకేసి నడిచాను. మహారధి గది తలుపు తోసుకుని వెళ్ళేసరికి అతను కుర్చీలో రిలాక్స్ డ్ గా కూర్చుని సిగరెట్ త్రాగుతున్నాడు.

    విష్ చేసి కూర్చున్నాను.

    "అంకిత్ విషయం మాట్లాడాలని పిలిపించాను" అన్నాడు.

    నాకు తెలుసు. అయినా అంతకన్నా దగ్గరితనం మా మధ్య ఏముంది. మృణాళిని సాహచర్యంలాంటి దగ్గరితనం?!

    "చెప్పండి" అతనేం చెబుతాడో ఊహించగలను. అయినా అడగాలి కాబట్టి అడిగాను.

    "అంకిత్ కి త్వరగా ఆపరేషన్ చేయాలి. ఎంత త్వరగా అంటే మరో పది రోజుల్లో."

    "కానీ కిడ్నీ ఇంకా దొరకలేదు."

    "అది మీ పని. ఇప్పటికే అతనివల్ల మా స్టాఫ్ ఆ గదిలోకి వెళ్ళగానే భయపడుతున్నారు. ఉండీ ఉండీ పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడు ఈ పరిస్థితుల్లో అతనికి త్వరగా ఆపరేషన్ చేయకపోతే చాలా ప్రమాదం."

    "నాక్కొద్దిగా టైమివ్వండి డాక్టర్. ఎలాగైనా అంకిత్ తల్లిని వెదికి పట్టుకుని కిడ్నీ ఇచ్చేలా వప్పిస్తాను."

    "మీరేం చేస్తారో నాకు తెలీదు. కానీ మరో కొద్దిరోజుల్లో ట్రాన్స్ ప్లాంట్ జరగాలి. ఈ మధ్య అంకిత్ బి.పి. విపరీతంగా పెరిగిపోతుంది." 

 Previous Page Next Page