ఎప్పుడూ లేనిది ఇవ్వాళ తాళం ఎందుకు వేసినట్టు?
ఎదురుగానేవున్న వరండాలో హాస్టల్ వార్డెన్ శాంతిశ్రీ కూర్చుని పుస్తకం చదువుకుంటున్నది...
తను ఎవరి కళ్ళలో పడకూడదు అనుకున్నదో సరాసరి ఆమె ముందే దోషిగా నిలవవలసి వచ్చింది.
ఇక లక్ష ప్రశ్నలు...చివాట్లు తప్పవు!
"ఆంటీ...తాళం..."
"ఆ...ఆ...రామ్మా...నీ కోసమే ఎదురు చూస్తున్నాను..."
అంటూనే శాంతిశ్రీ గేటు తాళం తీసింది.
నీలిమ తప్పుచేసిన దానిలా తలవంచుకుని లోపలకు అడుగు పెట్టింది.
"నీలిమా...భోజనం చేద్దువుగానీ...డైనింగ్ హాల్ కు పద..."
సరాసరి తన గదిలోకి వెళ్ళబోతున్నదల్లా వార్డెన్ మాటలకు ఆగిపోయింది.
"ఆంటీ టిఫిన్ చేశాను...నాకు ఆకలిగాలేదు..." అంది ఆవలిస్తూ.
"నాకు ఆకలిగా వుందమ్మా"
వార్డెన్ మాటకు నీలిమ నిర్ఘాంతపోయింది.
"ఆంటీ...మీరు ఇంకా భోజనం చేయలేదా?"
"ఎలా చేస్తాను అనుకున్నావమ్మా...నీకు తెలియదా హాస్టల్ లో అందరూ భోజనం చేసేదాకా నేను చేస్తానా...అందరూ నిద్రపోకముందు నేను నిద్రపోతానా..." తన రొటీన్ వర్క్ గుర్తుచేస్తూ అంది.
నీలిమ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
"సారీ ఆంటీ...పదండి మీకోసం తింటాను"
నీలిమ వార్డెన్ చేయి పుచ్చుకుని డైనింగ్ హాల్ కి తీసుకువెళ్ళింది.
తనకోసం కాకపోయినా వార్డెన్ కోసం అన్నట్టు నాలుగు మెతుకులు తనూ తింది.
"చూడు నీలిమా! ఇందాక నిన్ను హాస్టల్ బయట దిగబెట్టింది ఎవరు? ఏం చేస్తుంటాడు? అతని తల్లిదండ్రుల అడ్రస్ వగైరాలు నీకు తెలుసా?"
చేతులు తుడుచుకుంటూ వార్డెన్ అంది.
"అయితే ఆంటీ మీరు అంతా విన్నారా?" కంగారుగా అడిగింది.
వార్డెన్ మౌనంగా తలవూపింది.
"ఆంటీ...అతను... నేను...ప్రే ...ప్రేమించుకున్నాం" తడబడుతూ చెప్పింది.
"నేను కాదనడం లేదు. నీ గురించి అతనికి అన్ని వివరాలు తెలుసుగా?"
నీలిమ తెలుసున్నట్టు తల వూపింది.
"మరి అతను తన గురించి ఏమీ చెప్పలేదా?"
నీలిమ మవునంగా ఉండిపోయింది.
"నీలూ! పోనీ నువ్వు అడిగావా?"
తల అడ్డంగా వూపింది.
"నేను తెలుసుకున్నాను. చెప్పనా?"
క్షణం ఆశ్చర్యం, మరుక్షణం సంశయం.
ఏమి వినాల్సి వస్తుందోనన్న భయంతో నీలిమ మొహం పాలిపోయింది.
"ఆంటీ! నా గురించి మీరెందుకంత శ్రమ తీసుకున్నారు?" నీలిమ కళ్ళలో నీలినీడలు చోటు చేసుకున్నాయి.
"నీలూ! నేను చెప్పేముందు నాకు ఓ ప్రామిస్ చేయాలి. చేస్తావా?..."
నీలిమ సంశయంగా చూసింది.
"నీలూ! నీ జీవితంలోని మాధుర్యాన్ని నేను దోచుకుంటా ననుకున్నావా? నీకు వసంతాన్నిచ్చి, చెడును దిగమింగుతానమ్మా! నన్ను నమ్మవా? ఇప్పుడయినా ప్రామిస్ చేస్తావా?"
నీలిమ మవునంగా చేతిలో చేయి వేసింది.
"నీలూ! నువ్వు నేటినుండి రవిచంద్రను మర్చిపోవాలి" స్థిరంగా అంది.
"ఆంటీ..."
వినకూడనిది ఏదో విన్నట్టు నీలిమ చెవులు మూసుకుంది.
"నీలూ! ప్రామిస్ చేశావు మరచిపోవద్దు..."
"ఆంటీ! ఇదేనా మీరు నాకిచ్చే వసంతం? రవిచంద్రను వదులుకోవడమంటే జీవితంలోని మాధుర్యాన్ని పోగొట్టుకోవడం కాదా? ఇంతకన్నా నా జీవితానికి వేరే ఏదయినా శాపం వుంటుందా?..." ఆవేశంగా అంది నీలిమ.