"వాళ్ళు చింపగా నువ్వు చూశావా?"
"యింకెవరున్నారు?"
మా స్ట్రీటు కాకముందు వెంకన్నపంతులు కొన్నాళ్ళు మాష్టరు పనిచేశాడు.
"ఎక్కడ పెట్టావు?"
"నా పెట్టెమీద."
"అంత ఖరీదైన పుస్తకాలు దాచుకునేందుకు చోటు అదా! యెవరు చించారో! నువ్వే చింపి వాళ్ళమీద పెడుతున్నావేమో!"
గోపాలరావు కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగాయి.
"అయినా అంత పుస్తకం చదవాలనే తీసుకొచ్చావూ? నీవు సొంతం వొకటి చదివావు గనుకనా? సరిగా చదివితే ఆ "స్కాలర్ షిప్" రానే వొచ్చేది. (తనకి జీతం నెలకి పదిహేను రూపాయలు తగ్గేవి) యింతా ఖర్చుచేసి నిన్ను చదివిస్తోవుంటే (వెంకన్నపంతులు ఎఫ్. ఏ. మూడేండ్లు, బి.ఏ. ఒక ఏడు ఫెయిలయినాడు. అడిగేవాళ్ళెవరు?) ఆఖరికి, యివీ నేర్చుకునే బుద్ధులూ! చదువే, చదువు! ఆ పిల్ల యెక్కడ ఏం చేస్తోందా అని తొంగిచూడ్డంతో సరిపోతోందిగాని నీకు చదువుకూడానా?"
గోపాల్రావు పెదిమ కొరుక్కుంటో నుంచున్నాడు.
"ఇట్లయితే నేనిక్కడ వుండడం కష్టమండీ?" అని సంకోచంతో అనేశాడు.
"నిన్నిక్కడ వుండమని బతిమాలానా?"
గోపాలరావు తల గిర్రున తిరిగింది. చప్పున హాలులోకి వొచ్చి కూచున్నాడు. యేం చెయ్యాలి? యెక్కడ దిక్కు? తనూ తల్లీ వెళ్ళిపోవాలి. రవణకూడానా? యెక్కడా గతిలేదని అతనికి నిమిషంలో స్పష్టమయింది. యెక్కడన్నా గుమాస్తాగా చేరితే? యెవరిస్తారూ? యిక్కణ్ణించి కదిలేదెట్లా? వెంకట్రావుగారికి రాయడం సిగ్గేసింది. ఐనా వారంరోజుల్లో పట్నం యెట్లానూ వెళ్ళాలి. కళ్ళు మూసుకుంటే? కాని వెళ్ళేటప్పుడు ఆ వెంకన్నపంతులు దగ్గిర్నించి డబ్బు తీసుకోవడం, యెట్లా? యెట్లా ఆలోచించుకుని, ఆలోచించుకుని తన దౌర్భాగ్యానికి యేడ్చి అలిసిన ఆ దిక్కులేని హృదయాన్ని నిద్ర కావలించుకుంది. అతనికి వెంకన్నపంతులికీ జరిగిన సంభాషణలో చివరిభాగం విని బాధపడి, వెంకన్నపంతులు దీపం తుడవక, నీళ్ళియ్యక, దొడ్డివేపున అతని దౌర్భాగ్యానికి కన్నీళ్ళు కారుస్తున్న ఒక కన్య హృదయం వుందని తెలిస్తే గోపాలరావుకి కొంత శాంతి వొచ్చి వుండును. కొంతసెపటికి కళ్ళు తెరిచిచూస్తే రాత్రైనట్టుంది. అక్కడే చాప పరుచుకుని పక్కవేసి మళ్ళీ యేడ్చాడు. యీ పెళ్ళెందుకు చేసుకుని, వీళ్ళకింద బిచ్చగాడినై పడ్డానా? ఆ స్కూలు ఫైనలవగానే యెక్కడో గుమాస్తా పని చూసుకుంటే యెంతో ఆనందంగా వుండునే జీవితమూ అనుకుని, మళ్ళీ రవణ జ్ఞాపకమొచ్చి, ఆ ఆలోచనకి సిగ్గుపడి, దిగులుపడి యింకా రెండేళ్ళెట్లానా గడపటం అనుకుంటో నిద్రపోయినాడు. పదిగంటలయింది. అందరూ భోజనాలుచేసి యెవరి గదులకి వాళ్ళు వెళ్ళారు. వెంకన్న పంతులు చదవడానికి రమ్మంటే రవణ తలనొప్పి అని వంకపెట్టి ఐదుసార్లు పంపింది. అతను రాలేదు. రవణ వూరుకోలేకపోయింది. తనకోసం యీ గదిలోపడి యేడుస్తున్నాడు పాపం!