Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 5 పేజి 22

   

                             కల్యాణి వాణి

    భారతావని పుణ్యక్షేత్రములకు పుట్టినిల్లు. ఈ పవిత్ర భూమిలో సుప్రసిద్ధములైన ఇరువది యొక్క మహాగణేశక్షేత్రములు, ఏబది యొక్క శక్తి పీఠములు, ఏబది యొక్క సిద్దకేత్రములు, నూటయేనుబది విష్ణుక్షేతములు , నూటయేనుబది శివ క్షేత్రములు విరాజిల్లుచున్నవి. మఱియు నీ పుణ్యభూమి "అయోధ్య , మధుర, మాయ, కాశి, కాంచి అవంతిక, ద్వారక " అను మోక్ష ప్రదములగు సప్త పురములతో నలరారుచు పంచ కాశీ సప్తగంగా, సప్తబదరీ, చతుర్దశ ప్రయాగలతో విలసిల్లుచు గంగా, యమునా గౌతమీ కృష్ణవేణీ, పినాకినీ, కావేరీ ప్రముఖ పుణ్యతరంగిణీ తరంగములతో పరమ పావనమై యొప్పుచున్నది. తమిళగ్రంధ మగు పెరియపురాణమున రెండువందల డేబ్బది నాలుగు పవిత్ర మహా శైవక్షేతము లత్యద్భుతముగ నభివర్నింపబడినవి.
    
    సర్వం శివమయం జగత్ః
    
    చరాచర ప్రపంచ మంతయు శివమయము. ఈ విశాలవిశ్వమున శివుడు కానిదేదియు లేదు. ఈ సమస్తసృష్టియు పంచభూతములతో నిండియున్నది. "పృద్వీని, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, జీవాత్మ, సూర్యుడు, చంద్రుడు - " ఇవి పరమశివుని అష్టమూర్తులు, శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, పశుపతి, మహాదేవ, ఈశాన నామములతో పృద్వీ వ్యాధి అష్టమూర్తుల నధిష్టించి పరమేశ్వరుడు ప్రపంచమును పాలించుచున్నాడు.
    
    పంచభూతాత్మక శివలింగములు;

    కాంచీక్షేత్రములో పృద్వీలింగరూపమున , జంబుకేశ్వర క్షేత్రము లో జలలింగ రూమున, అరుణాచలక్షేత్రములో తేజోలింగరూపమున, శ్రీకాళహస్తి క్షేత్రములో వాయులింగ రూపమున, చిదంబర క్షేత్రములో ఆకాశలింగ రూపమున దయాసముద్రుడగు స్వామి సన్నిధి చేసి యున్నాడు. ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత నామకములకు పరమశివుని పంచబ్రహ్మ మూర్తులు బ్రహ్మాండపరివ్యాప్తములై సకల లోక కళ్యాణ ప్రదములై సర్వార్ధసందాయకములగుచున్నవి.
    
    ద్వాదశ జ్యోతిర్లింగములు :

    పరమశివుడు కరుణామయుడు. అయన ఆర్తులకు సన్నిది. ఆశ్రితులకు పెన్నిధి. ఆపన్నులకు ముంగొంగుబంగారము. దేవాది దేవుడైన మహాదేవుడు ద్వాదశ జ్యోతిర్లింగస్వరూపములతో ఆ సేతు శీతాచలము భారతభూమిలో భక్త జనపరిపలనార్ధమై యవతరించి భుక్తిముక్తుల నను గ్రహించుచున్నాడు.
    సౌరాష్ట్రమున సోమనాధుడై శ్రీశైలమున మల్లికార్జునుడై , ఉజ్జయుని లో మహాకాళుడై, ఒంకారమున పరమేశ్వరుడై, హిమాచలమున కేదారనాధుడై, డాకినియందు భీమశంకరుడై, వారణాసిలో విశ్వేశ్వరడై, గౌతమీతీరమున త్ర్యంబకేశ్వరుడై , చితాభూమియందు వైద్యనాధుడై, దారకావనమున నాగనాధుడై, సేతుబంధమున రామేశ్వరుడై, శివాలయమున ఘుశ్వేరుడై, సర్వలోక శుభంకరుడగు శంకరుడు విజయం చేసి యున్నాడు. పరమశివ సన్నిధానములగు నీ పన్నెండు పుణ్యస్థానములు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములుగా యుగయుగముల నుండి ప్రసిద్ధి గాంచియున్నది. ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమహిమ 'శివపురాణము' నందలి 'కోటి రుద్రసంహిత' యందు మనోహరముగ వర్ణితమైనది.

        శ్లో|| సౌరాష్ట్రే సోమనాధం చ శ్రీశైలే మల్లికార్జునమ్
        ఉజ్జయిన్యాం మహాకాళ మోంకారే పరమేశ్వరమ్||
        కేదారం హిమవత్ వ్రుష్టే డాకిన్యాం భీమశంకరమ్
        వారాణస్యాంచ విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే||
        వైద్యనాధం చితాభూమౌ నాగేశం దారుకావనే
        సేతు బంధేచ రామేశం ఘుశ్మేశంచ శివాలయే||
        ద్వాదశైతాని నామాని ప్రాతరుత్దాయ యః పఠేత్
        సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి||
         యం యం కామ మపేక్క్యైవ పఠిష్యంతి న సంశయం||
        ఏతేషాం దర్శనాదేవ పాతకం నైవ తిష్టతి
        కర్మక్షయో భవేత్తస్య యస్య తుష్నో మహేశ్వర||

    పైన చెప్పబడిన ద్వాద్వశజ్యోతిర్లింగ క్షేత్రమహాత్య మనన్య సామాన్యము. ఎవరు ప్రాతః కాలమున లేచి యీ పన్నెండు నామాములను స్మరించునో వానికి శివానుగ్రహము కల్గును. సప్తజన్మకృత దుష్మతము నశించును. ఎవరేది వాంచించి వీనిని పఠింతురో వారి కవాంచితము సత్వరము సిద్దించును. ఈ పుణ్య క్షేత్ర సమర్శనము సకల దురిత హారము. పరమేశ్వర ప్రీతికరము.

                                  సౌరాష్ట్రే సోమనాధం చ
    క్షేత్రమహిమ

    పరమేశ్వరుని జ్యోతిర్లింగములలో మొట్టమొదటిది శ్రీసోమనాధ జ్యోతిర్లింగము . ఈ జ్యోతిర్మూర్తి సౌరాష్ట్రదేశములో పరమ పవిత్రమైన ప్రభాసక్షేత్రమున వెలుగొందుచున్నది. ప్రభాసక్షేత్రమహిమ మహాభారతమునందు, మహా భాగవతమునందు , స్కందపురాణమునందు ననేక విధముల నత్యద్భుతముగా నభివర్ణింపబడియున్నది.

    పురాణకధ :

    దక్షప్రజాపతికి ఇరువది ఏడుగురు కుమార్తెలు జన్మించిరి. అందరు చక్కని చుక్కలు. అయన తన తనయులను సౌజన్యరాశియు సౌందర్యమూర్తియునగు, చంద్రున కిచ్చి మహావైభవముగా వివాహము గావించినాడు. భార్యలందరిలోనూ "రోహిణి" త్రిభువనమోహిని. చంద్రునకు ప్రాణము. ఇది మిగిలినవారికి అసూయజనకమైనది. ఈర్ష్యాళువులైన దక్ష పుత్రికలు ఇరువది అర్గుగురు తండ్రి దగ్గరకు వెళ్ళి తమ దైన్యమును విన్నవించుకోనిరి. దక్షుడు నక్షత్రనాధుని పిలిపించి, సతీమణుల నందరినీ సమాన ప్రేమతో నాదరింపుమని పలువిధముల ప్రబోధించెను. కాని మామగారి మాటలు చంద్రుని మనసున కెక్కలేదు. అతడు యధా పూర్వముగ రోహిణి యెడలనే అత్యంతాసురక్తుడై మెలగుచుండెను. అంత దక్షుడు కోపాద్రిక్తుడై చంద్రుని "క్షయరోగ పీడితుడవు కమ్ము" అని భయంకరముగ శపించెను.
 కళాసాంధ్రుడగు చంద్రుడు శాపవశమున క్రమముగా కళావిహీనుడు కాజోచ్చెను. సుధాకరుని సుధాకిరణములు నీరసించినవి. అమృతాహరులగు అమరులు హాహాకారాలు చేయసాగిరి. ఔషదులు వాడినవి. లతలు కాంతి వీడినవి. చరాచరసృష్టి నిస్తేజమైంది. ఇంద్రాదిదేవతలు, వశిష్టాది మునీంద్రులు చంద్రుని ముందిడుకొని బ్రహ్మదేవుని సన్నిధికి పోయిరి. ఈ మహోపద్రవము నుండి ముల్లోకముల రక్షింపుమని వేడుకొనిరి. వారి ప్రార్ధన లాకర్ణించి విధాత "చంద్రా! పవిత్రమైన ప్రభాసతీర్ధమునకు వెళ్ళి పరమశివునారాధింపుము. నీకు శుభము కలుగు" నని యతనికి మృత్యుంజయ మంత్ర ముపదేశించి పంపించెను.
    పితామహుని యుపదేశానుసారం చంద్రుడు దేవగణముతో కూడి ప్రభాసక్షేత్రమున కేగి మహానిష్టతో మహేశ్వరు నారాధించెను. ఆరుమాసముల కాలము ఘోరతపస్సు కొనసాగించెను. ఏకదీక్షతో పదికోట్ల పర్యాయములు మృత్యుంజయ మహామంత్రము జపించేను. భక్తశంకరుడు శంకరుడు చంద్రుని ముందు సాక్షాత్కరించి "చంద్రా! నీ భక్తికి మెచ్చితిని. వరము ననుగ్రహింప వచ్చితిని. ఇక నీ తపస్సు చాలింపుము" అని పల్కెను. చంద్రుడు జగదీశ్వరునకు సాష్టాంగ ప్రణామము లొనర్చి "స్వామీ! ధన్యుడను కృతార్ధుడను. నాయందు తమ కరుణ కలిగినది. ఇంతకంటే నాకు కావలసిన దేమున్నది నన్న నుగ్రహింపుము. నన్ను క్షమింపు" మని ప్రార్ధించెను. కరుణామయుడైన మహేశ్వరుడు అతని ప్రార్ధనను మన్నించి "కృష్ణపక్షములో మాత్రము నీ కళలు క్షీణించును. కాని శుక్ల పక్షమున నీ కళలు దినదిన ప్రవర్ధమానము లగును. పూర్ణిమనాడు నీవు షోడశకళాపరిపూర్ణుడవై విరాజిల్లేద" వని వర ప్రదాన మొనర్చెను.
    జాగత్పతి మృతతుల్యుడైన చంద్రునికీ విధముగ మరల అమరత్వమును ప్రసాదించెను. పరమశివుని వరప్రభావమున కళాహీనుడు కళానిధియై కళాప్రపూర్ణుడై కళకళలాడెను. ఎప్పటి వలె అమృతవర్షము కురిపించెను. నయనాభిరాముడగు సోముని సుధాకిరణములచే సర్వప్రపంచము సజీవమై సర్వాంగ సుందరమై ప్రకాశించెను. బ్రహ్మాది దేవతల ప్రార్ధన మన్నించి భక్త వత్సలుడైన పరమశివుడు పార్వతీ సహితుడై ప్రభాసక్షేత్రమున సోమనాధజ్యోతిర్లింగ రూపములో నేటికిని కన్నుల విందుగా సన్నిధి చేసి యున్నాడు.

 Previous Page Next Page