"లేదు, లేదు" అనే జవాబు విని అక్కడున్నవారంతా "నమఃశివాయ" అని జపిస్తున్నారు. కొత్తగా వచ్చినవారు సైతం జనవలయాన్ని నెట్టుకొని లోపలికి దూరడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఎండకు గొంతులు ఎండిపోతున్నాయి. కొబ్బరి బొండాలు అమ్మేవారికి బాగా వ్యాపారం జరిగింది. బొండాములు అమ్మేవారికి పోటీగా కాకీనిక్కరు కుర్రాడు "పుచ్చకాయలు. తింటే తియ్యన. వంటికి చలవ" అని కేకలేస్తూ అమ్ముతున్నాడు.
ఒక వృద్ధ భిక్షకుడు తిరగడం చాతకాక గుంపు చివర్న కూర్చొని "పుణ్యం సంపాదించుకోండి, శివుడు బైటికి వచ్చేప్పుడు ఒక్క అణా" అని అడుక్కుంటూ పుణ్యవ్యాపారం చేస్తున్నాడు.
శివుడు వస్తున్నాడా? ఎవరు రప్పిస్తున్నారు? కాషాయ వస్త్రాలు ధరించి మెళ్ళో రుద్రాక్షమాలికలుగల ఒక నల్లని దుంగలాంటి బ్రాహ్మడు పులిచర్మం మీద పద్మాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడు. అతని గంభీరస్వరం 'నమఃశివాయ' అని ఆలాపిస్తూంది. జపంతోపాటు ఇత్తడిచెంబులోని నీరు నేలమీద చల్లుతున్నాడు. అతని పక్కనే కాషాయ వసనములు ధరించిన ఒక యువతి పులిచర్మం మీద కూర్చొని ఉంది. ఆమె దీర్ఘకేశములు వీపుమీదా బుజాలమీద నాగసర్పాల్లా నాట్యం చేస్తున్నాయి. సుందర లలాటం చిక్కని సింధూరరేఖతోమెరిసిపోతూంది. ఆమె నోటినుండి వెలువడే మంత్రం నీరసంగానూ రిక్తంగానూ ఉంది. ఆమె ముఖంలో ఎలాంటి భావవికారమూలేదు. చెంబు ఎత్తడంలో బ్రాహ్మడికి సహకరిస్తూ ఉన్న ఆమె చేతులు దారాలు కట్టిన బొమ్మల చేతుల్లా ఉన్నాయి. వాటిల్లో ప్రాణం ఉన్నట్లు లేదు.
ఉదయం ఇంకా సూర్యుడు గగనయానానికి సన్నాహంలోనే ఉన్నాడు. ఒక యువకుడు సైకిలుమీద వెళ్తూ మర్రిచెట్టు క్రింద విచిత్ర క్రతువులో నిమగ్నులై ఉన్నవారిని చూశాడు. సైకిలు దిగి "ఏమిటిది?" అని అడిగాడు.
జవాబు రాలేదు.
"భూమిలో ఏమైనా దానం ఉందా? లేక మామిడిటెంకెగారడీయా?" వెక్కిరింపుగా అడిగాడు.
బ్రాహ్మడు ఆమాటలు విననేలేదు. కాని వెంట్రుకలు నేలకు వాలుతూ విచారవదనంగల యువతి తలెత్తి చూసింది.
"ధనంలేదు. గారడిలేదు. శివుడు భూమిలోంచి బైటికి వస్తున్నాడు."
సైకిల్ వాలా నమ్మలేదు. నమ్మకంలేని దృక్కుల్తో "శివుడేమిటి? బైటికిరావడం ఏమిటి?" అని అడిగాడు.
"ఈశ్వరుడు కలలో వచ్చి చెప్పాడు"
"కలే! కలా!!" ఆశ్చర్యం ఎక్కువైంది.
"ఆ బ్రాహ్మడు నా తండ్రి. ఆయనకు కలలో శివుడు ప్రత్యక్షం అయి 'నేను కలకత్తాలో బేహులా రోడ్డుపక్కన ఉన్న సనాతనమైన మరిక్రింద ఉన్న పుట్ట అడుగున ఉన్నాను. పుట్టను పడగొట్టి నేను పైకి వచ్చేదాకా నీరు చల్లు,' అని ఆదేశించాడు"
ఆమె దృష్టి మరల్చుకొని ధ్యానంలో మునిగిపోయింది. తండ్రి గొంతులో గొంతుకలిపి నమఃశివాయ" అని జపించింది.
సైకిల్ వాలా కళ్ళలో విశ్వాసం వెలిగింది. హుటాహుటిని సైకిలు తొక్కుతూ ఇల్లు చేరాడు. సైకిలు దిగగానే రొప్పుకుంటూ తాను చూచిన, విన్న వింతనుగురించి ముసలి తల్లికీ, భార్యకూ గబగబా చెప్పేశాడు.
ముసలి తల్లి చేతులుజోడించి నుదుటికి చేర్చి "నమఃశివాయ. ఇది ఏమి అద్భుతం స్వామీ!" అని కళ్ళు మూసుకొని జపించింది. కోడలు అత్తను అనుకరించింది.
"నీతో చెప్పడానికి పరుగెత్తుకొచ్చానమ్మా! ఈ అద్భుతం ఎప్పుడైనా విన్నావా?"
"వినడమేమిటి. ఒకసారి చూశాను. నలభై సంవత్సరాలక్రితం, అప్పటికి నీవింకా పసివాడివి. నేను మా ఊళ్ళోనే ఉన్నా. ఊరికి దూరంగా మర్రిచెట్టు క్రింద పచ్చికమైదానంలోంచి శివుడు బైటికి వచ్చాడు. జమీందారు భూమి దానం చేశాడు. దేవాలయం వెలిసింది. చుట్టుప్రక్కల ఏడు ఊళ్ళజనం పూజలు చేయడానికి వచ్చేవారు. మా ఊరికి ఆ దేవాలయం కొత్త కీర్తిని, శోభను ఇచ్చింది."
"అప్పుడుకూడా ఎవరికైనా కలవచ్చిందా?"
వృద్దురాలు తన తెల్లని కనుబొమ్మలు ముడేసి జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించింది.
'ఆఁ. ఆఁ, వచ్చింది. కలగూడా వచ్చింది. అసలు దాని ప్రారంభమే కలతో అయింది. ఆ రోజుల్లో మన చటర్జీ వట్టి దరిద్రుడు. కులం మొత్తంలోనూ అంతకంటే దరిద్రుడు ఉండేవాడు కాడు. మహదేవునికి అతనిమీద దయకలిగి ప్రత్యక్షం అయినాడు. దేవాలయంతోపాటే చటర్జీకూడా పెరిగాడు. నీరసమైన అతని కళ్ళకు కాంతి వచ్చింది. వట్టి నత్తివాడు. అతడు మాట్లాడుతుంటే అంతా నవ్వేవారు. అతని నత్తికూడా పోయింది. పూజారిగా మారి అందరి తలలకూ ఎక్కాడు. భూములు కొన్నాడు. ఇండ్లు కట్టాడు. అతని జ్యేష్టపుత్రునికి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అయిన గంగూలి తన కూతురును ఇచ్చి పెళ్ళి చేశాడు. తెల్లవారి......."
"అమ్మా! ఆలస్యం అవుతూంది. శివుడు ఏ క్షణాన బైటికివస్తాడో తెలియదు. నేనువెళ్ళి అందరితోనూ చెప్పివస్తా"
"అవును నిజమేనాయనా. పరుగెత్తి అందరికీ చెప్పు. ఇరుగుపొరుగువారందరికీ చెప్పేయి. ఆ మహాదేవునికి మనమీద దయకలిగింది. లేకపోతే ఇంత దగ్గరి స్థలాన్ని ఎన్నుకుంటాడా? ఎంత దూరం? అయిదు నిముషాల రిక్షాధారి. నిజంగానే మన అదృష్టం పండింది."
"గుడికట్టేస్తారా? గుడికట్టడానికి బోలెడు డబ్బుకావాలి. ఎవరిస్తారు?" అని అడిగాడు ఆశ్చర్యంగా.
"హుఁ. కలకత్తాలో ఉన్న దేవాలయాలన్నింటికంటే ఉత్తమం అయిన దేవాలయం సిద్దం అవుతున్నది. అలాకాకుంటే శివుడు నగరానికి అవతల ఉన్న ఆ స్థలాన్ని ఎందుకు ఎంచుకుంటాడు? డబ్బు వర్షం కురుస్తుంది. చూస్తుగాని."
ఈ వార్త కార్చిచ్చులా పాకింది. మర్రిచెట్టుచుట్టూ తండోపతండాలుగా జనం కూడారు. శివాగమనం ఆలస్యం అయినకొద్దీ జనపుగుంపు పెరిగిపోతూంది. కార్లువచ్చాయి. అనేకరకాల తినుబండారాలు, అమ్మేవాళ్ళు వచ్చేశారు. ఒక వ్యక్తి టేబుల్ మీద కలర్ సీసాలు పెట్టుకొని కూర్చున్నాడు.
బెంగాలు మూలమూలల్నుంచి ఆకలితోచస్తూ తిండికిగాను ఆకలి యాత్రలు సాగిస్తూవచ్చిన జనం అక్కడే నిలుచుండిపోయారు. వారి కళ్ళల్లో ఆమెమెరిసింది. శివుడువస్తే వారికష్టాలు గట్టెక్కవూ? వంగభూమిమీది ఆర్తనాదాలు అడుగంటించడానికి అదిదేవుడు అవతరిస్తున్నాడేమో?
శివాగమనాన్ని నిరీక్షిస్తూ ఆ దరిద్రమూర్తులు పొలాల్లో కూర్చుండిపోయారు.
* * * *
కాలూ వెన్నెముక నెప్పిపెట్టింది. గుండె తృప్తితో పొంగిపోయింది. స్మృతిపథంలో కల్పించుకున్న చిత్రం కళ్ళముందు సజీవంగా ప్రత్యక్షం అయింది. వందలకొద్ది జనం తండోపతండాలుగా గంటలకొద్ది మండుటెండలో నించుని నిరీక్షిస్తున్నారు. అది వారి విశ్వాసానికి పరీక్ష కొందరు విసుగుపుట్టి వెళ్ళిపోయారు, కాలూ వారందరినీ కనుకొలుకుల్తో కొలుస్తున్నాడు.
అతని మనసు తేలిగ్గా ఉందనికూడా చెప్పడానికి వీల్లేదు. శివావతరణం జరక్కుంటే? అలాంటి భీకర ఆలోచనలకు దూరంగా ఉండాలని యత్నించాడు. ధైర్యం చిక్కపట్టి వెర్రివెర్రి ఆలోచనలను పారద్రోలాడు.
లేఖ తిండిలేకుండా ఒకరోజంతా పద్మాసనంమీద కూర్చున్నది. ఆమెముఖాన అలసటా, నిరాశా తాండవం చేశాయి. ఒక్క ప్రశ్న సహితం వేయకుండా, ఆమె తండ్రి ఆదేశాల్ను పాలించింది. అప్పుడప్పుడు ఆమె కాలూవైపు చూచేది. ఆమెచూపుల్లో భయమూ, భ్రాంతీ కనిపించేవి.
గుండె రాయి చేసుకో. దొర్లిపోతున్న ప్రతిక్షణమూ ఆ ముహూర్తాన్ని దగ్గరికి తెస్తూంది. ఈ వ్యాపారానికి జనం బాగా నిరీక్షించడం జరగాలి. లేకుంటే కథంతా కరిగిపోతుంది. విలువ రాలిపోతుంది. చంద్రలేఖా! గుండె గట్టిచేసుకో.
సూర్యుడు పడమటికి వాలాడు. జనానికి ఓపిక చస్తూంది. అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాలూకేస్వయంగా కలిగిన అనుమానం బరువైన సమ్మెటలా అతని గుండెమీద పడింది.
"శివుడు భూమిలోంచి బైటికి రాకుంటే?"