Previous Page Next Page 
హత్య పేజి 22


    "చూడు సూరీడూ - నా కోసం నీవు పనులు మానేయవద్దు నీ పని నీది నాపని నాది. ఇంకో వారం ఆగి నిమ్మదిగా నేనే నా పనిలోకి దిగుతాను" కైలాసగణపతి చెప్పాడు.

 

    "పరిశోధనలో దిగితే ఎవరికీ అనుమానం రాదుకదా" తాను అనుమానం వెళ్ళడిస్తూ అడిగాడు సూర్యారావు.

 

    "రాదు..... నాతోపాటు చిన్న సుత్తి వులి బుల్లి పెట్టె తీసుకుని వెళతాను. అలాగే ఓ సీసాలో యాసిడ్ లాంటి ద్రావకం వుంటుంది.... సుత్తిపెట్టి కొట్టంగానే ఓ రకమైన శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చిన రాతిని మాత్రమే నేను పరీక్ష చేయవలసి ఉంటుంది. అలా శబ్దం వచ్చిన రాతిమీద ద్రావకం చుక్క వేస్తాను. అంత మేర రాతి మీద గాజు మెరుపు ఏర్పడితే ఆ రాతిని పరిశోధనకి వినియోగించాలన్నమాట."

 

    "అంత రాతిని పరిశోధనకి వినియోగిస్తే నలుగురికీ తెలిసిపోతుంది కదరా కైలాసగణపతి....."

 

    "డోంట్ వర్రి - నేను సుత్తిని వులిని వుపయోగించి చిన్న ముక్కని, సరీగా గులకరాయి అంత ముక్కని తీసుకుంటాను. దానిని ఇంటికి తీసుకువచ్చి నా గదిలో పరిశోధిస్తాను. నాతోపాటు నా శరీరాన్ని అంటిపెట్టి కోటు ఎలాగూ వుంటంది కదా! కోటు జేబులో ఉలి సుత్తి ఏసిడ్ సీసా వుంటాయి. కొండ దగ్గరనుంచి వస్తూ నాలుగు గులకరాళ్ళని తెస్తాను. అంతే!"

 

    "ఇలా అయితే నిన్ను ఎవరూ అనుమానించరు. ఇదివరకు రాళ్ళని పరిశోథించడానికి వచ్చిన వాళ్ళు అలాకాదు. ఏవేవో పరికరాలు తీసుకుని అక్కడే కొండమీద తిరుగుతూ వుండేవారు. ఒక్కొక్కరి దగ్గర అయితే పెద్ద పనిముట్లు కూడా వుండేవి." సూర్యారావు చెప్పాడు.

 

    "పరిశోధనలో కూడా పద్ధతులు ఉన్నాయి. ఈ విషయంలో ఆచారిని నిజంగా మెచ్చుకోవాలి. పరిశోధన విషయంలో చాలా ముందుకు పోయాడు. ప్రభుత్వానికి తెలియజేసి సహాయం కోరితే ఎంతో చేసేవాళ్ళు. గతంలో సాయం అడిగితే ప్రభుత్వం చేయూతనివ్వలేదుట. దాంతో కినుక చెందాడు. స్వయంగా తనే సాధించి అప్పుడు తన గొప్పతనం చూపుతాడుట. ఈ మాట తరచు నాతో అనేవాడు" గణపతి చెప్పాడు.

 

    "అయితే నాలుగు రాళ్ళు తెచ్చి పరిశోధిస్తే పని అవుతుందన్నమాట! చాలా తేలికే."

 

    "కాదు."

 

    "కాదంటే?"

 

    "కాదంటే అర్ధం నాలుగు రాళ్ళు పరిశోధించంగానే పని కాదు అని అర్థం. వంద కాకిగుడ్లలో ఒక కోకిల గుడ్డు లాగాలన్నమాట. అన్ని రాళ్లూ పరిశోధనకి పనికొచ్చేటట్లే వుంటాయి. వేల రాళ్ళలో ఒకరాయి వుంటుంది. అదృష్టం బాగుంటే ఎక్కువరాళ్లు పరిశోధించకుండానే పని అవుతుంది. కానీ సక్సెస్ అనేది అంత తేలికకాదు. ఒక్కోసారి జీవితాంతం కష్టపడ్డా ఫలితం సాధించకపోవచ్చు. మళ్ళీ ఇక్కడ దైవాధీనం తప్పదు."

 

    "ఏమిటో. ఇంత కష్టపడేబదులు కాస్త భూమి తీసుకుని కాసిని గింజలు చల్లితే బస్తాల ధాన్యం పుడుతుంది. కష్టపడ్డా ఫలితం చేతికి అందుతుంది" సూర్యారావు అన్నాడు.

 

    "ఎవడి పిచ్చి వాడి కానందంలే" అన్నాడు కైలాసగణపతి.

 

    "ఆ విషయం అంతటితో ఇరువురూ వదిలేశారు.

 

    సూర్యారావుది లంకంత కొంప. చాలా గదులు వున్నాయి. కైలాసగణపతికి ఓ గది ఇచ్చాడు. గదిలో నవ్వారు మంచం ఉంది. ఒక కుర్చీ, బల్ల వున్నాయి. కైలాసగణపతివి చిన్న పెట్టె బ్యాగ్ వున్నాయి అంతే. పరిశోధన చేయవచ్చు, పడుకుని దొర్లవచ్చు. ఎవరికి అడ్డులేదు. అడ్డురారు.

 

    కైలాసగణపతి ఇల్లు కదిలితే చాలు కోటు ధరించాలిసిందే. "రక్షణ కవచంలా ఇది నిన్ను అంటిపెట్టుకుని ఉండాల్సిందేనా?" సూర్యారావు నవ్వుతూ అడిగేవాడు.

 

    "అంగరక్షకులు ఎలాగూ లేరు. కనీసం రక్షణ కవచం అన్నా ఉండొద్దా?" తనూ నవ్వుతూ అనేవాడు కైలాసగణపతి.

 

    ఎవరికీ తెలియదు. అది కోటు అంతవరకు ఖాయం. కానీ ఆ కోటులో చాలా సీక్రెట్స్ వున్నాయి.
    యధాప్రకారం ఈ రోజు ఆ కోటు ధరించి షికారుకి బయలుదేరాడు కైలాసగణపతి. తోడుగా సూర్యారావు రావటం లేదు.

 

    షికారుగా నడుస్తూ అలా అలా వెళ్ళి కొండ దగ్గరకు వచ్చాడు గణపతి. ఈ రోజు రోజూకన్నా తొందరగా బయలుదేరాడు. ఓ రైతు తాలూకా కోర్టు వ్యవహారం మీద ప్లీడరుతో సంప్రదించటానికి పట్నం వెళ్ళాడు సూర్యారావు. రేపటి దాకా రాడు.

 

    కైలాసగణపతి కొండ దగ్గరకి వచ్చాడు. నలువైపులా చూశాడు. ఆ తర్వాత కొండ ఎక్కటం ప్రారంభించాడు. మధ్య మధ్య ఆగి పరిసరాలు చూస్తూ పైకి ఎక్కాడు!

 

    గవ్వలమ్మ గుహ దగ్గరకెళ్ళి ఆగాడు. మరోసారి నలువైపులా చూశాడు. నెమ్మదిగా గుహలో కాలుపెట్టాడు. ఇంతకు క్రితం సూర్యారావు ఓ రోజు ఉదయం పదిగంటలకు వచ్చి గవ్వలమ్మ గుహలోకి కైలాసగణపతిని తీసికెళ్లి చూపించాడు.

 

    అప్పుడు పన్నెండు గంటలలోపు పగలు వాళ్లిద్దరూ కలిసి గుహ చూశారు. తప్పు లేదు ఏ అనర్ధకమూ జరగదు!

 

    ఇప్పుడు సాయంత్రం అయిదున్నర. మధ్యాహ్నం దాటిం తరువాత తెలిసి తెలిసి గవ్వలమ్మ వున్న గుహలో ఎవరూ అడుగు పెట్టరు.

 

    గణపతి తెలిసికూడా ఏదో పనివున్నట్లు గవ్వలమ్మ వున్న గుహలోకి నడిచాడు.

 

    కైలాసగణపతి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు. సూర్యారావు ఊళ్ళోలేకుండా చూసుకున్నాడు! కొండ ఎక్కేటప్పుడు ఆగుతూ కూర్చుంటూ ఎవరూ దరిదాపుల్లో లేరుకదా అని వెయ్యి కళ్ళతో చూస్తూ గుహదాకా వచ్చాడు. గుహ లోపలకు వెళ్లేముందు కూడా చుట్టూ జాగ్రత్తగా ఓసారి చూసి వెళ్ళాడు!

 

    అంతకు క్రితం.....

 

    కైలాసగణపతి సూర్యారావుతో గుహలోకి వెళ్లినప్పుడు గుహ లోపలికంటా వెళ్ళలేదు. ఇరువురూ నాలుగు అడుగులు మాత్రమే వేశారు. అక్కడే ఆగి చూశారు. చూడదగ్గ గొప్ప వస్తువులు లేవు.

 

    గుహలోపల గోడవారగా కుండ వుంది. ఆ కుండకి పసుపు, కుంకం బొట్లు ఉన్నాయి. కుండ కాస్త పెద్దదే దానిమీద మూకుడు మూతవుంది. మూతకి త్రికోణంలా గవ్వలు అతికించి ఉన్నాయి. పెద్దకుండ పక్కన చాలా బుల్లికుండ వుంది. సైజుబేధం తప్పించి అది ఇలాగే వుంది. అంతకు మించి ఏ చిన్న వస్తువు అక్కడ లేదు.

 

    "నమస్కారం పెట్టు" అని కైలాసగణపతితో చెప్పి, "తల్లీ! గవ్వలమ్మా! కోటి నమస్కారాలు తల్లీ!" అని నమస్కారం పెడుతూ పైకి అన్నాడు సూర్యారావు.

 

    కైలాసగణపతి నమస్కారం పెట్టాడు.

 

    "ఇంక వెళదాం పద" అనిసూర్యారావు అన్నాడు.

 

    ఇరువురూ కలిసి బైటికి వచ్చారు.

 Previous Page Next Page