"నేరం కాదు కదా?"
"కాదు."
"అలా అయితే ఫరవాలేదు. వెళ్ళి అట్టుచేసి భోజనానికి పిలుపు మాణిక్యం" అన్నాడు సూర్యారావు పడక్కుర్చీలో శరీరం వాలుస్తూ.
మాణిక్యాంబ చిక్కుడు గింజలున్న పళ్ళెం ఎత్తుకుని లోపలికి వెళ్ళింది.
"ఇందాకటి జోకేమిటిరా కైలాసం?" సూర్యారావు అడిగాడు.
వివరించాడు గణపతి.
"హారి నీ మాటలు దొంగలు దోలా! అర్థనారీశ్వరుడికే అతుకుపెట్టావా? దేముడే దిగిరావాలిగాని వస్తే ఆయన నెత్తిన కుచ్చులటోపీ పెట్టేట్టున్నావు" పకపకా నవ్వుతూ అన్నాడు సూర్యారావు.
"నన్ను చూస్తే ఆ మాత్రం భయం వుండబట్టే ఆయన దిగిరాంది" సీరియస్ గా అన్నాడు గణపతి.
"హారినీ" అంటూ మళ్ళీ నవ్వాడు సూర్యారావు.
ముగ్గురు పిల్లలూ కోడలు ప్రమీలని చూడటానికి వాళ్ళ పుట్టింటికి వెళ్లారు. రేపుగాని రారు.
ఇంట్లో ఈ రాత్రి వీళ్ళు ముగ్గురే.
కైలాసగణపతి, సూర్యారావు మాటాడుకుంటూ కూర్చున్నారు.
"షికారు ఎందాక వెళ్ళి వచ్చావ్?" సూర్యారావు అడిగాడు.
"కొండదాకా వెళ్ళొచ్చాను. అంతేకాదు కొండ కూడా ఎక్కివచ్చాను. కైలాసగణపతి నెమ్మిదిగా అన్నాడు.
సూర్యారావు ఉలిక్కిపడ్డాడు. "ఏమిటి మళ్ళీ చెప్పు" అన్నాడు.
మళ్ళీ ఆ మాటే చెప్పాడు గణపతి.
"నీకు బుద్ధి లేదు."
"తిట్టకురా సూరీడు!"
"నిన్ను ఉత్తతిట్టటమే కాదు. కొట్టినా పాపం లేదంటాను. అసలు నేనేం చెప్పాను నీవేం చేశావు? నాకు అనుమానమే ఏదో ఇలాంటి అఘాయిత్యం పని చేస్తావని. మంచిగా జెప్పిందంతా వృధా అయింది. అసలు నన్నడిగితే.....
సూర్యారావు కోప్పడుతూ గడగడ మాటాడుతుంటే గణపతి బిక్కముఖం వేసుకుని కూర్చున్నాడు.
సూర్యారావుకి జాలివేసింది. "పోనీలే ఈతఫాకి క్షమించాను. నేను లేకుండా కొండ ఎందుకు ఎక్కావు?" అడిగాడు.
"మధ్యాహ్నం నీవు ఇంట్లోంచి వెళుతూ పొలాల దాగా షికారుగా నడిచి వెళ్ళిరా ఒంటరిగా కొండ ఎక్కకు జారి పడతావు మళ్ళీ కాళ్ళు నొప్పులని అఘోరిస్తావు అని కదా చెప్పి వెళ్ళావు. సరే నీ మాట ప్రకారమే పొలాలు దాగా షికారుగా నడిచి వెళ్లివద్దామని బయలుదేరాను. అలా కొండదాక వెళ్ళాను అప్పుడు."
"ఊ.... అప్పుడు ఏమైంది దెయ్యం కనిపించిందా?" మధ్యలో అడ్డు తగిలి వ్యంగ్యంగా అడిగాడు సూర్యారావు.
"దెయ్యం కాదు మనిషి కనిపించాడు" అని మనసులో అనుకున్నాడు కైలాసగణపతి. ఎందుకో ఆ విషయం పైకి చెప్పటం ఇష్టం లేకపోయింది. చెబుదామా వద్దా అన్నట్లు ఆలోచిస్తూ వుండిపోయాడు.
"ఏమిటి మాటలాడకుండా మూగనోము పట్టావు?" సూర్యారావు అడిగాడు.
"నీవు ముందా వ్యంగ్యం మానేస్తేగానీ చెప్పను."
"సరే - నీ ఇష్టమొచ్చినట్లు చెప్పి ఏడువు."
"అదిగో మళ్ళా!"
"లేదు లేరా బాబూ! కధ కానియ్యి నేను నోరు మెదపను." సూర్యారావు నోటిమీద వేలువేసుకుని మరీ చెప్పాడు.
"ఈ రోజు మా చెల్లెమ్మ మధ్యాహ్నం టిఫెన్ ఏం చేసింది. దిబ్బరొట్టెలు అవునా! అవి తింటే ఏమవుతుంది..... దాహం అవునా! షికారుగా మరికాస్త దూరం నడిస్తే అరుగుతుంది. అని కొండదాకా నడిచాకదా - దాహం అయింది..... వెనక్కి తిరిగి వస్తే తప్పమంచి నీళ్ళు దొరకవు ఇదీ అవును కదా!
అప్పుడు నాకో ఆలోచన వచ్చింది...... వెంటనే ఆచరణలో పెట్టాను. కాళ్లు నెప్పులు చేస్తాయని కొండ ఎక్కటం మానేశాననుకో. అలా నెప్పులు చేస్తూనే ఉంటాయి. పైగా రోజూ ఎంతో కొంత కొండ ఎక్కకుండా ఒకే రోజు రేపు నా అవసరానికి ఎక్కాననుకో అది చూసిన పదిమందికి అనుమానానికి దారి తీస్తుంది. అది సహజమేకదా మరి!
అందుకని నేనో పని చేశాను. ఇటు కొండ ఎక్కటము అలవాటు అవుతుంది కాళ్ళు నొప్పులువుండవు. ఓ అలవాటు కింద నలుగురికి కనిపిస్తాను. దాహము తీరుతుంది. నా ఆలోచన నాకే అద్భుతంగా నచ్చి హుషారుగా కొండ ఎక్కాను. పావు మాత్రం కొండ ఎక్కితే చాలుకదా నీళ్లదొన్నె వస్తుంది. అక్కడి దాకా కొండ ఎక్కాను కడుపు నిండా నీళ్ళు పట్టించాను. తాపీగా కిందకి దిగి వచ్చాను..... నేను చేసింది తప్పా! ఇప్పుడు చెప్పు సూరీడూ...."
కైలాసగణపతి వివరంగా చెప్పి అడిగాడు.
"మంచి పని చేశావు" సూర్యారావు మెచ్చుకోలుగా అన్నాడు.
"మళ్ళీ వ్యంగ్యమా....." కైలాస గణపతి అడిగాడు.
"కాదు నిజంగానే అంటున్నాను. నలుగురి కళ్ళు కప్పటానికి ఆ మాత్రం నటన చేయక తప్పదు. నీకు నిజంగానే చాలా చక్కని ఆలోచన వచ్చింది...." అన్నాడు సూర్యారావు.
"చేయబోయేది ప్రమాదంతో కూడినపని అయినప్పుడు ఆలోచన కూడా అద్భుతంగా వుండాలి..... ఉపాయంలేని వాళ్ళు ఊళ్ళో వుండరాదు అన్నారు."
"హారినీ....." అంటూ మళ్ళీ నవ్వాడు సూర్యారావు.
భోజనాలకి పిలుపు వచ్చిం దాకా ఇరువురూ మాట్లాడుతూ అలాగే కూర్చుండిపోయారు.
15
కైలాసగణపతి షికారుకి బైలుదేరాడు.
ఈ మధ్య షికారుకి సూర్యారావు రావటం లేదు. మొదట్లో వచ్చేవాడు వూళ్లో వ్యవహారాలు, పనులు, పొలం విషయము అలా అలా చాలా వ్యాపకాలే వున్నాయి సూర్యారావుకి. స్నేహితుడి కోసం కొన్నాళ్ళు త్యాగంచేసి అవన్నీ మానేశాడు.... ఇప్పుడు మళ్ళీ రొటీన్ వర్క్ లో పడ్డాడు.