మాది చాలా చిన్న పల్లె. ఆ వూర్లో దాదాపు అందరూ నాకు తెలుసు. ఆనంద్ అప్పటికే పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. అందుకే తనని చూడలేదు. తరువాత తెలిసింది మా నారాయణమ్మ కొడుకని.
సరే టిక్కెట్టు ఎవరి దగ్గరుండాలి? అన్న ప్రశ్న వచ్చింది. నా దగ్గరే వుంచమన్నాడు. నేనెవర్నో అడిగి తెలుసుకున్నాడు. వచ్చేస్తుంటే వెనకనుంచి, "లాటరీలో డబ్బు వస్తే నన్ను మోసం చేయకూడదు సుమా" అని అరిచాడు, నాకు నవ్వూ కోపమూ వచ్చాయి.
మరుసటిరోజు పేపర్లో చూస్తే మేము కొన్న టిక్కెట్టుకి లక్షరూపాయలు బహుమతి వచ్చినట్టు పడింది. చాలా సేపటి వరకూ నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. ఆనందం పట్టలేక అమ్మకి ఈ విషయం చెప్పాను. అమ్మ మావయ్యకి ఆ విషయం చెప్పింది. నేను చేసిన తప్పు అదే మావయ్య నా దగ్గిర నుంచి టిక్కెట్ లాక్కొన్నాడు. మరుసటిరోజే హైదరాబాదు వెళ్ళాడు- డబ్బు తీసుకురావటానికి మాకు లక్ష రూపాయలు వచ్చిన సంగతి ఊరంతా గుప్పుమంది. అందరూ అకస్మాత్తుగా మమ్మల్ని గౌరవంగా చూడటం ప్రారంభించారు.
అప్పటివరకూ మాకు పల్లెలో గౌరవం లేదు. కారణం మా అమ్మ వేశ్య ప్రెసిడెంట్ గారి దగ్గిర్నుంచి కరణంగారి వరకూ అందరికీ మా యిల్లు ఒకప్పుడు విడిది. నాకు వూహ తెలిశాక కూడా వాళ్ళు వస్తూ వుండేవాళ్ళు నన్ను కూడా ఆ వృత్తిలోకి దింపాలని అమ్మకి బాగా కోరికగా వుండేది. కానీ నేను తీవ్రంగా ప్రతిఘటించటంతో ఆ ఆలోచనలకి తాత్కాలికంగా శలవు చెప్పింది.
నాకు ఏడుపొక్కటే తరువాయి.
అమ్మకి బ్రతిమలాడుతున్నట్టు చెప్పాను- నేనూ అతడూ సగం సగం డబ్బులు వేసుకొని ఆ టిక్కెట్ కొన్నట్టు!- అందులో సగభాగం అతడికి ఇవ్వాలన్నట్టు!! అమ్మ మింగేసేలా చూసింది. "నీకేమైనా మతిపోయిందేమిటి? ఎవడో ముక్కూ మొహం తెలియని మనిషికి అప్పనంగా యాభైవేలు ఇస్తావా?" అని కసిరింది.
"వాడి అర్ధరూపాయి గురించి ఎవరితోనైనా చెప్పినట్టు తెలియనీ- రౌడీల్తో వాడిని కొట్టివ్వకపోతే నాకు మారు పేరుపెట్టు" అని సవాలుచేసి మరీ వెళ్ళాడు మావయ్య.
నాకేం చెయ్యాలో తోచలేదు. షాపు దగ్గిర టిక్కెట్టు కొంటూన్నప్పుడు అతడు నవ్వుతూ అన్న మాటలే గుర్తొస్తున్నాయి. అతడిని వెళ్ళి కలుసుకున్నాను. జరిగింది చెప్పి "మీరు నాకు ఏ శిక్ష విధించినా భరిస్తాను. తప్పు నాదే. మీరెంతో నమ్మకంతో టిక్కెట్టు నా దగ్గిర వుంచితే నేనిలా చేశాను...." అన్నాను తలదించుకుని.
"అర్ధరూపాయివ్వండి" అన్నాడు.
అతడేమంటున్నాడో నాకు అర్ధం కాలేదు.
"నా అర్ధరూపాయి నాకిచ్చెయ్యండి ఋణం తీరిపోతుంది-" అన్నాడు అదే చిరునవ్వుతో నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నా తల్లి... మావయ్య.... ఇతడి ముందు ఎంత అల్పులో అర్ధమైంది. పరిస్థితి అతడు గమనించి నట్టున్నాడు. "దీని గురించి అసలు ఆలోచించవద్దు. మర్చిపోండి" అన్నాడు. అంత మంచితనాన్ని భరించలేకపోయాను.
ఆ రాత్రి అమ్మతో గొడవ పెట్టుకున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనైనా యాభైవేలు అతడికివ్వాలని రాద్దాంతం చేశాను. అమ్మ నామీద విరుచుకుపడింది. ఆమె అన్న మాటలు యధాతధంగా ఇవి- యాభైవేలు ఇచ్చేబదులు కన్నెరికం చేయించుకోరాదటే. అటు ఫలం దక్కుతుంది- ఇటు మాకు బాధా తప్పుతుంది! వయసులో వచ్చే రాబడి అంతా పోగొడ్తున్నావు గదే... కనీసం వాడితోనన్నా మొదలెట్టు".
ఆ రాత్రి అమ్మ నిద్రపోయాక, నాలుగు బట్టలు సర్దుకుని అతడి దగ్గరకు వెళ్ళాను. ఇన్నేళ్ళ తరువాత తల్చుకుంటే అపుడంత ధైర్యం ఎలా వచ్చిందా అనిపిస్తుందిగానీ, ఆ రాత్రి నాకేమీ భయం వేయలేదు. ఒక మురికికూపం నుంచి బయట పడుతున్నాను అన్న సంతృప్తి మాత్రం కలిగింది.
"పడవలో పట్నం వెళ్ళిపోతున్నాను ఆనందబాబూ! మరోసారి మిమ్మల్ని క్షమించమని అడగటానికి వచ్చాను. ఆ ఇరుకు మనుష్యుల మధ్య నేనుండలేను" అన్నాను.
అతడు ఆశ్చర్యపోయాడు మొదట, తరువాత నచ్చచెప్పాడు. పాతిక సంవత్సరాల క్రితం అతడు అన్న మాటలు ఇప్పటికీ నాకు బాగా గుర్తున్నాయి. బంధుత్వాన్ని ఎప్పుడూ డబ్బుతో పరీక్ష పెట్టకండి ప్రమద్వరా! ఈ డబ్బు అనేది చాలా పాపిష్టిది. నీలి లిట్మస్ ను కూడా ఎర్రగా మారుస్తుంది. ఆత్మీయతని అడుక్కి తోసేస్తుంది అది. కొన్ని కొన్ని ఆత్మీయతల్ని పరీక్షల ప్రవాహానికి ఎదురు నిలపకపోతేనే మంచిది".
"మీకు తెలీదు. ఆ ఇంట్లో నేను నేనుగా మిగలను".
"రేపు పట్నం వెళ్ళినా మీరు మీరుగా మిగలరు". అన్నాడు అతడు మందలిస్తున్నట్టు "ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి".
రాత్రయితే ఆవేశంలో అలా వెళ్ళిపోయాను గానీ, తెల్లవారేక నా ధైర్యాన్ని తల్చుకుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అతడన్న మాటల్లో నిజం అర్ధమైంది అతడే గానీ వారించకపోయి వుంటే ఈ పాటికి ఎక్కడ వుండేదాన్నో..... పట్నంలో ....ఏ ఇం....ట్లో...నో! నేనూ, నా కుటుంబ సభ్యులు కలిసి అతడిపట్ల చేసిన మోసానికి మాత్రం నా మనసు సిగ్గుపడుతూనే వుంది. రెండు రోజుల తఃరువాత మావయ్య మొహం వేలాడేసుకుని దిగాడు. పేపర్లో నెంబరు తప్పుపడింది. లాటరీ మాకు రాలేదు.
పల్లె పల్లెంతా ఘొల్లుమంది.
నాకు మాత్రం ఎందుకో చెప్పలేనంత సంతోషం వేసింది.
డబ్బు రానందుకు బాధకన్నా, నేను ఆనంద్ కి ఋణపడి లేనన్న సంగతి నాకు ఎక్కువ ఆనందాన్నిచ్చింది. మా వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పినందుకు దేముడికి మనసులోనే కృతజ్ఞత చెప్పుకున్నాను.
ఏదైతేనేం, ఆనంద్ బాబుతో అలా జరిగింది. నా మొదటి పరిచయం ఆ తరువాత మేము ఎక్కువసార్లు కలుసుకోలేదు. కానీ ప్రతి సాయంత్రమూ అతడు వ్యాహ్యాళికి మా ఇంటిముందు నుంచి వెళ్ళేవాడు. ఆ సమయానికి నేను చూసేదాన్ని నేను చూస్తున్నానని అతడికి తెలుసని నాకు తెలుసు. నిశ్శబ్దం మా ఇద్దరిమధ్యా రాయబారాన్ని నడిపేది. నేను అందమైనదాన్ని కాను. నా కళ్ళు మాట్లాడవు. అందుకే నిశ్శబ్దాన్ని ఆశ్రయించాను.
ఆ నిశ్శబ్దాన్ని బ్రద్దలు కొట్టింది తరళ.
* * *
తరళ జి.పి.రావుగారి అమ్మాయి. మేమిద్దరం కలసి చదువుకున్నాం. తరళ నాలా కాదు, చాలా తేలిగ్గా తీసుకునేది ఏ విషయాన్నైనా పల్లెలో ఎవర్నీ లెక్కచేసేది కాదు. పల్లె కూడా తనంటే భయపడేది. పల్లెలో అందరి దగ్గరా ఎంత డబ్బుందో రావుగారి దగ్గర అంతుంది మరి.
తరళకి డబ్బున్నవాళ్ళు అమ్మాయిని అన్న గర్వం ఏమాత్రం లేదు. డబ్బే కాదు, తనకి దేముడు అందం కూడా ఇచ్చాడు. సన్నజాజి తీవెలా వుండేది. పోతే అల్లరెక్కువ. అందమైన అమ్మాయి అల్లరెంత చేసినా బాగానే వుంటుంది.