పోలీస్ స్టేషన్ ముందు కారు దగ్గిర అతడు నిలబడి వున్నాడు. లోపల్నుంచి మెట్లు దిగిన ఇన్ స్పెక్టరు దగ్గిరకు రాగానే "విజయ్" అన్నాడు. "చూశారా సాధించాను!"
విజయ్ ఆగాడు. అతడి మొహంలోకి మొదటిసారి సూటిగా చూశాడు "నిజమే. నువ్వు గొప్పవాడివి. రెండురోజుల్లో ఒక ప్రభుత్వోద్యోగిని ఉద్యోగంలో తీసేయించగల గొప్పవాడివి. అయినా ఇవేమిటి- ఇంకా గొప్ప పనులు చాలా అవలీలగా చేయగలవు నువ్వు! నువ్వు తల్చుకుంటే రాత్రికి రాత్రి ప్రభుత్వ యంత్రాంగాన్నే మార్చెయ్యగలవు! అయినా నువ్వు చేయలేని పని ఒకటుంది. నీకు తెలుసా అదేమిటో?... హాయిగా నవ్వటం! అదీ నువ్వు చేయలేనిది....! అనుక్షణం టెన్షన్ తో, ఎవరు నీ మీద దెబ్బతీస్తారా అన్న భయంతో, ఎవరిని ఎలా దెబ్బతీయాలా అన్న ఆలోచనతో బాధపడతావు. అందుకే నువ్వు నవ్వలేవు. నా ఉద్యోగం తీసేయించావు. కానీ ఏది? నా మొహంలో చిరునవ్వు చెరిగిపోయేలా చెయ్యి చూద్దాం! అది నీకు సాధ్యం కాదు... ఎందుకంటే నా మనసుకి నేను జవాబుదారీ కాబట్టి. నీ మనసుకి నువ్వు జవాబు చెప్పుకోలేవు కాబట్టి.... గుడ్ బై" వెళ్ళిపోయాడు.
అతడి మొహం పాలిపోయింది. కానీ క్షణంలోనే తేరుకున్నాడు. ఇలాటి వాటికి అతడు అతీతుడు. కారు డ్రైవ్ చేసుకుంటూ అతడి ఇంటివైపు బయల్దేరాడు. కానీ మనసంతా ఏదో ఇరుకైన భావన. కారు పోర్టికోలో ఆపుచేస్తుంటే 'హాయ్' అన్న పిలుపు వినిపించింది. ఒక పద్దెనిమిదేళ్ళ అమ్మాయి పరుగెత్తుకుంటూ వచ్చింది.
ఆ అమ్మాయి జీన్స్ పాంటు వేసుకుంది. పైన వేసుకొన్న బనియన్ వంటికి అతుక్కు పోయినట్టు వుంది. ఆ బనియన్ కి రొమ్ముల మీద "హిట్ మి హియర్" అని వ్రాసి వుంది. ఆ అమ్మాయి పేరు శైలజ. రామ్మూర్తి కూతురు.
పరుగెత్తుకుంటూ కారు దగ్గిరకి వచ్చి అతడి బుగ్గమీద గట్టిగా ముద్దు పెట్టుకుంటూ "అబ్బా- ఈ రోజు నాకెంత ఆనందంగా వుందో చెప్పలేను" అంది.
"నీకు ఆనందంగా వుండటం నాకు సంతోషమేగానీ దాన్ని నువ్వీ విధంగా ప్రదర్శించటమే బావోలేదు. ఇంతకీ విషయం ఏమిటి?" అదే పెన్సివ్ మూడ్ లో అన్నాడు. "మా నాన్నకి నువ్వు గొప్ప సాయం చేశావుట మహానందపడిపోతున్నాడు".
"ఏం సాయం?"
"మా అన్నయ్య ఉద్యోగం పోబోతోందటగా, అందుకూ ఆనందం".
అతడికి షాక్ తగిలినట్టయింది. "అందుకు ఆనందం ఏమిటి?"
"మా అన్నయ్యకి ఏవో సిద్ధాంతాల పిచ్చి వుందిలే. నాన్నతో దెబ్బలాడి సంవత్సరం నుంచీ విడిగా వుంటున్నాడు. ఈ దెబ్బతో కడుపుమాడి ఇంటికి తిరిగివస్తాడని సంబరపడిపోతున్నాడు" భూమి గిర్రున తిరిగి పోతున్నట్టు అనిపించింది.
ఆమె వివరంగా చెప్పుకుపోతుంది అతడు అన్యమనస్కంగా వింటున్నాడు సగం అర్థమవుతోంది. సగం అవటం లేదు!
తను రాత్రి ఫోన్ చేసినప్పుడు రామ్మూర్తి ఎందుకు మౌనంగా వింటూ వుండిపోయాడో ఇప్పుడు అర్థమైంది. బహుశా తనలో తానేనవ్వుకుంటూ వుండివుంటాడు. అది కూడా కాదు అతడు ఆలోచిస్తున్నది.
పోలీస్ స్టేషను మెట్లు దివుతూ విజయ్ అన్నమాటలు ...
... నా మనసుకు నేను జవాబుదారి కాబట్టి. నీ మనసుకి నువ్వు జవాబు చెప్పుకోలేవు కాబట్టి ...
కోటీశ్వరుడైన తండ్రి పంథా నచ్చక అతడితో దెబ్బలాడి - ఒక చిన్న గదిలో ఉంటూ- తన జీతంతో నిజాయితీగా బ్రతికే ఒక ఇన్ స్పెక్టర్ బ్రతుకుతెరువుని కేవలం తమ తమ వ్యక్తిగత కక్షలతో నిర్దాక్షిణ్యంగా తెగగొట్టారు.
విజయ్ తన తండ్రితో కలిసి ఉండటం లేదని తెలుసు కానీ అది చాలా మామూలు విషయం అనుకున్నాడు. ఉద్యోగం ఒక హాబీగా చేస్తున్నాడని అనుకున్నాడు. కాని తను నమ్మిన సిద్దాంతం కోసం అతని తండ్రి ఒక బట్లర్ కిచ్చేపాటి జీతంతో బ్రతుకుతున్నాడని తెలుసుకోలేకపోయాడు. ఈ చదరంగపు మొదటి ఎత్తులోనే ఓడిపోయాడు. ఇప్పుడేం చేయాలి? ఎలా గెలవాలి?
గెలవటం సరే. విజయ్ ని ఏం చేయాలి? ఎలా ఈ తప్పు సరిదిద్దాలి?
అతడికి ఒక ఆలోచన స్పురించింది.
* * *
అతడు విజయ్ కి ఫోన్ చేశాడు. "విజయ్".
"....మాట్లాడుతున్నాను"
"నేను విజయ్. ఆగు ఫోన్ పెట్టెయ్యకు. నేనింతవరకు నా జీవితంలో ఎవరికీ క్షమాపణలు చెప్పుకోలేదు విజయ్! మొట్టమొదటిసారి నీకు చెప్పుకుంటున్నాను. ఐయామ్ సారీ నాకు తెలీదు- నీకు మీ నాన్నకీ పడదనీ, నువ్వు ఇంటినుంచి విడివడి వేరేగా వుంటున్నావనీ..."
ఈ అకస్మాత్తు ఫోన్ కాల్ ఊహించని విజయ్ వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. కొంచెంసేపటికి తేరుకుని "ఇట్సాల్ రైట్" అన్నాడు. "-కానీ నేను మా నాన్న నుంచి విడిపోవటానికి, నువ్వు నా ఉద్యోగం తీసేయించినందుకు బాధపడటానికి సంబంధం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నా ఉద్దేశ్యంతో నువ్వు నా మీద "కసి తీర్చుకోవటానికి కారణం కేవలం నేను మా నాన్నని అరెస్టు చేయలేదని-"
"నిజమే. కానీ దానికన్నా ముఖ్య కారణం మీ నాన్నని- ఐమీన్ వంకచెక్కా రామ్మూర్తిని దెబ్బకొట్టటం... నీ ఉద్యోగం పోతే బాధపడతాడనుకున్నాను".
"బాధా..." అట్నుంచి చిరునవ్వు వినిపించింది. "సంతోషిస్తాడు"
"అవును. నాకు ఇప్పుడే తెలిసిందా విషయం. విజయ్ నాకో అరగంట టైమివ్వు. నీ సస్పెన్షన్ కాన్సిల్ చేయించి నీకు తిరిగి ఆర్డరు వేయించే బాధ్యత నాకు వదిలిపెట్టు, అక్కడవుండు అరగంటలో ఆర్డరు పట్టుకొస్తాను..."
అట్నుంచి జవాబు లేదు.
"ఏం మాట్లాడవు"
విజయ్ కంఠం నెమ్మదిగా వినిపించింది. "పోలీస్ స్టేషన్ ని బాంబులతో బ్రద్దలుకొట్టిన నేరానికి అరెస్టు కావలసిన రాక్షసుడు... అతడు తల్చుకుంటే అదే పోలీస్ డిపార్ట్ మెంట్ లో అరగంటలో తిరిగి ఉద్యోగం ఇప్పించగలడు! ఏం మాట్లాడను? నాకు నోటివెంట మాట రావటం లేదు" వ్యంగ్యంగా అన్నాడు.
"అవును విజయ్! భారతమాతని చెక్కపెట్టెలో మేకులు కొట్టి బంధించి వుంచినందుకు అరెస్టు కావలసిన రాక్షసుడు- అదే పెట్టెని అమ్ముతానూ అంటే టోకున అమ్ముతావా, చిల్లరగా ముక్కలుచేసైనా ఫర్వాలేదా అని బేరమాడే రాజకీయ నాయకులు ఉన్న దేశం ఇది. ఉద్యోగానిదెంత. చాలా సులభం".
అని ఫోన్ పెట్టేశాడు.
* * *
పురోహితన్!
చీఫ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్ మెంట్.