"ఒకవేళ నేనిదే ఫోన్ నుంచి నీ తండ్రి అయిన వంకచెక్కా రామ్మూర్తికి ఫోను చేసి 'నీ శత్రువైన లోహియని రాత్రికి హత్య చెయ్యి' అని చెపితే నీ తండ్రిని కూడా ఇలాగే అరెస్టు చేసి తీసుకొచ్చి రాత్రి వుంచుకుంటారా అని! అహ-ఊరికే అడుగుతున్నాను సుమా!"
విజయ్ మాట్లాడలేదు. అతడు లేచాడు. లేచి అన్నాడు- "నీ చట్టాన్నీ - నీ న్యాయాన్నీ చూసి నీకు సిగ్గు వేయటం లేదూ? నీకు తెలుసు. నీ తండ్రే ఈ హత్య చేశాడని! అయినా అరెస్టు చేయవు! కానీ నా నుంచి ఎవరో ఫోన్ కాల్ అందుకున్న నేరానికి వాళ్ళని అరెస్టు చేస్తావు..."
"శాంతి భద్రతల దృష్ట్యా నేను ఇలా చేయ..."
"శాంతి-భద్రత! ఏది శాంతి? లక్షలమంది ప్రజల ఆరోగ్యం కోసం ఒక డాక్టరు మన దేశానికి వస్తే తనకి జరిగే చిన్న నష్టం జరక్కుండా వుండటం కోసం ఒకరు హత్య చేస్తే గో టూ హెల్ విత్ యువర్ శాంతి అండ్ భద్రత" అంటూ అక్కడ్నుంచి లేచాడు.
అతడు బయటకు వస్తూంటే సింహమూ, రాబోట్ వాన్ నుంచి దిగుతూ కనిపించారు. అరక్షణం పాటు వాళ్ళ కళ్ళు మాట్లాడుకున్నాయి.
అతడు కారు దగ్గిరకు వెళ్ళాడు.
మరుక్షణం కారు కదిలిపోయింది.
ఇంటికి వెళ్ళగానే అతడు ఫోన్ చేశాడు.
"ఎవరదీ?" అటునుంచి వినిపించింది.
"నువ్వెవరు?"
"రామ్మూర్తి!"
"నువ్వు స్టాంపు పేపరు మీద వ్రాసిచ్చిన కొటేషనుకి కృతజ్ఞతలు. నిజంగా చదరంగంలో చచ్చేది పావులే. మన మధ్య ఆటలో ఇప్పుడు దెబ్బ తినబోయే పావు నీ కొడుకు. రెండు రోజుల్లో అతడి ఉద్యోగం పోతుంది. నీ చేతనైతే రక్షించుకో" అని ఫోను పెట్టేశాడు.
* * *
ఆ రాత్రి ఎనిమిదింటికి వాణి క్యారియర్ పట్టుకొని పోలీసు స్టేషనుకి వెళ్ళింది.
"ఏమిటిది?" అని అడిగాడు విజయ్.
"మా వాళ్ళు లోపలున్నారు. భోజనం తీసుకొచ్చాను" అంది ఇంగ్లీషులో.
"వాళ్ళ సంగతి మేం చూసుకుంటాం. వెనక్కి తీసుకెళ్ళండి" అన్నాడు ఇన్ స్పెక్టర్. ఆమె కొంచెంసేపు వాదించింది. లాభంలేకపోయింది. ఆమె వెనుదిరిగింది. ఇది జరిగిన అయిదు నిముషాలకి అతడి దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. "ఏమిటి మా వాళ్ళకి క్యారియర్ తెస్తే కూడా ఒప్పుకోలేదుట" అని అడిగాడు అమాయకంగా.
"మా లాకప్పులో వున్న వాళ్ళకి తిండి కావాలని మాకు తెలుసు. మీరు గుర్తుచెయ్యక్కర్లేదు" అన్నాడు విజయ కటువుగా ఇట్నుంచి.
"లాకప్పులో పెట్టిన ఇరవై నాలుగ్గంటలోగా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలన్న సంగతి కూడా తెలుసనుకుంటాను మీకు- మరి ఏ ఛార్జి మీద హాజరు పరుస్తారు?"
"అది మీకనవసరం".
అట్నుంచి అర్థింపు- అది నటనో నిజమో తెలీదు కానీ వినబడింది. "పాపం మా వాణికి సింహం అంటే అమితమైన ఇష్టంలా వుంది. చేతులతో తినిపించదులెండి క్యారియర్ అందజేయండి ఆమె తరఫున!"
"ఇలాంటివి నేను చాలా చూశాను! అన్నం మెతుకుల మీద సందేశం వ్రాసి అందించగల సమర్థుడివి నువ్వు, నిన్ను నమ్మను".
"రేప్రొద్దున్న ఎలాగూ మా వాళ్ళని వదిలేస్తారు మీరు. ఈ ఒక్క రాత్రికి క్యారియర్ తెస్తే ఏం పోయిందట?"
"నీ పట్టుదల చూస్తూంటే అనుమానం మరింత బలపడుతూంది. సారీ" అంటూ ఫోన్ పెట్టెయ్యబోయాడు.
"ఒక్క మాట!"
"ఏమిటి?"
"మనిద్దరం ఎప్పటినుంచీ ఏకవచనంలా సంబోధించుకునేటంత స్నేహితులమయ్యాము?" వెటకారం ధ్వనించింది అతడి కంఠంలో.
జవాబు చెప్పకుండా విజయ్ ఫోన్ పెట్టేశాడు.
ఆ తరువాత పదినిముషాలకి ఆ వీధి చివర చిన్న గొడవ జరిగింది. ఆ ప్రాంతంలో హిందూ ముస్లిమ్ గొడవలెక్కువ కాబట్టి విజయ్ స్వయంగా వెళ్ళాడు. దాని కోసమే చూస్తూన్న వాణి, అతడలా బయటకు వెళ్ళగానే క్యారియరుతో తిరిగి ప్రవేశించింది. ఈసారి కానిస్టేబుల్ వున్నాడు. ఆమె ఒక్క చిరునవ్వు అలాటి వాళ్ళని వేయిమందిని గెలవగలదు. కానీ శివరామయ్య కాస్త తెలివిగా ప్రవర్తించాడు. పరోటా మధ్య కత్తి పెట్టి పంపినవాళ్ళని నా సర్వీసులో నే ఎరుగుదును" అంటూ అన్నం అంతా కెలికి చూశాడు. ఏమీ దొరకలేదు.
"ఏముంటుంది. తెలగపిండి కూరా, శనగపిండి చారూ" అంది. ఆ క్షణం ఆమెని చూసినవారు ఇంగ్లీషులో కూడా ఆమె అంత బాగా మాట్లాడగలదని అనుకోరు. అచ్చు సింహానికి వుంపుడుగత్తె లాగానే వుంది. శివరామయ్యలాటివాడిని పావుగంటసేపు మానేజి చెయ్యటం వాణికి వెన్నతో పెట్టిన విద్య. లాకప్ లో వాళ్ళిద్దరూ భోజనం చేశాక క్యారియరు తీసుకుని వాణి వెళ్ళిపోయింది.
ఈ లోపులో గొడవ సర్దుకుని విజయ్ తిరిగి వచ్చాడు. చాలా అలసటగా వుంది. డ్యూటీ పూర్తిచేసుకుని వెళ్ళిపోబోతుండగా రిలీవరు ఆ రోజు రావటంలేదని తెలిసింది. ఉసూరుమంటూ కూర్చున్నాడు.
డ్యూటీ పూర్తి అవగానే శివరామయ్య శల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. విజయ్ కుర్చీలో వెనక్కి కళ్ళు మూసుకున్నాడు. పోలీస్ స్టేషను అంతా నిశ్శబ్దంగా వుంది. రాత్రి పదయింది. కుర్చీలోనే విజయ్ కి నిద్రపట్టింది.
రాత్రి ఒంటిగంట అవుతూండగా నిశ్శబ్దాన్ని చీలుస్తూ భయంకరమైన పేలుడు శబ్దం వినిపించింది. పోలీస్ స్టేషన్ గోడలు కదిలిపోయాయి విజయ్ అదిరిపడి లేచేలోపులోనే బయట రోడ్డుమీద కారు బయలుదేరిన శబ్దం వినిపించింది. లాకప్ గోడకు రాజమార్గంలా చేసిన రంధ్రంలోంచి ఇద్దరూ బయటకు వెళ్ళిపోయారు.
...ఆ తరువాత సంఘటనలన్నీ రెండ్రోజుల్లో జరిగిపోయాయి. ఏ ఛార్జితో వాళ్ళని లాకప్ లో పెట్టారో విజయ్ చెప్పలేకపోయాడు. పోలీసు శివరామయ్య తనకేమీ తెలీదన్నాడు. ప్రొద్దున్నుంచి విజయ్ డ్యూటీలో ఉన్నాడు. లోపల ఖైదీలు తుపాకి మందు సంపాదించగలగటం దారుణమైన నేరం. పత్రికలు పోలీస్ డిపార్టుమెంట్ అసమర్థతని తిడుతూ వ్రాసినయ్. అమాయకుల్ని లాకప్ లో పెట్టినందుకు మరికొన్ని పత్రికలు సంజాయిషీ అడిగినయ్.
సరిగ్గా రెండోరోజు సాయంత్రం నాలుగింటికి విజయ్ ని సస్పెండ్ చేస్తూ ఆర్డర్లు వచ్చినయ్.
(అతడేమీ మాట్లాడలేదు. ఆర్డరు సంతకం చేసి తీసుకుని బయటకు నడిచాడు. భోజనం క్యారియరులో తెలగపిండి కూర- శనగపిండి మిశ్రమమే తుపాకి మందు అని అతడికి తెలీదు. అసలు క్యారియరు సంగతే అతడికి తెలీదు. అతడికి తెలీని విషయం ఇంకొకటి వుంది. ఆ రోజు రాత్రి తనని రిలీవ్ చేయటానికి రాని ఇన్ స్పెక్టర్ బలవంతంగా ఆపుచేయబడ్డాడని.)