Previous Page Next Page 
రాక్షసుడు పేజి 23


    కొంకణి జాతికి సంబంధించినవాడు. అందులో వెనుకబడ్డ తెగ! ఐ.పి.యస్.లో అందుకే సులభంగా సెలెక్టు అయ్యాడు. మిగతా వాళ్ళందర్లాగే అతడూ ఒకసారి ఈ గౌరవప్రదమైన ఉద్యోగంలోకి రాగానే తన కులాన్ని - 'వెనకపడ్డ' తనవాళ్ళని మర్చిపోయి హై సొసైటీ మెంబర్ అయ్యాడు. ఒకప్పుడు తను నివసించిన ఊరి చివరి "వాడ" అంటేనే అసహ్యం అతడికి. అయినా ఇదంతా ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం మాట.

 

    తరువాత అతడు తన రాష్ట్రాన్ని వదిలి ఆంధ్రప్రదేశ్ కొచ్చాడు. అప్పటి ముఖ్యమంత్రికి ఇతడికీ 60:40 షేర్లు ఉండేవి. కాలం హాయిగా సాగిపోయింది. కానీ తర్వాత చిన్న దెబ్బ తగిలింది. కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రికీ ఇతడికీ సరిఅయిన టర్మ్స్ కుదర్లేదు. ఫలితంగా అతడు సస్పెండ్ అయ్యాడు.

 

    కానీ పురోహితన్ కూడా సామాన్యమైనవాడేమీ కాదు. ప్రజల్లో ముఖ్యమంత్రికి పలుకుబడి వుండవచ్చుగాక. కానీ "సర్కిల్స్" లో అతడికి పలుకుబడివుంది. హైకోర్టు జడ్జిని "కొనేసి ఉద్యోగానికి స్టే తెప్పించుకున్నాడు. సస్పెన్షన్ కి సరిఅయిన కారణాలు లేవని కోర్టు అభిప్రాయపడింది.

 

    ముఖ్యమంత్రి అహం దెబ్బతిన్నది. అతడిని మరిలేవకుండా స్మాష్ చేయాలనుకున్నాడు. రాజకీయాల్లో ఎత్తులకి కొదవేముంది. పురోహితన్ కి తిరిగి చీఫ్ ఆఫ్ పోలీస్ పదవి ఇవ్వబడింది. మొదట్లో పురోహితన్ కి అనుమానం వచ్చింది. కానీ రెండు మూడు నెలలు తిరిగేసరికల్లా సర్దుకున్నాడు. తిరిగి తన పొజిషన్ తనకివచ్చింది. దాంతో ముఖ్యమంత్రి తనతో రాజీకి వచ్చాడు అనుకున్నాడు. నెమ్మదిగా చేతులు సాచటం మొదలుపెట్టాడు. అతడిచుట్టూ పది కళ్ళు గమనిస్తున్నాయని అతడికి తెలీదు. ఈసారి మరింత పకడ్బందీగా ఒక శుభ ముహూర్తాన, అతడు పొద్దున్నే లేచి బ్రష్ మీద పేస్టుకని బాత్ రూమ్ లోకి వెళ్ళబోతున్న సమయాన ఎ.సి.బి. అధికారులు అతడి ఇంటిమీద రెయిడ్ జరిపారు. అతడు దొరికిపోయాడు.

 

    అక్కడితో ఈ ఆట పూర్తి కావల్సిందే.

 

    కానీ ఆ రోజు ముఖ్యమంత్రి ఊర్లో లేడు. దాంతో మరింత ముందుకు సాగింది.

 

    ఎ.సి.బి. చీఫ్ కి ముఖ్యమంత్రికన్నా తన కొడుకులూ, కూతుళ్ళూ ముఖ్యం. తను రిటైరయ్యే లోపులో వారి ఆస్తుల్ని కనీసం రెట్టింపు చేసే ప్రయత్నంలో వున్నాడు. పురోహితన్ కి రహస్యంగా ఫోన్ చేశాడు.

 

    "ఎంత"

 

    "పాతిక లక్షలు"

 

    "మైగాడ్. అంతా"

 

    "నే నొక్కణ్ణేకాదు. మీ ఇంటిని రైడ్ చేసిన ఇనస్పెక్టర్లందరికీ తలో రెండు లక్షలు ఇవ్వాలి. అదీగాక చాలా రిస్కు. ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా ఇందులో ఇంటరెస్టుతో వున్నాడు".

 

    "కానీ పాతిక లక్షలంటే..."

 

    "మిష్టర్ పురోహితన్... మీరూ పోలీస్ డిపార్టుమెంట్ మనిషే. ఒకసారి అరెస్టు అవుతే యెంత పరువు నష్టమో మీకూ తెలుసు. రేప్రొద్దున్నే విమానంలో ముఖ్యమంత్రి దిగుతున్నారు. రాత్రికి రాత్రి రికార్డులన్నీ మార్చెయ్యాలి. మీకు రాత్రి పదింటివరకూ టైం ఇస్తున్నాం. ఆ లోపులో పంపితే పంపండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. యిది మీరు మాకు సాయం చేయటం కాదు. మేము మీకు చేయటం-" అంటూ ఫోను పెట్టేసేడు.

 

    పురోహితన్ కి ఏమీ పాలుపోలేదు. రాత్రి లోపులో పాతిక లక్షలు ఎక్కడ తెస్తాడు?

 

    అదృష్టవశాత్తూ ప్రొద్దున్న జరిగిన రైడింగ్ సంగతి ఇంకా పేపర్ లో ఎక్కలేదు. ఈ రోజు తన రియాక్షన్ చూసుకుని రేపు వార్త విడుదల చేస్తారన్నమాట. ఎ.సి.బి. వాళ్ళు. ఈ పరపతి- ఈ డబ్బు సంపాదన- ఈ ఉద్యోగం రేపట్నుంచి వుండదు.

 

    ఉద్యోగంలో వుంటే పాతిక లక్షలు సంపాదించటం కష్టం కాదు. కానీ యిప్పుడు రాత్రికి రాత్రి సంపాదించటం ఎలా? అతడికి అప్పుడు జి.కె. గుర్తొచ్చాడు.

 

    జి.కె. ఇలాటి వ్యవహారాల్లో తన స్నేహితుడు...

 

    జి.కె.ని సంప్రదించాడు. అంత తొందర్లో కృష్ణమూర్తి మాత్రం ఏం చేయగలడు.

 

    ఆలోచన చెప్పగలవాడు "అత" డొక్కడే! జి.కె. యథావిధిగా కొడుకుని ఈ విషయం కాస్త "చూడ" మన్నాడు. అతడు రంగంలోకి దిగాడు. అయిదు నిముషాల్లో ప్లాన్ రెడీ అయింది.

 

    అతడు - వాణి - రాబోట్ - ష్యామా - భరత్. ఆరు ఫోనులు ఆరు గంటలసేపు నిర్విరామంగా పనిచేసినయ్... మొదటి ఫోను...

 

    "హలో పపట్ లాల్ జీ..."

 

    "హఁ"

 

    "ఎలా వున్నారు?"

 

    "తమరి దయవల్ల బాగానే వున్నాను"?

 

    "జంక్షన్ లో కడుతున్న సినిమా హాలు ఎంతవరకూ వచ్చింది?"

 

    "పునాదులు లేచినయ్ సాబ్"

 

    "తరువాత ట్రాఫిక్ కి అడ్డు వస్తూంది- లైసెన్సు కాన్సిల్ చేద్దామా అనుకుంటున్నరట- మీ వరకూ వచ్చిందా?"  

 

    "రామ్ భగవాన్! అట్ల ఎట్ల చేస్తారు సాబ్. పని సగం పూర్తయ్యాక-"

 

    "కాంపేన్సేషన్ ఇస్తారనుకుంటా... కానీ అది మీరు పుస్తకాల్లో చూపించినంతే వుంటుందే... ఎలా?'

 

    "పూర్తిగా మునిగిపోయాను సాబ్" అట్నుంచి కంగారుగా వినిపించింది.

 

    "సాయంత్రం ఆలోచిద్దాం. రండి"

 

    "ఎక్కడికి?"

 

    "సాయంత్రం పురోహితన్ ఇంట్లో ఫంక్షనుంది మీకు తెలీదా" ఫోన్ పెట్టేశాడు


    
    రెండో ఫోను....

 

    "హలో తులసీప్రసాద్"

 

    "చెప్పండి"

 

    "మీకు తెలీదా- పోలీస్ డిపార్టుమెంటు వాళ్ళు అంబేద్కర్ విగ్రహం నుంచి పోస్టాఫీస్ వరకూ వన్ వే ట్రాఫిక్ పెట్టాలనుకుంటున్నార్ట".

 

    "మైగాడ్- సగం బిజినెస్ పోతుందే. అందులోనూ మా షాపు రోడ్డుకి కుడివైపు వుంది".

 

    "పురోహితన్ మీకు తెలీదా?"

 

    "తెలీదు".

 

    "సాయంత్రం రండి మాట్లాడుకుందాం".

 

    "ఎక్కడికి?"

 

    "సాయంత్రం పురోహితన్ మనవరాలికి వడుగు వుంది".

 

                                        *    *    *

 

    పురోహితన్ ఇంటి ముందు గార్డెన్ కళకళలాడుతూంది.

 

    ఆరు నలభై అయిదుకి ముహూర్తం. లోపల ఆడవాళ్ళు కూర్చుని వున్నారు. పురోహితన్ మనవరాలికి చేస్తున్న వడుగు తాలూకు మంత్రోచ్చాటన మైకులో వినిపిస్తూంది. ఏడింటికి అది పూర్తయింది. పదేళ్ళ పాప లోపల్నుంచి బైటికి వచ్చింది.

 Previous Page Next Page