"ఇంక నువ్వు చెప్పొద్దు. ఇలా కథల్లో, నవలల్లో మా రహస్యాలు రాసి పారేస్తే మా గతి ఏమిటి? కొంపదీసి ఈ రైటర్స్ లో కూడా సి.ఐ.డీలు లేరు కదా!" అంటూ పెట్టె మూసేసి తాళం వేశాడు చందు.
"కొంపదీసి వుంటే ఫరవాలేదు. కొంపదీసే వాళ్ళు ఉంటే కష్టం" అంటూ నవ్వింది సీత.
ట్రంకుపెట్టె తాళం వేసి, ఆ తాళం చెవిని పౌడరు డబ్బాలో పౌడరు మధ్య దాచాడు. తర్వాత చిన్న బ్రీఫ్ కేసు సర్దుకున్నాడు. క్రాపు మార్చటానికి మధ్య పాపిడి తీసి సాఫీగా అటూ ఇటూ దువ్వుకున్నాడు. సన్నగా అణిగి వుండటానికి ఆముదంలాంటి తైలం పూశాడు. సిక్కుల కున్నట్లు గడ్డం, మీసం అతికించుకున్నాడు. కళ్ళకి జోడు పెట్టుకున్నాడు. ఖరీదయిన సూటు ధరించాడు. ఇప్పుడు చందూ రూపం పూర్తిగా మారిపోయింది.
"మిమ్మల్ని నేనే గుర్తు పట్టలేను" అంది సీత.
"ఎప్పుడో ఒకప్పుడు మారువేషంలో వచ్చి నిన్ను దడిపించకపోతే చూడు" అన్నాడు చందు.
"ఆ పని మాత్రం చేయకండి హడలి చస్తాను" భయంతో అంది సీత.
కనుమరుగు అవుతున్న ఆటోని చూస్తూ గుమ్మంలో నుంచుండిపోయింది సీత.
7
పాతకాలం వైభోగం చాటుతూ రాజభవనంలా వుంది ఆ పెద్ద మేడ.
లలితా భవన్ అన్న అక్షరాలు చూడముచ్చటగా వాకిట్లో ముందుగా దర్శనమిస్తున్నాయి.
లలితాభవన్ ఎప్పుడూ సుందరంగానే వుంటుంది... ఇప్పుడు కొత్త కోడలు ఆ భవనంలో ప్రప్రధమంగా కాలు పెడుతున్న శుభ సందర్భంలో మరింత సుందరంగా తీర్చిదిద్దారు.
రెండు చిన్నకార్లు వచ్చి ద్వారంవద్ద ఆగాయి. కారులోంచి ముందుగా అజయ్ చందర్ దిగాడు. మల్లెపూవు లాంటి లాల్చీ, పైజమా ధరించాడు. కాళ్ళకి ఆకు చెప్పులు ఉన్నాయి. అతని వెనుకనే కోమలాదేవి దిగింది. కెంపు రాళ్ళ నగలు...వాటిల్లో ఆమె రూపం ఖరీదయిన కెంపులా వుండి చూపరులకి మెరిసిపోతూ కానవచ్చింది. అజయ్ చందర్ మల్లెపూవులా వుంటే, కోమలాదేవి అతని పక్కన ముద్దమందారంలా వుంది. ఆ కారులో వాళ్ళిద్దరే దిగారు.
మరో కారులోంచి శారదాంబ. ఆమె పెద్ద కూతురు సుందరి దిగారు.
కొత్త కోడలు ఇంటికొచ్చేసరికి తాను అన్నీ సిద్దం చేయాలని లలితాదేవి ఉదయమే వచ్చింది. పెళ్ళి కార్లు వచ్చాయని తెలియగానే ఎర్రనీళ్ళతో పనిమనిషి ఎదురు ఆహ్వానానికి పండు ముత్తయిదువ మరి కొందరు పనివాళ్ళతో లలితాదేవి వాకిట్లోకి వచ్చింది. ఆమె కాశ్మీర్ శాలువా నిండుగా కప్పుకుంది' ముఖంలో అలసట, కళ్ళు ఎర్రగా వున్నాయి.
ఎర్రనీళ్ళతో పనిమనిషి పెళ్ళికూతురికీ, పెళ్ళికొడుక్కీ దిష్టి తీసి అవతలికెళ్ళింది. పెద్దముత్తయిదువ ఎదురేగి "కుడికాలు పెట్టమ్మా!" అని ఆహ్వానించింది.
శారదాంబకి, సుందరికి కళ్ళు తిరిగిపోతున్నాయి. భర్త చెపితే బాగా వున్నవాళ్ళు, కొంప మరీ పెద్దది అనుకుందిగాని ఇలా రాచకళలు ఉట్టిపడుతున్నాయని అడుగడుగునా సిరితాండవమాడుతున్నదని కలలో కూడా ఊహించలేదు.