"మరి అలాగే మీరు మారువేషాలు రహస్యంగా పోలీసుల్ని కలుసుకోవడం..."
"నీకు చెప్పినా అర్ధం కాదు సీతా. రహస్యాలు-మారువేషాలు అప్పుడప్పుడు మాకూ తప్పవ్. కాని సినిమాలో గంతులు వేసినట్లు పాటలు పాడినట్లు మాత్రం నిజ జీవితంలో వుండవు ప్రభుత్వ సి.ఐ.డి. ఎప్పుడూ గంతులు వేయడు."
"అబద్దం...నాతో ఎందుకండీ అబద్దాలు ఆడుతారు?" సీత బాధగా ముఖం పెట్టి అడిగింది.
"సీతా." దెబ్బ తిన్నట్లు చూశాడు చందు.
గడుసుగా నవ్వింది సీత.
"చూశారా మీకే టోకరా ఇచ్చాను. ప్రభుత్వం సి.ఐ.డి. ఎప్పుడూ గంతులు వేయడని అబద్దం చెపుతున్నారు. నాతో ఎన్నిసార్లు గంతులు వేశారో గుర్తు తెచ్చుకోండి"
"నిన్ను...నిన్ను...బుగ్గలు గాట్లు పడేలా కొరికినా పాపంలేదు" అంటూ కూర్చున్న చోటునుంచి లేచి వచ్చి సీతని కౌగిలిలోకి తీసుకున్నాడు.
"ఇదేం పని?" చిరుకోపంతో అడిగింది సీత.
"కానీ పనేంకాదు...కాసేపు పెదవి కదపకు."
"అన్యాయం...అక్రమం. అధర్మం."
"అబద్దం కూడా కలపవోయ్."
"మీ మనస్సు నొప్పించానా చందూ."
"అవును సీతా. నా ఉద్యోగ ధర్మంగా ఈ వేషం అబద్దాలాడడం తప్పవు. కాని సీతా నీతో..."
"పోలీస్ సూపరింటెండెంట్ దగ్గరనుంచి పోలీస్ జవాను వరకూ హాయిగా తమ ఉద్యోగం పదిమదికి తెలిసే లాగా వుంటారు. మీ డిపార్టుమెంట్ పేరుగొప్ప ఊరుదిబ్బ. గొప్పగా చెప్పుకోవడానికి కూడాలేదు. ఆ ఒక్కటే నాకు బాధ...మిగతా విషయాలలో ఓకె. నా అంత అదృష్టవంతురాలు లేదు" సీత తృప్తిగా అంది.
"ఈ జాబ్ తీరు అలాంటిది....ఆలోచిస్తే ప్రతిదాంట్లోనూ బాధ వుంది సీతా! అందుకే బాధ అనేమాట ఎప్పుడో వదిలేశాను...ఈ దేశంలోనే కాదు, అన్ని దేశాలలోకూడా సి.ఐ.డి.బి.డి వగైరాలు అతి రహస్యంగా వుంటాయి. గౌరవనీయమైన రహస్య జీవితం లోకుల దృష్టిలో దొంగ బతుకేమో గూడా...ఎందుకంటే మా వృత్తి మేము ఘనంగా చెప్పుకోలేం. రష్యాలో చిన్న పల్లెటూరిలో చౌకరకం చిన్న టీ స్టాల్ పెట్టుకున్నాడు ఒకాయన....తక్కువ రకం వాళ్ళు వచ్చి టీ తాగి పోతుంటారు__అలాంటి స్టాలులో ప్రపంచ హంతకుడు గొప్ప స్మగ్లర్ల, ముఠాలకి నాయకుడు అయినా ఒకతని ఆచూకీ తెలిసింది.
"ఎలా?"
"టీ స్టాల్ యజమాని నిజంగా బీదవాడు కాదు, తక్కువ డబ్బుతో స్టాలు నడిపేవాడు కాదు అతని సి.ఐ.డి. అతని జన్మంతా ఆ టీ స్టాల్ కే అంకితం. టీ స్టాల్ యజమాని గానే వుంటూ రహస్య సమాచారం సేకరించి ప్రభుత్వానికి అందివ్వడం అతని డ్యూటీ."
"ఎలా అందిస్తాడు అతనెక్కడికీ కదలడుకదా?" సీత తన ధర్మ సందేహం వెళ్ళడించింది.
"అదే సీక్రెట్ అతని జీవితకాలంలో ఏ రహస్యమయినా సేకరించవచ్చు. తన పరిధిలో వరకే తాను చూసుకుంటాడు."
"అదెలా కుదురుతుందబ్బా! బాగానే కుదురుతుందబ్బా! ఆ హంతకుడి కోసం అన్నిచోట్ల గాలించారు పెద్ద హోటల్సు, బార్లు, మారుమూల ప్రాంతాలు ఏదీ విడిచిపెట్టలేదు. అయినా అతడు దొరకలేదు. పోలీసులు వెయ్యి కళ్ళతో వెతకటం మొదలుపెట్టారు. ఆ హంతకుడికి సేఫ్టీ ప్లేస్ ఎక్కడా దొరకలేదు. టీ స్టాలుని మించిన సేఫ్టీ ప్లేస్ వేరే లేదని తలచి టీ స్టాలులో తన అనుచరుడితో కూర్చున్న..."
"బస్ బస్ ఇంక చెప్పకండి. ఇదే కధని మొన్నీ మధ్య నవలలో చదివాను. టీ స్టాలులో అతన్ని ఎవరూ గమనించరని తన అనుచరుడితో రహస్యాలు మాట్లాడుకుంటుంటే టీ స్టాల్ యజమాని అది విని...