5
మళ్ళీ గోపాలరావు యెండాకాలపు శలవలకి రావలసి వొచ్చింది. యెట్లానన్నా తప్పించుకోవాలని చూశాడు. ఒక స్నేహితుడితో తంజావూరిలో యెండాకాలం గడపటానికి యేర్పాటయింది; యింటికి రానని రాసేశాడు. రవణని మళ్ళీ వొక సంవత్సరం చూడననే దిగులు తోచింది.
కాని కొత్తదేశం, కొత్త స్నేహితులూ, అతన్ని ఆకర్షించారు. నారాయణా, నరుసూ పెట్టే బాధలు జ్ఞాపకమొచ్చాయి. కాని పాప చివరికి ఆ స్నేహితుడి తండ్రి హఠాత్తుగా చచ్చిపోవడం వల్ల గోపాల్రావు యెత్తు సాగలేదు. విచారంతో యిల్లు చేరుకున్నాడు. కాని యీసారి నారాయణా నరుసూ పెట్టే బాధలు పడదలుచుకోలేదు. తన చర్యనీ, నమ్రతనీ రవణ నిరంతరనూ చూస్తుందనే భావం గోపాల్రావుకి సహితం రోషాన్ని కలిగించింది. వాళ్ళిద్దరూ అల్లరి చేసినప్పుడల్లా చంపకాయలూ, గిల్లులూ సాగించాడు. వాళ్ళు రావమ్మతో చెప్పుకున్నారు. కాని వాళ్ళ అల్లరి చూసి అమ్మ ఏమీ అనలేకపోయింది. కాని "పిల్లల్ని వృధాగా కొట్టడం ఒకటి చాతనవును. చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు" అంటుంది.
అయినా ఆ పిల్లలకి - గోపాల్రావు, యీ యాచకుడు, తమకు యెదురు తిరిగినందుకు కోపమెక్కువై అతన్ని దొంగతనంగా ఏడిపించేందుకు కొత్త పద్ధతులు కనిపెట్టారు. అసలు అతనిమీద కోపమే కాకుండా అల్లరిమీద అభిలాషా, శత్రు విజయ ప్రోత్సాహమూ, వాళ్ళకి తోడ్పడ్డాయి. అతను లేకుండా చూసి అతని ట్రంకు పెట్టెలు పోగొట్టడమూ, దణ్ణెంమీది అతని చొక్కాలు చిల్లులు చెయ్యడమూ, అతని కలం పాళీ చిట్ల కొట్టడమూ మొదలైనవి ప్రారంభించారు. యెవరితో చెప్పుకుంటాడు బీద గోపాల్రావు? అతని బతుకు కష్టతరమయింది. చివరికి అతని కాలేజీ లైబ్రరీ పుస్తకంలో పది పేజీలు అడ్డంగా చించారు. అతను దాని ఖరీదెట్లా యిచ్చుకుంటాడు. అతని వొళ్ళుమండి, దుఃఖం పట్టలేక, ఆ పుస్తకం వెంకన్న పంతులుగారి ముందు పెట్టాడు. అసలు వెంకన్న పంతులు గోపాల్రావుతో మాట్లాడ్డమే మానేశారు. యింక ఏ ఏడాదికో రెండేళ్ళకో, రవణని తన దగ్గిర్నించి తీసుకుపోతాడనే కోపం ఆయనకి తెలీకుండానే మనసులో పనిచేస్తోంది.
"మీ అబ్బాయిలు ఏం చేశారో చూడండి. యెన్ని చిలిపి పనులు చేసినా వూరుకున్నాను. యిప్పుడు యీ పుస్తకం ఖరీదు యెవరిస్తారు?"
"పాపం! యిన్నాళ్ళూ నువ్వు వాళ్ళనేమీ చెయ్యనేలేదు కదూ?"
"మరి వాళ్ళు నన్ను పెడుతున్న బాధలో?"
"సరిపోయింది."
"కాని యీ పుస్తకం ఖరీదు యిరవై రూపాయలు. మీరిస్తారా ఖరీదు?"
చంటిపిల్లతో ఆడుకుంటున్న వెంకన్నపంతులు మా స్ట్రీటు పదవి నలంకరిచాడు చప్పున.