Previous Page Next Page 
పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 21

 

    "పార్ట్ టైం మొగుడంటే?"
    "టైం పాస్ మొగుడు."
    "నీకిదేం పోయేకాలం?"
    "నీకోసం ఎంతకాలం చూడను? వేకెన్సీ రాదు పెట్టదు "
    "ధూ!! గలీజ్ మాటలు "
    అటో వచ్చి పక్కన ఆగింది.
    రాధిక మైసూర్ క్రేప్ సిల్క్ చీరతో తల బయటకు జాపింది.
    "రండి! వెళ్దాం!"
    సురేష్ ఆటోలో కూర్చున్నాడు.
    "ఎలా ఉన్నానీ డ్రస్ లో?" అడిగింది చిరునవ్వుతో.
    "డ్రస్ లోపలి సంగతి నాకేం తెలుసు?"
    ఆమె చురుక్కుమనేలా చూసింది.
    "అలాంటి పిచ్చి మాటలు వద్దని చెప్పాను."
    "అడిగేది మీరే వద్దనేది మీరేనేమిటి?"
    "ఒకసారి రిహార్సల్ వేసుకుందామా?"
    "ఏం రిహార్సల్స్?"
    "అదే - అక్కడ మొగుడూ పెళ్లాల్లా ఎలా ఉండాలో?"
    "ఇదేం రిపబ్లిక్ డే పెరేడా? రిహార్సల్స్ వేసుకోడానికి!"
    ఆమె నవ్వేసింది.
    "నాకెందుకో భయంగా వుంది! మీరు మాత్రం కొంచెం తక్కువ మాట్లాడండి! వీలయితే ప్రతి జవాబూ నా కళ్ళల్లోకి చూసి నేను క్లియరెన్స్ ఇచ్చాక ఇవ్వండి."
    "అంటే నిజం మొగుడూ పెళ్లాల్లాగే అన్నమాట."
    'అవును! వీలయినంతవరకూ మొగుడూ పెళ్లాల్లా కనిపించాలి! లేకపోతే అనుమానం రావచ్చు "
    "మీకే భయం అక్కరలేదు. నేను కాలేజ్ రోజుల్లోనే మొగుడి కారెక్టర్ చాలాసార్లు వేశాను. చాలా నేచురల్ గా చేశానని, ఫోర్న్ హజ్ బెండ్ అనీ చాలా మంది మెచ్చుకున్నారు. ఎంత నేచురల్ అంటే నా పక్కన భార్యగా వేసిన ఇద్దరమ్మాయిలూ ప్రెగ్నెంట్ అయారు "
    ఆమె ఉలిక్కిపడింది.
    "మైగాడ్! నిజంగానా?"
    "నిజమే గానీ -- కారణం నేను కాదు! ఇంకెవరోనని తర్వాత తెలిసింది! అప్పుడు ఆ పాత్రకు జీవం పోశానని ట్రాఫీలు కూడా ఇచ్చారు .
    అటో ఓ విశాలమయిన ఆవరణలో ఆగింది.
    రెండంతస్తుల భవనం అది.
    ఓ పక్కగా స్కూటర్లు మరోపక్క అరడజను కార్లు పార్క్ చేసి ఉన్నాయ్.
    ఎమ్ డి చాంబర్ ముందున్న కుర్చీల్లో కూర్చున్నారు.
    అయిదు నిముషాల తర్వాత పిలుపు వచ్చింది.
    ఎమ్ . డి. ఇద్దరివేపూ ఓసారి పరీక్షగా చూశాడు.
    "నమస్తే సార్! ఈయనే మావారు" పరిచయం చేసింది రాధిక.
    "నమస్తే సార్" చిరునవ్వుతో అన్నాడు సురేష్.
    "నమస్తే -- ప్లీజ్ సిడౌన్."
    ఇద్దరూ కూర్చున్నారు ప్రక్క ప్రక్కనే.
    "మీ పేరూ ' సురేష్ నడిగాడతను.
    "సురేష్!"
    "సురేష్! గుడ్ నేమ్! మీ పెళ్ళయి ఎంత కాలమయింది ?"
    "సంవత్సరం ' అని సురేష్ చెప్తుండగానే రాధిక 'రెండేళ్ళు' అనేసింది.
    ఎమ్ .డి. ఆశ్చర్యపోయాడు.
    రాధిక గతుక్కుమంది. కొంప మునిగిపోయింది. ఇంక ఉర్యోగం గోవిందా! మొత్తం డ్రామా ఇప్పుడు బయటపడిపోక తప్పదు. సురేష్ చెంపలు వేసుకున్నాడు.
    "ఇద్దరిలో ఎవరు కరెక్టు!' రాధిక మెడవేపు అనుమానంగా చూస్తూ అడిగాడు ఎమ్.డి.
    ఎందుకయినా మంచిదని రాధిక మంగళసూత్రం తాడుని తీసి బయటకు వదిలింది. అతనికి కనిపించేట్లు -
    నిస్సహాయంగా , కోపంగా సురేష్ వేపు చూసింది.
    "వాట్ మిస్టర్ !' మాట్లాడవేమిటి? అనుమానం మరింత పెరిగి పోతోంది.
    సురేష్ చిరునవ్వు నవ్వాడు.
    "నిజం చెప్పాలంటే ఇద్దరమూ కరెక్టే నండీ!"
    'అంటే?"
    "అఫీషియల్ గా భార్యా భర్తలమయి సంవత్సరమే అయిందండీ! అనధికార పూర్వకంగా కాపురం పెట్టి రెండేళ్ళయిందండీ!' తడుముకోకుండా చెప్పాడు.
    "అనధికారపూర్వకంగానా?"
    "అవునండీ!"
    'అంటే?"
    సురేష్ సిగ్గుపడ్డాడు.
    "మీకు తెలీందేముంది సార్ - ఈరోజుల్లో - పెళ్ళికి ముందే అన్ని అయిపోతున్నాయ్ కదా?"
    "ఎమ్ .డి. ఒక్క క్షణం ఆగి హటాత్తుగా విరగబడి నవ్వేయసాగాడు.
    "ఓ! అదా! అయ్ కెన్ అండర్ స్టాండ్ నౌ పెజెంట్ డే మోరల్స్"
    ఎగ్జాక్ట్ లీ సర్"
    రాధిక మొఖం సిగ్గుతో ఎరుపెక్కిపోయింది.
    గుండె కొంచెం కుదుటపడింది.
    మంచో, చెడో తెలివిగానే మానేజ్ చేశాడు.
    "గుడ్! వెరీ గుడ్ ! పిల్లలెంతమంది ?"
    ఇద్దరూ ఏదో చెప్పబోయి భయపడి ఒకరి నొకరు చూసుకుని సైలెంటయిపోయారు .
    "మాట్లాడారేమిటి?"
    "ఒక్క నిమిషం సార్! కొంచెం కన్సల్ట్ చేసుకుని చెప్తాం" అంటూ రాధిక కు సైగ జేశాడతను. ఇద్దరూ కలిసి ఆ గదిలోకే ఓ మూల కెళ్ళి నిలబడ్డారు.
    "ఏం చెప్దామంటారు?"
    "పిల్లలు లేరని చెప్దాం!"
    "ఇద్దరూ తిరిగి వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు.
    "పిల్లలు ఇంకా లేరండీ!"
    "ఐసి! రెండేళ్ళనుంచీ పిల్లలు లేకపోవటమేమిటి? ఏమయినా డిఫెక్ట్?"
    "తెలీదండీ! ఆమె నడిగి చెప్తాను " బుర్ర గొక్కుంటూ అన్నాడు.
    "ఇద్దరూ మళ్ళీ పక్కకు వెళ్ళారు.
    "ఏం చెప్తాం?" అడిగాడు సురేష్.
    "మీలో లోపమని చెప్పేస్తాను . అంది రాధిక."
    సురేష్ ఉలిక్కిపడ్డాడు.
    "నాలో లోపమా?"
    "అవును !"
    "నో! నేనొప్పుకోను! ఇన్సల్ట్ - మీలోనే లోపమని చెప్పండి!"
    "అలా చెప్పటం బావుండదు! ప్లీజ్! నా మాట వినండి!' దీనంగా చూసింది.
    'అల్ రైట్! అలా చెపితే నాకు నెలకు ఇంకో పది రూపాయల జీతం ఎక్కువ ఇవ్వాల్సి వుంటుంది. ఎందుకంటె భవిష్యత్తులో ఈ అపవాదు వల్ల నాకు సమస్యలు వచ్చే అవకాశం వుంది కనుక."
    "హ! ప్రతిదీ డబ్బుతోనే కొలుస్తారన్నమాట."
    "బార్టర్ సిస్టం లేదు కదా మరి'
    'సరే - అలాగే కానీండి !' కోపంగా అంది.
    యిద్దరూ తిరిగి వచ్చారు.
    "మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదండీ?' అంది రాధిక. 

 Previous Page Next Page