ఎమ్ .డి జాలిపడ్డాడు.
"పూర్ గాళ్ ! ఎందుకని ?"
"ఆయనలో లోపం ఉందని డాక్టర్లు చెప్పారు '
ఎమ్.డి. అతని వేపు ఓ దోషిని చూసినట్లు చూశాడు.
సురేష్ తల వంచుకున్నాడు.
ఆప్యాయంగా సురేష్ భుజం తట్టడతను.
"డోంట్ వర్రీ మైడియర్ ఫ్రెండ్! నువ్వేం బాధపదనక్కర్లేదు . నీకు తెలుసో తెలీదో డాక్టర్ మైత్రేయి నాకు బెస్ట్ ఫ్రెండ్! పిల్లలు లేని అరవై ఏళ్ళ ముసలి దంపతులకు కూడా పిల్లలు పుట్టించింది ! మీకు సంవత్సరం తెరక్కుండా పిల్లలు పుట్టించే బాధ్యత నాది! సరేనా ?"
రాధిక మొఖం పాలిపోయింది.
సురేష్ నీరసంగా నవ్వాడు.
"ఏదో మేము పిల్లల విషయంలో రాజీ పడిపోయాం సార్! యిప్పుడింక అవన్నీ ఎందుకులెండి!"
"నో నో నో ! నేనొప్పుకోను ! అయినా ఆ విషయమంతా నా కోదిలేయ మన్నానా?'
సురేష్ రాధిక వేపు చూశాడు భయంగా.
రాధిక కలవరపాటుతో చూస్తోంది.
"మీరిద్దరూ అన్యోన్యంగా వుంటారా -- ఎప్పుడూ కీచులాడుకుంటారా?' సురేష్ నడిగాడు.
'ఒక్క నిమిషం సార్! మా మిసెస్ నడిగి చెప్తాను '' సిగ్గుపడుతూ అన్నాడు.
యిద్దరూ లేచి ఓ మూలకు వెళ్ళబోతుంటే అతను చప్పున ఆపేశాడు.
'అక్కర్లేదు! తెలిసిపోతూనే వుంది ' నవ్వుతూ అన్నాడు.
సురేష్ కూడా నవ్వాడు.
'నువ్వెక్కడ జాబ్ చేస్తున్నావ్ మిస్టర్ ?"
సురేష్ భయంగా రాధిక వేపు చూశాడు.ఇద్దరూ లేచి గది మూల కెళ్ళారు. ఎమ్.డి నెత్తి కొట్టుకున్నాడు.
'నీ ఉద్యోగం సంగతి కూడా కన్సల్ట్ చేయాలంటయ్యా!'
కొద్ది నిమిషాల తర్వాత తిరిగి వచ్చారు ఇద్దరూ.
"ఇంకా ఉద్యోగం రాలేదండీ! దానికోసమే వెతుకుతున్నాను."
'అల్ రైట్! మీ అన్యోన్యత నాకు బాగా నచ్చింది! నీకు ఉద్యోగం ఇవ్వడానికి నేను రడీ ! కానీ మీరు బాండ్ రాసివ్వాలి.'
యిద్దరూ ఉలిక్కిపడ్డారు.
"ఏమిటండీ అది?"
"మీరిద్దరూ కనీసం ఇంకో అయిదేళ్ళు వరకూ హైదరాబాద్ లోనే సంసారం చేస్తారని గ్యారంటీ ఇవ్వాలి! లేకపోతే మా ఆయనకు వైజాగ్ లో ఉద్యోగం వచ్చింది కనుక నేనూ వైజాగ్ వెళ్ళిపోతానని పేచీ పెడితే నాకు కష్టం! ఏమంటారు?"
ఇద్దరూ మళ్ళీ లేవబోతుంటే అయన అడ్డు పడ్డాడు.
"నా ఎడురుగ్గానే డిస్కస్ చేసుకోండి. ఫర్లేదు -- మాట్లాడితే మూల కెళ్ళడం ఎందుకు?"
"రాసిచ్చేద్దాం !' అంది రాధిక.
"నెలకు ఇంకో పది ఎక్సట్రా!' అన్నాడు సురేష్.
ఆమె అశాంతిగా , కోపంగా చూసింది. ఎమ్.డి ఇద్దరి వంక అయోమయంగా చూస్తున్నాడు.
"దిసీజ్ టూమచ్."
"ఈ బాండ్ కూడా టూ మచ్చే-"
గత్యంతరం లేక ఒప్పుకుందామే.
'సరే-'
'సరే సర్! అలాగే రాసిస్తాం !"
"ఇంకో కండిషన్!"
"అదేమిటి సార్!"
"మీరిద్దరూ కనీసం అయిదేళ్ళవరకూ భార్యాభర్తలుగా వుంటామని , ఏ పరిస్థితిలోనూ డైవర్స్ తీసుకోమని కూడా రాసివ్వాలి .
"అదేమిటి సార్ - ఎందుకలా రాసివ్వటం?"
"కిందటిసారి కృష్ణకుమారి అనే అమ్మాయి ఏం చేసింది? ఉద్యోగం యిచ్చాక వెంటనే మొగుడిని వదిలేసి ఇంకోడితో లేచిపోయింది."
రాధిక సిగ్గుపడింది.
"నేనులాంటిదాన్ని కాదండీ!"
"కృష్ణకుమారి కూడా ఒరిజనల్ గా అలాంటిది కాదమ్మా! కానీ పరిస్థితులు అలా వచ్చాయ్ -- ఎవరేం చేస్తాం? మధ్యలో నష్టపోయింది మేము! ఆమెకు ఆరునెలల పాటు ఇరవై వేలు ఖర్చుతో ట్రైనింగ్ ఇస్తే -- అలా చిలక లేగిరినట్లు ఎగిరిపోతే ఎలా?"
"సరేనండీ! అలాగే రాసిస్తాం"
"ఓకె. ఇంకో పావుగంటలో నీకు అపాయింట్ మెంటు లెటర్ ఇస్తాను -- విజిటర్స్ రూమ్ లో కూర్చో "
"థాంక్యూ సర్!"
ఇద్దరూ విజిటర్స్ రూమ్ లోకి చేరుకున్నారు.
"ఛీ! ప్రతి విషయాన్ని మీలా డబ్బుతో లెక్కలు కట్టే వాళ్ళంటే నాకు అసహ్యం " అంది రాధిక.
"డబ్బు కోసం ముక్కు మొహం తెలీనినోడికి పెళ్ళాం అవటం కంటే నయం అనుకుంటాను."
ఆమె పౌరుషంగా చూసింది.
"మీతో మాట్లాడటం నాది బుద్ది తక్కువ."
"నేనింకేవరిదో అనుకుంటున్నాను."
పావుగంట తర్వాత అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకుంది.
ఇద్దరూ బయటకు నడిచారు.
"మీదారిన మీరు వెళ్ళవచ్చు ."
"ప్రతి నెలా ఫస్ట్ తారీఖున వస్తాను"
"ఆఫీస్ కి రావద్దు"
"మరి?"
"టాంక్ బండ్ దగ్గర కలవండి!"
"టాంక్ బండ్ లో ఎక్కడ వుండమంటారు?"
"నాకు తెలీదు - మీరే చెప్పండి !"
'అన్నమయ్య విగ్రహం పక్కనే కూర్చుని కీర్తనలు ప్రాక్టీస్ చేస్తుంటాను. మీరు కొంచెం లేటయినా నేను కీర్తనలు నేర్చుకోవచ్చు "
ఆమె వెళ్ళిపోబోయింది.
"అరె! అప్పుడే వెళ్ళిపోతున్నారేమిటి? ఈ శుభ సమయంలో మీ మొగుడు కి కాఫీ నీళ్ళయినా తాగించరా?"
"మీరు అన్నీ పైసల్తో లెక్కలు కడితే నేనూ తక్కువేం కాదు -" అనేసి విసవిసా బస్ స్టాప్ వేపు నడిచింది.
సురేష్ ఆనందంగా బయల్దేరాడు.
నెలకు నాలుగొందల యాభై జీతం ---
టెంపరరీగా తన దరిద్రం వదిలిపోతుంది.
ఆ డబ్బుతో ఒకపూట తిండి గారంటీ!
కొన్ని ఉద్యోగాలకు ఫీజులు కట్టి అప్లయ్ చేయవచ్చు.
హోటల్లో కాఫీ తాగుబోతుంటే ఫామిలీ రూమ్ లో నుంచి బయటి కోస్తూ కనిపించింది శిరీష.
మరింత అందంతో వెలిగిపోతోందిప్పుడు --
"హలో" బిగ్గరగా అరిచాడు.
జనమంతా ఉలిక్కిపడ్డారు.
శిరీష ఆశ్చర్యపోయింది.
"ఏమిటలా గావుకేక పెట్టారు?" దగ్గరికొస్తూ అడిగింది.
"ఎగ్జయిట్ మెంట్ ! రండి! కూర్చోండి!"
"ఊహూ! టైం లేదు , నేను వెళ్ళిపోవాలి! ఆఫీస్ పని మీద వెళ్తూ కాఫీ కోసం ఇక్కడి కొచ్చాను."
"అయితే నేనూ మీతో వస్తాను --"
ఇద్దరూ బయటకు నడిచారు.
బస్ స్టాప్ దగ్గర బేరార్ కి బిల్ కట్టాడు సురేష్ -- ఓ 'సారీ' తో పాటు.