Previous Page Next Page 
రాక్షసుడు పేజి 20


    లోపల ఇన్ స్పెక్టర్ కూర్చొని ఏదో వ్రాసుకుంటున్నాడు. అతడి పేరు విజయ్. అతడికి పాతికేళ్ళ వయస్సు ఉంటుంది. గిరిజాల జుట్టు. అందంగా పొడుగ్గా వున్నాడు. మొహంలో అమాయకత్వం ఇంకా పూర్తిగా పోలేదు. కానీ దాన్ని చూసి ఎవరూ భ్రమపడకూడదు. ఆరునెలల్లోనే ఆ వూరిని గడగడలాడిస్తున్నాడు.

 

    పక్కనే పోలీసు శివరామయ్య నమ్రతగా నిలబడి వున్నాడు. ఆ నమ్రత వెనుక చిరుమందహాసం వుంది. దాని వెనుక ఐ.జి. ఆఫ్ పోలీసు నుంచి క్లాస్ వన్ వ్యభిచారి వరకూ ఎవర్ని ఎలా ఆడించాలో తెలిసిన లౌక్యం వుంది. ఎవరికేం కావాలో అది ఇవ్వగలడు. తనకేంకావాలో తీసుకోగలడు. అతడి మీద స్టేషనొదిలేసి చాలా మంది ఎస్సైలు నైట్ డ్యూటీల్లో ఇంటికెళ్ళి పడుకుంటూ వుంటారు. ఒకసారి అలాగే వెళ్ళిపోతే ఒకావిడనీ భర్తనీ సెకండ్ షో నుంచి వెళ్తూంటే పట్టుకొచ్చి భర్తను లాకప్పులో పెట్టి ఆవిడని రేప్ చేశాడు. తరువాత పత్రికలకెక్కి సుప్రీంకోర్టువరకూ వెళ్ళి, ఇంటికెళ్ళిపోయిన యస్సైని దోషిగా నిర్ణయించి అతడిని ఉద్యోగంలోంచి తీసేశారు. ఇతడిని బెనిఫిట్ ఆఫ్ డవుట్ క్రింద వదిలేశారు. అంతటి గత చరిత్ర వైభవం వున్నవాడు శివరామయ్య.

 

    అడుగుల చప్పుడికి తలెత్తి చూశాడు ఇన్ స్పెక్టర్. అప్పటికే అతడు దగ్గిరగావచ్చి టేబిల్ మీద విసురుగా కాగితాన్ని పడేస్తూ "ఇతడిని అరెస్టు చేయాలి" అన్నాడు.

 

    ఇన్ స్పెక్టర్ మొహంలో విస్మయం కనబడింది. అతడు అలా పోలీసు స్టేషన్ కు రావటమే ఒక వింత.

 

    "కూర్చోండి" అన్నాడు.

 

    "నేను కూర్చోటానికి రాలేదు ఇన్ స్పెక్టర్! ఇక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక హత్య జరిగింది. ఒక విదేశీ ప్రొఫెసరు దారుణంగా చంపబడ్డాడు. హంతకుడు తనే ఈ హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. ఇదిగో ఆ కాగితం. వెంటనే అతడిని అరెస్టు చేసి-"

 

    "ముందు కూర్చోండి మిష్టర్-" తాపీగా కాగితం చేతిలోకి తీసుకుంటూ అన్నాడు విజయ్- "హత్య జరిగిన సంగతి ఇంతకు ముందే తెలిసింది. అది మా జ్యూరిస్ డిక్షన్ కాదు. ఆ ఇన్ స్పెక్టర్ ఈ పాటికే అక్కడికి వెళ్ళి వుంటాడు".

 

    "కానీ హంతకుడు వున్నది మీ జ్యూరిస్ డిక్షన్".

 

    ఈ లోపులో ఇన్ స్పెక్టర్ ఆ కాగితాన్ని చదవటం పూర్తి చేశాడు. తాపీగా తలెత్తి "ఏం చెయ్యమంటారు?" అని అడిగాడు. అ ప్రశ్నకి కోపాన్ని అణచుకుంటూ, "అది కూడా నేనే చెప్పాలా" అన్నాడు వ్యంగ్యంగా.     

 

    'ఎక్కడో ఏదో హత్య జరిగింది. ఈ హత్య చేసింది నేనే అని వ్రాసి వున్న ఒక కాగితం తీసుకొచ్చి ఇస్తే దాని ఆధారంగా నేను ఆ పేరున్న వాడిని అరెస్టు చేయాలి, అంతేనా - ఇంపాజిబుల్" కుర్చీ వెనక్కి వాలుతూ అన్నాడు ఇన్ స్పెక్టర్. "క్షమించండి, నేనీ సాక్ష్యాన్ని స్వీకరించలేను".

 

    "వ్వాట్" అని అరిచాడు అతడు. అతడి గొంతు కీచుగా ధ్వనించింది. "ఒకరిని హత్యచేసి, ఆ చేసినవాడు దానిని స్టాంపు పేపరు మీద తనే దాన్ని చేసినట్టు వ్రాసి సంతకం పెడితే, పైగా అది చాలదన్నట్టు వేలిముద్ర కూడా వేస్తే- ఇంకా ఇంతకన్నా సాక్ష్యాధారాలు కావాలా?"

 

    "కావాలి" క్లుప్తంగా అన్నాడు విజయ్.

 

    "విజయ్! దీన్నంత ఎందుకు నువ్విలా తీసి పడేస్తున్నావో నాకు తెలుసు".

 

    "ఎందుకు?"

 

    "వంకచెక్కా రామ్మూర్తి నీ తండ్రి కాబట్టి".

 

    విజయ్ చటుక్కున లేచి నిలబడి "మిష్టర్!" అన్నాడు.

 

    "అవును విజయ్! నిన్ను బదిలీచేయించటానికి లోహియా అలజడి లేవనెత్తినప్పుడు, నీ తండ్రి ఎందుకు డబ్బు వెదజల్లి ఆపుచేశాడో నాకు ఇప్పుడు తెలిసింది. అ రౌడీలు స్ట్రయిక్ పేరున చేసిన అల్లర్లని అణచటానికి నా తండ్రి ద్వారా ఎందుకు నన్ను నియమించాడో ఆ క్షణం నేను వూహించలేకపోయాను! నువ్వింకా నిజాయితీ పరుడవనే భ్రమలోనే వుండిపోయాను! నువ్వూ, నీ తండ్రీ తోడు దొంగల్లా..."

 

    విజయ్ మొహం జేపురించింది. "-ఈ మాటలే గానీ ఇంకెవరైనా అని వుంటే కటకటాల వెనక్కి తోసి వుండేవాణ్ని" అన్నాడు.

 

    "అవును! స్వయంగా చేతుల్తో చంపి, పైగా ఆ విషయాన్ని స్వదస్తూరితో వ్రాసి ఇచ్చిన వాడిని ఏమీ చేయలేవు గానీ నన్ను కటకటాల వెనక్కి తోస్తావు" హేళనగా అన్నాడు అతడు. "నీ తండ్రి నీకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా నువ్వు ఈ పని చేసి వుండవచ్చు! నీ తండ్రికి వ్యతిరేకంగా లోహియా అంతటివాడే నిన్ను బదిలీచేయించలేకపోయాడు. కానీ నేను లోహియా కన్నా పెద్దపాములాంటి వాడిని. నిన్ను బదిలీకాదు. సస్పెండ్ చేయిస్తాను. సరిగ్గా రెండు రోజుల్లో ... చూస్తూ వుండు" అన్నాడు.

 

    విజయ్ మొహంలో మార్పు కనబడింది. అతడి దగ్గిరగా వచ్చి రాజీ చేసుకుంటున్నట్టు "నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. అతడు నా తండ్రిగానీ, ఎవరుగానీ- ఇక్కడ సమస్య అది కాదు. ఏమాత్రం తెలివైన లాయరైనా ఈ కేసుని క్షణాల మీద లేవగొట్టేస్తాడు" అన్నాడు.

 

    "నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. ఇంత తేలిగ్గా లేవగొట్టబడే ఈ న్యాయస్థానం మీదే నాకు నమ్మకం లేదు. అందుకని నేనే ఈ చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నాను" అని తాపీగా కుర్చీలో కూర్చుంటూ ఫోన్ దగ్గిరకి లాక్కుని డయల్ చేశాడు. అటు నుంచి రిసీవర్ ఎత్తిన ధ్వని వినిపించగానే "హలో సింహం" అన్నాడు.

 

    "నేనే" అటునుంచి వినిపించింది.

 

    "నేనే మాట్లాడుతున్నాను. రేపు పొద్దున్న వంకచెక్కా రామ్మూర్తిని చంపెయ్యి! నీతోబాటు రాబోట్ ని కూడా తీసుకెళ్ళు. ఈ రాత్రికి పని జరిగిపోవాలి" అంటూ ఫోన్ పెట్టేశాడు. అంతకన్నా పెద్ద సూచన అతడెప్పుడూ తన అనుచరులకి ఇవ్వడు.

 

    అప్పటి వరకూ అదేదో మామూలు విషయంలా వింటున్న ఇన్ స్పెక్టర్ "మైగాడ్" అంటూ చప్పున వంగి ఫోన్ లాక్కునే లోపలే ఇదంతా జరిగిపోయింది.

 

    "ఎంత ధైర్యం నీకు! మా ఫోన్ నుంచి మా ముందే మర్డర్ చేయమని చెప్తావా?"

 

    "నన్ను అరెస్టు చెయ్యి ఇన్ స్పెక్టర్! కానీ ఏ మాత్రం తెలివైన లాయరైనా కేసుని క్షణాల మీద లేవగొట్టేస్తాడు! నేను ఫోను చేసినట్టు నీ న్యాయస్థానానికి కావల్సిన సాక్ష్యాధారాలు ఏవీ లేవుగా"

 

    విజయ్ కానిస్టేబుల్ వంక తిరిగి, "వెంటనే వెళ్ళి ఆ సింహాన్నీ వాడి అసిస్టెంట్ నీ పట్టుకురా అర్జెంట్" అని అరిచాడు. అప్పటి వరకూ స్థబ్ధంగా వున్న ఆ పోలీసు స్టేషన్ క్షణాల్లో చైతన్యవంతమయింది. మరో నిముషంలో వ్యాను బయలుదేరిన శబ్దం వినిపించింది. అప్పటికి గానీ విజయ్ కుదుటపడలేదు! తరువాత తన కుర్చీలో కూర్చుంటూ "క్షమించు. ఈ రాత్రికి నీ సహచరులిద్దరూ నాకు అతిథులుగా వుంటారు" అన్నాడు.

 

    "ఇలా హత్య చేయమని నేను చెప్పిన వాళ్ళందర్నీ నువ్వు తీసుకొచ్చి లాకప్పులో తోసేస్తూ వుంటావా ఏమిటి?"

 

    "అంటే..." అర్థం కానట్టు అడిగాడు.

 Previous Page Next Page