రవణకి రాత్రి యేదోవేళ మెళకువ వచ్చింది. ఏదో మెళుకువ తెప్పించినట్లయింది. దీపంకింద అత్త నిద్రపోతోంది. దీపం మెల్లగా ఆరిపోతోంది. ఇంకా ఎవరో హాలులో వున్నట్టు తట్టింది. కనురెప్పల కింద నుంచి మెల్లిగా చూస్తోంది. దీపం ఆరి చీకటయింది. ఎవరో చీకట్లో కదులుతున్నారు. కళ్ళు బాగా తెరిచి చూసింది. ఏమీ కనపట్టం లేదు. ఎవరో దగ్గరిగా మెల్లిగా అడుగడుగు వేస్తోవొస్తున్నారు కొంచెం దూరమే. చెయ్యి జాస్తే తగిలేట్టున్నారు. సుబ్బారావు అనుకుంది. దగ్గిరగా, పక్క దగ్గరిగా వొచ్చాడు. వూపిరి పీలవడం వినపడుతోంది. అర్ధమయ్యీ కాక అర్ధమవుతోంది. మనసుకు తెలీదు, శరీరానికి తెలుస్తోంది. అతని రాకకి అర్ధం. వొళ్ళంతా లాక్కుపోతోంది. దొల్లాలి, లేవాలి యామన్నా చెయ్యాలి. ఎందుకట్లా వూరికే నుంచుంటాడు? యెంతసేపు! యెందుకు వచ్చాడు మరి! చీకట్లో తెల్లని మల్లుపంచ కళ్ళ దగ్గిరగా వుంది. ఆమె శరీరమంతా కదలకుండా అతనివేపు జరిగింది. చేతులు వణికాయి. అతను కదులుతున్నట్టుంది. వూపిరాగింది. అతని వేళ్ళ కొసలు ఆమె నడుమును తాకాయి. వొళ్ళంతా బిగుసుకుంది. కదలకుండా వుండడం దుస్సహం. నిట్టూర్పు విడిచాడు. చెయ్యి కదిలించింది. అతన్ని తాకడం, ఆ వేళ్ళని పట్టుకోడం యెంత సులభం. కాని అమితమైన సిగ్గూ, భయమూ. చేతిని గట్టిగా మోపి వూయించాడు. అమ్మా! కల మాయమయింది. కదలక వూరుకుంది. వూయించాడు.
"ఎవరు?" అంది బిగ్గిరిగా.
వెళ్ళిపోతున్నాడు. అతను కదలగానే శూన్యం తోచినట్టయింది. ఇంతేనా? అయిపోయింది! వెళ్ళిపోతున్నాడే! పక్కకి దొల్లింది, నిట్టూర్పు విడిచింది. చెయ్యి జాచింది. అతను చూడలేదు. తరవాత చాలాసేపు రవణకి నిద్రపట్టలేదు.
మర్నాడు పొద్దున్న రాత్రి సంగతి రవణకి కలలాగు తోచింది. కాని తలచుకుంటే సిగ్గూ, కొంచెము న్యూనతా తోచాయి. సుబ్బారావు వెళ్ళిపోయినాడు. రవణ త్వరలో అంతా మరిచిపోయింది.